Site icon Sanchika

వీడెవడో…?

[dropcap]వీ[/dropcap]డెవడో…
రెల్లుపూలను రెక్కలుగా తొడుక్కుని
పాల నురగ లాంటి సంతోషాన్ని జుర్రుకుంటూ..
గుత్తులు గుత్తులుగా వేలాడే కలల్ని కోసుకుంటూ
వెన్నెల తీరంలో నగ్నంగా నర్తిస్తున్నాడు
శబ్దించని ఏటి నీటి పలకపై
పెంకులను తేలకొడుతూ కేరింతలు పెడుతున్నాడు
దేహం నిండా ఇంకా మానని పచ్చిగాయాలు
వేలికొసలపై విన్యాసిస్తున్న వెదురుకొమ్మ
ఉన్మాదిలా ప్రేలాపిస్తూ
గుప్పెళ్ళతో పూలను దారంతా చల్లుకుంటూ…
ఎంత సమ్మర్దం లోనైనా
ఏకాండీలాంటి తనలోంచి వాక్యాలను తీసుకుంటూ…
కులాసాగా నడిచే
వీడ్ని మీరేమైనా గుర్తు పట్టగలరా??
గోరు తాకితే గొంతు తెగిపోయే పారిజాతం పువ్వులా..
పెదవి తాకితే స్వరించే పున్నాగకాడలా…,
మంచు ఉదయాలను స్నానించే
వీడి ఆనవాలు చెప్పగలరేమో చూడండి.
రాలుగాయి పిల్లాడు గురిచూసి విసిరిన పలుకురాయికి,
నవ్వుతూ రాలిపడే చింతకాయలా
నేలభుజంపై చేతుల్ని స్నేహించి
కొసరి కొసరి పళ్ళను తినిపించే
జీడిమామిడి లా
పసితనాన్ని పరిమళించే
వీడి స్పర్శా సుగంధాన్నేమైనా…
అనుభవం లోకి తెచ్చుకోగలరేమో
ఆలోచించండి
మనుషుల దుఃఖాలను తనలోకి ఒంపుకుంటూ…
కత్తిపడవల్ని జన ప్రవాహంలోకి
ఒదులుతూ,
ప్రశ్నల్ని శ్లేషించే
వీడి పదధ్వనిని కొద్దిగానైనా వ్యాఖ్యానించగలరేమో ఆలకించండి,
మసీదు గోడపై
బొగ్గు తో రాసిన ఫిరదౌసి పద్యంలా..
కలుషించినా కనికరించే ప్రకృతి లా…
కాలం దరులను ఒరుసుకుంటూ ప్రవహించే వీడెవడో….?!

Exit mobile version