[అనూరాధ బండి గారు రచించిన ‘వేకువస్వరం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఇ[/dropcap]ది ఆకాశాన్ని చూపుల మౌనంతో
రహస్యంగా నమిలివేసే
ఇంకా సరీగ్గా తెల్లవారని సమయం.
చీకటిగా నడుస్తూ, వెలుతురులోకి
తప్పిపోయే సమయం.
నిద్రని విదుల్చుకుని వేకువకి సాగిపోయే
మెత్తని సమయం.
అతి గమ్మత్తైన రహస్యశోకపు సమయం.
ఈ సమయాన్ని లిఖిస్తూ అంటాను కదా
మనుషులెందుకు ముగింపుల్ని ఇష్టపడరూ అని.
తెలుసు కదా! ఏ రెండు రకాల పక్షులూ
ఒకేలా అరవవు.
సరే ఇప్పుడు దుఃఖాన్ని కాసేపు, ఈ వేకువ ఝాములో నానవేసే సంగతి చెప్పుకుందాం.
వేకువకల్లా ఒక సౌమ్యపుతెరను, సామరస్యంగా హృదయంపై ఆరవేసుకునే సంగతి కూడా.
అయినా మనల్ని మనం ప్రేమించుకుందాం.
విస్మరించకుండా స్మరించుకుందాం.
మనల్నిమనం ఎవరికీ చెందనితనంతో
కాసేపు ఊరడించుకుందాం.
ఉగ్గపట్టుకున్న శబ్దాలని మౌనంగా కన్నీరుని చేద్దాం.
సరే, కొన్నిసార్లు మనసు ఆపకుండా అరిచే
ఒక పక్షిలా అయిపోతుంది.
మరికొన్నిసార్లు గతపు చిహ్నంలా
వరండాలోని ఉయ్యాల్లో ఊగుతుంది.
అంతే కదా!