[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.
1. ఆదాయం
“తెల్లవారు జాము మూడుగంటలు కావస్తున్నా ఇంకా పడుకోకుండా, ఎందుకమ్మా అలా కూర్చునే వున్నావు” రాత్రంతా బాగా యేడ్చి మోహం ఉబ్బినట్లుగా ఉన్న కోడలు కమలను అడిగింది శారదమ్మ.
“నిద్ర పట్టడం లేదు అత్తయ్యా” కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతుండగా జవాబిచ్చింది కమల.
“వాడు రోజూ తప్ప తాగి వచ్చి నిన్ను, పిల్లలను చావబాదడం, అడ్డు వచ్చిన నాకూ నాలుగు పడటం మామూలై పోయింది కదా కమలా, దాని గురించి బాధపడడం ఎందుకు?” సానుభూతిగా అంది శారదమ్మ.
“ఆ పాడు తాగుడు అలవాటు మానుకోమని ఏళ్ల తరబడి నెత్తీ, నోరూ బాదుకుని చెబుతున్నా, ఆయన మారడం లేదత్తయ్యా” కమల మాటల్లో ఆవేదన ధ్వనించింది.
“అంతా మన ఖర్మ అని సరిపెట్టుకోకతప్పదు కమలా” కోడలును ఊరడిస్తున్నట్లుగా అంది శారదమ్మ.
“సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ప్రతి పార్టీ చెబుతోందే కానీ, తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయమే పట్టించుకోవడం లేదత్తయ్యా, అలా జరిగినా బాగుండు” కాస్తంత ఆశాభావం వ్యక్తం అయింది కమల గొంతులో.
“దశాబ్దాల కాలంగా ప్రజలను మద్యానికి బానిసలుగా చేసి సొమ్ము చేసుకుంటున్న పాలకులకు ఇది సులభమైన చక్కని ‘ఆదాయ’ వనరు అయినప్పుడు ఈ అవకాశాన్ని వాళ్ళు మాత్రం ఎందుకు వదులుకుంటారమ్మా” చెప్పింది శారదమ్మ.
“మీరు చెబుతున్నట్లుగా అంతగా ‘ఆదాయమే’ ముఖ్యమైతే, మద్యం వల్ల కూలిపోతున్న కాపురాలను నిలబెట్టుకునేందుకు నాలాంటి ఎందరో మహిళలు మానాభిమానాలు ప్రక్కనపెట్టి ‘సాని’ పని చేసైనా ‘ఆదాయం’ చెల్లించేందుకు సిద్ధపడతారు అత్తయ్యా” తండ్రితో చావు దెబ్బలు తిని ఓ వారగా పడుకొని నిద్ర పోతున్న తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ డగ్గుత్తికతో కమల.
(ఎవరిని ఉద్దేశిస్తూ, కించపరుస్తూ రాసినది కాదు).
2. అక్షయ పాత్ర
“అపర్ణా, అమ్మ చెప్పింది గత కొంత కాలంగా నువ్వు కేవలం ఒక్కపూట మాత్రమే భోంచేస్తున్నావట, నిజమేనా?”భార్యను అడిగాడు రవీంద్ర.
“అవునండీ నిజమే” బదులిచ్చింది అపర్ణ.
“తినకుండా పస్తులుండి, నువ్వేమీ నాకు మిగిల్చాల్సిన అవసరం లేదులే” అన్నాడు రవీంద్ర.
“నా ఉద్దేశ్యం అది కాదండీ” చెప్పింది అపర్ణ.
“మరైతే ఏదైనా ఆరోగ్య సమస్యనా, లేక మరీ సన్నబడాలనా?”అడిగాడు రవీంద్ర.
“అదేం లేదండీ, దేవుడికి ఉపవాసాలు ఉంటున్నా” సమాధానమిచ్చింది అపర్ణ.
“ఉపవాసాల పేరుతో ఆరోగ్యం చెడగొట్టుకోకు” చిరాగ్గా అన్నాడు రవీంద్ర.
సరిగ్గా ఓ ఏడాది తర్వాత…
“అపర్ణా, ఎన్నో కఠోర నియమాలు పాటిస్తూ, కఠిన ఉపవాసాలు ఉండి నన్ను బాగా కదిలించావు ఎందుకోసం”అడిగాడు ఓరోజు ప్రత్యక్షమైన భగవంతుడు.
“స్వామీ, ‘అక్షయపాత్ర’ అంటే మనం ఏది కోరుకుంటే దాన్ని ప్రసాదిస్తుందట కదా?” అడిగింది అపర్ణ.
“నిజమే” బదులిచ్చాడు భగవంతుడు.
“అయితే ఈ ఒక్కసారికి నా కడుపును ‘అక్షయపాత్ర’గా మార్చు స్వామీ” వేడుకుంది అపర్ణ.
“అందరూ సిరిసంపదలూ, భోగభాగ్యాలూ కోరుకుంటారు, నీ కోరిక విచిత్రంగా వుందే?” ప్రశ్నించాడు భగవంతుడు.
“మరేంలేదు స్వామీ, పిల్లల్ని కనే విషయంలో నా ప్రమేయం ఏమాత్రం లేకున్నా ఇప్పటివరకూ ముగ్గురినీ ఆడపిల్లలనే కన్నానని, కనీసం ఈసారైనా మగ పిల్లాడిని కనకుంటే తన్ని ఇంట్లో బయటకు గెంటేస్తానని బెదిరిస్తోంది మా అత్తగారు, అందుకోసం” అపర్ణ సమాధానానికి నోటమాట రాని వాడయ్యాడు భగవంతుడు ఏం చెప్పాలో తెలియక.
3. నిజాయితీ
“రంగయ్యా, నేను ఇచ్చింది యాభై నోటు కదా, చిల్లర పది తక్కువగా ఇచ్చావేం?” షేవింగ్ చేయించుకున్నాక బార్బర్ షాప్ వాడిని అడిగాడు హరికృష్ణ.
“షేవింగ్ రేటు ఓ పది పెంచి ముప్పై చేశాను సార్” చెప్పాడు రంగయ్య.
“ఈ మధ్యకాలంలో బ్లేడ్లు గానీ, షేవింగ్ క్రీమ్ గానీ రేట్లు పెరగలేదే” అసంతృప్తిగా మొహం పెడుతూ అన్నాడు హరికృష్ణ.
“అవి పెరగకపోయినా, మిగతా అన్ని నిత్యావసరాలా రేట్లు భారీగా పెరిగాయి కదా సార్, పైగా మా ఇంటి ఓనరు, షాపు ఓనరు ఇద్దరూ ఒకేసారి అద్దెలు కూడా పెంచేశారు, నాకు ఏమీ మిగలడం లేదు, ఓ పది రూపాయలు మీకేమీ తక్కువ కాదు కదా” వినయంగా అన్నాడు రంగయ్య.
“ఏదో ఒక సాకు చెప్పి, ఏదో ఒక రకంగా మెల్లగా ప్రజల్ని నిలువు దోపిడీ చేయడం మీలాంటి వాళ్ళు బాగా నేర్చుకున్నారయ్యా” కోపంగా అంటూ బయటకి దారితీశాడు హరికృష్ణ.
సరిగ్గా నెల రోజుల తర్వాత….. కరోనా లాక్‌డౌన్ సమయంలో….
“ఏవండీ, పిల్లాడికి జుట్టు బాగా పెరిగిపోయి, మరీ చికాకు పెడుతోంది, సెలూన్ షాప్ వాడి యిల్లు ఈ నాలుగు వీధుల అవతల సందులోనే కదా, లాక్‌డౌన్ బ్రేక్ సమయంలో పిల్లాడిని అక్కడికే తీసుకెళ్లి క్రాఫ్ చేయించరాదా?” శారద చెప్పింది భర్త హరికృష్ణతో.
ఓ గంట తర్వాత….
“కాదు, కూడదూ అనకుండా పిల్లాడికి ఇంటి వద్దనే క్రాఫ్ చేశావయ్యా, ఈ వంద తీసుకో చిల్లర ఏమి వాపసు ఇవ్వకులే” అన్నాడు వందనోటు ఇస్తూ హరికృష్ణ రంగయ్యతో.
“వంద అవసరం లేదు సార్, యాభై చాలు, నేను ఇక్కడ చేసింది కూడా షాపులో చేసే పనే కదా, మీ అవసరాన్ని అవకాశంగా చేసుకొని ఎక్కువ సొమ్ము తీసుకున్నా అది నాకు అరగదు” ‘నిజాయితీ’గా యాభైనోటు వాపసు అందిస్తూ చెప్పాడు రంగయ్య.
4. ధైర్యం
“ఎక్కడికయ్యా బయలుదేరుతున్నావు?” బయటకు వెళ్లబోతున్న భర్తను అడిగింది రాజమ్మ.
“పట్నానికి వెళుతున్నా” భార్యకు బదులిచ్చాడు నారాయణ.
“నిన్నా, మొన్నా కూడా పట్నానికే వెళ్లొచ్చావా?”మళ్లీ అడిగింది రాజమ్మ.
“అవును” చెప్పాడు నారాయణ చెప్పుల్లో కాళ్ళుదూర్చుతూ.
“ఇంత తెల్లవారుజామునే వెళుతున్నావు, ఏం పనిమీద?” ప్రశ్నించింది రాజమ్మ.
“పెద్దగా పనేమీ లేదు , ఊరికే వెళుతున్నా” చెప్పాడు నారాయణ.
“ఏ పనీ లేకుండా వూరికే ఎందుకు వెళ్లడం, పైగా అదేదో కరోనా రోగం వచ్చిందనీ, ఎవరూ ఇంటిగడప దాటవద్దనీ, చావును కోరి తెచ్చుకోవద్దని అదేపనిగా నెత్తీ, నోరూ మొత్తుకొని చెప్తుంటే” అంది రాజమ్మ.
“సాయంత్రం దాకా పట్నంలో రోడ్లు, వీధులు అలా తిరిగొద్దామనీ” చెప్పాడు నారాయణ నోటికి, ముక్కుకు తువ్వాలు చుట్టుకుంటూ.
“నీకు ఇదేం ఆలోచనయ్యా విచిత్రంగా” భర్తను అదోరకంగా చూస్తూ అడిగింది రాజమ్మ.
“పైరు సాగుకోసం చేసిన అప్పులు, ఎరువులు, పురుగుమందు షాపుల్లో ఇవ్వాల్సిన బాకీల కారణంగా అప్పులవాళ్ళు నడిబజార్లో నిలేస్తారని ఇన్నాళ్లూ పట్నానికి వెళితే దొంగచాటుగానూ, ముళ్లమీద నడిచే వాడిలా సందుల్లో, గొందుల్లో భయపడుతూ తిరగాల్సి వచ్చేది, ఈ కరోనా రోగం పుణ్యాన కనీసం ఇప్పుడన్నా ‘ధైర్యం’గా తిరిగే అవకాశం వచ్చింది, వెళ్లనివ్వు” చెప్పాడా రైతు భర్త.