వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-31

0
4

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. జవాబు

“అమ్మగారూ, మీ ఇంట్లో ఏదైనా పని వుంటే చెప్పండమ్మా, చేస్తాను” ఇంటి బయట నిల్చుని వున్న రాజేశ్వరిని అడిగింది ఓ పదిహేనేళ్ళ అమ్మాయి.

“నిన్ను ఎప్పుడూ ఈ ఏరియాలో ఎక్కడా చూడలేదే?” అడిగింది రాజేశ్వరి ఆ అమ్మాయిని కాస్తంత సందేహంగా గమనిస్తూ.

“మాది ఈ ఊరు కాదమ్మ గారూ, ఏవైనా పనులు దొరుకుతాయని ఇక్కడికి కొత్తగా వచ్చాం” బదులిచ్చిందా అమ్మాయి.

“మీ అమ్మా, నాన్నలు ఎక్కడ?”అడిగింది రాజేశ్వరి.

“ఈ ఊరికి నిన్ననే వచ్చాం అమ్మగారూ, ప్రస్తుతాన్నికి సెలవులు కదా అని స్కూలు వరండాలో వుంటున్నాం, ఏవైనా కూలి పనులు దొరుకుతాయని మా అమ్మా, నాన్నలు వెళ్ళారు” సమాధానమిచ్చిందా అమ్మాయి.

“పని అడుగుతున్నావు, అసలు ఏం పని చేయగలవు?”అడిగింది రాజేశ్వరి.

“ఇంట్లో పని ఏదైనా చేయగలను అమ్మగారూ, పాత్రలు తోమడం, బట్టలు ఉతకడం, కసువులు వూడ్చడం బాగా వచ్చు, ఇంతకు ముందు వున్న ఊర్లో కూడా మా అమ్మ వెంట వెళ్ళి ఒకామె ఇంట్లో అప్పుడప్పుడూ ఈ పనులే చేసేదాన్ని” చెప్పిందా అమ్మాయి.

“అక్కడే పనులు చేసుకోక ఇక్కడికి ఎందుకు వచ్చారు?”అడిగింది రాజేశ్వరి.

“మా నాన్న నన్ను, మా తమ్ముడిని ఈ సారి ఇక్కడే స్కూల్‌లో చేర్పించాలని వచ్చేశాం” సమాధానమిచ్చిందా అమ్మాయి.

“ఆసలు ఇంతకూ నీ మొహాన బొట్టు లేదు, పైగా మాట కూడా యాసగా మాట్లాడుతున్నావ్, సాయిబుల పిల్లవా?”ప్రశ్నించింది రాజేశ్వరి.

“అవునమ్మ గారూ, నా పేరు హసీనా, ఈసారి పదో తరగతికి పోతా, శెలవుల్లో ఖాళీగా వుండేది ఎందుకని” చెప్పిందా అమ్మాయి.

“మీ సాయిబులు కొందరు మా హిందువుల ఇళ్ళల్లో పనులు చేయరే, మీ ఆచారాలు, మా ఆచారాలు వేరే కదా?”అడిగింది రాజేశ్వరి.

“వాటితో నాకేం పనమ్మా, సాయిబులైనా, హిందువులైనా ఆకలి వేస్తే అది తీరడానికి అన్నమే కదా తినేది, దప్పిక వేస్తే నీళ్ళే కదా తాగేది, పని వుంటే చెప్పండి, లేదంటే వేరే చోటికి వెళతా” బదులిచ్చిందా అమ్మాయి.

2. అర్థం

“ఏం నారాయణా, కనిపించి నాలుగు రోజులాయనే?” ఓ రోజు ఉదయాన్నే తన ఇంటి వద్దకు వచ్చిన అనుచరుడు నారాయణను ప్రశ్నించాడు ఓ ప్రముఖ రాజాకీయ పార్టీ ముఖ్య నాయకుడు భూషణం.

“ఊరికి పొయ్యింటి న్నా, కూతురు దగ్గరికి, మనవడి పుట్టినరోజుకు రమ్మని పిలిస్తే” చెప్పాడు నారాయణ.

“పుట్టినరోజు నాడు మనవడికి ఏం ఇస్తివి?” ప్రశ్నించాడు భూషణం.

“మంచి గుడ్డలు తీసుకోమని రెండు వేలు ‘లెక్క’ ఇచ్చినానున్నా”చెప్పాడు నారాయణ.

“ఇంకేం విశేషాలు నారాయణా?” అడిగాడు భూషణం.

“రాత్రి టీ.వీ.చూసినావా న్నా?” అడిగాడు నారాయణ.

“రాత్రి టౌన్ నుండీ వచ్చేటప్పటికే బాగా ఆలశ్యమయ్యింది, ఏం చెప్పినారు?” ప్రశ్నించాడు భూషణం.

“సముద్రంలో అల్పపీడనం లేసిందంట, వారం దినాలు ఇడ్సకుండా పెద్దగా వానలు పడతాయంట. వరదలు వస్తాయేమో న్నా” కాస్తంత ఆందోళనగా అన్నాడు నారాయణ.

“రానీలే, మంచిదే కదా”నవ్వుతూ తాపీగా అన్నాడు భూషణం.

“వరదలు వస్తే సన్నా బన్నా జనాలకు చానా ఇబ్బంది కదన్నా, నువ్వేమో మంచిదంటాండావ్?” ప్రశ్నించాడు నారాయణ అర్థం కానట్లుగా చూస్తూ.

“చిన్న కొడుక్కు టౌనులో ఇల్లు కట్టించల్లనుకుంటాడా, వరదలొస్తే గవర్నమెంటు పనులు వస్తాయి కదప్పా” చెప్పాడు భూషణం అర్థం చేసుకోమన్నట్లుగా.

సరిగ్గా ఆరు నెలల తర్వాత….

“ఏం నారాయణా, చానా దిగులుగా వుండావే?” అడిగాడు ఓ రోజు భూషణం తన వద్దకు వచ్చిన నారాయణను.

“రెండు నెలలుగా చుక్క వాన పడలేదు న్నా, కరువు వచ్చేటట్లుగా వుండాది” ఆందోళన కనిపించింది నారాయణ మాటల్లో.

“రానీలే నారాయణా, మంచిదే కదా, టౌనులో కడతాండే ఇంటి పని నిల్చిపోయింది, ఈరకంగా అయినా పని పూర్తి కానీ” ఈసారి నువ్వే అర్థం చేసుకో అన్నట్లుగా చెప్పాడు భూషణం మళ్ళీ తేలిగ్గా నవ్వేస్తూ.

3. అవసరం

“అమ్మా, నాకు రేపు వంద రూపాయలు డబ్బు కావాలి” వీధిలోని స్నేహితురాళ్ళతో ఆటలు ముగియగానే ఇంట్లోకి వచ్చిన పధ్నాలుగేళ్ళ సరళ అడిగింది తన తల్లిని.

“నా దగ్గర లేవు సరళా” కూతురికి బదులిచ్చింది రత్నమ్మ.

“నాన్నను అడిగి ఇప్పించమ్మా” బ్రతిమాలుతున్నట్లుగా అంది సరళ.

“అవసరం నీది కాబట్టి నువ్వే అడగరాదూ” సలహా ఇస్తున్నట్లుగా అంది రత్నమ్మ.

“ఆమ్మో, నాకు భయం, నువ్వే ఎలాగైనా అడిగి ఇప్పించుమ్మా, ప్లీజ్” మరోసారి తల్లిని బ్రతిమలాడుతున్నట్లుగా అంది సరళ.

“అయినా ఇప్పుడు నీకు డబ్బు ఎందుకే?” అడిగింది రత్నమ్మ కూతురి వంక సందేహంగా చూస్తూ.

“నా స్నేహితురాళ్ళంతా ఈ మధ్యన మార్కెట్ లోకి క్రొతగా వచ్చిన లేటెస్ట్ మోడల్ గాజులు, చెవి జూకాలు కొనుక్కున్నారు, అలాంటివి నేనూ కొనుక్కుందామని” తల్లికి సమాధానమిచ్చింది సరళ.

“సరే మీ నాన్న పనికి వెళ్ళాడు కదా, రాగానే అడిగి ఇప్పిస్తాలే” చెప్పింది రత్నమ్మ.

“థ్యాంక్యూ మమ్మీ, మా మంచి అమ్మవు నువ్వు” తల్లిని రెండు చేతులతోనూ గట్టిగా చుట్టేస్తూ అంది సరళ సంతోషంగా.

“అమ్మా, నాన్నకు చెప్పి నాకూ ఓ రెండు వందలు ఇప్పించమ్మా” అడిగాడు తల్లి రత్నమ్మను అక్కడే ఆడుకుంటూ వున్న పన్నెండేళ్ళ కిరణ్.

“అక్క అంటే ఆడపిల్ల, గాజులేవో కొనుక్కోవాలట, మగ పిల్లాడివి, నీకెందుకు డబ్బు, నువ్వు అడిగేవన్నీ మీ నాన్నే కొనుక్కొచ్చి ఇస్తున్నాడు కదా” అంది రత్నమ్మ.

“ఈ మధ్య వాడికి ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు మమ్మీ, బొంగరాల ఆటలో పందేలు కాయడానికేమో”తమ్ముడి మీద ఫిర్యాదు చేస్తున్నట్లుగా అంది తల్లితో సరళ.

“ఏం కాదు” వుడుక్కుంటూ అన్నాడు కిరణ్ మొహం గబ్టు పెట్టుకుంటూ.

“కిరణ్, మరి దేనికోసం మీ అమ్మను డబ్బు అడుగుతున్నావ్?”అడిగాడు పని నుండీ అప్పుడే ఇంటికి వచ్చి వీళ్ళ మాటలు విన్న సుబ్బయ్య.

“నాన్నా, మరే ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది కదా, వూరవతల పూరి గుడిసెల్లో వుంటున్న చాలా మంది ఈ వ్యాధిపై సరయిన అవగాహన ఏ మాత్రం లేక మాస్కులు ధరించక దీన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు కారణమవుతున్నారు, వాళ్ళల్లో కొందరికయినా మాస్కులు కొని పంచుదామని” డబ్బు తనకు ఎందుకు అవసరమో మెల్లగా చెప్పాడు కిరణ్ రోజూ దిన కూలీకి వెళ్ళే తన తండ్రికి.

4. ఆలోచన

“సుజాతా ఇవాళ వెంకట్రామయ్య గారు ఆఫీసుకు రాలేదు, ఆయన ఆఫీసు చిరునామాకు వచ్చిన ఈ కవర్‌ను మన రాజు ద్వారా వాళ్ళ ఇంటికి పంపించు” ఆఫీసు నుండీ ఇంటికి రాగానే భార్యతో చెప్పాడు గోపాల్ .

“దాన్ని ఆ టేబుల్ మీద వుంచండి, అలాగే పంపుతాను” చెప్పింది సుజాత భర్తకు మంచి నీళ్ళ గ్లాసు అందిస్తూ.

“మళ్ళీ ఆలశ్యం చేయక ఇప్పుడే పంపెయ్, ఆ కవర్‌లో ఏదైనా ముఖ్యమైన సమాచారం వుందేమో” చెప్పాడు గోపాల్ .

“పిల్లాడు ఇంటికి రానీయండి, రాగానే పంపుతాను” చెప్పింది సుజాత భర్తకు కాఫీ కలిపి ఇవ్వడానికి వంటింట్లోకి దారితీస్తూ.

“అవును, ఇంతకీ వీడు కనిపించడం లేదు, ట్యూషన్ కి గానీ వెళ్ళాడా?” అడిగాడు గోపాల్.

“స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళాడేమోనండీ” చెప్పింది సుజాత.

“ఎంతసేపయ్యింది వెళ్ళి?” మరో ప్రశ్న వేశాడు గోపాల్.

“మధ్యాహ్నం మూడు గంటలకి” చెప్పింది సుజాత.

“సాయంత్రం ఆరు గంటలు కావస్తోంది, పైగా బాగా చీకటి కూడా పడుతోంది, వాడి కదలికల్ని ఏమాత్రం గమనించకుండా నువ్వేం చేస్తున్నట్లు?” కోపంగా అన్నాడు గోపాల్.

“రానీయండి, వాడినే అడుగుదాం” భర్త కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తూ అంది సుజాత.

సరిగ్గా ఓ అరగంట తర్వాత….

“ఇంతసేపూ ఎక్కడికి చచ్చావురా వెధవా, నీ కోసం ఎక్కడని వెదికేది?” ఇంట్లోకి అడుగు పెట్టిన పధ్నాలుగేళ్ళ కొడుకు కృష్ణ చెంప చెళ్ళుమనిపించి ఆగ్రహంతో వూగిపోతూ అడిగాడు గోపాల్.

“ఎల్లుండి వినాయక చవితి కదా నాన్నా, అందరూ రంగుల్లేని మట్టి విగ్రహాలనే వాడితే పర్యావరణానికి హాని జరగదనే ఉద్దేశ్యంతో ఎలాగూ ఖాళీగా వున్నాం కాబట్టి మా స్నేహితులమంతా కలిసి కొందరికైనా మట్టి గణపయ్యలను తయారు చేసి ఇద్దామనే ఆలోచనతో బంకమట్టి కోసం వెళ్ళాం నాన్నా” జవాబిచ్చాడు కృష్ణ కళ్ళ నిండుగా నీళ్ళు తిరుగుతుండగా తండ్రి చెంప దెబ్బను చేత్తో తడుముకుంటూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here