వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-14

1
4

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. ఆశ

“సూర్యం, రేపు ఒక్కపూట కాలేజీకి వెళ్లడం మానేసి ఎగువపల్లి వరకూ వెళ్లి రావాలి” రాత్రి భోజనాల సమయంలో కొడుకు సూర్యానికి చెప్పాడు నరసింహారావు.

“సరే డాడీ, వెళ్ళొస్తా గానీ అక్కడ ఏం చేయాలి?”తండ్రిని అడిగాడు సూర్యం.

“ఈ ఏడాది వర్షాలు సరిగా కురవక పంటలు పూర్తిగా కోల్పోయిన ఆ గ్రామంలోని కొందరు రైతులకు నా తరపున కొంత డబ్బును ‘సాయం’గా ఇచ్చిరావాలి” చెప్పాడు నరసింహారావు.

“ఆ రైతులకు ఎంత మాత్రం సాయం చేస్తున్నారేమిటి?” అడిగింది విశాలమ్మ, నరసింహారావు భార్య.

“ఒక్కో రైతుకు నా వంతు సాయంగా ఉచితంగా ఐదువేల రూపాయలు, చేతి బదులుగా మరో పదివేల రూపాయలు పంపిస్తున్నా” భార్యకు జవాబు ఇచ్చాడు నరసింహారావు.

“మరీ అంత సొమ్ము దుబారాగా ఎందుకు ఇవ్వడం, మనకేమైనా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా” తనకు ఇష్టం లేనట్టుగా అంది విశాలమ్మ.

“మళ్లీ త్వరలో ప్రారంభమయ్యే సీజన్లో వాళ్లకు పెట్టుబడుల కోసం కావాలిగా అందుకే పంపిస్తున్నా” చెప్పాడు నరసింహారావు.

“కష్టపడి సంపాదించిన సొమ్మును ఇలా దానాలు చేస్తూ పోతే…” దీర్ఘాలు తీసింది విశాలమ్మ.

“ఓసీ పిచ్చి మొహమా, ఇప్పుడు మనం ‘సాయం’ పేరుతో సొమ్ము ఇస్తే మళ్లీ పంటలు పండించాలనే ఆశ కలుగుతుంది, లేకుంటే నాలుగేళ్లుగా నష్టాలు వస్తున్న వ్యవసాయం ఇక తమ వల్ల కాదని వదిలేస్తారు, సేద్యంపై వాళ్ళకు ‘ఆశ’ చావనీయకూడదు” చెప్పాడు నరసింహారావు.

“వాళ్లు మానేస్తే మనకు ఏమిటి?” అర్థం కానట్లుగా చూస్తూ భర్తను అడిగింది విశాలమ్మ.

“నీ ముద్దుల కొడుకు కోసం నేను త్వరలో ప్రారంభించబోయే మన మూడవ ఎరువుల, పురుగు మందుల దుకాణానికి ‘గిరాకీ’లు కావాలిగా, పైగా ఆ రైతులంతా వేరే షాపులకు వెళ్లకుండా మన కస్టమర్లుగానే ఉండాలిగా” తన సాయం వెనుక ఉన్న ‘వ్యాపార రహస్యాన్ని’ అర్థం చేసుకోమన్నట్లుగా చెప్పాడు నరసింహారావు.

2. అవసరం

“నాయనా, నీతో చిన్న పని పడిందప్పా” అంది అరవై ఏళ్ల పెద్దావిడ నారాయణమ్మ తమ ఊరి స్కూల్లో టీచరుగా పని చేసే రమేష్ వద్దకు వచ్చి.

“దేని గురించి అవ్వా?” ప్రశ్నించాడు రమేష్ పెద్దామెను కూర్చోమని చెబుతూ.

“నువ్వు ఒగతూరి నన్ను టౌనుకు తోడుకొని పోవల్ల ఐవారూ” చెప్పిందామె.

“ఎందుకోసమో వివరంగా చెబితే కదా?”అడిగాడు రమేష్ సందేహంగా చూస్తూ.

“టౌనులో కంపీటర్‌లో (మీసేవ) ఓటెక్కించుకునేదానికి” చెప్పింది పెద్దావిడ.

“ఇదివరకు నీకు ఓటు వుంది కదా, మళ్ళీ కొత్తగా ఎక్కించుకోవడమెందుకు?” అర్థం కానట్లుగా అడిగాడు రమేష్.

“ఏంలేదు నాయనా, ఈ మద్దెన ఒల్లు బాగలేకుంటే నా కూతురు దెగ్గిరికీ పొయ్యింటి, అప్పుడు ఊర్లోలేనని నా ఓటు పీకేసినారు” చెప్పింది పెద్దావిడ బాధగా.

“అయ్యో అలాగా, ఏం పర్వాలేదులే, టౌనుకు ఎల్లుండి వెడదాం” అన్నాడు రమేష్.

“ఈ చిన్న సాయం చేసి ‘పున్యం’ కట్టుకో సామీ” ప్రాధేపూర్వకంగా అందామె.

“తప్పకుండా చేస్తాను గానీ, నాకు తెలియక అడుగుతాను, ఎంతో పెద్ద చదువులు చదివిన వాళ్ళు, మంచి ఉద్యోగాలు చేస్తూ అన్నీ తెలిసిన వాళ్ళే చాలామంది అస్సలు ఓటు గురించే పట్టించుకోరే, పెద్దగా ఏమీ తెలియకున్నా, పైగా ఈవయస్సులో ఓటు గురించి ఎందుకు అవ్వా అంతగా ఆరాటపడుతున్నావు?” అడిగాడు రమేష్ ఉత్సుకతతో.

“నువ్వు చెప్పేవన్నీ నాకు తెలీదు గానీ నాయనా, ఓటు వుంటే ఎలక్సన్లప్పుడు ‘అంతో ఇంతో లెక్క’ ఇచ్చిపోతారు గదా” ఓటుతో తనకు గల ‘అవసరా’న్ని చెప్పింది పెద్దామె.

3. సెగ గడ్డ

“వదినా బాగున్నావా?” బంధువుల పెళ్ళిలో తారసపడ్డ కల్యాణిని పలకరించింది సుమతి.

“బాగున్నా సుమతీ” జవాబిచ్చింది కల్యాణి నవ్వుతూ.

“అన్నయ్య రాలేదా?” అడిగింది సుమతి

“ఏవో పనులు వుండి రాలేకపోయారు” చెప్పింది కళ్యాణి.

“కనీసం పిల్లలనైనా తీసుకురాలేకపోయారా?” మళ్ళీ అడిగింది సుమతి.

“వాళ్లకు ఎల్లుండి నుండి పరీక్షలు కదా, రామన్నారు” చెప్పింది కళ్యాణి.

“ఒక్కదానివే వచ్చావన్న మాట, ‘కూర్చుందాం రా’ అంది సుమతి కుర్చీలు ఉన్న వైపుకు దారితీస్తూ.

“పెళ్లికూతురు వాళ్ళు మరీ దగ్గర బంధువులు, కాబట్టి రాక తప్పదు కదా, ముందు ముందు నిష్ఠూరాలు ఎందుకని” చెప్పింది కల్యాణి కుర్చీలో సెటిల్ అవుతూ.

“వదినా, నువ్వు ఏమీ అనుకోనంటే ఓ మాట అడగనా?” అంది సుమతి తటపటాయిస్తున్నట్లుగా.

“ఏమిటో అడుగు సుమతీ, నీకు నా దగ్గర దాపరికం ఎందుకు?” సందేహంగా చూస్తూ అంది కల్యాణి.

“మరేం లేదు, నీకు నగలు అంటే చాలా ఇష్టం కదా, పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్ళినప్పుడు బాగా అలంకరించుకోవడం అలవాటు, కానీ ఇప్పుడేంటి నగలేమీ లేకుండా మరీ బోసి మెడతో వచ్చావు?” అడిగింది సుమతి.

“మెడ మీద చిన్న ‘సెగ గడ్డ’ వచ్చింది సుమతీ, నగలు వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా వుంది” జవాబిచ్చింది కళ్యాణి పెళ్లి మండపంలోకి రాబోయే ముందు మెడ వెనుక భాగంలో అతికించుకున్న చిన్న ‘మెడికేటెడ్ ప్లాస్టర్’ను చేత్తో తడుముకుంటూ, రెండేళ్ల క్రితం వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టి భర్త ఇంకా విడిపించని తన నగల్ని తలచుకుంటూ.

4. కానుక

“అమ్మగారూ, చీరలు బొత్తిగా లేవు, మీది ఏదైనా ఓ పాత చీర ఉంటే ఇప్పించండమ్మా” అడిగింది పనిమనిషి సుబ్బులు.

“ఇప్పుడు తీరిక లేదు కదే, సాయంత్రం వచ్చినప్పుడు గుర్తుచేయ్, వెతికి పెడతా, రేపు తీసుకెళ్దువుగాని” చెప్పింది రత్నమ్మ టి.వి. మీద నుండి దృష్టి మరల్చకుండా.

“సరే అమ్మగారూ, అలాగే” అంది సుబ్బులు.

“సుబ్బులూ, నీకు ఈ నెలాఖరున జీతంతో పాటు డబ్బు కొంచెం ఎక్కువగానే ఇస్తాలే, కొత్త చీర  కొనుక్కుందువు” అంది రత్నమ్మ.

“మీరు ఎంత మంచివారు అమ్మగారూ, పండుగకు ‘కానుక’గా కొత్త చీర తీయిస్తున్నారన్నమాట” తబ్బుబ్బవుతూ అంది సుబ్బులు ఆనందంగా.

“అన్నట్లు చెప్పడం మరిచా, వచ్చే నెల నుండి నువ్వు పని చేసుకోవడానికి వేరే ఎక్కడైనా మరో ఇల్లు చూసుకో” మెల్లగా అంది రత్నమ్మ బుల్లితెర మీద నుండి మెడ తిప్పకుండానే.

“ఎందుకు అమ్మగారూ, మీరు ఏ పని చెప్పినా చేస్తున్నా, పైగా జీతం పెంచమని కూడా అడగలేదుగా, నావల్ల ఏదైనా పొరపాటు జరిగిందా?” కంగారు పడుతూ అడిగింది సుబ్బులు.

“అదేం లేదే, మొన్న మేము వెళ్లి అబ్బాయికి చూసి వచ్చిన తిరుపతి సంబంధం కుదిరింది, ఈనెలాఖరున పెళ్లి జరిగేలా ఖాయం చేసుకుందామని అమ్మాయి తండ్రి రాత్రే కబురు పంపాడు” చెప్పింది రత్నమ్మ.

“అబ్బాయి పెళ్ళికీ, నన్ను పని మానేయమనడానికి ఏమిటమ్మా సంబంధం?”అడిగింది సుబ్బులు అర్థం కానట్లుగా చూస్తూ.

“కోడలు వచ్చి ఇప్పుడు నువ్వు చేస్తున్న అన్ని పనులూ తనే చేసుకుంటే, ఇక నీతో ఏం అవసరం ఉంటుంది”అంది రత్నమ్మ ఇక మాట్లాడేందుకు ఏమీ లేదు అన్నట్లుగా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here