[box type=’note’ fontsize=’16’] “మిగతా చిత్రాలలో నాయికల పాత్రలెలా వుంటాయో ఇందులో నాయకుల పాత్రలు అలా వున్నాయి. గొప్ప చిత్రం కాకపోవచ్చు కాని మంచి, చూడతగ్గ చిత్రమే” అంటున్నారు పరేష్ ఎన్. దోషి “వీరే ది వెడింగ్” సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap style=”circle”]మ[/dropcap]నం ఇదివరకు male bonding, bromances హిందీలో చాలా చూశాము. అలాగే ఫేమేల్ బాండింగ్ ప్రధానంగా చిత్రాలు చూశామా, నాకైతే గుర్తుకు రావట్లేదు. ఇప్పుడు వచ్చిన ఈ వీరే ది వెడింగ్ అలాంటి చిత్రమే. నలుగురు స్నేహితురాళ్ళు. వాళ్ళల్లో వొకామె వివాహానికి అందరూ కలవడం, తమ జీవితాల గురించిన కథలు కలబోసుకోవడం ద్వారా ప్రస్తుత కాలపు (బహుశా సంపన్న వర్గపు అనాలేమో, యెందుకంటే మధ్యతరగతి అమ్మాయిల కథలు, బాధలు కొంచెం వేరు) అమ్మాయిల జీవితాలు, ఆలోచనలు తెర ముందుకు తెస్తుంది.
ముఖ్యంగా వొక విషయం చెప్పుకోవాలి. ఇది ఫెమినిస్టు చిత్రం కాదు. కేవలం వాళ్ళ జీవితాలు, తప్పులు చేస్తూ గుణపాఠాలు నేర్చుకుంటూ యెదగడం, వాళ్ళ సంశయాలు, బాధలు, కోపాలు, ఫ్రస్ట్రేషన్లు అన్నీ నిజాయితీగా, యెలాంటి తీర్పులు చెప్పకుండా మనముందు పెట్టారు.
కాళింది (కరీనా కపూర్), అవని (సోనం కపూర్), సాక్షి (స్వరా భాస్కర్), మీరా (శిఖా తల్సానియా) నలుగురు కలిసి చదువుకున్న స్నేహితురాళ్ళు. పదో తరగతి తర్వాత యెవరి దారి వారిదవుతుంది. ఇప్పుడు మళ్ళీ అందరూ రిషభ్ (సుమీత్ వ్యాస్)తో కాళింది పెళ్ళికి కలుస్తారు. చాలా మంది అబ్బాయిల్లాగా కాళిందికి కమిట్మెంట్ ఫోబియా. కాని పెళ్ళికి జంకుతూనే వొప్పుకుంటుంది. సుమీత్ వాళ్ళ ఇంట్లో ఆర్భాటం, సాంప్రదాయం పేర్లతో చేసే హంగామాకు బెదిరిపోతుంది. అవని కోసం తగిన వరుడి గురించిన చింత ఆమె తల్లికి (నీనా గుప్తా). సాక్షికి పెళ్ళైతే అయ్యింది కాని ఆమెకు తన భర్తతో గొడవలు. మీరా వొక తెల్లవాణ్ణి ఇష్టపడి తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా చేసుకుంది. వాళ్ళకు ఇప్పుడు రెండేళ్ళ బాబు. యేది తప్పు, యేది వొప్పు, యేది పట్టించుకోవాలి, యేది విడిచిపెట్టాలి ఇలాంటివన్నీ మీమాంసలే వారికి. తగినంత జీవితానుభవం లేదు. కాని జీవితాన్ని జీవించాలి, తప్పులు చేసినా వాటిలోంచే నేర్చుకోవాలి అని వాళ్ళ నమ్మకం. నిజమైన స్వాతంత్ర్యం అంటే అదే కదా.
మాటల్లో మీరా చెబుతుంది తనకు యేడాది నుంచీ సెక్సు జీవితం లేదని. దాన్ని వివరించే సన్నివేశం వొకటి మొదట్లో వుంటుంది. భర్త రెండేళ్ళ బాబును తమ మంచం మీదే పడుకోబెట్టుకోవడం ఇష్టం లేదంటాడు. ఆమె వినదు. ఆమె పెదనాన్న తో టచ్ లో వుంటూ, ఆమెనుకూడా ఫోన్ చేసి మాట్లాడమంటాడు, ఆమె వినదు. ఆ వాతావరణంలో ఇద్దరూ నలుగుతుంటారు. సాక్షికి పెళ్ళి అసంతృప్తికరంగా మిగిలింది. తన భర్త తో విడాకులు తీసుకోవాలని ఆలోచిస్తూ వుంటుంది. స్నేహితురాళ్ళతో మాటల మధ్యలో చెబుతుంది, తన భర్త వొకసారి ముందే ఇంటికి వచ్చేయడం, తను వైబ్రేటర్ ఉపయోగిస్తూ అతని కంట బడటం గురించి. ఇక్కడ ఆమె చర్య కంటే కూడా అతని ముఖం పై భావాలు, విషయాన్ని తెరకెక్కించారు కాబట్టి ప్రేక్షకుల స్పందనా చర్చనీయాంశాలు. కోరికలు వగైరా విషయంలో మనదగ్గర జెండర్ బయాస్ యెలానూ వుంది.
ఇక మిగతా విషయాలకొస్తే నలుగురూ ఉన్నత శ్రేణికి చెందిన వారు కాబట్టి అదే వొక పరిమితి అయి కూర్చుంది. వొకరి కథను చెప్పడానికే రెండుగంటలు సరిపోవు, ఆ స్థానంలో నలుగురి కథలు చెప్పబూనడం వల్ల అది కాస్త పలుచబడింది. పెళ్ళి హంగామా తగ్గించి కథ మీద మరింత దృష్టి పెట్టి వుంటే ఇంకా మెరుగ్గా వుండేది. చిత్రంలో నలుగురూ తాగడం, బూతులు మాట్లాడడం మీద చాలా రభస జరుగుతోంది. వాళ్ళ ఆర్థిక నేపథ్యం, ప్రస్తుత కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే మొదటిది అంత ఆశ్చర్యకరంగా వుండదు. ఇక బూతులు వాళ్ళు నలుగురు మాత్రమే వున్నప్పుడు మాట్లాడుకుంటారు, అదీ తమను తాము సమర్థించుకునే పధ్ధతిలో కాదు. ఈ మధ్య వచ్చిన వో తెలుగు చిత్రంలో నాయకుడు తన స్నేహితుడితో అంటాడు: మనం బూతులు మాట్లాడుతాము కాని స్త్రీని వో వస్తువుగా చూడము అని. ఇందులో అలాంటి జస్టిఫికేషన్లు లేవు. తప్పైతే తప్పే. కాని వాళ్ళంతే. అందులో అవమానం కంటే కూడా హాస్యమే యెక్కువగా వుంది. మిగతా చిత్రాలలో నాయికల పాత్రలెలా వుంటాయో ఇందులో నాయకుల పాత్రలు అలా వున్నాయి. కొత్తగా వచ్చిన శిఖా తల్సానియా (టికూ తల్సానియా కూతురు) చాలా బాగా చేసింది. స్వరా భాస్కర్ పాత్ర ఆమెకు కొట్టిన పిండే! కరీనా, సోనం లు పర్లేదు. గొప్ప చిత్రం కాకపోవచ్చు కాని మంచి, చూడతగ్గ చిత్రమే.