వయసు మనసు

29
2

[dropcap]రా[/dropcap]జు, రమేష్ ఇద్దరూ ఆటో దిగి చెరొక సూటుకేసు చేతిలో పట్టుకుని అన్నయ్య మోహన్ ఇంట్లోకి అడుగు పెట్టారు. ఇద్దరూ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వాళ్ళు ముగ్గురూ అన్నదమ్ముల కొడుకులు. చదువుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకుంటూ కొన్ని ఖర్చులు తీర్చుకోవటం అలవాటు అయ్యింది. ఇప్పుడు దసరా సెలవులు గడపటానికి విజయవాడలో అన్నయ్య మోహన్ ఇంటికి వచ్చారన్నమాట! వీల్లిద్దరిలో, ఎప్పుడూ మంచి దుస్తులు వేసుకుని, నిగనిగ మెరిసే షూస్‌తో టిప్ టాప్‌గా ఉంటాడు రాజు. మంచి పొడగరి, అందగాడు కూడా. స్నేహానికి ప్రాణం ఇచ్చే సుగుణం కలవాడు.

రమేష్ మాత్రం చాలా సాదా సీదాగా వుండి, చదువు మీద తన మొత్తం దృష్టి పెట్టి, ఎప్పుడూ స్నేహితులతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు.

“రండి, ప్రయాణం హ్యాపీగా జరిగిందా” అంటూ మొహం నిండా నవ్వుతో గుమ్మంలో ఎదురొచ్చి సూటుకేసులు అందుకుంది నిర్మల.

“అవును వదినా. హాపీగానే జరిగింది” అంటూ నవ్వుతూ సోఫాలో కూలబడ్డారు ఇద్దరూ.

“పరీక్షలు బాగా రాశారా?” అని పరామర్శించింది వదిన నిర్మల.

ఇంతలో రాజు జేబులో మొబైల్ ఫోన్ మ్రోగింది. దాన్ని తీసి కంగారుగా కాల్ కట్ చేసి “బాగానే రాశాం వదినా, ఇంతకూ అన్నయ్య ఎక్కడ?” అన్నాడు.

“బ్యాంక్‌లో ఇంకాస్త ఆలస్యమౌతుందని చెప్పారు.. వచ్చేస్తారు, మీరు స్నానాలు చేసి భోజనం చేసెయ్యండి” అని వంటింట్లోకి దారి తీసింది నిర్మల.

ఇంతలో భోజనాలు చేస్తుండగా నవ్వుతూ లోనికి వచ్చి, “ఏరా.. ఎప్పుడొచ్చారు.. పిన్నీ, బాబాయ్ బావున్నారా?” అన్నాడు మోహన్.

“సాయంకాలం వచ్చాం. అందరూ బావున్నారన్నయ్య” అన్నాడు రాజు.

భోజనాలయింతర్వాత అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు.

రాజు మొబైల్‌కు చాలా సార్లు కాల్స్ రావటం అతను వాటిని కట్ చేస్తూ ఉండటం, మరి కొన్ని సార్లు బయటకు వెళ్లి పోయి ఫోన్ మాట్లాడి, చాలా హుషారుగా లోపలి రావటం గమనించాడు మోహన్.

కుటుంబంలో అందరికంటే పెద్ద అన్నయ్యగా మోహన్ చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందుతూ వున్నాడు. మోహన్ అంటే తమ్ముళ్ళందరికీ అమితమైన ప్రేమాభిమానాలు.

ఆ రాత్రి పక్క మీద వాలినప్పుడు “అవునోయ్ నిర్మలా, వీడికేంటి వెంట వెంటనే అన్ని కాల్స్ వస్తున్నాయి. పైగా వాడు కట్ చేసిన వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తున్నారెవరో. ఏంటి అయ్యుండచ్చు ప్రాబ్లెమ్?” అన్నాడు భార్య కేసి చూసి, మోహాన్.

“అబ్బా.. మీరు మరీను, కాలేజీ కుర్రాళ్ళు వాళ్ళు. వాళ్లకు కాక మీకొస్తాయేంటి. మన రోజులు కావు ఇవి. వయసు కొచ్చిన పిల్లలను.. మనం చూసి చూడనట్లుగా మసలు కోవాలి.. వారు హద్దులు దాటనంత వరకూ మనకేం దిగులు అక్కర లేదు.. ఇక పడుకోండి” అని నవ్వి మంచం పక్కనున్న స్విచ్ నొక్కి లైట్ ఆర్పేసింది నిర్మల.

“అదేంటి అప్పుడే నిద్రా?!!” అన్నాడు గుస గుసగా.

“పక్క గదిలో వయసుకొచ్చిన పిల్లలున్నారు. అల్లరి చేయకుండా నిద్రపొండి” అంది మంద్ర స్వరంతో చిన్నగా నవ్వి.

***

“వారం నుండీ ఎన్ని సినిమాలు చూసార్రా?” తమ్ముళ్లను చూసి నవ్వుతూ అడిగాడు మోహన్.

“మరేం చేయం.. రోజంతా ఇంట్లో కూర్చుని. పైగా అది పల్లెటూరు. టీవీ బోరు కొడుతూ వుంది.” అన్నాడు రమేష్.

రాజు ఏం మాట్లాడకుండా, నిరుత్సాహంగా, ముభావంగా కూర్చుని ఉండటం గమనించాడు మోహన్.

***

ఆ రోజు మధ్యాహ్నం ఊర్లోని చిన్న టీ కొట్టులో కూర్చొని మాట్లాడుకుంటున్నారు రాజు, రమేష్.

చిన్న రేకులతో వేసిన టీ హోటల్ అది. జనాలెవ్వరూ లేరు. ఒక పక్కగా వుండే టేబుల్ దగ్గర కూర్చున్నారిద్దరూ.

“నాలుగు రోజుల నుండీ ఫోన్ చెయ్యటం లేదు, నా ఫోన్ లేపటం లేదు రిషిత” అన్నాడు రాజు దిగులుగా మొహం పెట్టి.

“ఏదో ఇబ్బంది ఉండొచ్చు.. ప్రతీ దానికి కంగారెందుకు” నింపాదిగా సమాధానం చెప్పాడు రమేష్.

“ఏమో రా రమేష్, పోనీ మన వూరెళ్ళిపోదామా?” అన్నాడు రాజు. అతని గొంతులో కంగారు, భయం మొదలయ్యాయి.

“ఈ మాత్రం దానికెందుకు.. ఏ మాత్రం వీలున్నా ఫోన్ చేస్తుంది కదా.. ప్రతీ చిన్న దానికి భయపడకు. అయినా నీకు పరిచయం అయి నాలుగు నెలలే కదా.” అన్నాడు రమేష్ సమాధానపరుస్తూ.

“అవును నాల్గు నెలలే, అయితే?.. నీకర్థం కాదులే, మాది అసలైన, సిసలైన ప్రేమ!” అన్నాడు కాస్త గంభీరంగా మొహం పెట్టి.

“అయితే మరలాంటప్పుడు కంగారెందుకు, నిదానంగా వుండు.” అన్నాడు రమేష్.

ఆ మాట విన్న రాజు చిరాకుగా చూసాడు రమేష్ ను. మళ్ళీ జేబులోనుండి మొబైల్ తీసి నెంబర్ కలిపి చెవి దగ్గర పెట్టుకుని “ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది.” అన్నాడు మళ్ళీ భయంగా మొహం పెట్టి.

రమేష్ ఏమీ మాట్లాడకుండా నిరాసక్తతతో బయట వీధి వేపు చూస్తూ కూర్చున్నాడు.

అలాగే గంట కూర్చున్నారిద్దరు. అక్కడ వున్నంత సేపూ నిముషానికోసారి మొబైల్ తీసి కాల్ చేస్తూనే వున్నాడు రాజు.

“ఇక ఇంటికెళదామా?” అన్న రమేష్ మాటతో లేచి అసహనంగా బయటకు అడుగులు వేసాడు రాజు.

***

రాజు ఆ రోజంతా టీవీ ముందు నిశ్శబ్దంగా కూర్చుని ఉండటం గమనించింది నిర్మల. అన్నం కొద్దిగా తినీ తినకుండా ముగించాడు రాజు.

రమేష్‌ను పిలిచి “ఏంటి రాజు అదోలా ఉంటున్నాడు.. ఏమైంది రమేష్” అంది చిన్నగా నిర్మల.

“వదినా.. అదీ..” అంటూ ఆగి పోయాడు రమేష్.

“చెప్పు చెప్పు పర్లేదు” అంటూ కళ్ళతో భరోసాగా చూసింది.

“రిషిత అనే అమ్మాయితో నాల్గు నెలలుగా పరిచయం. ఎప్పుడు చూసినా ఆ అమ్మాయి ధ్యాసే వదినా!, వారం నుండీ ఆ అమ్మాయి ఫోన్ చేయటం లేదు, లేపటం లేదు. అదీ సమస్య.” అన్నాడు రమేష్.

“ఎందుకని?” అనింది నిర్మల.

“తెలీదు, అది తెలియక ఊరికి వెళ్లి పోదామంటున్నాడు, అదేమీ పక్కనుందా, మళ్ళీ రాత్రంతా జర్నీ” అన్నాడు కాస్త అసహనంగా.

“అంత ఎందుకు? మరీనూ” అంది పకపకా నవ్వుతూ

“అబ్బో మీకేం తెలుసు? పైగా మాది అసలైన ప్రేమ! అంటున్నాడు.”

“ఏదీ అప్పుడే, నాల్గు నెలల్లోనే!” అంది నిర్మల.

మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు రాజు మొబైల్ మ్రోగింది. నిద్ర లేచి కళ్ళు నులుముకుంటూ ఫోన్ తీసుకుని “హలో” అన్నాడు రాజు.

“హలో రాజు.. నేను వినోద్” అన్నాడు రాజు స్నేహితుడు వినోద్.

“ఆ.. చెప్పరా వినోద్, ఏంటి సంగతి “ అన్నాడు మంచం మీద లేచి కూర్చుని.

“అదే, రిషిత పెళ్లి రేపే, తెలుసా నీకు” అన్నాడు.

రాజు నిద్ర మత్తు వదిలి పోయింది. లేచి నిటారుగా నిలబడి “అదేంటి.. ఎందుకలా.. ఏం మాట్లాడుతున్నావ్.. నిజంగానా?!” అన్నాడు. అతని తల దిమ్మెక్కి పోయింది. భూమి కదిలినట్లయ్యింది. కళ్ళు తిరిగి మంచం మీద కూలబడి “రిషిత ఒప్పుకుందా.. బలవంతంగా చేస్తున్నారా? నువ్వెళ్ళి కలిసావా?” అని, ఆత్రంగా అడిగాడు. అటునుండి వినోద్ చెప్పిన విషయాలు విని అతని కళ్ళలో నీళ్లు తిరగటం మొదలయ్యింది. గొంతు మూగ పోయింది. ఫోన్ పడేసి మంచం మీద అలాగే కూర్చుని వెక్కి వెక్కి ఏడవ సాగాడు. అన్నీ వింటున్న రమేష్ లేచి వచ్చి రాజు చేయి పట్టుకుని సముదాయించటానికి ప్రయత్నించసాగాడు.

ఆ రోజు సాయంత్రం బ్యాంక్ నుండీ సరాసరి ఇంటికి చేరుకున్న మోహన్ “నిర్మల.. అందరం కలిసి సినిమా కెళదామా?” అన్నాడు.

“ఏం సినిమాకి వెళ్తాం. రాజు ప్రొద్దున్నుండీ ముద్ద మింగలేదు. ఏడుస్తూ వున్నాడు, లోనికెళ్లి చూడండి” అంది నిర్మల, గది వేపు చూపించి.

“ఏమైంది.. ఎందుకని?” అన్నాడు కంగారుగా.

“ఎవరో.. అమ్మాయి.. లవ్ స్టోరీ” అంది గమ్మత్తుగా నవ్వుతూ.

“అయితే? మరి ఏడవటం ఎందుకు?” అన్నాడు కాస్త చిరాకుగా.

“ఆ అమ్మాయి పెళ్లిట.. వేరే వాడితో” అంది.

“ఓహో, అదా సంగతి.. నే చూస్తానుండు” అని గది లోనికి వెళ్ళాడు.

మంచం మీద బోర్లా పడుకుని కనిపించాడు రాజు. లోని కొచ్చిన మోహన్‍ను చూసి పక్కన కుర్చీలో కూర్చున్న రమేష్ లేచి నుంచున్నాడు.

“రాజూ! లే” అన్నాడు మోహన్.

మోహన్ గొంతు విని లేచి కూర్చున్నాడు రాజు. కళ్ళు ఎర్రగా వాచి పోయి వున్నాయి.

“వెళ్లి మొహం కడుక్కుని రా.” అన్నాడు మోహన్.

మొహం కడుక్కుని వచ్చిన రాజుకి కాఫీ ఇచ్చింది నిర్మల. త్రాగి కప్ పక్కన పెట్టాడు.

రమేష్, నిర్మల గదిలో నుండీ బయటకు వెళ్లి పోయారు.

“ఊఁ… అమ్మాయి పేరేంటి?” ఉపోధ్ఘాతం లేకుండా సూటిగా ప్రశ్నించాడు మోహన్, తమ్ముడి ముఖ కవళికలను గమనిస్తూ. చెప్పాడు రాజు.

“ఎన్నాళ్ళ నుండి పరిచయం?” అన్నాడు మోహన్.

“నాల్గు నెలలయింది” తల వంచుకుని చెప్పాడు

“మరిప్పుడేంటి సమస్య?”

“తన పెళ్లి.. రేపే” అన్నాడు గొంతులో వస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకుని.

“మరి మీరు మాట్లాడుకోలేదా? ఇంతకీ అమ్మాయి ఏమంది. అమ్మాయికి ఇష్టమేనా?”

“అసలు తాను నాతో మాట్లాడలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వుంది. నా ఫ్రెండ్ వెళ్లి కలిసాడు. బలవంతం ఏమీ లేదుట. సంతోషంగా చేసుకుంటుందని తెలిసింది” తల దించుకుని చెప్పాడు రాజు.

“అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకపోతే బలవంతంగా ఈ రోజుల్లో పెళ్లి చేయలేరు. అమ్మాయి నీకు ఫోన్ చేయలేదన్నావు. మరలాంటప్పుడు నువ్వెందుకు బాధ పడటం?” అన్నాడు మోహన్.

ఆ మాట విని కళ్ళు లేపి మోహన్ వేపు బాధగా చూసాడు రాజు.

ఒక క్షణం ఆగి అన్నాడు మోహన్ “పైగా నీ వయసెంతని ఇప్పుడు.. ఇరవై కూడా లేవు. అప్పుడే ఎలా పెళ్లి చేసుకుంటావు? ఒక వేళ పెళ్లి చేసుకున్నా, చేసుకుని భార్యని ఎలా పోషిస్తావు. నీకు ఉద్యోగం వచ్చి నువ్ పెళ్లి చేసుకోవటానికి ఇంకా కనీసం ఆరు సంవత్సరాలుంది” అన్నాడు మోహన్.

“అప్పటి వరకూ ఎదురు చూసేవాడిని.” అన్నాడు రాజు మెల్లిగా.

“కావచ్చు, కానీ అమ్మాయి తల్లి తండ్రులు, నీ దగ్గర ఏం చూసి వాళ్ళ పిల్లనిస్తారు? చేసుకునే అమ్మాయి కూడా అది చూడకుండా కళ్ళు మూసుకుపోయి పెళ్లి చేసుకునే రోజులు పోయాయి.” చెప్పాడు మోహన్

ఆలోచనలో పడ్డాడు రాజు. ఏమీ మాట్లాడలేదు.

అప్పుడు మెల్లిగా అన్నాడు మోహన్. “అయినా ముందు ముందు అందమైన అమ్మాయిలు ఎంతో మంది నీ మనసుని చూసి, నీ అర్హత ను బట్టి నిన్ను ప్రేమిస్తారు. అందులో నీకెవరు బాగా నచ్చితే వారిని ఎన్నుకుని పెళ్లి చేసుకోవచ్చు. అంతే కానీ ఇప్పటి నుండీ ప్రేమా దోమా పెళ్లి అనుకుంటూ ఈ న్యూసెన్స్ లు నీకెందుకు?..”

మోహన్ వేపు అనుమానంగా చూసాడు రాజు.

“లోకంలో నిన్ను మెచ్చే అమ్మాయిలు బోల్డు మంది వుంటారింకా.. అయినా నీ వాల్యూ తెలీని అమ్మాయి గురించి నీవెందుకు ఏడవటం.. అనవసరం.” అన్నాడు గట్టిగా.

రాజు కేసి చూసాడు మోహన్. మొహంలో బాధ తగ్గి, తేలిక పడ్డ మనసుతో వింటున్నట్టుగా అనిపించింది.

అయిదు నిముషాలు మౌనంగా కూర్చున్నాడు మోహన్. ఒక సారి రాజును గమనించాడు. చాలా వరకు స్తిమిత పడ్డట్లుగా అనిపించింది.

“ఇప్పటినుండే ఇటువంటి లేని పోని, సాధ్యం కాని తల నొప్పులు పెట్టుకోకుండా, హాయిగా ప్రశాంతంగా అమ్మాయిలతో మంచి స్నేహం చేస్తూ జీవితాన్ని ఆనందంగా కొనసాగించాలి. నీ గమ్యం చేరుకునే సమయానికి, నీకు సరిగ్గా సూట్ అయ్యే అమ్మాయి దొరికితే, అప్పుడు పెళ్లాడాలి. అంతే కానీ ఇప్పుడు ఎవరు దొరికితే వారిని చూసి ప్రేమ పెళ్ళీ అని బుర్ర పాడు చేసుకోకు” అన్నాడు మోహన్

అన్నయ్య చెప్తున్న విషయాలు విని మొహం తుడుచుకుని ప్రశాంతంగా కూర్చున్నాడు రాజు.

తమ్ముడిని నిశితంగా గమనించిన మోహన్ ‘తన పని అయిపోయింద’ని నిర్ధారణకు వచ్చి, లేచి నిలబడి “మంచి సినిమా రిలీజ్ అయ్యింది వెళ్లి రండి” అని తమ్ముళ్లకు చెప్పి తన గది లోకి వెళ్ళాడు.

కొద్ధి సేపటికి స్నానం చేసి, బాత్ రూమ్‌లో నుండి తల తుడుచుకుంటూ వచ్చాడు మోహన్. అంతలో మంచి డ్రెస్ వేసుకుని హాల్ లోకి వచ్చి షూస్ తొడుక్కుని “వదినా! మేమిద్దరం సినిమా కెళ్ళొస్తాం!!” అని నిర్మలకు చెప్పి హుషారుగా బయటకు నడిచాడు రాజు. వెనకాల రమేష్ వదినను చూసి నవ్వుతూ అనుసరించాడు.

అది చూసి ఆశ్చర్యంగా ముక్కున వేలేసుకుని భర్త మోహన్ వేపు చూసి “అదేంటి, ఇంతలో అంత మార్పు ఎలా వచ్చింది!?. పొద్దున్నుండీ ఏడుస్తున్న వాడు అలా ఎలా మారిపోయాడు? ఏం మంత్రం వేసారింతకీ” అంది నిర్మల.

సమాధానంగా నవ్వుతూ చూసాడు భార్య వేపు మోహన్.

“చెప్పండి ఏం చేశారు” అంది.

“దాన్ని మంత్రం అంటారు. అది రహస్యంగా ఉన్నంత వరకే పని చేస్తుంది.” అని గుంభనంగా నవ్వాడు మోహన్.

“అయ్యా మీ తెలివికి నమస్కారం” అని రెండు చేతులు పైకెత్తి, కళ్ళెగరేసి వంటింట్లోకి అడుగులు వేసింది నిర్మల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here