Site icon Sanchika

వేంపల్లి నాగ శైలజ కవితలు

సంచిక పాఠకులకు కోసం మూడు కవితలనందిస్తున్నారు నాగ శైలజ.

1. కృతజ్ఞత

నిన్ను
నేల కూల్చేశానని విర్రవీగి
వికటాట్టహాసం చేసినా
పువ్వు
గాలికి వినయంగా
కృతజ్ఞతలే చెప్పుకుంది
తాను
చెట్టు తల్లి పాదాలపై వాలి
ప్రణమిల్లి
అమ్మ ఋణం తీర్చుకునేలా
సాయం చేసావంటూ….

2. నిత్య సంగీతం

పనికిరావని
పారవేస్తే
విత్తులు
మొలకలెత్తి
పచ్చగా కనువిందు చేసే
గుబురు చెట్లయ్యాయి
ఇప్పుడు
మా ముంగిట్లో
నిత్య సంగీత ప్రవాహమే
కొమ్మలపై
రెమ్మలపై వాలిన
బుల్లి పిట్టల
కువ కువల రాగాలతో…..

3. పరిమళాలనే

చెత్తను
ఎరువుగా వేసినా
సత్తువగా స్వీకరించి
కంపును ఇంపుగా భరిస్తూ
సుగంధాల్ని వెదజల్లే
పూల పరిమళాలనే ఇస్తోంది
పచ్చని చెట్టు

Exit mobile version