వేంపల్లి నాగ శైలజ నాలుగు మినీ కథలు-3

0
2

[dropcap]వేం[/dropcap]పల్లి నాగ శైలజ గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. గిఫ్ట్

“మమ్మీ, నా వచ్చే పుట్టినరోజుకు విల్లంబులు, రథం బొమ్మ గిఫ్ట్‌గా కొనివ్వు”తల్లిని అడిగింది ఎనిమిదేళ్ళ నిరుపమ.

“వేరే ఆటబొమ్మలు కాకుండా అవే ఎందుకు అడుగుతున్నావు?” ప్రశ్నించింది తల్లి.

“ఎందుకంటే, అమాయక ప్రజల్ని నానా చిత్రహింసలు పెట్టిన నరకాసురుడిని సత్యభామ చంపినట్లుగా నిన్ను పదే పదే మాటలతో, చేతలతో హింసిస్తున్న నాన్నను కూడా అలాగే చంపేద్దామని”క్రితం రోజు  పండుగ సందర్భంగా టెలివిజన్‌లో తను చూసిన ‘దీపావళి ‘సినిమా గుర్తు చేసుకుంటూ చెప్పింది నిరుపమ తల్లికి.

2. ట్యూషన్

“ఈరోజు సాయంత్రం నుండీ నేను కూడా మీ ఇంటివద్దకు ట్యూషన్‌కు వస్తాను సార్” ప్రాధేయపూర్వకంగా అడిగాడో ఆరోతరగతి అబ్బాయి తమ స్కూల్ ఇంగ్లీష్ టీచర్‌ను.

“నేను కేవలం పదోతరగతి వాళ్ళకే చెబుతా, నువ్వు పది కాదుగా, ఏం అవసరం?” అడిగాడు టీచర్.

“రోజూ కూలికి వెళ్ళి పగలంతా ఎంతో కష్టపడి తెచ్చిన కూలిసొమ్మును బలవంతంగా లాక్కుని పీకల్దాకా తాగొచ్చి మా అమ్మను మా నాన్న చితకబాదడం చూడలేక సార్” వెక్కుతూ చెప్పాడా అబ్బాయి నిస్సహాయంగా.

3. వ్యాపార రహస్యం

“ఇంత హఠాత్తుగా ఊళ్ళో గంగజాతర జరిపించేందుకు పాతికవేలు చందా ఇస్తా అంటున్నావు, ఎందుకు డాడీ?” వడ్డీ వ్యాపారి రంగనాధాన్ని అడిగాడు అతడి కొడుకు.

“వానలు దండిగా కురిసి, పంటలు బాగా పండి కూలిపనులతో ఈ సన్నజనాలు అంతో ఇంతో ‘లెక్క’ సంపాదించుకుని మనల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు,పండగ పేరుతో వుండే సొమ్ము అయిపోగొడితేనే కదా వాళ్ళు మనకు విలువ ఇచ్చేది” చెప్పాడు రంగనాధం తన వ్యాపార రహస్యాన్ని విడమరుస్తూ.

4. అసలు సంగతి

“అన్నా, మన పల్లె  బస్సు ఈరోజు ఎందుకనో ఇంకా రాలేదు,  టైం అయిపోతోంది, నేనూ నీతోపాటుగా  వస్తానన్నా” కంగారు పడుతూ అడిగాడు డిగ్రీ పరీక్షలు రాస్తున్న కృష్ణ, భార్యతో పాటు కారులో టౌన్‌కు వెడుతున్న తమ ఊరి సర్పంచ్‌ను.

“నేను అర్జెంట్ పని మీద ప్రక్క పల్లెకు వెళుతున్నా.” చెప్పాడు సర్పంచ్.

“ఎందుకండీ అలా అబద్దం చెప్పారు” అడిగింది సర్పంచ్‌ను అతడి భార్య.

“వాడిని టయానికి టౌనుకు తీసుకెళితే పరీక్ష రాసి పాసై ఉద్యోగం సంపాదించుకుని వెళ్ళిపోతే  మన పొలాల్లో కూలిపనులకు ఎవరొస్తారో నువ్వే చెప్పు?” భార్యను ఎదురు ప్రశ్నించాడు సర్పంచ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here