వెలుగు దివ్వెల విత్తనాలు..!

0
3

[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘వెలుగు దివ్వెల విత్తనాలు..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]కసారి ఆకుపచ్చని సముద్రమైన
దట్టమైన అడవిలోకి వెళ్ళాను
అపూర్వమైన స్వాగతం పలికింది
గాయాలతో గూడు చెదిరిన
జీవుల గాథలను వినిపించింది..!

ఒకానొక సమయాన నది తీరానికి వెళ్ళాను
వడి వడిగా ఒడ్డును తాకుతున్న అలలు
చిరునవ్వులతో పలకరించాయి
అవిశ్రాంతమైన నది యానాన్ని గూర్చి
బోధకుల్లా విశ్లేషణాత్మకంగా చెప్పినవి..!

సాయంత్రమోసారి రోడ్డు మీదికి వెళ్ళాను
ఆత్మీయులైన మిత్రులందరు
ఆనందోత్సాహాలతో కరచాలనం చేశారు
అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైన జ్ఞాపకాలను
కుప్పగా పోసి కానుకగా అందించారు..!

ప్రత్యేకమైన రోజున పాఠశాల ఆవరణలోకి
అలుపులేని బాటసారిలా అడుగుపెట్టాను
చెట్ల కొమ్మలు ముక్తకంఠంతో ఆహ్వానించాయి
చెరిగిపోని పాద ముద్రల్ని తడుముతుంటే
రాలిపోయిన క్షణాలు హత్తుకున్నాయి..!

ఒక గాఢాంధకారమైన రాత్రిలో రహదారి పైన
చంద్రోదయ కిరణంలా వెళ్ళుతున్నాను
మెరుస్తున్న నక్షత్రాలు కౌగలించుకున్నాయి
వెలుగు దివ్వెల విత్తనాలను చల్లుకుంటూ
శాంతిమంత్రాన్ని జపిస్తూనే సాగమన్నాయి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here