వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-3

1
2

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. అమ్మ మనసు

“అక్కా, ఈమధ్య నువ్వు మరీ ఎక్కువగా ఎదురింటి లక్ష్మిని కలవడానికి వెళుతున్నావు, ఆవిడకు వున్న క్షయ జబ్బు అంటురోగం అనే సంగతి నీకు తెలుసా?” పక్కింటి సుశీలమ్మను హెచ్చరిస్తున్నట్లుగా అంది పార్వతమ్మ.

“తెలుసు పార్వతీ, ఆ జబ్బు నాకు కూడా సోకాలనే అస్తమానం ఆమె దగ్గరకు వెళ్తున్నా” బదులిచ్చింది సుశీలమ్మ.

“ఎందుకలా” అర్థం కానట్లుగా అడిగింది పార్వతమ్మ.

“చాలా రోజులుగా నా కోడలు వేరు కాపురం పెట్టమని మావాడిని పోరు పెట్టి సతాయిస్తోంది, వాడు అటూ నాకూ చెప్పలేక, ఇటు భార్యకు చెప్పలేక సతమతమవుతున్నాడు” బాధగా చెప్పింది సుశీలమ్మ.

“దానికీ దీనికి ఏమిటి సంబంధం?” అయోమయంగా ప్రశ్నించింది పార్వతమ్మ.

“ఆ జబ్బు నాకు వస్తే నా ద్వారా పిల్లలకు కూడా సోకుతుందనే భయంతోనైనా మావాడు వేరు కాపురం పెట్టి భార్య పోరు తప్పించుకుంటాడుగా” ‘అమ్మ మనస్సు’తో పలికింది సుశీలమ్మ గొంతు.

2. గంజి

“రేపటి నుండి నువ్వు పనిలోకి రావాల్సిన అవసరం లేదు” తెగేసినట్లు చెప్పింది రాజేశ్వరి.

“ఎందుకమ్మగారూ?” కంగారుగా ప్రశ్నించింది పనిమనిషి రంగమ్మ.

“నీకు అన్నం’సరిఎసరు’తో వండడం రానట్లుంది, అందుకే” బదులిచ్చింది రాజేశ్వరి.

“సరిఎసరుతో చేయడం కూడా చేతనవుతుందమ్మా” వినయంగా చెప్పింది రంగమ్మ.

“మరయితే రోజూ గంజి వార్చుతున్నావేం?” యజమానురాలి మరో ప్రశ్న.

“ఆ గంజితో నా పిల్లల కడుపులు కనీసం ఒక్క పూటయినా కాస్తంత నిండుతాయన్న ఆశతో అమ్మగారూ” గొణుగుతున్నట్లుగా అంది రంగమ్మ తాగుబోతు భర్తను తలచుకుంటూ…..

3. భరోసా

“వృద్ధాశ్రమం కడుతున్నాం సార్, మీరేమైనా సాయం చేస్తారేమోనని” స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల కళ్ళలో ఆశ, గొంతులో అభ్యర్థన.

“ఇలాంటి పనులంటే నాకు చాలా అసహ్యం, ఒక్క నయా పైసా కూడా ఇవ్వను” ఆ కోటీశ్వరుడి మాటల్లో కాఠిన్యం, చిరాకు.

సరిగ్గా పాతికేళ్ళ తర్వాత….

“సంపాదించిన కోట్ల సొమ్మును లాక్కొని కొడుకులు తన్ని తగలేసారు, ఈ వృద్ధాశ్రమంలో కాస్తంత చోటు ఇస్తారా?” ఆ ముసలాయన మాటల్లో ఆవేదన.

“తప్పకుండా. మీలాంటి వాళ్ళ కోసమేగా ఈ వృద్ధాశ్రమం నిర్మించింది” నిర్వాహకుల జవాబులో నీకు తోడుగా మేము వున్నామనే ఆపాయ్యతతో కూడిన భరోసా.

4. పరిష్కారం

“అమ్మాయిని నారాయణ కొడుకు చూసి వెళ్లాడుగా, వాళ్లకు మన సంబంధం నచ్చిందట” భర్తకు భోజనం వడ్డిస్తూ చెప్పింది రాజమ్మ.

“ఆ సంబంధం వద్దనుకుంటున్నా” భార్యతో చెప్పాడు చంద్రయ్య.

“ఎందుకలా?, ఆ అబ్బాయి మంచివాడే కదా?” అడిగింది రాజమ్మ.

“మంచివాడే, కానీ అమ్మాయిని మళ్లీ నాలాంటి రైతుకే ఇచ్చి నా చేతులతో నేనే గొంతు కోయలేను” బదులిచ్చారు చంద్రయ్య.

“మరెలా?” ప్రశ్నించింది రాజమ్మ కంచంలో మరోసారి కూరలేస్తూ.

“క్రితం నెలలో వచ్చి చూసి వెళ్లిన ఆ గవర్నమెంట్ ఉద్యోగి సంబంధాన్ని ఖాయం చేద్దామనుకుంటున్నాను” అన్నాడు రాజయ్య.

“వాళ్ళు ఐదు లక్షలు కట్నం అడిగారుగా, ఎక్కడ నుండీ తెస్తారు?” రాజమ్మ ప్రశ్న.

“అప్పు చేద్దాంలే, కనీసం అమ్మాయి అయినా సుఖంగా వుంటుంది” చంద్రయ్య జవాబు.

“పంట సాగు కోసం ఇప్పటికే చాలా చోట్ల అప్పులు చేసి వడ్డీలు కట్టలేకున్నాం, మళ్లీ కొత్త అప్పు తెస్తే ఎలా తీర్చగలం?” బాధగా అంది రాజమ్మ.

“నీకా భయం అక్కరలేదులే, ఇకపై రాష్ట్రంలో ఏ రైతు చనిపోయినా  వెంటనే ఆ కుటుంబానికి పది లక్షల పరిహారం అందచేసే నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పినట్లు రాత్రి టి.వి.వార్తల్లో చూడలేదా? దాంతో ఆ అప్పులు తీర్చేదువు గానీ”  అంటూ పరిష్కారం ఇదే అన్నట్లుగా బదులిచ్చాడు చంద్రయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here