Site icon Sanchika

వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-22

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. శిక్ష

“పిల్లలూ, ఇవాళ మనం రోజూ మాదిరీ పాఠాలు కాక వేరే ఏవైనా విషయాలు మాట్లాడుకుందామా?” స్టూడెంట్స్‌ను అడిగాడు ఇంటెర్మీడియెట్ ఫస్టియర్ క్లాస్ రూంలోకి అడుగుపెట్టిన తెలుగు లెక్చరర్.

“సరే సార్, అలాగే” ఉత్సాహంగా బదులిచ్చారు విద్యార్థులంతా.

“సరే, మీకు గతజన్మ, మరుజన్మ, పాపపుణ్యాలు, స్వర్గం, నరకం వంటి వాటిమీద నమ్మకం వుందా?” అడిగాడు లెక్చరర్.

“వుంది సార్” చెప్పారు ఎక్కువశాతం మంది విద్యార్థులు.

“పాపపుణ్యాలు ఎలా వస్తాయో తెలుసా?” మళ్ళీ అడిగాడు లెక్చరర్ విజయ్ అనే అబ్బాయిని లేపి.

“మంచి పనులు, పరోపకారం చేస్తే ఫుణ్యం, చెడ్డపనులు చేస్తే పాపం వస్తుంది సార్” చెప్పాడా విధ్యార్థి వినయంగా.

“పాపపుణ్యాల వల్ల ఏం లభిస్తుందో చెప్పగలవా?” అడిగాడు లెక్చరర్ గణేష్ అనే మరో విధ్యార్థిని.

“పుణ్యం వల్ల మనం చనిపోయాక స్వర్గానికి వెళ్ళి అక్కడ సర్వసౌఖ్యాలు అనుభవిస్తాం సార్, అదే పాపం వల్ల అయితే నరకానికి వెళ్ళి యమభటుల చేతుల్లో శిక్షల పేరుతో భరింపరాని ఎన్నో కష్టాలు, తట్టుకోలేని అనేక ఇబ్బందులు పడాల్సివస్తుంది సార్” చెప్పాడా అబ్బాయి తను చూసిన యమలోకపు సీన్లు వున్న ఎన్నో సినిమాలను గుర్తుచేసుకుంటూ.

“స్వర్గం సంగతి నాకు తెలీదుగానీ, గణేష్ చెబుతున్నట్లుగా నరకంలో యమభటులు పెట్టే కష్టాలు, ఇబ్బందులు, ఇప్పుడు బ్రతికుండగానే ఈలోకంలో అన్నదాతలు తమను పట్టించుకోని పాలకులవల్ల, ప్రకృతివైపరీత్యాల వల్ల, దళారులవల్ల పడుతున్న ఇక్కట్లు, అగచాట్లకంటే మరీ భరింపరానివి ఖచ్చితంగా ఎంతమాత్రం కావులెండి సార్” ఉక్రోషంతో చెప్పాడు గిరిబాబు అనే ఓ విధ్యార్థి తన రైతు తండ్రిని తలచుకుంటూ…

2. పుణ్యం కోసం

“అమ్మా, రూపాయో, రెండు రూపాయలో ధర్మం చేసి దయపెట్టు తల్లీ” ఇంటిముందు ఎవరో ముఫైఏళ్ళ యువతి దీనంగా అర్థిస్తోంటే చిరాగ్గా బయటకు వచ్చింది రమ.

“రాత్రి నుండీ బిడ్డ ఆకలికి తట్టుకోలేకపోతోందమ్మా, ఎంతోకొంత దానం చేసి పుణ్యం కట్టుకోండమ్మా” మరోసారి వేడుకుందా యువతి.

“బిడ్డకు ఆకలి అంటున్నావు, పాలు పట్టరాదా, డబ్బులు ఎందుకు అడుక్కోవడం?” సలహా ఇస్తున్నట్లుగా అంది రమ ఆమె చంకలోని గుక్కపట్టి ఏడుస్తున్న నెలల పసికందును గమనిస్తూ.

“నాకు పాలుపడక రొమ్ములు ఎండిపోయి ఈ బిడ్డ పోతపాలతో పెరుగుతోందమ్మా, మీరు ధర్మం చేసే దుడ్లతో హోటల్లో గ్లాసుడు పాలు కొని దాని ఆకలి తీర్చుదామని తల్లీ” చెప్పిందామె ఏడుస్తున్న బిడ్డను వూరడిస్తూ.

“నిన్ను ఇంతకు మునుపు ఈ ఏరియాలో ఎక్కడా చూడలేదే?”అడిగింది రమ ఆ యువతి వంక తేరిపారచూస్తూ.

“మాది ఇక్కడకు చాలా దూరప్రాంతం తల్లీ, నేను అడుక్కు తినేదాన్ని కాదు, కూలిపనుల కోసం ఈ వూరొచ్చాం, వానలు కురుస్తుంటే నాలుగురోజులుగా పనుల్లేవు, కాంట్రాక్టర్ కూలిసొమ్ము ఇవ్వక చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు” చెప్పిందా యువతి.

“చిల్లర లేదు వెళ్ళిరా” చెప్పింది రమ ఇంట్లోకి వెళ్ళబోతూ.

“కనీసం కాసిన్ని పాలు వున్నా ఈ సీసాలోకి పొయ్యి తల్లీ, బిడ్డ గొంతు తడిపితే నీకు పుణ్యం వుంటుంది” మరింత ఆశగా, చాలా దీనంగా అభ్యర్తిస్తూ దండం పెట్టందా యువతి.

“రమా, ఆమె ఆకలితో అల్లాడుతున్న బిడ్డ కోసమని అంతగా అడుగుతోంది, రోజూ మనం తెచ్చుకునే పాకెట్ పాలు వద్దని ఇవాళ మాత్రం అదేపనిగా తెల్లవారుజాము నాలుగునుండీనే నన్ను ఎక్కడెక్కడో తిప్పి ఆవుపాలు తెప్పించుకున్నావుగా, కాసిన్ని పోయరాదా”అన్నాడు అప్పుడే బయటకు వచ్చిన వెంకట్ భార్యతో.

“అయ్యయ్యో, కళ్ళు పోతాయ్,మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా, ముందు ఇంట్లోకి వెళ్ళండి, అవి ఇవాళ నాగులచవితి పండుగ అని ‘పుణ్యం కోసం’ గుడికి వెళ్ళి నాగదేవత కోసం పుట్టలోకి పోయడానికి తెప్పించుకున్న పాలు అనే సంగతి తెలిసి కూడా ఉచితసలహా ఇస్తున్నారే” గుడ్లురుముతూ భర్తను తీవ్రంగా కసురుకుంటూ ఇంట్లోకి దారి తీసింది రమ భక్తితో కళ్ళు మూసుకుని చెంపలు వాయించుకుంటూ.

3. సాంప్రదాయం

“శాస్త్రిగారూ, డబ్బు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, నాన్నగారి అంతిమసంస్కారాలన్నీ ఎంత చిన్నదయినా ఏ ఒక్కటీ వదలకుండా పూర్తి సాంప్రదాయబద్దంగానే జరిపించండి, ఆయన ఆత్మకు శాంతి కలగడమే నాకు కావాల్సింది” చెప్పాడు అనారోగ్యంతో రెండురోజుల క్రితం మృతి చెందిన తండ్రి అంత్యక్రియలు జరిపించేందుకు ఆరోజు ఉదయమే ఆమెరికా నుండీ స్వంత ఊరు చేరుకున్న వెంకట్.

“సరేనండీ, అలాగే, ఈ జాబితాలోని సరంజామా మొత్తం తెప్పించండి మరి” చెప్పాడు శాస్త్రి ఓ పొడవాటి కాగితాన్ని వెంకట్‌కు అందిస్తూ.

“శాస్త్రిగారూ, మరోసారి చెబుతున్నా, ఈ విషయంలో ఏ చిన్న లోటు కూడా రానీయకండి” సెంటిమెంట్ ఫీలవుతూ మళ్ళీ చెప్పాడు వెంకట్.

సాయంత్రం నాలుగుగంటల వేళ….

“అయ్యా, మీ తండ్రిగారి మహాప్రస్థాన యాత్రకు సరిగ్గా మరో పదినిముషాల్లో ఏర్పాట్లు మొదలుపెట్టాలి, ఆలస్యం చేస్తే దుర్ముహూర్తం ముంచుకొచ్చేస్తుంది, నేను ఇచ్చిన జాబితాలోని సరంజామా అంతా వచ్చిందిగానీ కుండ మాత్రం రాలేదు”హడావుడి పడుతూ వెంకట్ తో చెప్పాడు శాస్త్రి.

“సురేంద్రా, శాస్త్రిగారు ఇచ్చిన జాబితాలో కుండ రాసివుందట, తీసుకురాలేదా?” కంగారుగానూ, కాస్తంత చిరాగ్గానూ అడిగాడు వెంకట్ ఆ వ్యవహారాలన్నీ చూస్తున్న తన బావమరిదిని.

“కుండ కోసమే అదేపనిగా ఇప్పటిదాకా ఈ చుట్టుప్రక్కలవున్న సుమారు పది పల్లెలు చుట్టివచ్చా బావా, ఎక్కడా దొరకలేదు, ఏ పల్లెలోనూ కుండలు తయారుచేయడంలేదట” నిస్సహాయంగా చెప్పాడు సురేంద్ర.

“మన ఊళ్ళోనే కుండలు తయారుచేసే సుబ్బయ్య వుండాలే, లేడా?”అడిగాడు వెంకట్.

“మీరు చాలా ఏళ్ళుగా అమెరికాలోనే వుండి మీకు పెద్దగా తెలీదేమోగానీ గత పదేళ్ళకాలంగా మనలాంటి అతి మారుమూల పల్లెల్లోకూడా రిఫ్రిజిరేటర్ల వాడకం మొదలయ్యాక తాము చేస్తున్న కుండలకు బొత్తిగా గిరాకీలేక చాలామంది కుమ్మరులు పొట్టకూటికోసం పల్లెలను వదిలేసి పిల్లా, జెల్లాతో సహ కూలీలుగా

పట్నాలకు వలస వెళ్ళిపోయారయ్యా” వెంకట్‌తో చెప్పాడు అక్కడేవున్న అతడికి చిన్నాన్న వరుసయిన ఓ పెద్దాయన విచ్చలవిడిగా పెరిగిన యాంత్రీకరణ వల్ల విధ్వంసమైన సాంప్రదాయ గ్రామీణ చేతి వృత్తులను తలచుకుని నిట్టూర్పు విడుస్తూ.

4. ఫోటో

14.ఫిబ్రవరి.2020…..

“పరంధామయ్యగారూ, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేసి మాతో సంబంధం కలుపుకోవడానికి మేము లక్షల్లో కట్నకానుకలు, బంగారం అడుగుతామని ఆందోళన చెందుతున్నారేమో,మాకు ఒక్క పైసా కూడా అవసరం లేదుగానీ పెళ్ళి మాత్రం మా స్థాయికి తగినట్లుగా పదిమందీ ఘనంగా చెప్పుకునేలా చేయిస్తే చాలండీ” చెప్పాడు నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రంగారావు.

“రంగారావు గారూ, మా సంబంధం మీకు నచ్చడం, పైగా మీరు ఏ కట్నకానుకలూ అవసరం లేదని చెప్పడం మీ మంచి మనసును నిదర్శనమండీ” వినయపూర్వకంగా అన్నాడు పరంధామయ్య.

“కానీ పరంధామయ్య గారూ, ఓ చిన్నమాట, నగరంలోని చాలామంది వి.వి.ఐ.పి.లు వస్తారు కాబట్టి పదిమందీ గొప్పగా చెప్పుకునేలా పెళ్ళి మాత్రం ఓ పదిలక్షల ఖర్చుతో కాస్తంత ఘనంగా జరిపిస్తే చాలండీ, ఆలోచించుకుని ఏ మాటకూ కబురు చేయండి” చెప్పాడు రంగారావు లేచి బయలుదేరుతూ.

“దేవుడి దయవల్ల చాలా మంచి సంబంధమే కుదిరింది,కానీ..”

“పి.ఎఫ్.లోనుతో సహా పిల్లల చదువులకోసం చేసిన అప్పులే తీరలేదు, మళ్ళీ అంత అప్పు ఎవరిస్తారు, ఈ సంబంధం వద్దులే” నిరాశగా అన్నాడు పరంధామయ్య ఆ రోజు రాత్రి దిగులుగా వున్న భార్య లక్ష్మిని ఓదారుస్తూ.

04 జూన్.2020 ……..

“లక్ష్మీ, ఈ ఫోటోను జాగ్రత్తగా దేవుడి గదిలో పెట్టు” కాగితంలో చుట్టివున్న ఓ పెద్ద ఫ్రేం కట్టిన పార్శిల్ ను భార్యకు అందిస్తూ చెప్పాడు ఆఫీసు నుండీ ఇంటికి వచ్చిన పరంధామయ్య.

“ఇదేంటండీ, కరోనా క్రిమి బొమ్మను పటంగా చేయించుకొచ్చారు, పైగా ఏకంగా దేవుడి గదిలో పెట్టమంటున్నారు?” భర్త వాలకం అర్థం కాక అయోమయంగా చూస్తూ అడిగింది లక్ష్మి.

“ఇవాళ ఉదయం రంగారావు గారు ఫోన్ చేశారు, మన సంబంధం వాళ్ళకు మరీ బాగా నచ్చిందట, ఈ కరోనా మహమ్మారి వల్ల ఎవ్వరుగానీ పెళ్ళిళ్లు గ్రాండ్‌గా జరపడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు గాబట్టి ఈ నెల పద్నాలుగున వున్న మంచి ముహూర్తంలో ఏ హంగూ, ఆర్భాటం లేకుండా ఓ నలభైమందితో సింపుల్‌గా పెళ్ళి జరిపించేయమని మరీ ఒత్తిడి చేస్తున్నారు” చెప్పాడు పరంధామయ్య భార్యతో ఆ ఫోటో ఎందుకు తెచ్చానో అర్థం చేసుకోమన్నట్లుగా మెల్లగా నవ్వేస్తూ.

Exit mobile version