Site icon Sanchika

వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-25

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. తృప్తి

“లలితగారూ, సామాన్లన్నీ సర్దేసుకున్నారా?” నాలుగు రోజుల క్రితమే తమ ప్రక్కింట్లో అద్దెకు దిగిన లలితను అడిగింది పద్మజ.

“ఇంకా కాలేదండీ” చెప్పింది లలిత.

“అన్నయ్య గారిని శెలవు పెట్టమనరాదా, కాస్తంత తోడుగా వుండేవారు కదా?” అంది పద్మజ.

“వర్క్ చాలా వుందటండీ, శెలవు పెట్టడానికి కుదరలేదట” సమాధానమిచ్చింది లలిత.

“అయ్యో, మరి సామాన్లు పూర్తిగా సర్దుకునేంతవరకు హోటల్ తిండి తప్పదనుకుంటా” అంది పద్మజ.

“అవునండీ, ఆ ఎదురింట్లో వుంటున్న పెద్దావిడతో పాటు ఎవరెవరు వుంటారు?” అడిగింది లలిత.

“ఆవిడ ఒక్కరే వుంటారు” చెప్పింది పద్మజ.

“వయస్సు సుమారుగా అరభై దాటినట్లుంది, ఒంటరిగా వుండడం కంటే, ఎవరైనా అయినవాళ్ళ దగ్గర వుండొచ్చుగదా” అంది లలిత.

“ఆవిడకు నా అనేవాళ్ళు ఎవరూ లేరండీ పాపం”చెప్పింది పద్మజ.

“మరయితే ఈ ఇంట్లోకి దిగిన నాలుగు రోజుల నుండీ గమనిస్తున్నా, ఎప్పుడు చూసినా చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఎవరితోనో చాలా బిజీగా మాట్లాడుతున్నట్లుంటుందే?” అడిగింది లలిత సందేహంగా.

“తనకొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలతో రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో క్రమంతప్పకుండా మాట్లాడుతుందండీ” చెప్పింది పద్మజ.

“ఎవరూ లేరన్నారు, మళ్ళీ కొడుకు, కోడలు అంటున్నారేంటి?” అర్థం కానట్లుగా అడిగింది లలిత.

“ఆ పెద్దావిడ కొడుకు, కోడళ్ళు హైదరాబాద్‌లో ఆఫీసర్లుగా పని చేసే వాళ్ళండీ, వాళ్ళంటే ఆవిడకు చాలా ప్రేమ. ఆవిడను తమ వద్దకే వచ్చేయమంటే ఎందుకో ఈవిడే వెళ్ళలేదు, ఈవిడను చూసేందుకు వాళ్ళంతా కారులో వస్తుండగా, మీరు రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుందని ఈవిడ కాల్ చేస్తే, కొడుకు డ్రైవింగ్ చేస్తూనే ఎదురుగా చూసుకోకుండా జవాబు చెబుతూ కంట్రోల్ తప్పి జరిగిన ప్రమాదంలో నలుగురూ అక్కడే చనిపోతే ఆవిడకు మతి భ్రమించి ఇలా మాట్లాడుతూ, వాళ్ళు వున్నట్లు తృప్తి పడుతోందండీ” చెప్పింది పద్మజ మాటల్లో సానుభూతి వ్యక్తంచేస్తూ…

2. జాలీ ట్రిప్

“ఏమండీ, రోజూ ఆరింటికే వచ్చేసేవారు, ఈమధ్య ఆఫీసులో వర్క్ ఎక్కువగా వుందా?” అడిగింది మాలతి సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో ఆఫీసు నుండీ ఇంటికి వచ్చిన భర్తను.

“ఏం లేదు, ఆఫీసు నుండీ అయిదుకే బయలుదేరా, మధ్యలో స్కూటర్ ట్రబులిస్తే మెకానిక్ దగ్గరకు వెళ్ళి వస్తున్నా” తన ఆలస్యానికి కారణం చెప్పాడు సుధాకర్ భార్యకు.

“అయ్యో, నాలుగు రోజుల క్రితం కూడా ఓసారి ఇలాగే జరిగినట్లు చెప్పారు” అంది మాలతి.

“పదిహేనేళ్ళ క్రితం కొన్నది, ఇంకా క్రొత్తదానిలాగే ఎలా పని చేస్తుంది?” అన్నాడు సుధాకర్.

“ఆ డొక్కు స్కూటర్ ప్రక్క పడేసి క్రొత్తది కొనుక్కోండి” భర్తకు సలహా ఇచ్చింది మాలతి.

“మొన్న వచ్చిన లోను మొత్తాన్ని పిల్లాడి ఇంజినీరింగ్ సీటు కోసం కట్టేసాగా, మళ్ళీ ఎక్కడినుండీ తేను?, మరో రెండేళ్ళన్నా దీనితోనే వేగక తప్పదు” అన్నాడు సుధాకర్ నిరాశగా.

“మరో రెండు వారాలు ఆగండి, మీ స్కూటర్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది” చెప్పింది మాలతి.

“ఎలా?” అడిగాడు సుధాకర్.

“ఎప్పటినుండీనో పెండింగ్‌లో వున్న మా వేతనసవరణ సెటిల్ అయిందట, నాకు అరియర్స్ లక్ష దాకా వస్తాయి, ఆ డబ్బుతో మీ బర్త్ డే గిఫ్ట్‌గా తీసుకుందురుగానీ” చెప్పింది మాలతి.

“థ్యాంక్యూ సోమచ్ మాలతీ” భార్యను గట్టిగా కావలించుకున్నాడు సుధాకర్.

సరిగ్గా ఏడాది తర్వాత…..

“ఏమండీ, ఎల్.ఐ.సి.పాలసీ మెచ్యూర్ అవుతోంది కదా, ఏమాత్రం వస్తుందేమిటి?” అడిగింది మాలతి.

“ఒకటిన్నర లక్ష దాకా వస్తోంది, అయినా ఎందుకు అడిగావు?” ప్రశ్నించాడు సుధాకర్.

“మరేంలేదు, మన పెళ్ళప్పుడు మా పుట్టింటివాళ్ళు నాకు చేయించిన నగలన్నీ మీ చెల్లెలి పెళ్ళి కోసం తాకట్టు పెట్టినప్పటి నుండీ మెడలో సన్నపాటి గొలుసు కూడా లేక మన బంధువుల పెళ్ళి ళ్ళు, ఫంక్షన్లకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా వుంది, ఇప్పుడు మీకు వచ్చే ఎల్.ఐ.సి.సొమ్ముతో చిన్న గొలుసు చేయించుకుంటానండీ” అడిగింది మాలతి భర్తను.

“ఆ సొమ్ము మీద అప్పుడే కన్నేసావా?, నువ్వు ఏం అనుకున్నా ఫర్వాలేదు, ఒక్క నయాపైసా కూడా ఇవ్వను, ఆఫీసు కొలీగ్స్‌తో కలిసి వారం రోజులు జాలీగా సింగపూర్ ట్రిప్ వెళ్ళిరావడానికి టికెట్ కూడా బుక్ చేసేయమని ఓ ఫ్రెండ్‌కు నిన్ననే చెప్పేసా, ఆ అమౌంట్ మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకు” నిర్మొహమాటంగా చెప్పాడు సుధాకర్ ఆఫీసుకు వెళ్ళేందుకు స్కూటర్ స్టార్ట్ చేస్తూ…

3. కోపం

“రజనీ, ఈ మధ్య నువ్వు చేస్తున్న అశ్రద్ధ, నిర్లక్ష్యం పనులవల్ల చిరాకు మరీ ఎక్కువవుతోంది” బజారు నుండీ ఇంట్లోకి రాగానే భార్యమీద కోపంతో గుర్రుమన్నాడు నాగేంద్ర.

“ఎందుకండీ అంతలాకోపంగా వున్నారు?” అడిగింది రజని భర్తను.

“గత కొంతకాలంగా గమనిస్తున్నా, నీకు ఏవైనా ఇంట్లోని వస్తువులన్నా, డబ్బు అన్నా అస్సలు విలువ లేకుండాపోతోంది” అన్నాడు నాగేంద్ర.

“మీ కోపానికి కారణం ఏమిటో చెబితే కదా తెలిసేది” అంది రజని.

” వెళ్ళి వీధి చివరన చెత్తకుండీలో చూసిరా, తెలుస్తుంది”చెప్పాడు నాగేంద్ర.

“ఏంటో మీరే చెప్పరాదా?”అడిగింది రజిని.

“నాలుగు నెలలకు మునుపు పాపకు బర్త్‌డే గిఫ్ట్‌గా ఫలానా బొమ్మే కావాలని పట్టుబట్టి మరీ తెప్పించావా, వెయ్యి రూపాయలకు పైగా ఖర్చుపెట్టి సిటీ అంతా తిరిగి తెస్తే ఇప్పుడు దాన్ని ఎందుకు ముక్కలుగా విరిచి చెత్తకుండీ పాలుచేసావ్?” ప్రశ్నించాడు నాగేంద్ర.

“అయ్యో, నాకు తెలీదు కదండీ, అయితే ఇది మన గడుగ్గాయి పనే అయివుంటుంది, చెత్తకుండీలోకి ఎలా చేరిందబ్బా” అంది రజని.

“ఇంతకూ మహరాణిగారిని ఎక్కడకు పంపావ్?” ఇంట్లో ఎక్కడా కనిపించిన కూతురి గురించి అడిగాడు నాగేంద్ర.

“ప్రక్కింటి పింకీతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళిందండీ” జవాబిచ్చింది రజని.

సరిగ్గా ఓ పదినిముషాల తర్వాత….

“చిన్నీ, నీ పుట్టినరోజు గిఫ్ట్‌గా తీసిచ్చిన బొమ్మను ఎందుకురా అంతలా విరిచి మరీ చెత్తకుండీలో పడేశావ్?” ఇంట్లోకి వచ్చిన ఎనిమిదేళ్ళ కూతురును అడిగాడు నాగేంద్ర ఒళ్ళోకి తీసుకుంటూ.

“అదంటే నాకు ఇష్టం లేదు నాన్నా, మా క్లాసులో నా బెస్ట్ ఫ్రెండ్ సుజీ నీకు తెలుసుగా, వాళ్ళ డాడీ మిలిటరీలో పనిచేసేవాడు కదా, ఆ అంకుల్ను డ్యూటీ చేస్తుంటే చైనా దేశం వాళ్ళు చంపేశారట, ఇకపై తనకు డాడీ లేడని చాలా ఏడుస్తూ చెప్పింది, అందుకనే ఆ దేశంలో తయారైన బొమ్మ కాబట్టి నేను కూడా నా ఫ్రెండ్ కోసం దాన్ని ముక్కలుగా విరిచి చంపి పడేసా” చెప్పింది మాటల్లో కోపం ధ్వనిస్తుండగా.

4. క్విజ్ ప్రోగ్రాం

“డియర్ పార్టిసిపెంట్స్, వన్స్ అగైన్ వెల్ కం టు మేధ 2020, ఈ చివరి రౌండ్‌లో ఒక్కో గ్రూపును ఒక్కో ప్రశ్న అడగడం జరుగుతుంది, గత మూడు నెలలుగా జరుగుతున్న ఈ పోటీల్లో విజేతలెవరో తేల్చే రౌండ్ కూడా ఇదే” రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు క్షణం కూడా రెప్పవేయకుండా తమ ఇళ్ళలో టి.వి.లకు కళ్ళప్పగించి చూస్తుండగా చెప్పాడు ఓ ప్రతిష్ఠాత్మక టెలివిజన్ చానెల్ తరపున రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్న క్విజ్ మాస్టర్.

“సరే సార్” ఉత్సాహంగా చెప్పారు క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న స్టూడియోలోని పిల్లలంతా.

“మొదటి ప్రశ్న,’ఏ’ గ్రూపుకు. తెలంగాణా రాష్ట్ర రాజధాని ఏది?” బజర్ నొక్కి ప్రశ్నించాడు క్విజ్ మాస్టర్.

“హైదరాబాద్ సార్” ఉత్సాహంగా చెప్పాడు ‘ఏ’ గ్రూపులోని ఓ అబ్బాయి.

“కరెక్ట్ ఆన్సర్, ఇప్పుడు రెండవ ప్రశ్న గ్రూపు ‘బి’ వాళ్ళకు. విజయవాడలో కనకదుర్గమ్మ కొలువైన కొండ పేరు ఏది?” అడిగాడు క్విజ్ మాస్టర్ ఏం అడుగుతాడా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.

“ఇంద్రకీలాద్రి” రెట్టించిన సంతోషంతో జవాబిచ్చింది ‘బి’ గ్రూపులోని ఓ అమ్మాయి.

“రైట్ ఆన్సర్, ఇప్పుడు వేయబోయే ప్రశ్న గ్రూపు ‘సి’ వాళ్ళకు. ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏది?” అడిగాడు క్విజ్ మాస్టర్ స్కోర్ బోర్డ్ వైపు చూపు సారించి బజర్ ప్రెస్ చేసి.

“అమరావతి సార్” మరింత గట్టిగా అరిచి చెప్పాడు ‘సి’ గ్రూపులోని ఓ విద్యార్థి మిగతా గ్రూపుల స్కోరు తమకంటే తక్కువ వుండడాన్ని గమనిస్తూ.

“ఓకే పార్టిసిపెంట్స్ అండ్ వ్యూయర్స్, ఇది ఈ క్విజ్ ప్రొగ్రాం విజేతలు ఎవరో తేల్చిచెప్పే చిట్టచివరి ప్రశ్న” అందరినీ టెన్షన్ లోకి నెడుతూ బోర్డుమీది గ్రూపుల స్కోరు చదివాడు క్విజ్ మాస్టర్ ప్రతిఒక్కరూ ‘ఎంగిలి’ మింగడం కూడా మాని నరాలు తెగే ఉత్కంఠతో చూస్తుండగా.

“ఇప్పుడు ప్రశ్న గ్రూప్ ‘డి’ వాళ్లకు. ఏ ప్రాంతాన్ని రాయలసీమ అంటారు?” అడిగాడు క్విజ్ మాస్టర్ చేతులకు వున్న కోటు రట్టలు సవరించుకుంటూ.

“కరువు, ఎండిన వాగులు, వంకలు, బావులు, చెరువులు, బోర్లు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు ప్రతినిత్యం వుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దశాబ్దాల కాలంగా మరీ వెనుకబడిన ఓ ప్రాంతాన్ని సార్” కళ్ళనిండా నీళ్ళు వుబుకుతుండగా చాలా నెమ్మదిగా సమాధానమిచ్చాడు బెంగుళూరుకు దినసరి కూలీగా వలస వెళ్ళిన ఓ రైతు ఎనిమిదో తరగతి చదివే కొడుకు.

Exit mobile version