వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-29

0
1

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. రేటు

“ఏం సుబ్బయ్యా, ఎలా వున్నావు?” అడిగాడు వీరారెడ్డి ఓ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో సుబ్బయ్యను తన ముఖ్య అనుచరులతో పాటుగా అతడి ఇంటి వద్ద కలిసి.

“బాగున్నానయ్యా” బదులిచ్చాడు సుబ్బయ్య .

“నీ భార్య అలివేలు ఎలా వుంది?” మళ్ళీ అడిగాడు వీరారెడ్డి ఇంట్లోకి తొంగి చూస్తూ.

“తను కూడా బాగుందయ్యా” చెప్పాడు సుబ్బయ్య.

“అవును సుబ్బయ్యా, ఇప్పుడు మీ అమ్మా, నాన్నలు కూడా నీతోనే వుంటున్నారట కదా?” మరో ప్రశ్న వేశాడు వీరారెడ్డి.

“ఔను సామీ”అన్నాడు సుబ్బయ్య.

“క్రితం సారి కలిసినప్పుడు నీకు ఇద్దరు పిల్లలని చెప్పినట్లు గుర్తు, వాళ్ళు ఇప్పుడు ఏం చదువుతున్నారు?”వాకబు చేశాడు వీరారెడ్డి.

“పెద్దోడు నాలుగు, సంటోడు రెండు సదువుతాండారు సామీ” జవాబిచ్చాడు సుబ్బయ్య.

“అది సరేగానీ ఇప్పుడు నేను ఎందుకొచ్చినానంటే ముందుసారిలాగే ఈసారి కూడా నేనే మన వూరి ఎం.పి.టి.సి.గా పోటీ చేస్తాండా, మీ ఓట్లన్నీ నాకే వేసి మళ్ళీ నన్నే గెలిపించాల” అన్నాడు వీరారెడ్డి తను వచ్చిన అసలు కారణం చెబుతూ.

“అట్లనా సామీ”అన్నాడు సుబ్బయ్య.

“వచ్చే గురువారమే పోలింగ్, ఓటు వేసిందాకా మళ్ళీ ఎక్కడికీ వెళ్ళవద్దండి, మీ ఇంట్లో మొత్తం నాలుగు ఓట్లు వున్నాయి కదా, ఇదిగో ఓటుకు ఐదు వందలు చొప్పున మొత్తం ఈ రెండు వేలు తీసుకో” సరిక్రొత్త రెండు వేల రూపాయల నోటు అందివ్వబోయాడు వీరారెడ్డి సుబ్బయ్యకు.

“కుదర్దులే రెడ్డీ”చెప్పాడు సుబ్బయ్య డబ్బు తీసుకోకుండా.

“ఏం సుబ్బయ్యా?”అడిగాడు వీరారెడ్డి అర్థం కానట్లుగా చూస్తూ.

“ఔ సామీ, ఐదేండ్లకు ముందు మన వూరినుండీ టౌనుకు బస్సు చార్జీ ఎంత వుండె?, ఇప్పుడు ఎంత అయ్యింది?”అడిగాడు సుబ్బయ్య.

“అప్పుడు పది, ఇప్పుడు ఇరవై” చెప్పాడు వీరారెడ్డి.

“కందిబ్యాడలు, చింతపండు, నూనె, కూరగాయల రేట్లు? మరో ప్రశ్న అడిగాడు సుబ్బయ్య.

“ఈ ఐదేళ్ళలో అన్ని ధరలు రెట్టింపు అయినాయి” ఒప్పుకుంటున్నట్లుగా అన్నాడు వీరారెడ్డి.

“మీరు గెల్సినాక మాకోసం ఏం చేస్తారో, ఎంతమాత్రం చేస్తారో  మీకూ మాకూ ఇద్దరికీ బాగా తెలిసిందే గానీ మా ఓటుకు మాత్రం రేటు పెరగదా సామీ?” నిలదీసినట్లుగా అడిగాడు సుబ్బయ్య వీరారెడ్డి అనుచరులు బిక్కమొహాలు వేసుకుని చూస్తుండగా.

2. హోదా

“చిన్నీ, గంట పది దాటుతోంది, ఇక రామ్మా, పడుకుందువు” బెడ్ రూం లోనుండీ గట్టిగా కేక వేసింది సుజాత హాల్లో వున్న తన కూతురును.

“మరో అరగంట మమ్మీ, ప్లీజ్”తల్లి సుజాతతో అభ్యర్థనగా చెప్పింది తొమ్మిదేళ్ళ చిన్ని.

“రాత్రి వేళల్లో ఎక్కువ సేపు మేలుకుంటే ఆరోగ్యం దెబ్బ తింటుందమ్మా, ఎన్ని సార్లు చెప్పినా వినవు” అంది సుజాత కూతురును కోపగించుకుంటున్నట్లుగా.

“మరో అరగంటే అని చెప్పా కద మమ్మీ, నువ్వు పడుకో, వచ్చేస్తా” మరోసారి చెప్పింది చిన్ని తల్లితో.

“అంతగా కావాల్సివస్తే ఉదయం ఐదుకే నిద్ర లేపుతాలే, చెప్పిన మాట విని రా” అంది సుజాత .

“మరి కొంచెం సేపు చదువుకుందామంటే అస్సలు కుదరనివ్వవు” నిరుత్సాహంగా అంది చిన్ని.

“నువ్వు చదివే మూడో తరగతికే రేయింబగళ్ళు ఇంతగా కష్టపడి చదవాల్సిన పని లేదు లేవే, పై తరగతుల్లోకి వెళ్ళాక చదువుదువు గానీ” అంది సుజాత కూతురి పుస్తకాల్ని బ్యాగులోకి సర్దుతూ.

“మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే దాన్ని పూర్తిగా సాధించేవరకు ప్రతి క్షణం శ్రమించాలట కదా మమ్మీ” అడిగింది చిన్ని తల్లిని.

“నిజమే, అయినా ఎవరు చెప్పారు నీకు ఈమాట” ప్రశ్నించింది సుజాత.

“మా క్లాస్ టీచర్ నిర్మలా మిస్ చెప్పారు మమ్మీ, బాగా కష్టపడి శ్రద్ధగా చదివితే పెద్దయ్యాక మంచి హోదా సంపాదించుకోవచ్చట కదా”మళ్ళీ తనే  అడిగింది చిన్ని.

” ఇంతకూ నువ్వేం లక్ష్యం పెట్టుకున్నావ్?” అడిగింది సుజాత కూతురిని.

“గొప్ప ఆఫీసర్ అయ్యి పెద్ద జీతంతో దండిగా డబ్బు సంపాదించాలని” చెప్పింది చిన్ని.

“మంచి ఆఫీసర్‌గా గొప్ప హోదా అంటే గౌరవమే, దండిగా డబ్బు సంపాదించాలంటున్నావే, ఎందుకు?”అడిగింది సుజాత.

“వీలైనంత త్వరగా ఓ నాలుగు లక్షలు సంపాదించి నానమ్మ మొహాన విసిరి కొడదామని”చెప్పింది చిన్ని విసురుగా.

“ఎందుకమ్మా, అలా అంటున్నావు?” కూతురి సమాధానానికి ఉలిక్కిపడుతూ అడిగింది సుజాత దిగ్గునలేచి బెడ్ మీద కూర్చుంటూ.

“ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం నాన్న నిన్ను పెళ్ళి చేసుకుంటే అప్పటి పాతిక వేల కట్నం బాకీ తీర్చలేదని నిన్ను ఇప్పటికీ అప్పుడప్పుడూ సూటిపోటి మాటలతో టార్చర్ పెడుతోంది కదా, అందుకని” చెప్పింది చిన్ని.

3. నిజాయితీ

“నమస్కారం సార్, సుమారు అరగంట క్రితం ఎవరో ప్యాసింజర్ నా ఆటోలో ఈ బ్యాగు మరచిపోయాడు” చెప్పాడు పోలీస్ స్టేషన్‌లో అడుగు పెట్టినన ఆటో డ్రైవర్ మస్తాన్ అక్కడి ఎస్.ఐ.తో.

“ఏమున్నాయి అందులో?”మళ్ళీ అడిగాడు ఎస్.ఐ.

“డబ్బు వుంది సార్, అన్నీ ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు” సమాధానమిచ్చాడు మస్తాన్ ఆ చేతి బ్యాగును ఎస్.ఐ.కి అందిస్తూ.

“ఆ ప్రయాణీకుడు ఎవరో గుర్తు పట్టగలవా?” అడిగాడు ఎస్.ఐ.

“అతడు రెగులర్ ప్యాసింజర్ కాదు సార్, దీన్ని ఎవరు పోగొట్టుకున్నారో సరిగ్గా గుర్తించి వాళ్ళకు అందజేయండి దయచేసి” అన్నాడు మస్తాన్.

“ఆ ప్యాసింజర్ నీ ఆటో ఎన్ని గంటలకు, ఎక్కడ ఎక్కి, ఎక్కడ దిగాడో చెప్పగలవా”అడిగాడు ఎస్.ఐ.

“పదిన్నర గంటల సమయంలో ఎల్.ఐ.సి.సర్కిల్‌లో ఎక్కాడు సార్, జగదాంబ సెంటర్‌లో దిగాడు, వయస్సు సుమారుగా యాభై దాకా వుండొచ్చు”చెప్పాడు మస్తాన్ .

“ఇందులో మొత్తం డబ్బు ఐదు లక్షలు వుంది, మేము పూర్తిగా ఎంక్వయిరీ చేస్తాం గానీ, నీకు మళ్ళీ కబురు చేస్తాం వెళ్ళిరా” చెప్పాడు ఎస్.ఐ. మస్తాన్ ఫోన్ నెంబర్ రాసుకుంటూ.

మరుసటిరోజు …పోలీస్ స్టేషన్ ఆవరణలో డియస్పీ గారి సమక్షంలో…

“మస్తాన్, నిన్న నువ్వు మాకు తెచ్చి ఇచ్చిన డబ్బు సంచీ ఇతడిదే, బ్యాంకులో నగదు విత్‌డ్రా చేసి తీసుకెళుతూ మరిచిపోయాడు, బ్యాంకుతోనూ, ఈ పెద్దాయనతోనూ మేము చేసిన ఎంక్వయిరీ, నోట్ల వివరాలు అన్నీ కూడా సరిపోయాయి, ఇది నీ చేతులతోనే ఆయనకు అందించు” చెప్పాడు డియస్పీ విలేకరులు ఫోటోలు తీసుకుంటుండగా.

తను పోగొట్టుకున్న బ్యాగును ఎంతో నిజాయితీతో మళ్ళీ తనకు అందజేసినందుకు పెద్దాయన మస్తాన్‌కు, పోలీసులకు కృతజ్ఞతలు వెల్లడించుకున్నాడు.

“బాబూ, నువ్వొక సామాన్యమైన ఆటో డ్రైవర్‌వు కదా, దొరికిన డబ్బు నీ అవసరాలకు వినియోగించుకునే ఆస్కారం వుండీ ఈ రోజుల్లో కూడా చాలా నిజాయితీగా అప్పజెప్పావెందుకూ?” అడిగాడు మస్తాన్‌ను అక్కడున్న ఓ విలేఖరి.

“నా చిన్నప్పుడు మా నాన్న కూడా ఇలాగే డబ్బు సంచీ పోగొట్టుకుని ఆ కారణంగా మరో పది రోజుల్లో జరగాల్సిన మా అక్క పెళ్ళి నిలిచిపోతే ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు సార్, పోగొట్టుకున్న డబ్బు కారణంగా మరో కుటుంబం మాలా ఏ ఇబ్బందీ పడకూడదని” తండ్రి జ్ఞాపకాలతో కళ్ళ నిండా నీళ్ళు తిరుగుతుండగా చెప్పాడు మస్తాన్.

4. చేయూత

“ఏమండీ, ఇవాళ లంచ్ బాక్స్ రెడీ కావడానికి కాస్తంత ఆలశ్యమయ్యేలా వుంది, మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్‌లో భోంచేయండి ప్లీజ్” చెప్పింది లత ఆఫీసుకు వెళ్ళబోతున్న భర్తతో.

“సరేలే అలాగే ఇవాల్టికి ఎలాగోలా సర్దుకుంటా గానీ ఇక రోజూ ఇలాగే చేయకు, బయటి తిండితో అడ్జస్ట్ కాలేను” చెప్పాడు సాగర్ .

“ఓ చిన్న మాట, సాయంత్రం ఆఫీసు నుండీ కాస్తంత త్వరగా రాగలరా?” అడిగింది లత.

“వారం రోజులుగా ఆడిట్ జరుగుతోంది, ముందుగా రావడాలు కుదరవు గానీ, ఇంతకూ ఏం పని వుంది?” అడిగాడు సాగర్ డ్రెస్ చేసుకుంటూ.

“బజారుకు వెళ్ళి వద్దామని” చెప్పింది లత.

“ఏం కొనాలి?” అడిగాడు సాగర్ .

“వర్షాకాలం వస్తోంది కదా, బాబు స్కూలుకు వెళ్ళడానికి, మీరు ఆఫీసుకు వెళ్ళడానికి గొడుగులు కొనుక్కొద్దామని” జవాబిచ్చింది లత.

“ఇదివరకే ఇంట్లో మూడో, నాలుగో వున్నాయిగా, మళ్ళీ క్రొత్తవి కొనడం ఎందుకు?” అడిగాడు సాగర్.

“పాత గొడుగులు కడ్డీలు విరిగి, చిరుగులు పడి పనికి రాకుండా పోయాయండీ”చెప్పింది లత.

“ఒక పని చెయ్, వాటిని ఇళ్ళ ముందుకు వచ్చి రిపేరు చేసే వాడు వస్తే వాడితో తయారు చేయించు” చెప్పాడు సాగర్.

“పాత గొడుగులు ఎందుకండీ మరీ దరిద్రంగా, ఓ నాలుగు వందలు పడేస్తే క్రొత్తవి వస్తాయి కదా, మనమేమైనా మరీ లేనివాళ్ళమా” అంది లత భర్తతో.

“లతా, ఓ చిన్న మాట చెబుతా విను, మనం బాగా వున్నవాళ్ళమని చెప్పి చిన్నచిన్న రిపేర్లతోనే మళ్ళీ వాడుకలోకి వచ్చే గొడుగులను ప్రక్కకు పడేసి క్రొత్తవి కొంటూపోతే కేవలం ఈ వృత్తి మీదనే ఆధారపడి బ్రతుకుతూ భార్యాపిల్లల్ని పోషించుకునే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు, మనుషులుగా మనం వాళ్ళకు కూడా మన వంతుగా ఆ మాత్రం చేయూత ఇవ్వకుంటే ఎలా?” చెప్పాడు సాగర్ స్కూటర్ స్టార్ట్ చేస్తూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here