వీరన్న

0
2

[dropcap]నం[/dropcap]దుడి గారింటి నించీ పదడుగులు వేసి పక్కకి తిరిగితే అల్లంత దూరంలో ఊరి మధ్యలో రావిచెట్టూ జువ్వి చెట్టూ కృష్ణ బలరాముల్లాగా కలిసి పెనవేసుకుని భుజాల మీద చేతులేసుకుని నుంచున్నయ్యి. వాటి చుట్టూ ఊరి పెద్దలు తీర్పు చెప్పటానికీ, పొద్దుపోని పెద్దాళ్ళు అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోటానికి వీలుగా కట్టిన రచ్చబండ, బృందావనంలో జరిగే అన్ని సంఘటనలనీ స్థితప్రజ్ఞుడి లాగా సాక్షిలాగా చూస్తూ ఉంది. పగలంతా పెద్దవాళ్ళ రాజకీయాలతోనూ, పులీ మేకా, చదరంగం ఆటల హడావిడితోనూ గందరగోళంగా ఉండే ఆ స్థలం సాయంత్రానికి అన్నీ సద్దుమణిగి ప్రశాంతంగా తయారవ్వుతుంది. చీకటి పడేటప్పటికల్లా అక్కడ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ కూడతారు. కృష్ణుడూ, బలరాముడితో సహా అందరు పిల్లలూ ఎవరి దిండూ దుప్పటీ వాళ్ళు తెచ్చుకుని దొరికితే బండ మీదా లేకపోతే దానికి చుట్టూతా కూచోటానికీ, వీలైతే పడుకోటానికీ చోటు చేసుకుని ఎదురుచూస్తూ ఉంటారు. అల్లరి చేసేవాళ్ళూ, హడావిడి చేసేవాళ్ళూ, ఏడ్చే వాళ్ళూ , కొట్టుకునేవాళ్ళూ పాటలు పాడే వాళ్ళూ అందరూ అక్కడ ఎదురు చూసేది వీరన్న తాత కోసం.

పగలంతా ఊరి మొత్తానికీ రకరకాల కుండల్నీ, దుత్తల్నీ, ఉట్లనీ తయారుచేసి ఇస్తుండే కుమ్మరి వీరన్న, రాత్రయ్యేసరికల్లా గొంగళి కప్పుకుని రెండు ప్రమిదలు పట్టుకుని మెల్లిగా రచ్చబండ దగ్గిరికి చేరాడు. అతన్ని చూసి వాసంతిక లేచి వెళ్లి ఆ ప్రమిదల్ని తీసుకుని తను తెచ్చిన నెయ్యి కొద్దిగా వేసి రెండు దీపాలు వెలిగించి రెండు చెట్ల మొదళ్ళల్లో పెట్టంగానే వాచస్పతి వొచ్చి దీపం జ్యోతి పరంబ్రహ్మ అని శ్లోకం చదివి నమస్కారం చేస్తే అందరూ లేచి నుంచుని దణ్ణం పెట్టారు. వీరన్న తాత మెల్లిగా కూర్చుని గొంతు సవరించుకుని అంతా పరికించి చూసి “బుల్లోడా ఏంటి మరీ మెరిసిపోతున్నావు” అని కృష్ణుడి కేసి చూసి నవ్వాడు. “ఏదోలే తాతా, నీ అంత కాదు కదా” అని కృష్ణుడు అంటే పిల్లలందరూ నవ్వారు.

గొంతు సవరించుకుని “అనగనగా ఒక రాజున్నాడు” అంటూ మొదలెట్టేడప్పటికి పిల్లలందరూ చెవులు రిక్కించారు. ఇంక అక్కడ ధైర్యవంతులైన రాజులూ, వాళ్ళని సేవించే మంత్రులూ, రాజ కుమార్తెలూ, వాళ్ళని కాపాడటానికి వెళ్ళే రాజ కుమారులూ, గంధర్వ కన్యలూ, మంత్ర తంత్రాల్లోనూ, గజ కర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలలోనూ ఆరితేరిన మాంత్రికులూ, యక్ష రాక్షసులూ, అణిమాది అష్ట సిద్దుల్నీ వశం చేసుకున్న మునులూ, అకారణంగా శపించే ఋషులూ, అత్యంతాదరంతో దగ్గరికి తీసే తపస్వులూ, అమాయకులైన ప్రజలూ, అడవుల్లో ఉండే ఆటవికులూ, మృగాలూ, క్రూరులూ, వంచకులూ అయిన అధికారులూ, ఇలా వీళ్ళందరూ రక రకాల వేషాలు వేసుకుని సంచారం చేసేవాళ్ళు. అలా కథలు వింటూ కలల ప్రపంచంలో విహరిస్తూ పిల్లలు ఒకళ్ళు ఒకళ్ళుగా నిద్దర్లోకి జారుకుంటే, వాళ్ళ అమ్మలో, పరిచారికలో వచ్చి పిల్లల్ని అందర్నీ ఎత్తుకుని వెళ్ళేవాళ్ళు. అన్నయ్యతో పాటు అందరూ నిద్దరపోయినా, వాళ్ళందరినీ అమ్మలు ఇంటికి జేర్చినా, ఊ కొడుతూ కృష్ణయ్య ఇంకాస్త కథ చెప్పమని వేపేవాడు. చివరికి యశోదమ్మ వచ్చి మిగతా కథ రేపు చెప్పమని వీరన్నకి పురమాయించి బలవంతంగా బయలుదేరదీస్తే ఇంటి మొదలు తిరగకుండానే అమ్మ చంక ఎక్కి క్షణంలో నిద్ర పోయేవాడు. ఇలా రోజులు పరిగెత్తాయి.

***

ఒక రోజు వీరన్న కుండల కోసం తెచ్చిన మట్టిని పిసుకుతూ ఉంటే కృష్ణుడు సవిలాసంగా నడుస్తూ చేతిలో కర్రని తిప్పుతూ అక్కడికొచ్చాడు.

“ఏం తాతా ఏం చేస్తున్నావు” అన్నాడు.

“కుండలు చేస్తున్నాను మనవడా”

“కుండలంటే”

“మట్టిని పిసికి దాన్ని ఇలా చక్రం మీద పెట్టి మెల్లిగా తిప్పి ఈ విధంగా మలిచి దాన్ని ఎండ బెట్టి ఆవంలో వేడి చేస్తే దాన్ని కుండ అంటారు”

“అవును తాతా, కుండకీ మట్టికీ తేడా ఏమీ లేనట్టుంది. కుండ తయారు కానప్పుడు మట్టి ఉంది, కుండ పగిలిపోయిన తరవాతా మట్టే ఉంది. కుండగా ఉన్నప్పుడు కూడా అది మట్టే. అవునా”

వీరన్నకి మాటల్లో ఉన్న తర్కం అర్థం కాలేదు. ఏం చెప్పాలో తెలీక “అల్లాగే అనిపిస్తోంది” అన్నాడు. వెంటనే కృష్ణుడు చేతిలో కర్ర పెట్టి అక్కడ తయారు చేసి ఉన్న కుండలని అన్నిట్నీ “కుండకీ మట్టికీ తేడా లేదు” అంటూ మళ్ళీ మళ్ళీ అరుస్తూ ఎగిరి గెంతులు వేసి నవ్వుతూ ఘట్టిగా కొడితే అవన్నీ ముక్కలై పొయ్యాయి.

వీరన్నకి నోట మాట రాలేదు. తమాయించుకుని “ అదేంటి మనవడా, అలా పగలగొట్టావు” అన్నాడు. “కుండకీ మట్టికీ తేడా లేదని నువ్వే ఒప్పుకున్నావుగా, ఇదిగో ఇదీ కుండ” అంటూ మట్టిని చూబించాడు కృష్ణుడు.

“అయితే మట్టుక్కు అలా పగలకొట్టేస్తారా”

“సరే తాతా ఇవి ఎందుకు చేస్తున్నావో చెప్పు”

“ఊళ్లోవాళ్ళ కోసం”

“నీ కోసం చెయ్యాలి కాని ఊళ్లోవాళ్ళ కోసం ఎందుకు”

“ఆరి భడవా, ఈపని చేస్తే వాళ్ళు డబ్బులు, ధాన్యం, పాడీ ఇస్తారు. వాటి కోసం”

“అంటే నీ కోసమేనన్నమాట”

“అవును నాకోసమే, సరేనా ఇంతకీ ఎందుకు పగల..”

“కృష్ణుడు గట్టిగా నవ్వాడు. పట్టపగలే వెన్నెల విరిసింది, మలయా మారుతం వీచింది. అమృతం కురిసింది.

“మరి నాకోసం ఓ కుండ చేసివ్వవా”

“ఓ మనవడా, తప్పకుండా చేసిస్తాను, ఇప్పుడే”

“ఆగు తాతా, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను, చాలా రోజులయాక, నే పెద్దయ్యి బోల్డు యుద్ధాలు చేసి అప్పుడు డబ్బులు ఇస్తా సరేనా”

“హ,హ హ, సరే అలాగే”

“తాతా నాకు ముందర ఇది చెప్పు, కుండకీ మట్టికీ తేడా లేదు అన్నావు కదా మరి వాటి మధ్య సంబంధం ఏంటి. ఈ కుండకీ ఆ కుండకీ ఏంటి తేడా. రెండూ మట్టివే, రెండూ కుండలే కానీ వాటి మధ్య తేడాలు ఉన్నయ్యా, లేవా, ఉంటే ఎందుకట్లా, కుండ లేక పోయినా మట్టి ఉంది, మరి మట్టే లేకపోతే?” అని ప్రశ్న మీద ప్రశ్న సంధించిన కృష్ణుణ్ణి చూసి ఎం చెప్పాలో తెలీక అవాక్కయ్యాడు వీరన్న.

ఒక క్షణం తరవాత తేరుకుని “ఏవో ప్రశ్నలేసి నా బుర్ర తిన్నావు. ఉండు కుండ చేసిస్తా” అని చక్రం తిప్పబోయాడు.

“తాతా, నీ మట్టిని గురించీ, నీ కుండల గురించీ నీకే సరిగా తెలియకపోతే నీ కుండ సరిగ్గా ఎల్లా వుంటుంది చెప్పు. కుండతో బాటు నా ప్రశ్నలకి సమాధానం ఇస్తేనే కుండని తీసుకుంటాను. నేను నిన్ను ఈ ప్రశ్నల్ని అడిగానని ఎవరికీ చెప్పొద్దు తాతా” అని నవ్వుతూ వెళ్ళిపోయాడు కృష్ణుడు.

వీరన్నకి బుర్రేమీ పనిచెయ్యట్లేదు. కృష్ణుడికి ఎలాగైనా కుండని ఇవ్వాలని మనసు తొందరిస్తోంది. కృష్ణుడి ప్రశ్నలని ఇంకోసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. కాసేపు ఆలోచించాడు. ఏమీ అర్థం కాలేదు. ఇలా కాదు అని ఎవర్ని అడిగితే బావుంటుందని ఆలోచించి చిన్నప్పట్నించీ స్నేహం ఉన్న పక్క వీధి సుబ్బులు దగ్గిరి కెళ్ళాడు. వాడికీ ఇదేంటో తెలీదని క్షణంలో అర్థమవటంతో బయట పడి ఒకళ్ళ తరవాత ఒకళ్ళని అలా ఊరందరినీ అడగటం పూర్తి చేసాడు. చాలామంది ప్రశ్నఏంటో అర్థం చేసుకోలేకపోవటమూ, చేసుకున్న కొద్ది మంది చెప్పే సమాధానం తనకి అర్థమయ్యీ కాకుండా దృశ్యాదృశ్యంగా అవటంతో వీరన్నకి ఏమిచెయ్యాలో తెలీలేదు.

కొన్ని రోజుల తరవాత కృష్ణుడు వీరన్న ఇంటికి మళ్ళీ వచ్చాడు.” ఏం తాతా, నా కుండ తయారయ్యిందా” అన్నాడు.” కుండ సిద్ధంగానే ఉంది కానీ సమాధానం తెలీటల్లేదు మనవడా” అన్నాడు వీరన్న.

“అసలు తెలీకుండా కొసరు చేస్తే సరి కాదు కదా, సరే తెలిసినప్పుడే తీసుకొచ్చి ఇవ్వు” అన్నాడు కృష్ణుడు.

“అలాగే” అని దిగులుగా అన్నాడు వీరన్న. కృష్ణుడు వెళ్ళిపోయాడు.

ఆ ప్రశ్నకి సమాధానం కోసం వీరన్న వేట ప్రారంభించాడు. చుట్టూ పక్కల ఉన్న చదువుకున్న వాళ్ళ అందరి దగ్గిరికీ వెళ్ళాడు. కానీ ఏం లాభం, వాళ్ళు చెప్పేది వీరన్నకి అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ వాళ్ళ చేత చెప్పించుకునే వాడు. కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. ఎక్కడన్నా ఒక ముక్క అర్థమయ్యింది అనిపిస్తే దాని గురించి వంద ప్రశ్నలు రేగి మనస్సుని అల్లకల్లోలం చేసేవి. వీరన్న రోజూ బోలెడు కుండలు చేసేవాడు, వాటిని చూస్తూంటే, చేస్తూంటే కృష్ణుడి ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చేవి. వెంటనే లేచి కృష్ణుడు పగలకోట్టినట్టు తనకి తానే అన్ని కుండలనీ పగలకొట్టేవాడు. ఊళ్ళో వాళ్ళు పిచ్చి ఎక్కిందేమో అని కూడా అనుకున్నారు. ఇలా రోజులూ, వారాలూ, వత్సరాలూ గడిచాయి.

కృష్ణుడు రేపు మధురాపురం వెళుతున్నాడు అన్న వార్త ప్రబలింది గోకులంలో. ఒక కుండని ఎంతో శ్రద్ధతో తయారుచేసి మెల్లిగా నందుడి గుమ్మం తొక్కంగానే “వీరన్న తాతా బావున్నావా” అంటూ కృష్ణుడు వొచ్చి కావులించుకున్నాడు.

వీరన్నవొళ్ళు మరిచిపోయాడు. గట్టిగా కావిలించి ముద్దులు పెడుతూంటే “వీరన్నా, పిల్లాడు, నలిగిపోతాడు, మెల్లిగా” అని యశోద గొంతు వినిపించేసరికి సద్దుకుని “ఇదిగో మనవడా, నీ కుండ” అని ఆ కుండని తీసి ఇచ్చాడు.

కృష్ణుడు దాన్ని నిశితంగా చూసి  “చాలా బావుంది. నా ప్రశ్నలకి..” అని ఆగాడు. వీరన్న తల వాల్చేశాడు. “తొందరేముంది. మధురకి వొచ్చి ఇద్డుగాని” అని ఆగి నవ్వుతూ కుండని వెనక్కి ఇస్తూ “సమాధానంతో” అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు.

కృష్ణుడు మర్నాడు మధురకి వెళ్ళిపోయాడు. వీరన్న కూడా మర్నాటి నించీ కనిపించలేదని చుట్టూ ఉన్న పొదలూ, వనాలూ వెదికారు చుట్టాలూ, పక్కాలూ. వీరన్న జాడే దొరకలేదు. కొన్నేళ్ళు గడిచాయి. వీరన్న ఎక్కడో హిమాలయాల్లో సాధువు దగ్గర శిష్యుడిగా అన్నాడని వార్త వొస్తే చుట్టాలు వెళ్లి చూసి కాదని స్థిరపరిచారు. ఇలా రెండు మూడు చోట్ల వెదికిన తరవాత వెదకటం విరమించుకున్నారు.

***

కొన్నేళ్ళు గడిచినయ్యి. కృష్ణుడు మధురలో రాచ కార్యాలు చక్కపెడుతున్నాడు. పెళ్లిళ్ళు అయ్యి పిల్లలు కూడా పుట్టారు. ఒకరోజు రాత్రి సత్యభామా గృహంలో భోజనం చేసి హంస తూలికా తల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న ప్రభువుకి కంచుకి వొచ్చి “ఎవరో కుమ్మరి వీరన్నట తమ దర్శనం కోరుతున్నాడు ప్రభూ” అన్నాడు. ఒక్క ఉదుటున లేచాడు కృష్ణుడు. “అదేంటి. అంత తొందర. రేప్పొద్దున చూడొచ్చు కదా” అన్న సత్యాదేవిని చూసి నవ్వి “అతన్ని చంద్రశాలలో ప్రవేశపెట్టి అన్ని మర్యాదలూ జరిపించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు కృష్ణ ప్రభువు. “చంద్రశాలలోనా” అన్న సత్యాదేవి ప్రశ్నార్ధకమైన మాటకి తల ఊచాడు ప్రభువు.

రాత్రి రెండో యామం ఊరంతా సద్దు మణిగింది. వెన్నెల, భగవంతుడి కోసం వేచి ఉండే భక్తుడి కళ్ళ లాగా బాగా విప్పారి అంతటినీ వెలిగిస్తోంది. వీరన్న చంద్రశాల మేడ పైకి ఎక్కాడు. పుచ్చ పువ్వు లాంటి వెన్నెలతో చంద్రశాలని నింపేస్తూ ఉన్నాడు చంద్రుడు. మేడ మీద ఉన్న పొదరింట్లో చంద్రకాంత శిలతో చేసిన అరుగు మీద కూచుని అలా చంద్రుణ్ణి చూస్తూ కూచున్న వీరన్నకి మెట్ల దగ్గిర అలికిడైనట్లుంటే చూసాడు. వెన్నెల వెలుగుల్లో విరాజిల్లుతూ నీలమేఘ దేహుడు స్వామి కనిపించేటప్పటికి వీరన్న మనస్సు ఆనంద తరంగితం అయిపోయింది. కృష్ణుడు మెల్లిగా వొచ్చి ఎదురుగా ఉన్న అరుగు మీద కూచుని ‘తాతా, బావున్నావా’ అని అడిగాడు. నవ్వుతూ తన భుజానికి ఉన్న జోలి లోంచి చిన్న మట్టి కుండని తీసి కృష్ణుడి చేతిలో పెట్టాడు.

“సమాధానం దొరికిందా తాతా”

“ఆహా”

“ఏంటో చెప్పు”

“ఎప్పుడూ ఉండేదీ, ఉన్నదీ మట్టే కానీ మనం దానికి నామ రూపాలు కల్పించి రక రకాల కుండలు అని భ్రమ పడతాం. కుండలు ఇవాళ్ళ ఉంటయ్యి రేపు పోతయ్యి. కానీ ఎప్పుడూ సత్యంగా ఉండేది మట్టే. ఆ కుండ అనీ ఈ కుండ అనీ భేదం చూడటం లాంటి మిగతాదంతా అసత్యమే.”

“ఇది తెలుసుకోటానికి ఇన్ని రోజులా”

“ఈ బుర్రలో ఉన్న మట్టి పోతే గానీ అసలు మట్టి గురించి అర్థం కాదుగదా” అని నవ్వాడు వీరన్న.

“ఇదంతా ఎందుకు గానీ మంచి కథలు చెప్పు తాతా చాలా రోజులైంది నీ కథ విని” అని కృష్ణుడు అరుగు మీద పడుకుని వీరన్న వైపు చూశాడు. చంద్ర కాంతి పడి కృష్ణుడు మెరిసిపోతున్నాడు. వీరన్న తెలీకుండానే “ఏం బుల్లోడా, మరీ మెరిసిపోతున్నావు” అంటే కృష్ణుడు జగన్మోహనంగా నవ్వాడు. వీరన్న బ్రహ్మానందాన్ని ఒక్కసారి అనుభవించి మళ్ళీ నేల మీదకి వొచ్చాడు. గొంతు సవరించుకుని కథ మొదలెట్టాడు.

మరుసటి రోజు పొద్దున్నే సత్యభామా దేవిగారి అంతఃపురంలో స్వామి వారు కనిపించడం లేదని పరిచారికలు అందరూ నాలుగు మూలలా అన్ని అంతఃపురాల్లో గాలిస్తే ఎక్కడా దొరకలేదు స్వామి. చివరికి చంద్రశాల పైభాగాన్ని శుద్ధి చేసేందుకు వెళ్ళిన సేవకుడికి అక్కడ అరుగు మీద నిద్రపోతున్న స్వామీ పక్కన చిన్న మట్టి కుండా కనిపించినయ్యి. నిన్న రాత్రి వొచ్చిన వీరన్న మట్టుక్కూ కనిపించలేదు. వెంటనే పరిచారికలూ, సత్యాదేవీ వొచ్చి లేపితే స్వామి వారు లేచి నవ్వుతూ ఆ మట్టి కుండని తీసుకుని అంతఃపురంలోకి వెళ్ళారు. అప్పటి నించీ స్వామి ఆ మట్టి కుండ తోనే మంచి తీర్థం సేవించారని పరిచారికలందరూ చెప్పుకుంటూ ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here