వేంపల్లి నాగ శైలజ నాలుగు మినీ కథలు-1

1
3

వేంపల్లి నాగ శైలజ గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. కారణం

“సుజాతా, ఎంతో శ్రమకోర్చి వందల మైళ్ళ దూరంలో వున్న మీ పల్లెకు వచ్చి నా కొడుకు పెళ్ళికి తప్పనిసరిగా రమ్మని అదేపనిగా చెప్పినా రాలేదెందుకని?” కాల్ చేసి తన ఒకప్పటి కాలేజ్‌మేట్‌ను అడిగింది రమ.

“సారీ రమా, ఆ ‘అయిదు రోజుల’ కారణంగా పెళ్ళికి రాలేని పరిస్థితి” వారం రోజుల క్రితమే పంట సాగు కోసం భర్త తన మెడలోని బొట్టుగొలుసు బ్యాంకులో తనఖా పెట్టిన సంగతి తలచుకుంటూ స్నేహితురాలికి జవాబిచ్చింది ఆ రైతు భార్య.

2. సెంటిమెంటు

“పిల్లోడు జొరంతో మూసిన కన్ను తెరవడమే లేదు అమ్మగారూ, మీరు నాకు ఇయ్యాల్సిన జీతంలో ఓ రెండొందలు అడ్వాన్సుగా ఇప్పించండి, మందులు కొనుక్కోవాలి” ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది పనిమనిషి రంగి.

“ఇవాళ శుక్రవారం, చచ్చినా ఇయ్యను, రేపొచ్చి తీసుకెళ్ళు, నీ మూడేళ్ళ పిల్లోడి కోసం నా ముప్పై ఏళ్ళ సెంటిమెంటును వదులుకోలేను” మొహాన్నే ధడేల్మని తలుపులు మూసుకుంటూ చెప్పింది యజుమానురాలు యాభై ఏళ్ల శాంతమ్మ.

3. ఆశ

“చిటారుకొమ్మ మరీ పెళుసుగా వుండి విరుగుతుందని తెలిసికూడా దానిమీదకే ఎందుకు ఎక్కావు?” తనవద్దకు చికిత్స కోసం వచ్చిన ఓ యువకుడిని అడిగాడు ఆర్థోపెడీషియన్.

“గత తొమ్మిదేళ్ళనుండీ ఇప్పటిదాకా ముప్ఫైనాలుగు ఇంటర్వ్యూలకు వెళ్ళా సార్, ఒక్క ఉద్యోగం కూడా రాలేదు, కనీసం ఈ రకంగానైనా…..” కళ్ళల్లో ఆశ కదలాడుతుండగా సమాధానమిచ్చాడు ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగి.

4. (హిం)సమాధానం

“పర్యావరణం అంశంగా నీ వ్యాసానికి ఓ పత్రిక వాళ్ళు మొదటి బహుమతిగా పంపిన వెయ్యి రూపాయలు ఏం చేయాలనుకుంటున్నావు?” అడిగాడు ఓ హెడ్మాష్టర్ తన స్కూల్లో ఆరో తరగతి చదివే విద్యార్థిని.

“దీనికి తోడు మరికొంత సొమ్ము పోగు చేసి ఓ రివ్వాల్వర్ కొనాలి సార్” చెప్పాడు విద్యార్థి.

“ఎందుకు?” వులిక్కిపడుతూ అడిగాడు హెడ్మాష్టర్.

“ఎప్పటిదో కాస్తంత కట్నం బాకీ ఇంకా తీర్చలేదని ఇప్పటికీ మా అక్కను గొడ్డు కంటే హీనంగా చావబాదుతున్న మా బావను కాల్చి చంపేద్దామని” కళ్ళు నిప్పుల్ని కక్కుతుండగా జవాబిచ్చాడు ఆ పన్నెండేళ్ళ పిల్లాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here