Site icon Sanchika

వెలుతురు చిగుళ్ళు

[box type=’note’ fontsize=’16’] “నమ్ము శారదా. ఇప్పుడు నువ్వు కూతురులాంటి దానపు అనుకోవడం లేదు. కన్న కూతురన్న భావనతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాను” అన్నాడా మామగారు వడలి రాధాకృష్ణ రాసిన “వెలుతురు చిగుళ్ళు” కథలో. [/box]

[dropcap]‘టి[/dropcap]కెట్ కన్‌ఫాం అయింది! రేపు రాత్రికి బయలుదేరుతోంది!!’

‘నాలుగు రోజులు ఉండి రమ్మనకపోయారా!’

మాట్లాడలేదు.

‘ఇప్పుడు ఎలాగ ఉంది మీకు!’

‘ఎలా ఉంది. నిన్న కాసింత ఎంగిలిపడు నాన్నా అంది బంగారు తల్లి! హితవు చేసుకొని ఎంగిలిపడ్డాను. ఇష్టమని కాకరకాయ కూర వండి పెట్టింది.!’

‘…….’

‘నోరు చేదు… కూర చేదు. కాని చేసింది కన్నకూతురు కదా… చాల తీపిగా అన్పించింది!’ అంటూన్న నారాయణ గొంతు సన్నగా వణుకుతోంది.

వియ్యంకుడి మాటలు హరిహరరావును కదిలిస్తున్నాయి.

‘చేదయినా, తీపయినా నాలుగు రోజులు ఇంటి వంట తింటే కొంత సత్తువ చేకూరగలదని….!’

‘ఆమెను అక్కడ నాలుగు రోజులు ఉండనీయండి! మీరు ఏమీ పరాయి కాదు కదా!’

‘మీరు అలా అంటారని తెలుసు. కానీ ఆమె బాధ్యతలు ఆమెవి’

‘టైఫాయిడ్ జ్వరం వచ్చి మంచాన పడ్డారు. అది మాత్రం బాధ్యత కాదా!!’

‘మీరు ఎలా అనుకున్నా నేను బాగానే ఉన్నాను. రెండు రోజుల్లో కోలుకోగలనన్న నమ్మకముంది. అసలే వేసవి వచ్చేసింది. కాపు పెరుగుతోంది. కాయల యజమాని కబురు పెట్టాడు. పనిలోకి దిగిపోతానా… అప్పుడు జ్వరం సంగతి మర్చిపోతాను’. నారాయణ చిన్నగా నవ్వబోయాడు. నిస్సత్తువ ఆవహించి మాటను అదిమి పట్టేస్తోంది.

‘మీ ఇష్టం. ఆరోగ్యం జాగ్రత్త. డాక్టర్ దగ్గర కెళ్ళి ఇచ్చిన మందులు వాడతూ ఉండండి!’

‘రేపు శారద చేత మంచి బంగినిపల్లి మామిడి మొదటికాపు పళ్ళు పంపుతున్నాను’

‘ఇక్కడ పంపినా ఎవరు తింటారు చెప్పండి! మీ చెల్లెలు పరిస్థితీ ఇక్కడ షరా మామూలే!! ఇంక తినాల్సింది శారద మాత్రమే. అయినా తీరిక చేసుకొని మీరు కూడా హైదరాబాద్‌కు వచ్చేయండి.’

‘మీకు తెలియంది ఏముంది చెప్పండి. మంచం పట్టినా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఇక్కడ నాది!’

‘మీ ఇష్టం… ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి!’

హరిహరరావు అలా కళ్ళుమూసుకున్నాడు. వియ్యంకుడికి ఆత్మాభిమానం ఎక్కువ. ఒక పట్టాన వినే రకం కాదు.

***

‘అయ్యగారూ! తమరు ఉదయాన్నే నిద్ర లేవలేదు. ఎవరో బాబు మీకోసమని వచ్చారు’ పనిమనిషి అంది.

‘బాబు అంటే’

‘తిరుపతి నుండి వచ్చినారంట! మధ్యాహ్నం మరల వచ్చి కలుస్తానన్నారు’ ఆమె చెబుతున్న మనిషి ఎవరో తనకు గుర్తుకు రావడం లేదు.

“ఊరు నుండి శారద ఎల్లుండికి వచ్చేస్తోంది. డాక్టరుగారు అమ్మగారిని చూడ్డానికి సాయంత్రం వస్తానన్నారు. నువ్వు దగ్గర ఉండాలి.”

హరిహరరావుకి కొంత అనిశ్చితిగా అనిపిస్తోంది. నాలుగు రోజులు అక్కడ కావాలంటే ఉంటుంది అన్నాడే గాని,  నిజానికి మనవడి మీద తనకు అప్పుడే భ్రమ ఆరిపోయింది. శారద దొడ్డిపట్ల వెళ్ళి పది రోజులయింది. అప్పుడే ఆ బుడతడు తన కళ్ళలో మెదులుతున్నాడు.

కోడలు ఇక్కడ ఉంటే అత్తగారి ఆలనాపాలనా అన్నీ చూసుకుంటుంది. కానీ ఆ లోటు ఇప్పుడు తనకు సుస్పష్టంగా కన్పిస్తూనే ఉంది.

శారద చాల యోగ్యురాలు- మంచి అమ్మాయి.

***

‘నమస్కారం సార్!’

‘ఓహ్ నువ్వా! తిరుపతి నుండి ఎవరో వచ్చారంటే నాకు అర్థం కాలేదు!’

‘……’

‘జాబ్ ఎలావుంది.!’

‘మీరు పెట్టిన భిక్ష. ఎలా ఉంటుంది. చాలా ఫైన్‌గా ఉంది సర్!’ చిన్నగా నవ్వాడు.

‘కస్టమర్ రిసీవింగ్ కోసం హైదరాబాద్‌కి వచ్చాను. మిమ్మల్ని చూసి పలకరించి పోవాలనిపించి….’‌

‘……’

‘హౌ ఈజ్ యువర్ రిటైర్డ్‌ లైఫ్ సార్!’

‘ఇట్స్‌ ఫైన్! మేడమ్‌కే ఆరు నెలల నుండి బాగా లేదు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.’

తాను హెచ్.ఆర్ మేనేజర్‌గా ఉండగా రిక్రూట్ చేసిన ఆఖరి వ్యక్తి సుదర్శన్. అందుకే తాను బాగా గుర్తుండి పోయాడు.

సాధారణంగా ఒక ఉద్యోగిని అపాయింట్ చేసిన తర్వాత పది మంది దగ్గిర అతని గురించిన ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం తనకు బాగా అలవాటు. అలా తాను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా సుదర్శన్ గురించి అందరినీ అడిగి చూశాడు.

‘అతను చాల సిన్సియర్’ అని, ‘వర్క్ ఓరియంటెడ్ పర్సన్’ అని అందరూ మంచిగా చెప్పడం తనకు ఇప్పటికీ బాగా గుర్తుంది.

‘మీరు అంటే సుదర్శన్‌కి చాలా గౌరవం, మర్యాద సార్’ చాలా మంది తన కోలీగ్స్ అతని గురించి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. చెప్పాలంటే తాను ఉద్యోగమిచ్చిన వాళ్ళందరూ ఈ రోజు చాలా మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. అది హరిహరరావుకి చాల గర్వంగా అన్పిస్తుంటుంది. అలానే సుదర్శన్ కూడా ఆ లెవెల్‌కి  రావాలని కోరుకుంటాడతను.

***

“డాక్టర్ అత్తగారిని నాలుగు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాలన్నారు. ఈ  రోజు ఈవెనింగ్ షిప్ట్ చేస్తే సరి!’’

‘సరే ఆమెకు తోడుగా హాస్పటల్‌లో నేనుంటాను.’

‘ఆడ తోడు ఉండటం మంచిది. నేను వెళతాను.’

‘మరి బబ్లూ!’

‘నాతో వస్తాడు. ఏముంది దాంట్లో. తెలిసిన హాస్పిటలే కదా!’ కోడలు మాటలు చాలా సంతృప్తి నిస్తున్నాయి. శారద నిజంగానే చాలా మంచి అమ్మాయి.

ఇప్పుడు తమకు కొండంత అండగా నిలుస్తోంది. కానీ దేవుడు ఆమెకు తీరని అన్యాయం చేశాడు. ఆ భగవంతుడు ఒక్క ఆమెనే కాదు, తమ యావత్ కుటుంబాన్ని వీధిన పారేశాడు. లేకపోతే తమని భూమి మీదే ఉంచేసి ముక్కు పచ్చలారని విజయ్‌ని తీసుకుపోవడమేమిటి?

అదీను పెళ్ళయి ఐదు సంవత్సరాలు అయినా కాకుండానే ఒక బిడ్డకు తండ్రి అయిన వాడిని బలి తీసుకుపోవడమేమిటి?

“ఇంటికి కోడలుగా మనం తెచ్చుకొనే పిల్ల మనకన్నా చిన్నస్థాయి కుటుంబం నుండి తెచ్చుకోవాలంటారు!” నాన్న అన్న మాట ప్రకారం సాధారణ ఉద్యోగి అయిన నారాయణగారి అమ్యాయిని తన కొడుక్కి చేసుకున్నాడు హరిహరరావు.

పెళ్ళి తర్వాత విజయ్‌కి చెన్నైలో పోస్టింగ్ ఇచ్చారు. శారద విజయ్ చిలకా గోరింకల్లా ఉండేవారు. వారిని చూస్తే తమకు వాసంతికి ఎంతో ముచ్చటగా అనిపించేది.

‘అత్తయ్యా మావయ్యా’ అంటూ శారద చాల ప్రేమగా ఉండేది. అటువంటిది విధి వక్రించింది. డ్యూటి చేసుకొని ఇంటికి వస్తున్న విజయ్ బైక్ ప్రమాదానికి గురయ్యింది. వాడు అక్కడికక్కడే ప్రాణం విడిచాడు.

ఆ దుర్ఘటన తమ యావత్తు కుటుంబాన్నీ కల్లోలంలో ముంచేసింది.

అప్పటికే బబ్లూకి సంవత్సరం నిండిపోయింది. శారదను చూస్తే తనకిప్పుడు గుండె తరుక్కుపోతోంది. బబ్లూకి నడక బాగా వచ్చేసింది. వచ్చీరాని కబుర్లుతో వాడు తమను బాగా అలరిస్తున్నాడు.

శారద తల్లిలేని పిల్ల. ఆమె తండ్రి నారాయణ దొడ్డిపట్లలో మామిడి పండ్ల వ్యాపారి దగ్గర గుమాస్తాగిరీ చేసుకుంటూ బ్రతుకు ఈడుస్తున్నాడు. యాక్సిడెంట్‌లో అల్లుడి దుర్మరణం, కూతురు జీవితం ఇలాగ పెటాకులవడం, తన లేమితనం ఇవన్నీ నారాయణను నిర్లిప్తునిగా చేస్తూనే ఉన్నాయి.

ఒక మనిషిగా ఆలోచిస్తే అనేక సమాధానం లేని ప్రశ్నలు హరిహరరావుని నిరంతరం నిలేస్తూనే ఉన్నాయి. శారద తమ ఇంటి దేవత. భర్త మరణానంతరం కుంగిపోక ఆత్మస్థైర్యంతో కొడుకే లోకంగా బ్రతుకుతోంది.

జీవిత చరామాంకంలో ఇక్కడ తాను, వాసంతి. అక్కడ వియ్యంకుడు నారాయణ ఎవరు ముందో, ఎవరు వెనకో అన్నట్లు రోజుల్ని నెట్టుకురాగాలుగుతున్నా తమ అనంతరం శారద జీవితం… బబ్లూ భవిష్యత్తు.

లోకంలో అందరూ కాకపోయినా కనీసం కొందరు కొడుకు చనిపోతే కొంత భరణాన్ని పడేసి పుట్టింటికి సాగనంపే ప్రయత్నం పూర్తిగా అక్రమం దుర్మార్గమూ. అందునా శారద లాంటి సుగుణశీలి, ఒక అణుకువ కల్గిన  ఆడదాని విషయాలలో ఇంటువంటి ఆలోచనలు ఏ మాత్రం సహేతుకం కాజాలవు.

బాధ్యత తానయి ఈ విషయమే కోడలి దగ్గర ప్రస్థావిస్తూనే ఉన్నాడు. తన ఉద్దేశాల్ని ప్రతిపాదిస్తూనే ఉన్నాడు. కాని ప్రతిసారీ ఒక మౌనం… దాని వెనుక ఉదాసీనత… కొడుకు పట్ల బాధ్యత అన్నీ ఆమెను మౌన యౌగినిలా చేస్తూనే ఉన్నాయి.

తమకు సిరిసంపదల విషయంలో ఏమీ లోటు లేకపోయినా ప్రశ్నార్ధకంగా మారిన భవిష్యత్తులో, అంధకార మయమవుతూన్న జీవితాన్ని నెట్టుకొస్తూన్న ఆమెను సమాయత్తపరచ బూనుతూనే ఉన్నాడు.

“సుదర్శన్ మా పూర్వ సంస్థలోని ఉద్యోగి. మంచివాడు. అవివాహితుడు. ప్రస్తుతం తిరుపతిలో పోస్టింగ్. మనిషి బాగా తెలుసు నాకు. సహృదయత కల్గినవాడు. నీ జీవితం ఛిద్రం కాకూడదని, సుదర్శన్‌తో నీకు పునర్వివాహం జరిపించాలని నా ఆత్రుత.”

“…..”

బబ్లూ ఈ ఇంటికి వారసుడు. వాడిని ఆదుకొని నా తర్వాత ముందుకు తీసుకెళ్ళగల్గిన ఓ తండ్రిగా… నీ జీవితాన్ని మళ్ళీ చిగురింప చేయగల్గిన మనసున్న మనిషిగా సుదర్శన్ పట్ల పూర్తి నమ్మకముంది నాకు.”

“…..”

“నువ్వు ఆలోచించుకొని తగిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిది. మీ నాన్నగారితో కూడా మాట్లాడుతాను. చూచాయగా విషయాన్ని సుదర్శన్ ముందుంచాను. అతగాడు నా మీద ఉన్న గౌరవంతో ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా అంగీకారాన్ని తెలియజేస్తున్నాడు.”

“…..”

“ఎంతో ఆలోచించి ముందుచూపుతో తోసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఒప్పుకుంటావని ఆశిస్తున్నాను.”

మామగారి నోటి మాటలు కంపిస్తున్నాయి. గొంతు గద్గదమవుతోంది. ఆయనలోని విషయ వేదన శారదను చలింపజేస్తోంది. మోడు వారిపోయిన తన జీవితాన్ని ఒక మామగారిగా కాకుండా ఓ తండ్రిగా నిలబెట్టాలన్న ఆయనలోని మానవీయ మహతీమయ కోణం తనను తట్టిలేపుతోంది.

“నమ్ము శారదా. ఇప్పుడు నువ్వు కూతురులాంటి దానపు అనుకోవడం లేదు. కన్న కూతురన్న భావనతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాను.”

గొప్ప ఎడ్మిరేషన్‌తో తీసుకున్న మావగారి నిర్ణయానికి తన అంగీకారాన్ని తెలియజేస్తూ ఆయన పాదాలకు నమస్కరిస్తోంది శారద.

Exit mobile version