[dropcap]వేం[/dropcap]పల్లి నాగ శైలజ గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.
1. అర్థం
“మామయ్యా, డిక్షనరీల్లో కూడా కొన్ని పదాలకు అర్థాలు తప్పుగా అచ్చవుతుంటాయా?” అమ్మమ్మగారింటికి వెళ్ళిన నందిని అడిగింది తన మామయ్య శ్రీధర్‌ను.
“ఒకటీ, అరా జరుగుతూ వుండొచ్చమ్మా, ఇంతకీ ఎందుకలా అడిగావ్?” ప్రశ్నించాడు శ్రీధర్.
“మరేంలేదు, ఈ డిక్షనరీలో ‘వైఫ్’ అన్న పదానికి అర్థం బానిస అని కాక భార్య అని వుంటేనూ” సమాధానమిచ్చింది ఆ పదేళ్ళ చిన్నారి.
2. ఉపయోగం
“సుబ్బయ్యా, నాకు తెలిసినంతవరకు గత రెండేళ్ళుగా వానలే సరిగ్గా కురవక ప్రస్తుతం మీ గ్రామంలో ఏ పంటలు కూడా సాగులో లేవు కదా, మరెందుకు పురుగుమందుల డబ్బా కావాలంటున్నావు?” అడిగాడు దుకాణం యజమాని.
“పురుగు మందులు రైతులు సాగుచేసే పంటల కోసమే కాదయ్యా, పంటలు సాగుచేసే రైతుల కోసం కూడా” చెప్పాలనుకున్న సమాధానాన్ని బలవంతంగా గొంతులోనే నొక్కేశాడు ఆ బడుగు రైతు.
3. సందేహం
“అమ్మా, అక్కయ్యకు వాళ్ళ అత్తగారింట్లో ఎంత జీతం ఇస్తారు?” అడిగాడు పదేళ్ళ చిన్నూ తన తల్లిని.
“అక్కయ్యకు జీతం ఏమిట్రా?” కొడుకు ప్రశ్న అర్థం కాక అడిగిందామె.
“మరే, మన ఇంట్లో చెత్తలు వూడ్చడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేసినందుకు మనం మన పనిమనిషి రంగమ్మకు ప్రతినెలా రెండువేలు ఇస్తున్నాంగా, అక్కయ్య కూడా అత్తగారింట్లో అవే పనులు చేస్తోంది కదా, ఎంత జీతం ఇస్తారోనని” అమాయకంగా సందేహం వ్యక్తం చేశాడు చిన్నూ.
4. గెలుపు
డియర్ పార్టిసిపెంట్స్,ఈ క్విజ్ ప్రోగ్రాంలో విజేతలు ఎవరో తేల్చే చివరి రౌండ్ లోని చివరి ప్రశ్న, అందరూ సిద్ధమేనా?” అడిగాడు క్విజ్ మాస్టర్ విద్యార్థుల్లో ఉత్కంఠ రేపుతూ.
“సిద్ధమే సార్”, జవాబిచ్చారు పిల్లలంతా మరీ హుషారుగా.
“సృష్టిలో రెండు నాలుకల జీవి ఏది?” ప్రశ్నించాడు క్విజ్ మాస్టర్.
“రాజకీయ నాయకుడు సార్” ఠకీమని జవాబు వచ్చింది ‘ఏ’ గ్రూపులోని ఓ విద్యార్థి నోటినుండీ ఆ గ్రూపు గెలుపొందినట్లుగా స్కోరు బోర్డు మీద ఫలితం పచ్చని అక్షరాలతో మెరుస్తుండగా.