Site icon Sanchika

వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-27

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. బత్యం

“అయ్యా, ఏదైనా పనివుంటే ఇప్పించండయ్యా” సిటిలో ఐదంతస్తుల భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో వున్న మేస్త్రీని అడిగాడు ఓ యాభయ్యేళ్ళ పెద్దాయన.

“ఏం పని చేయగలవు?” అడిగాడు మేస్త్రీ పెద్దాయన వంక ఎగాదిగా చూస్తూ.

“ఈ కట్టడం పనుల్లోనే ఏదో ఒక పని చెప్పండయ్యా, చేసుకుంటా” బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు పెద్దాయన.

“ఇప్పుడు గంట తొమ్మిదవుతోంది, పని కావాలంటే ఎనిమిదికే రావాలి, రేపు రాపో చూద్దాం” చెప్పాడు మేస్త్రీ.

“పల్లె నుండీ రావడానికి బస్సు ఆలశ్యమయ్యిందయ్యా, తిరిగి ఖాళీగా వెళ్ళలేను, వెళ్ళేటప్పుడు రాత్రికి ‘బత్యం’ తీసుకుపోవాలి” ప్రాధేయపడ్డాడు పెద్దాయన ఇంటివద్ద పస్తువున్న భార్యాపిల్లలను, మరుసటి రోజున స్టోర్‌లో ఇవ్వబోయే రేషన్‌ను గుర్తు చేసుకుంటూ.

“సరే, అంతగా అడుక్కుంటున్నావు, గంట ఆలశ్యం అయ్యింది కాబట్టి ఈ రోజుకు సగం కూలీ మాత్రమే ఇస్తాను, చేస్తావా?” అడిగాడు మేస్త్రీ.

“సరేనయ్యా, అలాగే” ఒప్పుకున్నాడు పెద్దాయన.

సాయంత్రం నాలుగన్నర గంటల సమయంలో, మరో అరగంటలో ఆ రోజు పని ముగిసిపోతుందనగా….

“పెద్దాయనా, ఇలా రావయ్యా” క్రిందనుండీ ఐదో అంతస్తులోకి ఇటుకలు మోస్తున్న పెద్దాయనను పిలిచాడు మేస్త్రీ.

“చెప్పండయ్యా” అన్నాడు పెద్దాయన.

“ఈ వీధి చివరలోవున్న బ్రాందీషాపుకు వెళ్ళి ఓ క్వార్టర్ విస్కీ, ఇరభై రూపాయలకు బజ్జీలు తీసుకురా” చెప్పాడు మేస్త్రీ జేబులో నుండీ ఐదు వందలు నోటు తీసి అందివ్వబోతూ.

“అలాంటి పనులు నాకు చెప్పొద్దయ్యా, నేను చెయ్యను” చెప్పాడు పెద్దాయన.

“ఏరా, ముసలోడా, పోనీ పాపం అని జాలిపడి పని ఇస్తే, నేను చెప్పిన పనే చెయ్యనంటావా, నీకు కూలి ఇచ్చేది లేదు, నీ దిక్కున్నచోట చెప్పుకోపో, అంత పరువుగా బ్రతికేవాడివి, ఇంతకూ ఏం పని చేస్తావురా?” కోపంగా అడిగాడు మేస్త్రీ.

“నేను రైతునయ్య, అలాంటి పనులు మాత్రం నాకు చెప్పొద్దు, చేయను, వానలు కురవక పంటలు పండక ఇలాంటి పనులకు వచ్చా, కూలి పనులు చెప్పండి, ఎంత కష్టమైనవైనా చేస్తా” చెప్పాడు పెద్దాయన బాధగా బయటకు నడుస్తూ…

2. పునాది

“శకుంతలా, నీ ముద్దుల కొడుకు ఉదయాన్నే టింగురంగా అంటూ ఎక్కడికో బయలుదేరడానికి రెడీ అవుతున్నట్లున్నాడే?” అడిగాడు సర్పంచ్ భూషణయ్య భార్యను.

“భార్యను లేడీ డాక్టర్ దగ్గర చూపించడానికి టౌనుకు వెళుతున్నాడండీ” బదులిచ్చింది శకుంతల.

“ఒంట్లో ఏం బాగాలేదట?” అడిగాడు భూషణయ్య.

“అయ్యో, అదేం కాదండీ,మా ఆడవాళ్ళ వ్యవహారాలు మీకు చెప్పడం ఎందుకని చెప్పలేదుగానీ, అమ్మాయి ఇప్పుడు ఒట్టి మనిషి కాదు, అందుకే చెకప్ చేయించడానికి తీసుకెళుతున్నాడు” చెప్పిందామె.

“కొంప ముంచావు కదే, ఈ విషయం చెప్పకుండా దాచి, ఎన్నో నెలట ఇప్పుడు?” భార్య సమాధానం వినగానే వెంటనే చాలా కంగారుగానూ, కోపంగానూ అన్నాడు భూషణయ్య .

“నాలుగో నెల” జవాబిచ్చిందామె.

“వెంటనే అబార్షన్ చేయించుకుని రమ్మను” హుకుం జారీచేశాడు భూషణయ్య.

“ఎందుకండీ?, తొలి కానుపులో కవలలుగా ఇద్దరూ మగపిల్లలే పుట్టారు కదా, ఈసారి ఆడపిల్ల పుట్టనీయండి, ఇంటికి లక్ష్మీదేవి శోభ వస్తుంది” అంది శకుంతల కాస్తంత ధైర్యం చేసి.

“వాడికి ఇక పిల్లలు అక్కరలేదు, కోడలును అబార్షన్‌తో పాటూ ఆపరేషన్ కూడా చేయించేసుకోమను” ఆర్డర్ వేసాడు భూషణయ్య.

“మరో పిల్ల పుడితే మనం పోషించుకోలేమా, మీరు రాజకీయాల్లోనూ, కాంట్రాక్టుల్లోనూ, వ్యాపారం, వ్యవసాయాల్లో రెండు చేతులా సంపాదిస్తోంది చాలదా?” అడిగింది శకుంతల.

“కోడలు మరో పిల్లనో, పిల్లాడినో కంటే ఆ పుట్టే బిడ్డ మనవాడి రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా చంపేసినట్లే, చెప్పినా నీకివన్నీ అర్థం కావు, మరో ఆరు నెలల్లో జరగబోయే పంచాయితీ ఎలక్షన్లలో ఈసారి నాకు బదులుగా వాడినే పోటీ చేయిస్తున్నా, నువ్వే దగ్గరుండి రేపు సాయంత్రం లోగా అబార్షన్, ఆపరేషన్ పనులు చూడు” మరో మాటకు తావులేదన్నట్లుగా భార్యను ఆదేశించాడు భూషణయ్య కోడలు కడుపులో పెరుగుతున్న ప్రాణిని నిర్దాక్షిణ్యంగా సమాధి చేస్తూ, కొడుకు రాజకీయ జీవితానికి ‘పునాది’ వేస్తూ.

3. మ్యాప్ పాయింటింగ్

“విపులా, బాగా చదువుకున్నావు కదమ్మా?” ఉదయం తొమ్మిది గంటల వేళ మరో అరగంటలో పరీక్షాకేంద్రానికి బయలుదేరడానికి తయారవుతున్న కూతురును అడిగింది రుక్మిణి.

“చదువుకున్నానమ్మా” తల్లికి జవాబిచ్చింది విపుల హాల్ టికెట్, ఎగ్జాం ప్యాడ్, పెన్నులు సర్దుకుంటూ.

“ఇవాళే కదా చివరి పరీక్ష?” మళ్ళీ అడిగింది రుక్మిణి కూతురికి కాఫీ గ్లాసు అందిస్తూ.

“అవునమ్మా” చెప్పింది విపుల.

“బాగా రాయమ్మా, మీ నాన్నను కాళ్ళా వేళ్ళాపడి బ్రతిమలాడి ఎలాగైనా ఒప్పించి నిన్ను కాలేజీలో చేర్పిస్తా, నువ్వు నాలా కాకుండా బాగా చదువుకుని చిన్న ఉద్యోగం సంపాదించుకుని ప్రతిదానికీ మొగుడి మీద ఆధారపడకుండా నీ కాళ్ళమీద నువ్వు నిలబడుదువు” కూతురి భుజం తడుతూ అంది రుక్మిణి.

“సరేనమ్మా, అలాగే”అంది విపుల తల్లివైపు అదోలా చూస్తూ.

“ఇవాళ చివరి పరీక్ష కదా, స్నేహితురాళ్ళమంతా మళ్ళీ ఎప్పుదు కలుస్తామో, అందరితో కలిశాక ఇంటికి కాస్తంత ఆలశ్యంగా వస్తానమ్మా, వెళ్ళొస్తా” చెప్పింది విపుల గడప దాటుతూ.

“అలాగేనమ్మా, జాగ్రత్త, మీ నాన్న గారు రాకముందే త్వరగా ఇల్లు చేరుకో” కాస్తంత భయంగా చెప్పింది రుక్మిణి కూతురికి.

మధ్యాహ్నం, పన్నెండున్నర గంటల ప్రాంతంలో….

“విపులా, ఇలా రా, ఎలా రాశావు ఇవాళ పరీక్ష?” ఎగ్జాం హాల్ లోనుండీ అప్పుడే బయటకు వచ్చిన విపులను అడిగింది అక్కడేవున్న పదో తరగతి సోషియల్ టీచర్ రాజ్యలక్ష్మి.

“బాగా రాశా మేడం” సమాధానమిచ్చింది విపుల తన స్నేహితురాళ్ళ కోసం చుట్టూ పరికిస్తూ.

“అవును, మ్యాప్ పాయింటింగ్‌లో సప్త సముద్రాలు ఎక్కడెక్కడున్నాయో గుర్తించమన్నారు కదా, సరిగ్గానే గుర్తించావా? అడిగిన ప్రశ్నకు పూర్తి మార్కులు వచ్చే చాన్స్ ఒక్క మ్యాప్ పాయింటింగ్ లోనే వుంది” మళ్ళీ అడిగింది రాజ్యలక్ష్మి టీచర్.

“ఏమో టీచర్, వాళ్ళిచ్చిన ఖాళీ మ్యాప్ నిండుగా మా అమ్మ మొహాన్ని చక్కగా గీసేశా” జవాబిచ్చింది విపుల తను ఈ పదో తరగతి వరకు చదవడానికైనా తన తల్లి తనకు చదువే వద్దన్న తండ్రితో ఏడాది కాలంగా రోజూ పోట్లాడి ఎన్నిసార్లు చీవాట్లు, దెబ్బలు తిని భరింపరాని నిత్య హింసను అనుభవిస్తూ, ఎన్నో బడబానలాల్ని లోలోపల దాచుకున్న సముద్రాల్ని కడుపులో పెట్టుకుని మౌనంగా భరించిందో గుర్తు చేసుకుంటూ.

4. సమాధానం

“ఏమండీ, పద్నాలుగేళ్ళుగా ఒంటికాలి మీద ఘోరంగా తపస్సు చేస్తున్న ఎవరో భక్తుడిని అనుగ్రహించడానికని వెళ్ళారు, ప్రయాణం సుఖంగానే జరిగింది కదా?” అప్పుడే కైలాసంలోకి అడుగు పెట్టిన పతిదేవుడు శివయ్యను అడిగింది పార్వతీదేవి.

“బాగానే జరిగింది” జవాబిచ్చాడు శివుడు.

“ఆ భక్తుడు ఏం వరం కోరాడో?” ప్రశ్నించింది పార్వతి.

“కాస్తంత అసాధ్యమైన కోరికే “సమాధానమిచ్చాడు శివయ్య.

“అనుగ్రహించేశారా?”మరో ప్రశ్న వేసింది అమ్మవారు.

“భూలోకంలో నాకు భోళాశంకరుడని పేరే పెట్టేశారు, అనుగ్రహించక తప్పదు” చెప్పాడు శివుడు.

“అడిగిందే తడవుగా ఇప్పటిదాకా మీరు ఇచ్చిన అన్ని వరాలూ ఎందరికో ఎన్నో చిక్కులు తెచ్చినట్లు ఈ వరం కూడా ఎవరిని ఎలా ఇబ్బందుల పాలు చేస్తుందో పాపం” అంది పార్వతీదేవి.

“అవన్నీ చూసుకునేందుకు విష్ణుమూర్తి వున్నాడులే” అన్నాడు శివుడు.

“ఇదేం న్యాయమండీ, యుగయుగాలుగా గమనిస్తున్నా, భక్త సులభుడు అనే పేరు కోసం అనాలోచితంగా వరాలు ఇచ్చేసి చిక్కులు తెచ్చేది మీరు, అవి తీర్చడానికి ఎన్నో వేషాలు వేసి నానా కష్టాలు పడేది మా అన్నయ్యనా?” అడిగింది పార్వతి.

“అందుకేగా ఆయన గారు దశావతారాలెత్తి అన్ని రూపాల్లోనూ పూజలందుకుంటున్నది, నాదేముంది అయితే లింగం గానో, కాకుంటే విగ్రహంగా మాత్రమే కదా” చెప్పాడు శివుడు.

“అవునండీ, ఇందాకటినుండీ గమనిస్తున్నా, మీ వదనం ఎందుకో చిన్నబోయినట్లుంది, ఇంతకీ నెత్తిమీద మీ ముద్దుల గంగమ్మ లేదే, ఎక్కడికి పోయిందో?” అడిగింది పార్వతి భర్త మొహంలోకే అదేపనిగా చూస్తూ.

“అనేక యుగాలుగా నా నెత్తిమీదనే కాపురం వుండి విసుగేసింది కాబోలు, మార్పు కోసం భూలోకం చేరినట్లుంది” చెప్పాడు శివుడు.

“మీకెలా తెలిసింది?” అడిగింది పార్వతి.

“తరచూ భక్తుల కోసం భూమి మీదకు వెళుతుంటానా, అక్కడి ‘మగువ’ల కళ్ళు క్షణం కూడా తీరిక లేకుండా, తడి ఆరక, పొడిబారక, ఎప్పుడూ జాలువారుతున్నట్లుంటేనూ, ఆ మాత్రం చెప్పలేమా?” సమాధానమిచ్చాడు శివుడు.

Exit mobile version