వేదాధ్యయనపరుడు ‘కౌశికుడు’

0
2

[dropcap]కౌ[/dropcap]శికుని గాథను మార్కండేయు ముని  అరణ్యవాసములో ఉన్న ధర్మరాజుతో చెపుతాడు. కౌశికుని గాథ ద్వారా మార్కండేయ ముని ధర్మరాజుకు వర్ణాశ్రమధర్మాలు మొదలైన ధర్మ సూక్ష్మలను వివరిస్తాడు. పూర్వకాలములో కౌశికుడు అనే ఒక తపోమూర్తి, వేదాధ్యయనపరుడు అయిన ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. విద్యాభ్యాసము అయినాక గురువుగారు – కౌశికునితో ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులకు సేవచేయమని చెపుతాడు. కానీ కౌశికుడు ఇంకా జ్ఞానాన్ని సంపాదించి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలు దేరుతాడు. ఆయన ఒకనాడు వటవృక్షపు నీడలో కూర్చుని మంత్రానుష్ఠానము చేసుకుంటూ ఉండగా చెట్టుపై నున్న ఒక పక్షి తన సహజ ధర్మముగా కౌశికుని పై రెట్ట వేసింది. అప్పుడు కౌశికుడు కోపముగా ఆ పక్షి వంక చూస్తాడు. మరుక్షణమే ఆ పక్షి కౌశికుని ఆగ్రహ జ్వాలలకు మాడి బూడిద అవుతుంది. తన తొందరపాటుకు చింతించి కొంత శాంతము వహిస్తే బావుండేది అనుకున్నాడు. తన అనుష్ఠానాన్ని ముగించుకొని సదాచార పరాయణుల ఇంట భిక్షకు బయలుదేరాడు.

ఒక ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అంటాడు. విన్న ఇల్లాలు భిక్ష వేయటానికి సిద్ధమవుతుండగా ఆ ఇల్లాలి భర్త ఆకలితో ఇంటికి వస్తాడు.

భర్తను చుసిన ఇల్లాలు తన చేతిలోని పాత్రను పక్కన బెట్టి భర్తకు అన్ని సపర్యలు చేసి ఆయనకు భోజనము తినిపిస్తుంది. ఆయన సేద తీరినాక ఆ ఇల్లాలికి భిక్ష కోసము వచ్చిన బ్రాహ్మణుడి మాట గుర్తుకు వచ్చి బ్రాహ్మణుడికి భిక్ష వేయటానికి పాత్రతో వచ్చింది. తనను ఎక్కువ సేపు ఆ విధముగా భిక్ష కోసము వేచి ఉండనిచ్చినందుకు కౌశికుడు ఆగ్రహముతో ఇల్లాలితో, “నీకు వీలు కానప్పుడు నాతో ఉందో లేదో చెపితే నేను ఇంకో ఇంటికి వెళ్లిపోయేవాడిని”అంటాడు.

అప్పుడు ఆ ఇల్లాలు ఎంతో శాంతముగా, “నిజానికి మీకు బిక్ష వేద్దామని ఏర్పాటు చేసాను. కానీ అదే సమయములో నా భర్త అలసి పోయి ఇంటికి వచ్చాడు. గృహిణిగా నా భర్త సేవలు చేయటము నా ధర్మము. నేను నా ధర్మాన్ని ఆచరించాను. నా భర్తకు సపర్యలు చేసినాక మీకు భిక్ష తెచ్చాను. ఇందులో నా తప్పేమి లేదు. నా చర్య అధర్మము కాదు” అని తన చర్యను ఇల్లాలు సమర్థించుకుంది. ఈ మాటలతో కౌశికుడు మరింత ఉగ్రుడై, “నేను నీ భర్త కన్నా హీనుడినా? దేవతలు, భూసురులు నా ఆగ్రహానికి గురికాకూడదని తమను తాము అర్పించుకుంటారే, అటువంటిది నీవు సామాన్య గృహిణివి నన్ను నిర్లక్ష్యం చేస్తావా?” అని ఆగ్రహంతో ఇల్లాలి వైపు చూస్తాడు.

కోపము పట్టలేకపోతున్న కౌశికుని వైపు పరమ పతివ్రతా అయిన ఇల్లాలు ప్రశాంతముగా ఒక చిరునవ్వు నవ్వి, “ఓ మహాత్మా నాకు మీ వంటి మునీశ్వరుల శక్తులు తెలుసు. నేను ఎవరిని కించపరచలేదు. కానీ వివాహిత స్త్రీకి పతియే ప్రత్యక్షదైవం, కాబట్టి భర్తను కాదని ఏ పూజ లేదా పుణ్యకార్యము చేసిన అది నిష్ఫలం కాబట్టి నా ధర్మం నిర్వర్తించి తమ వద్దకు భిక్ష ఇవ్వటానికి వచ్చాను. మీరు తపోధనులు అయినా శాంతము లేనిచో ప్రశాంతత లభించదు. అయినా మీరు కన్నెర్ర చేస్తే మాడిపోవటానికి నేను అడవిలో చెట్టు పైన ఉన్న పక్షిని కాను” అన్నది. ఈ మాటలకు కౌశికుడు నివ్వెరపోయి కొంచము సేపటికి తెలివి తెచ్చుకొని “అమ్మా” అని మాత్రమే అనగలిగాడు.

అప్పుడు ఆ ఇల్లాలు, “బ్రాహ్మణునికి మొదటగా ఉండవలసినది శాంతము, వేదాలు అభ్యసించటం వలన విద్య, తపస్సు వలన శక్తి వస్తుంది. శాంతి, స్వధర్మము-భక్తి యుక్తులను ఇస్తాయి. ఈ సత్యాన్ని మరిస్తే ఎత్తిన బ్రాహ్మణా జన్మ, చదివిన చదువు, చేసిన తపస్సు అంతా వృథాయే” అని చెప్పి, “మిథిలా నగరానికి వెళ్లి అక్కడ ఉండే ధర్మవ్యాధుడిని కలిస్తే అతడు ధర్మమూ అంటే ఏమిటో వివరిస్తాడు. నీకు సత్యము బోధపడుతుంది” అని చెపుతుంది.

కౌశికుడు ఆ తల్లికి నమస్కారించి ఆవిడ ఆదేశానుసారం మిథిలానగరానికి ధర్మవ్యాధుడిని దర్శించటానికి బయలు దేరుతాడు. మిథిలానగరానికి చేరిన కౌశికుడు ధర్మవ్యాధుని గురించి వాకబు చేసి అతని వద్దకు చేరాడు. మాంసము దుకాణం ముందు కూర్చుని మాంసము అమ్ముతున్న ధర్మవ్యాధుని చూసి ఆ మాంసము వాసన భరించలేక దూరంగా పక్కన నిలబడ్డాడు. కొంచము సేపటికి ధర్మవ్యాధుడు తన పని ముగించుకొని కౌశికుని వద్దకు వచ్చి నమస్కరించి, “అమ్మ పంపగా మీరు వచ్చారు. మీరు వచ్చిన విషయం నాకు అంతా తెలుసు” అనేటప్పటికి కౌశికుడు నిర్ఘాంతపోయాడు.

ధర్మవ్యాధుడు కౌశికుని తన నివాసానికి తీసుకొని వెళ్లి అర్ఘ్యపాదాలతో మునిని సత్కరించి గౌరవించాడు. కౌశికుడు ధర్మవ్యాధుడిని మనసులో ఛీత్కరించుకున్నందుకు సిగ్గుపడి, “ధర్మవ్యాధా, నీ ధర్మనిరతి, సంస్కారము నన్ను మంత్రముగ్ధుడిని చేశాయి. ఇన్ని తెలుసున్న నీవు జీవహింస చేయటము మాంసము అమ్మటం సమంజసేమేనా?” అని అడుగుతాడు.

“నేను జీవహింస చేయను. మాంసాన్ని మాత్రమే స్వల్ప లాభముతో అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటాను. కౌశికా, ధర్మాలలో విద్యలలో ఉత్తమమైనది దానము. తపోనిరతి, వేదాధ్యయనము బ్రాహ్మణులకు, ప్రజాపాలన దండన క్షత్రియులకు, వాణిజ్యము, పశు పాలన, కృషి వైశ్యులకు, సేవలు చేసి తరించే ధర్మాన్ని శూద్రులకు ఏర్పరచి భగవంతుడు చాతుర్వర్ణాలు ఏర్పరచి వారికి నియమించిన ధర్మాలు ఇవి. కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి. జీవ ధర్మమూ వేరు, వృత్తి ధర్మమూ వేరు, ధర్మానికి దండనీతికి మిథిలాధిపతి అయినా జనకుడు ప్రతిరూపం. ఏ విధమైన తరతమ భేదాలు లేకుండా శిక్షలు అమలు చేస్తాడు. ధర్మ కర్మలను ఆచరించటంలో భవబంధాలకు తావు లేకుండా అమలు పరుస్తాడు. తల్లిదండ్రుల సేవలో పురుషుడు, పతి సేవలో స్త్రీ తరిస్తారు. ఆయా ధర్మాలను విడిచి పెట్టి చేసే ఏ పూజ అయినా నిష్ప్రయోజనము. కాబట్టి స్వధర్మాన్ని పాటించాలి. కుల ధర్మాన్ని పాటించాలి. నా తల్లిదండ్రులను సేవించటం వల్ల నాకు నీ మనసును తెలుసుకొనే శక్తి అబ్బింది. అన్ని ధర్మాలలో కెల్లా ఉత్తమమైనది సత్యము. సత్యానికి ధర్మానికి సనాతన సదాచారానికి భంగము వాటిల్లిన భగవంతుడు ఉపేక్షించడు. సర్వము తెలిసిన మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను” అని ధర్మవ్యాధుడు కౌశికునికి వర్ణ వ్యవస్థ గురించి, ధర్మ సూక్షల గురించి వివరిస్తాడు.

జ్ణానోదయం అయిన కౌశికుడు తన తల్లిదండ్రులను సేవించటానికి గృహస్థాశ్రమము స్వీకరించటానికి నిర్ణయించుకొని వెనుతిరుగుతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here