Site icon Sanchika

వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-19

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. అసలు కారణం

“అమ్మగారూ, ఎదురింట్లో ఎవరో కొత్తగా దిగినట్లున్నారే?” ఉదయం పనిలోకి రాగానే యజమానురాలు ప్రభావతిని ప్రశ్నించింది పనిమనిషి రంగమ్మ.

“అవునే, నిన్న సాయంత్రమే దిగారు, తిరుపతి నుండి వచ్చారట” చెప్పింది ప్రభావతి.

” ఆ ఇంటామె మీకు పరిచయం అయితే, పనిమనిషి కావాలేమో అడగండమ్మా” చెప్పింది రంగమ్మ.

“అడుగుతాగానీ, ఇప్పటికే నీవు ఈ కాలనీలో అయిదారిళ్లలో పని చేస్తున్నావు కదా, నీకు ఎలా కుదురుతుంది?” అడిగింది ప్రభావతి.

“వాళ్లు సరే అంటే,నా కూతురును కుదుర్చుదామని” బదులిచ్చింది రంగమ్మ.

“నీ కూతురు ఇంటర్మీడియట్ చదువుతోంది కదా, చదువు మానిపించేసి నీలా పాచి పనుల్లోకి దింపడం ఎందుకు? హాయిగా చదువుకొనీక” అడిగింది ప్రభావతి.

“ఎల్లకాలం చదువంటే సంసారం జరుగుబాటు ఉండాల కదమ్మగారూ?” అంది రంగమ్మ.

“నువ్వు ఇళ్లల్లో పనిమనిషిగా, నీ మొగుడు దిన కూలీగా సంపాదించేది, మీముగ్గురికీ చాలదనా?” కొంచెం కోపంగా ప్రశ్నించింది ప్రభావతి.

“నేను పాచిపనులు చేసి సంపాదించిందంతా, నా మొగుడు రోజూ తాగడానికీ, అక్కడ ఇక్కడ చేసిన అప్పులు తీర్చడానికే సరిపోతోందమ్మా, ఆ అప్పులు తీర్చుకుంటే ఇచ్చినవాళ్ళు ఇంటి మీదికి వచ్చి చేసే గలాటాలతో వీధిలో మానం పోతోంది” చెప్పింది రంగమ్మ ఆవేదనగా.

“సుబ్బయ్యను ఎలాగోలా తాగుడు మాన్పించలేక పోయావా?” అంది ప్రభావతి.

“ఈ కరోనా మహమ్మారి వచ్చాక, లాక్‌డౌన్‌తో నెలన్నర రోజులు మందు దొరక్క పూర్తిగా మానేశాడమ్మా, చెబితే నిజంగా మీరు నమ్మరుగానీ ఆ కారణంగా కరోనాకు నిజంగా దండం కూడా పెట్టుకున్నా, కానీ ‘మాయదారి సచ్చినోళ్ళు’ మళ్లీ షాపులు తెరిచారు కదా, మాలాంటి సన్నజనాల సంసారాలు కూల్చడానికి” తన కూతురును చదువు మానిపించేసి పనిలోకి దించడానికిగల ‘అసలు కారణం’ వివరించింది రంగమ్మ మెటికలు విరుస్తూ, శాపనార్థాలు పెడుతూ.

2. బాధ్యత

“ఏవండీ, ఆ రాజమండ్రి వాళ్లకు మన అమ్మాయి బాగా నచ్చిందని చెప్పి పంపారుగా, ఆ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారు?” భర్త ఇంటికి రాగానే అడిగింది సుమతి.

“ఇప్పుడు అమ్మాయి పెళ్ళికి వచ్చిన తొందరేమీ లేదు గానీ, పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించి అమెరికాకు పంపిస్తే, తరువాత వాడు వాళ్ల అక్క పెళ్లి ఘనంగా చేస్తాడు, పైగా మనకు బంధువుల్లో, స్నేహితుల్లో గౌరవం గొప్పగా పెరుగుతుంది” చెప్పాడు రాజారావు భార్యతో.

“వాడికి ఇంజనీరింగులో సీటు రావడానికి తగినంత ర్యాంకు కూడా రాలేదు కదండీ” అంది సుమతి.

“అమ్మాయికి పెళ్లి చేయడానికి ఉపయోగించాలనుకున్న ప్రావిడెంట్ ఫండ్ లోను సొమ్మును పిల్లాడికి డొనేషన్ కట్టి చదివిస్తే సరి” చెప్పాడు రాజారావు.

“నాన్నా, నాకు ఇంజనీరింగ్ చదవడమూ, అమెరికాకు వెళ్లడమూ, అసలు ఏమాత్రం ఇష్టం లేదు” చెప్పాడు అక్కడే ఉండి అమ్మానాన్నల మాటలు వింటున్న ధీరజ్.

“ఇష్టం వచ్చినట్లు వాగకు, నువ్వు నేను చెప్పినట్లు వినాల్సిందే, ఇంజనీరింగు చదివి అమెరికాకు వెళ్లాల్సిందే, లేకుంటే నాకు బంధువుల్లో, స్నేహితుల్లో నామోషీ, వాళ్ళ మధ్య తలెత్తుకొని తిరగలేను” హుకుం జారీ చేస్తున్నట్లుగా గద్దించాడు రాజారావు.

సరిగ్గా పదేళ్ళ తర్వాత…

“ధీరజ్, నువ్వు అమెరికా వెళ్లి ఐదేళ్లు పూర్తి కావస్తోంది, మీ అక్కయ్యకు వయసు మీరిపోతోందీ, సంబంధాలు కూడా పెద్దగా రావడం లేదు, అక్కయ్య పెళ్ళి కోసం ఓ పది లక్షలు సర్ది పంపితే, త్వరగా ఆ బరువు కూడా ఎలాగోలా తీర్చుకుంటా” ఫోనులో కొడుకుతో చెప్పాడు రాజారావు.

“డబ్బు సర్దడం ఇప్పట్లో నావల్ల కాదు నాన్నా, ఏం అనుకోకు” జవాబిచ్చాడు తండ్రికి ధీరజ్.

“మీ అక్కయ్య పెళ్ళికి ఖర్చు చేసేందుకు ఉద్దేశించిన ప్రావిడెంట్ ఫండ్ లోను డబ్బు నీ చదువు కోసం ఖర్చు చేశారా, ఇప్పుడు దాని పెళ్లి చేయడం నీ ‘బాధ్యత’ అన్నాడు రాజారావు కొడుక్కి నచ్చచెప్తున్నట్లుగా.

“బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ లేనిపోని పేరు ప్రతిష్ఠల కోసం ప్రాకులాడి నాకు ఇష్టంలేని చదువును బలవంతంగా చదివించి, అమెరికా పంపి ఇప్పుడు అక్కయ్య పెళ్లి నా ‘బాధ్యత’ అంటున్నారు, ఏంటి నాన్నా?” తను చేసిన తప్పు అర్థమవుతుండగా కొడుకు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు వింటున్న రాజారావుకు.

3. పుళ్ళు

“చెప్పమ్మా, ఏమిటి నీ సమస్య?” అడిగాడు డాక్టర్ రాంబాబు చికిత్స కోసం వచ్చి తన ఎదురుగా కూర్చున్న ఇరవై ఏళ్ల కిరణ్మయిని.

“నాకు శరీరం అంతా పుళ్ళు లేస్తున్నాయి సార్” చెప్పింది కిరణ్మయి.

“ఏఏ భాగాల్లో?” అడిగాడు డాక్టర్ స్టెత్ చేతిలోకి తీసుకుంటూ.

“ఒక్క భాగంలో అని కాదు డాక్టర్, దేహం అంతా” బదులిచ్చింది కిరణ్మయి.

“ఎక్కడా ఒక్క పుండు కూడా కనిపించడం లేదే?” సందేహంగా అడిగాడు డాక్టర్ తన కళ్ళజోడును సరిచేసుకుని ఆ అమ్మాయి ముఖం మీద, చేతుల మీద దృష్టి సారిస్తూ.

“ఆ పుళ్ళు మీకు ప్రత్యక్షంగా కనిపించక పోవచ్చు సార్, కానీ వాటివల్ల కలిగే నొప్పులు, బాధ నాకు నిత్యం చాలా స్పష్టంగా తెలుస్తోంది” చెప్పింది కిరణ్మయి.

“లేనిది ఉన్నట్లుగా ఊహించుకుని నీవు ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లున్నావు, ఎవరినైనా సైక్రియాటిస్టును కలవడం మంచిదమ్మా” సలహా ఇస్తున్నట్లుగా అన్నాడు డాక్టర్ రాంబాబు.

“నాకు మానసికపరమైన జబ్బు ఏదీ లేదు డాక్టర్ గారు” స్థిరంగా చెప్పింది కిరణ్మయి.

“మరి అయితే నీకు ఒళ్ళంతా పుళ్ళు అని ఎందుకు అనుకుంటున్నావు, అసలు ఆ ఫీలింగ్ నీకు ఎందుకు కలుగుతోంది?” అడిగాడు డాక్టర్.

“కాలేజీకి వెళ్లేటప్పుడూ, లేక ఏదైనా పనిపై ఇంటి గడప దాటి వీధిలోకి అడుగు పెట్టినప్పుడు, కొందరు మగాళ్లు తమ చూపుల శూలాల్ని గుచ్చి నా దేహంపై గాయాల య్యేలా చేస్తున్నారు సార్, నా శరీరంలోని ప్రతి అవయవం అచ్చంగా వాళ్ళ అమ్మల, అక్క చెల్లెళ్ల దేహాల్లోని అవయవాలను పోలి వున్నా కూడా” బిగ్గరగా వెక్కుతూ బదులిచ్చింది కిరణ్మయి.

“కిరణ్మయీ, ఏదో పీడకల వచ్చినట్లు కలవరిస్తున్నావు, లేచి కాసిన్ని మంచి నీళ్ళు త్రాగి పడుకో” కిరణ్మయి శరీరాన్ని కదుపుతూ చెప్పింది వాళ్ళ అమ్మ నిద్రలో నుండి లేచి మేలుకుంటూ.

4. కొన్ని గొర్రెల కథ

“ఎందుకు మీరంతా అలా లుంగలు చుట్టుకుని గడగడ వణికిపోతున్నారు?” ఓ మందలో గుంపుగావున్న అనేక గొర్రెలను అడిగింది ఆ దారి వెంబడి వెడుతున్న ఓ కుందేలు.

“చలిగాలి ఎక్కువగా వీస్తోంది కదా, ఆ గాలికి అస్సలు తట్టుకోలేకపోతున్నాం” దవడలన్నీ పిడుచగట్టుకుపోతుండగా అతికష్టం మీద జవాబిచ్చాయి గొర్రెలన్నీ ఒకేసారి.

“గతంలో మీ శరీరాలపై మందంగా ఉన్ని వుండేది కదా, ఇప్పుడు ఒక్కదానిపైనా వీసమెత్తు ఉన్ని కూడా కనిపించడం లేదు, ఎందుకని?” ప్రశ్నించింది కుందేలు చర్మం బాగా కనిపిస్తున్న వాటి దేహాలవంక ఆశ్చర్యంగా చూస్తూ.

“ఇప్పుడు అధికారంలో వున్న మా రాజుగారు పాలనాపగ్గాలు చేపట్టక పూర్వం, అంటే ఏడాది క్రితం ఎంత చలినైనా తట్టుకునేలా మాలో ప్రతి గొర్రెకూ ఓ మందపాటి, నాణ్యమైన దుప్పటిని ఉచితంగా అందిస్తానంటే ఆ దుప్పట్ల తయారీకి మా ఒంటిమీద వున్న ఉన్నినంతా పూర్తిగా ఇచ్చేశాం, దుప్పట్లు మాత్రం రాలేదు, ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయో రావో కూడా తెలీదు చలికి మాత్రం తట్టుకోలేకపోతున్నాం” నిరాశగా చెప్పాయి గొర్రెలన్నీ.

“నాన్నా, మీరు పత్రికకు పంపడానికి రాసిన ‘కొన్ని గొర్రెల కథ ‘ ఇప్పుడే చదివా, అందులో గొర్రె అంటే ఓటరు, నాణ్యమైన దుప్పటి అంటే మంచి పరిపాలన, ఉన్ని అంటే ఓటు అని కదా అర్థం?” అడిగాడు నాలుగో తరగతి చదివే తొమ్మిదేళ్ళ మహతీ కృష్ణ తన తండ్రిని.

“నా వంతు కథ రాయడం వరకే బాబూ, చదివినవాళ్ళు ఎవరికి తోచినట్లు ఎలా అనుకుంటే వారికి అలాంటి అర్థం ధ్వనిస్తుంది” కొడుక్కి బదులిచ్చాడు రచయిత అయిన ఆ తండ్రి.

Exit mobile version