Site icon Sanchika

వీరేశం గాడి రెండు మార్కుల కథ

[dropcap]వీ[/dropcap]రేశంకి గుండెల్లో గుబులుగా వుంది. ఆరవ తరగతి చదువుతున్న వీరేశంకి స్కూల్‌లో ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు. ఆ కార్డ్ వాళ్ళ నాన్నకి చూపించి సంతకం చేయించాలి, అదీ వాడి బాధ. ఇందులో బాధ పడడానికేముందని సందేహించకండి..

వాడికి ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో యూనిట్ టెస్ట్‌లో పాతికకి గాను.. కేవలం రెండు మార్కులే వచ్చాయి. మిగతా అన్ని సబ్జక్ట్స్‌లో మంచి మార్కులే వచ్చినా.. ఈ ఆగ్లంలోని మార్కులు… వాడి గుండెల్లో అలజడికి కారణమవుతుంది.

రెండు రోజులుగా ఆ ప్రోగ్రెస్ కార్డ్ వాడి బ్యాగ్ లోనే వుంది.

తండ్రి మూడ్ చూసి సంతకం చేయించాలని తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. నాలుగో తరగతి చదువుతున్న తమ్ముడికి అన్ని సబ్జెక్ట్స్ మంచి మార్కులు వచ్చాయి. వాడు ఒక రోజు క్రితం తండ్రి దగ్గర సంతకం చేపించడం.. తండ్రి చిరునవ్వుతో సంతకం చేయడం.. వాడి కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉంది.

అదే సమయంలో తండ్రి అడిగిన ప్రశ్న వాడి గుండెల్లో పెను తుఫాను సృష్టించింది.

“నీకు ప్రోగ్రెస్ కార్డు ఇవ్వలేదా?”

తల మొదట అడ్డంగా ఊపాడు..

కొద్ది క్షణాలు ఆలోచించి.. అడ్డదిడ్డంగా ఊపాడు.

వీరేశం వాళ్ళ నాన్న కాంతయ్యకి కొడుకు ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు. అయోమయంగా చూశాడు.

అప్పుడే అక్కడికి వచ్చింది వీరేశం వాళ్ళ అమ్మ రాజమ్మ.. జరుగుతున్నదేంటో అర్థం కాకపోయినా.. కొడుకు వాలకం గమనించి..

“మీ నాన్న అంతలా అడుగుతుంటే.. మాట్లాడవేంటి?” అంది గద్దిస్తున్నట్లుగా..

వీరేశం అమాయకంగా తల్లి వైపు చూస్తున్నాడు.

“వీడివన్నీ వాళ్ళ నాన్న పోలికలే..” తనలో తనే గొణుక్కుంటున్నట్లుగా పైకే అంటూ.. ఏదో పని వున్నట్లుగా లోనికి వెళ్ళింది.

ఇంతలో బయటినుండి తండ్రిని ఎవరో కేకేయడంతో.. కాంతయ్య బయటికి వెళ్ళాడు.

‘ఈ పూటకి గండం గడిచింది రా’.. అనుకున్నాడు వీరేశం.

ఇంట్లో నుండి బయటకు వచ్చిన రాజమ్మ.. కొడుకు ఇంకా అక్కడే వరండాలో ఎందుకు నిలబడ్డాడో అర్థం కాక.. “వీరేశం.. స్కూల్‍కి టైం అవుతుంది” అంటూ గట్టిగా అరిచి గుర్తు చేస్తుంటే..

‘అవును కదా’ అనుకుంటూ బ్యాగ్ తీసుకున్నాడు. ఇంట్లో నుండి బయటకు వస్తూ.. బ్యాగ్ తెరిచాడు.. బ్యాగ్‌లో వున్న ప్రోగ్రెస్ కార్డ్ వెక్కిరిస్తున్నట్లుగా అనిపించింది. గబుక్కున దాన్ని పుస్తకాల అడుక్కి దాచాడు. అప్పుడు కాస్త రిలాక్స్‌గా అనిపించింది.

***

“వీరేశం..” తన పేరే మాస్టారు పిలుస్తుంటే..

ఈ లోకం లోకి వచ్చి “సార్..” అన్నాడు.

“రేయ్! ప్రోగ్రెస్ కార్డు సంతకం చేయించలేదా? నువ్వు మదన్, రాకేష్ ముగ్గురే ఇంకా కార్డ్స్ ఇవ్వలేదు” అన్నాడు హుంకరిస్తున్నట్లుగా.

“రేపు తప్పకుండా ఇస్తాను సార్..” అన్నాడు మాటలు కూడబలుక్కుని..

“అలాగే” అన్నాడాయన.

‘బ్రతికాను రా దేవుడా’ అనుకుని తన సీట్లో కూర్చున్నాడు వీరేశం.

అనుకోకుండా మరో ప్రశ్న బుల్లెట్‌లా దూసుకోస్తుంటే.. గబుక్కున లేచాడు.. జారుతున్న లాగూను సరిచేసుకుంటూ..!

“మార్క్స్ ఎందుకు రాలేదురా ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో..?”

‘మీరు తెలుగు సార్ కదా.. మా కష్టాలు మీకేమి అర్థమవుతాయి లే.. ఆగ్లం అదో బ్రహ్మరాక్షసి.. అర్థం కావడం కష్టం’ అనుకున్నాడు మనస్సులో.

“ఏంట్రా పళ్ళు కొరుకుతున్నావు”

“అదేం లేదు సార్” చెప్పాడు.

పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి.. ఎప్పుడో ఇదే మాస్టారు చెప్పిన సామెత గుర్తొచ్చి పక్కున నవ్వాడు.

తెలుగు సార్.. క్లాస్ టీచర్ కదా.. ఎవరికి ఏ సబ్జక్ట్‌లో మార్కులు తక్కువొచ్చినా ఈయనదే బాధ్యతట.. హెడ్మాస్టర్ గారు ఈయనకి క్లాస్ పీకుతారట.. అదీ ఈయన బాధ.!.. ఆలోచిస్తున్నాడు వీరేశం.

వాడిలా ఆలోచిస్తూ నవ్వుతుంటే.. వాడికి విమానం పోతున్న శబ్దం వినిపించింది.. కొద్ది క్షణాలు పట్టింది.. ఆ శబ్దం తన వీపు నుండే నని..

భోరున ఏడుస్తూ.. “రేపు తప్పకుండా ప్రోగ్రెస్ కార్డు ఇస్తాను సార్” అన్నాడు కన్నీళ్ళని తుడుచుకుంటూ..

***

ఇంగ్లీష్ పిరియడ్ సమయం అయ్యింది. సీతారత్నం సార్ వచ్చాడు. అందరూ లేచి గుడ్‌మార్నింగ్ చెప్పారు.

ఆయన క్లాస్ పూర్తయ్యాక.. వీరేశాన్ని పిలిచాడు.

ఇంటర్వెల్ కావడంతో పిల్లలందరూ బయటకు వెళుతున్నారు..

‘నాకీ ఖర్మేంటి రా బాబు’ అనుకున్నాడు వీరేశం.

ఆయనో చిన్న సైజ్ క్లాస్ ఇచ్చాడు. మెదడైతే వాయలేదు కానీ.. ఇంగ్లీష్ పుస్తకాన్ని విసిరి అవతల పారేయాలనిపించింది అతడికి.

చివరగా ఆయనో ప్రశ్న అడిగాడు..

“నీకు ఒక్క మార్క్ ఎందుకు వచ్చిందో తెలుసా?” తెల్లమొఖమేసుకుని చూస్తున్న వీరేశాన్ని అడిగాడు.

అయోమయంగా చూస్తూ నవ్వాడు వీరేశం. ఆ సమయంలో పరీక్షల్లో తనేం వ్రాశాడో గుర్తుకు రావడం లేదు.

“మాస్టారు మిమ్మల్ని రజనీ మేడం పిలుస్తున్నారు” అంటూ తెలుగు సార్ చెప్పడంతో హడావుడిగా అక్కడినుండి వెళ్ళిపోయాడాయన.

ఎంతైనా భార్య పిలిస్తే ఆలస్యం చేయకుండా వెళ్ళడం ఉత్తమ పురుషుల లక్షణం కదా!

***

కాంతయ్య ఆవేశంతో ఊగిపోతున్నాడు కొడుకుపైన..

“అలా వాడ్ని అరిచే బదులు ఆ సార్‌ని కలిసి వీడికి చదువెందుకు రావడం లేదో తెలుసుకోవచ్చు కదా?” భార్య సలహా వింటుంటే..అతని కోపం రెట్టింపయింది.

‘ఈ ఆడవాళ్ళు మొగుళ్ళకి సలహా ఇవ్వడానికి ఎప్పుడూ ముందుంటారు.. అంతే కాని సమస్యని పరిష్కారం చేసే ప్రయత్నం చేయరు! మాట్లాడడం తేలిక, చేయడం కష్టం..’ అనుకున్నాడు.

ఇంతలో ఆమె మరో మాట అనడం.. అలా ఇద్దరి మధ్య చిన్న యుద్ధం జరగడం.. తరువాత ఇద్దరూ నవ్వుకోవడం జరిగింది.

అదే అదునుగా భావించిన వీరేశం స్కూల్‌కి బ్యాగ్ సర్దుకుని మెల్లగా జారుకున్నాడు.

ఎప్పుడూ లాస్ట్ పిరియడ్‌లో వచ్చే ఇంగ్లీష్ మాస్టారు ఈ రోజు మొదటి పిరియడ్‌లో రావడం వీరేశానికి విస్మయాన్ని కలిగించింది.

ఫస్ట్ యూనిట్లో పిల్లలు వ్రాసిన జవాబుల పత్రాలను అందరికీ అందిస్తున్నారు మాస్టారు.

వీరేశానికి తన పేపర్ చూసుకోగానే బలే సంబరంగా అనిపించింది.

కారణం.. పేపర్ పై వున్న మార్క్స్. పెద్దగా వేసిన నెంబర్ “2”

మళ్ళీ ఒకసారి పరీక్షగా చూసుకున్నాడు.

ఒకటిని దిద్దినట్లుగా అనిపించింది.

ఆనందంగా గట్టిగా అరవబోయి ఆగిపోయాడు..

ఇంగ్లీష్ మాస్టారు ఇస్తున్న అనౌన్స్మెంట్ వింటూ..

“అరే! పిల్లలు మీకిచ్చిన బిట్ పేపర్‌లో ఒక బిట్ తప్పుగా వచ్చింది.. అందుకే అందరికీ ఒక మార్క్ కలిపి మార్కులు ఇచ్చాము.”

పిల్లలందరూ “హే..” అంటూ ఆనందంగా కేరింతలు కొట్టారు.

గబుక్కున లేచిన వీరేశం..

“సార్..” అంటూ ఇంగ్లీష్ సార్‌ని పిలిచాడు.

“ఏంట్రా?”

“సార్.. అది..”

“ఆ..”

“సార్.. అదీ.. అదీ..”

“అడగరా ఏంటో..నీ క్వశన్?”

“సార్! నాకో సహాయం చేయగలరా?’

“చేస్తాను.బట్ వన్ కండిషన్.. నువ్వు అడిగిన ప్రశ్న ఇంగ్లీష్‌లో అడుగు, అప్పుడు చేస్తాను”

వీరేశం వైపు చూస్తూ..’సచ్చింది గొర్రె..’ అన్నట్లుగా నవ్వొకటి నవ్వాడు సార్.

అంతకన్నా అడగక పోవడం ఉత్తమం అనుకున్నాడు.

వీరేశానికి అన్ని సబ్జక్టులలో మంచి మార్కులు వచ్చినా ఇంగ్లీష్ అంటే కష్టం. అందుకు అసలు కారణం.. నరనరాన తెలుగు భాష జీర్ణించుకు పోవడం! అందుకే ఎప్పుడు ఆ సబ్జెక్ట్లో కనీస మార్కులు వస్తుంటాయి. ఈసారి పరీక్షలప్పుడు వూరు వెళ్లి రావడం.. కొత్తగా ఆరవ తరగతి లోకి ప్రవేశించడం.. కారణాలేవైనా ప్రోగ్రెస్ కార్డు పై తండ్రితో సంతకం చేయించడం చాలా కష్టంగా వుంది.

“మాస్టారు.. మిమ్మల్ని రజనీ మేడం గారు పిలుస్తున్నారు” అంటూ చెబుతున్న తెలుగు మాస్టారి మాటలు వింటూ..

“వెళుతున్నానండి” అంటూ వెళుతూ..

వీరేశం ప్రోగ్రెస్ కార్డ్ అందుకుని ఇంగ్లీష్ సబ్జెక్ట్ దగ్గర ఒకటిని రెండు చేసి.. రెడ్ పెన్‌తో టోటల్ సంఖ్యని మార్చి సంతకం చేసి వడి వడిగా వెళ్ళిపోయాడాయన.

కాస్త ధైర్యం వచ్చింది వీరేశానికి.

ఒకటి కంటే రెండు ఎక్కువ కదా అనే ధైర్యం.

***

ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న కాంతయ్య వీరేశం గాడి ఇంగ్లీష్ ఆన్సర్ షీట్ అటూ ఇటూ తిప్పి చూశాడు.

తెల్లగా వుంది కాగితం.

“రెండు మార్కులు ఎలా వచ్చాయి రా?” అడిగాడు.

బోరున ఏడ్చాడు వీరేశం వస్తున్న ఏడుపుని ఆపుకోలేక.

తండ్రి హృదయం కరిగిపోయింది.

“అలా ఏడవకు.. ఈసారి బాగా చదువు. మాతృభాషని ప్రేమించినంతగా పరాయి బాషని ఇష్టపడకపోవచ్చు మనం. కానీ నేడు ఆగ్లం నేర్చుకోవలసిన అవసరం ఎంతో ఉంది. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో!? టెక్నాలజీ పెరుగుతుంటే.. ప్రపంచం కుగ్రామమయ్యే కొలది.. ఇంగ్లీష్ భాష బాగా నేర్చుకోవలసిన అవసరం పెరుగుతుంది. గుర్తించి చదువు సరేనా?” తండ్రి అనునయంగా అంటున్న మాటలు అతడికి నచ్చాయి.

తర్వాత..

వీరేశం ఇంగ్లీష్ పై ఇష్టాన్ని పెంచుకుని చదివాడు.

అదంతా 1995వ సంవత్సరంలో జరిగిన సంఘటన!

ఆ తర్వాత..

వీరేశం ఇంగ్లీష్‌లో ఎం.ఏ చేసి ప్రస్తుతం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో లెక్చరర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ఇంతకీ ఆ రోజుల్లో అతడికి ఒక్క మార్స్ ఎందుకు వచ్చిందో చెప్పాలా!?

“Which city is the capital of India?”

అతడు వ్రాసిన సరి అయిన ఆన్సర్..

“New Delhi”

Exit mobile version