వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-2

1
5

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. నిజం

“మమ్మీ నాన్నగారు ఈ మధ్య తాగుడుకు బానిసయ్యారు కదూ?” సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వచ్చిన సుధ ప్రశ్నించింది తన తల్లిని.

“నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది?”అడిగింది లలిత కూతురుని.

“నాన్నగారు ఈ మధ్య డ్యూటీ నుండి ఏ తెల్లవారుజామునో రావడం, కళ్ళు ఎప్పుడూ ఎర్రగా ఉబ్బి ఉండడం చూసి అడుగుతున్నా” చెప్పింది సుధ.

“సిటీ బస్సుల్లో ఆకతాయిల పోరుతో నువ్వు కాలేజీ మానేస్తానంటే నీ కోసం స్కూటీ కొనేందుకు చేసిన అప్పు తీర్చడానికి రోజూ ఓవర్ టైం చేస్తున్నారమ్మా మీ నాన్న” చెప్పింది తల్లి.

“అంతగా అప్పులు చేసిమరీ నన్ను చదివించడం నాన్నకు అవసరమా?” అడిగింది సుధ.

“నువ్వు ఉద్యోగస్తురాలివైతే మీ అత్తవారింట్లో జీవితాంతం తగిన గౌరవమర్యాదలు పొంది సుఖంగా ఉంటావనే మీ నాన్న తన నిద్రను కూడా దూరం చేసుకుని నీ కోసం కష్టపడుతున్నాడు” చెప్పింది లలిత.

నిజం గ్రహించక తండ్రిని అపార్థం చేసుకున్నందుకు సుధ వదనం చిన్నబోయింది కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లుతుండగా.

2. పనిమనీషి

“అమ్మగారూ, మా చంటిదానికి ఒంట్లో సుస్తీ చేసింది, ఈ నెల జీతం ముందుగానే ఇవ్వండమ్మా, మందులు కొనుక్కోవాలి” శారదమ్మను బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది పనిమనిషి రంగమ్మ.

“అలా ఇవ్వడం కుదరదు, నీ వల్ల కాకుంటే పనిమానేయ్, మరో మనిషిని చూసుకుంటా” కఠినంగా జవాబిచ్చింది శారదమ్మ.

“సరేనమ్మగారూ, జీతం నెలాఖరునే ఇద్దురుగానీ” చెప్పింది రంగమ్మ.

సరిగ్గా వారం రోజుల తర్వాత…..

“రంగీ ఈ రెండు వేలు తీసుకో” వంద నోట్ల బొత్తిని పనిమనిషికి ఇవ్వబోయింది శారదమ్మ.

“నెల ఇంకా పూర్తి కాలేదు కదమ్మా” సందేహంగా చూస్తూ అంది రంగమ్మ.

“నెల జీతం కాదు లేవే, మొన్న నా కూతురు ప్రసవించింది కదా, తనకు ఇంకా పాలు పడలేదు, పిల్లాడికి పోతపాలు అరగడం లేదు, నువ్వెలాగూ చంటి బిడ్డ తల్లివే గదా, కొన్నాళ్ళు నా మనవడికి కూడా నీ పాలు పడదామని” చెప్పింది శారదమ్మ.

“పసిపిల్లాడికి ఆకలి తీర్చడానికి పట్టే పాల కోసం మీ దగ్గర డబ్బు తీసుకునే పాపిష్టి దాన్ని కాదమ్మగారూ, నేనూ ఓ చిన్న బిడ్డకు తల్లిని” రంగమ్మ సమాధానానికి చెంపమీద ఎవరో చెళ్లున చరచినట్లనిపించింది శారదమ్మకు.

3. పాస్‌పోర్ట్

“చెప్పండి, ఏదైనా ఫిర్యాదు చేయడానికి వచ్చారా?” ప్రశ్నించాడు సబ్ ఇన్‌స్పెక్టర్ సత్యమూర్తి తన ఎదురుగా కూర్చుని ఉన్న రామకృష్ణను.

“నా కొడుకు పేరు భరత్, వయస్సు పాతికేళ్ళు, వాడిని మీరు ఏదో ఓ కేసులో అనుమానితుడిగా అరెస్ట్ చేసి ఓ నెలరోజులు జైలు శిక్ష పడేలా చేయాలి, మీ ఋణం వుంచుకోను” చెప్పాడు రామకృష్ణ.

“ఎందుకలా?, ఇంతకూ మీ వాడు ఏం చేస్తాడు?” అడిగాడు ఎస్.ఐ

“ఇంజనీరింగ్ చదివాడు సార్, రేపో, ఎల్లుండో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయబోతున్నాడు, అది వాడికి రాకుండా చేయాలి” అన్నాడు రామకృష్ణ.

“పాస్‌పోర్ట్ వస్తే మీకేంటి సమస్య, అయినా స్వంత కొడుకునే తప్పుడు కేసులో ఇరికించమని అడిగే తండ్రిగా నా సర్వీసులో మిమ్మల్నే చూస్తున్నా” అసహ్యం కదలాడింది ఎస్.ఐ కళ్ళలో.

“నా భార్య ఎన్నో గుళ్ళు, గోపురాలు, ఆసుపత్రుల చుట్టూ తిరిగితే పెళ్లయిన పదేళ్ల తరువాత లేక లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు సార్ వాడు, ఉద్యోగం పేరిట అమెరికా వెళ్ళిపోతే వాడి తల్లి కన్నపేగు తట్టుకోలేదు, అందుకే పాస్‌పోర్ట్ రాకుండా అడ్డుకుంటే…” గాద్గదికమయ్యింది రామకృష్ణ గొంతు.

4. స్కూల్ అడ్మిషన్

“ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మా ప్రభుత్వ హయాంలో మీకోసం ఇంకా ఏమైనా చేయాలా?” ఓ మారుమూల గ్రామంలో జరుగుతున్న బహిరంగ సభలో ప్రజల్ని అడిగాడు మంత్రివర్యుడు.

“సర్కారు బడిలో మాకు కూడా ప్రవేశాలు కల్పించండి దొరా” వినయంగా అభ్యర్థించాడొక యాభై ఏళ్ళ పెద్దాయన.

“ఈ వయసులో కూడా చదువుకోవాలనే నీ ఆరాటం మెచ్చుకోదగిందే, దీనిని బట్టి చూస్తే మా పాలనలో రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ నువ్వు ఎందుకు చదువుకోవాలని అనుకుంటున్నావు?” అడిగాడు మంత్రి.

“వానలు రాక, పంటలు పండక, పండిన గిట్టుబాటు ధర లభించక, సాగు కోసం చేస్తున్న అప్పులకు వడ్డీలు చెల్లించుకోలేకున్నాం” చెప్పాడు రైతు.

“దానికీ దీనికీ సంబంధం ఏమిటి?” రెట్టించి అడిగాడు మంత్రి.

“బడిలో చేరితే మధ్యాహ్నం పెట్టే భోజనంతో అన్నా ఒక్కపూట కడుపు నింపుకుందామని” కళ్ళలో ఆశ కదలాడుతుండగా బదులిచ్చాడా పెద్దాయన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here