వేదాంతం – వేదాంత విద్యార్థి

0
68

మన పెద్ద వాళ్ళు ఎప్పుడూ అనే మాట “వేదాంతం చెప్పకురా..”. లేదా “మెట్ట వేదాంతం చెబుతున్నాడురా..” అంటారు.

ఎంతో సహజంగా చెప్పే ఈ మాటకు అసలు చాలా సార్లు మనం అర్థం కానీ పరమార్థం కాని ఆలోచించము. చిన్నతనం నుంచీ వింటున్న ఎన్నో మాటలలో ఇదీ అలా ఒకటి మనకు. దీని వెనక అర్థం పరమార్థం చాలా ఉంది.

– అసలు వేదాంతమంటే ఏమిటి?

వేదాంతం అంటే పుస్తకభాషలో చెప్పాలంటే వేదాలకు చిట్టచివర ఉన్నది. వేదాల తదనంతరం వేదాలలో ఉన్నది తిరిగి చెబుతూ ఉండేది. మరో రకంగా చెప్పాలంటే ఉపనిషత్తులను వేదాంతం అంటారు.

వేదాలలో చెప్పినది తిరిగి ఉపనిషత్తులలో చెప్పబడింది. లోతైన సత్యం, పరమ సత్యం, ఏ విషయమైతే తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది లేదో అది వేదాంతం.

“వేదాంత జ్ఞాన ఉపనిషత్ ప్రమాణ”. వేదాంతమంటే ఉపనిషత్తులలో ఉన్న జ్ఞానమే.

ఈ వేదాంతము షట్‌దర్శనాలలో ఒకటి. దీనినే ఉత్తర మీమాంసగా పేర్కొన్నారు.

సనాతన ధర్మం చెప్పిన ఈ షట్‌దర్శనాలు అత్యంత ఉత్తమమైన, తుట్టతదుకున్నది పరమసత్యాన్ని ఆవిష్కరిస్తున్నది వేదాంతమే. ఈ వేదాంతాన్ని అద్వైత, విశిష్ఠాద్వైత, ద్వైత అన్న సిద్ధాంతాల ద్వారా విచారిస్తారు. ఇందులో అద్వైతమే అత్యంత ఉత్తమమైనదిగా అంగీకరించబడింది.

ఈ అత్యంత ఉన్నతమైన పరమ సత్యం “జీవన్ముక్తి నిచ్చే జ్ఞాన్నాని” గురించి చెబుతుంది.

ఎవ్వరు ఈ జ్ఞానాన్ని పొందుతారో వారు జీవన్ముక్తులై బ్రహ్మానందమనుభవిస్తారు.

ఈ వేదాంతము తెలుసుకోవటానికి మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని “ప్రస్థానత్రయమని” అంటారు.

ఆ మూడు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత.

ఇవి బ్రహ్మవిద్యను బోధిస్తాయి. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మమేదో తెలియచేసేది. అన్నిటా ఉన్న ఆ పరమ సత్యం ఏదో, ఏ సత్యాన్ని గ్రహిస్తే మరి తెలుసుకోవలసినది లేదో అది బ్రహ్మవిద్య. ఆ బ్రహ్మ విద్యనే మనకు ప్రస్థానత్రయం ద్వారా తెలుసుకోగలము. అదే వేదాంతమంటే.

అంటే వేదాంతం చెబుతున్నారంటే వారు పరమ సత్యాన్ని ఆవిష్కరిస్తున్నారని మనము అర్థం చేసుకోవచ్చు.

వీరు జీవన్ముక్తులని, పరమానందంలో రమిస్తున్నారని.. ఆ ఆనందం మనకూ పంచుతున్నారని కూడా అర్థం.

ఈ వేదాంతం ఎవరికంటే వారికి తెలుస్తుందా? అన్నది తరువాత మనకు సందేహం కలుగుతుంది.

ఎవరు జీవితం క్షణభంగురమని గ్రహించారో, ఎవరు జనన మరణ చక్రం నుంచి విడుదల కోరుతున్నారో వారు ఈ విషయం మీద ఆలోచన చేస్తారు.

ఎవరు పరమ సత్యమైన దానిని తెలుసుకోవాలనుకుంటారో, వారు సాధనా చతుష్టయాలను సాధన చేస్తారు. వారిని సాధకులంటారు. వీరు వేదాంతాని తెలుసుకోగోరుతారు. వారు ప్రస్థానత్రయాన్ని అభ్యసిస్థారు.

వారిని “వేదాంత విద్యార్థు”లంటారు.

ఈ విద్యార్థులు నేర్చుకోవాలనుకునేది ఏమిటి?

పరమ సత్యమైన బ్రహ్మాన్ని.

ఆ సత్యం ఎలా తెలుస్తుంది?

అజ్ఞానం వీడినప్పుడు. ఆ ప్రయాణము అజ్ఞానము నుంచి జ్ఞానము వైపుకు సాగుతుంది.

అంటే చీకటి పోవాలంటే వెలుతురు రావాలి. ఒక చిన్న దీపం వెలిగితే ఎలా కాంతివంతమవుతుందో, అలాగే అజ్ఞానం వీడితే ఉండేదంతా జ్ఞానమే ఇక. అంటే సాధకునిలో జ్ఞానం ఉంది. కాని అది అజ్ఞానమన్న తొడుగుతో కప్పబడింది. ఎప్పుడైతే సాధకుడు ప్రస్థానత్రయం ద్వారా వేదాంత సాధన చేసి ఆ ముసుగును బద్దలు కొట్టుకుంటాడో అప్పుడు మిగిలినదంతా జ్ఞానమే.

ఎలాగైతే చీకటి తొలగించటానికి దీపం వెలిగించాలో అలా అజ్ఞానం తీసివేస్తే ఉన్నది ఇక జ్ఞానమే అవుతుంది.

అజ్ఞానం నుంచి స్వేచ్ఛ కోరే సాధకులు ముముక్షువులు.

ఎప్పుడైతే తను వెతుకుతున్న పరమ సత్యం తమ నుంచి వేరుగా లేదని, వెతక వలసినది తన లోలోనే అని తెలుసుకుంటాడో ఆ సాధకుడు “జిజ్ఞాసు” అవుతాడు. అంటే తనలోని జ్ఞానాన్ని తెసుకోవాలా సాధకుడు. అదే స్వస్వరూప జ్ఞానం.

స్వస్వరూపు జ్ఞానం ఎలా లభిస్తుంది? అని ప్రశ్న ఉదయిస్తుంది.

జిజ్ఞాసు అయిన ముముక్షవు స్వస్వరూప జ్ఞానాన్ని ఎలా పొందాలో ముండకోపనిషత్తు చెబుతుంది.

“తదేతత్ సత్యం
మంత్రేషు కర్మాణి కవయో యాన్య పశ్యం-
స్తాని తేత్రాయాం త్రేతాయాం బహుధా సన్తతాని
తాన్యాచరథ నియతం సత్యకామా
ఏష వః పన్థాఃసుకృతస్య లోకే॥”

యజ్ఞయాగాదుల వలన, వేదాలలో అనుష్ఠించినవి చెయ్యటము వలన జ్ఞానాన్ని పొందగలరు.

వేదాంతము నేర్చుకునే విద్యార్థులకు మూడు మెట్లు నిర్దేశించబడి ఉంటాయి.

స్వస్వరూప జ్ఞానము కోరే జిజ్ఞాసువులు మొదట కర్మయోగం, ఉపాసనా యోగం సాధన చెయ్యాలి. నిత్యకర్మలను విడవరాదు. వారి జన్మయందు నిర్దేశించబడినవి నిత్యకర్మలను వారు చివరి వరకూ విడవక పాటించాలి. కర్మ ధర్మ స్వరూపం. ఎలా ఉండాలో చెబుతుంది ధర్మం.

ఉపాసనా వారి వారి సాంప్రదాయం బట్టి చెయ్యవలసినదే. ఉపాసన వలన ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఈ రెండూ కూడా జ్ఞానానికి దారి చూపుతాయి.

రెండవ మెట్టులో రెండు విధానాలు చెప్పబడ్డాయి. మొదటిది శ్రవణం. రెండవది మననం.

భగవంతుని గురించి సదా వినటమే శ్రవణం. విన్న దాన్ని మరువక తిరిగి తిరిగి గుర్తు తెచ్చుకోవటం మననం. దీని వలన వారికి భక్తి నిలబడుతుంది.

మూడవ మెట్టు జ్ఞాన నిష్ఠ. జ్ఞాననిష్ఠ ద్వారా స్వ స్వరూప జ్ఞానము కలుగుతుంది. ఈ జ్ఞానము కలిగినవారికి జ్ఞాత, జ్ఞ్యైయం అన్న బేధం ఉండదు. ఇది నిదిధ్యాసనం వలన పరిపుష్ఠి కలుగుతుంది.

ఇలా నిరంతర సాధన వలన సాధకుడు పురోగమించగలడు, తన స్వస్వరూప జ్ఞానము సముపార్జనలో.

అయితే సాధనలో తమ పురోగతి ఏమిటి అని ప్రతి సాధకునికీ ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది.

అది తెలుసుకోవాలంటే సాధకులు అంతరంగంలో సదా నెమ్మదిని నుండటము, అలజడులు లేకపోవటము, ఎటు వంటి స్థితిలోనైనా నిశబ్దంతో ఉండటము వలన సాధకులు తమ పురోగమనాన్ని చూసుకోవచ్చు. దీనినే భగవద్గీతలో స్థితప్రజ్ఞత అన్నారు. ఆ స్థితి కలిగే వరకూ సాధకులు సాధనను చేస్తూనే ఉండాలి.

కాబట్టి వేదాంత విద్యార్థి సాధనలో ఉపనిషత్‌జ్ఞానము అత్యంత ముఖ్యమైనది. స్వస్వరూప జ్ఞానానికి ఉపనిషత్తులు సహాయపడగలవు.

అది అద్వైతానికి సోపానం. అద్వైతమే ఉత్తమోత్తమైన మార్గం.

అదే జీవన్ముక్తి. ఆ స్థితి పొందటమే గమ్యం ఈ వేదాంత విద్యార్థికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here