[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.
1. అనువాదం
“నమస్తే సార్, మీరు సాహితీసేవ ప్రారంభించిన ఈ మూడున్నరేళ్ల కాలం లోనే గొప్ప ‘చెయ్యి తిరిగిన’ కవిగా, ప్రముఖ రచయితగా గుర్తింపు పొందారు కదా, ఇది ఎలా సాధ్యమయింది?” అడిగాడొక దినపత్రిక విలేఖరి గొప్ప సాహితీవేత్తగా పేరు పొందుతున్న’కలలు కనే కళ్లు’ కవితా సంపుటి ఫేం కొండారెడ్డిని.
“అర్ధరాత్రి దాటినా కూడా రోజు రాత్రుళ్లు క్రమం తప్పకుండా ఆవులింతల్ని, నిద్రను ఆపుకుంటూ ఎంతో కృషి చేయడం వల్ల” బదులిచ్చాడు కొండారెడ్డి.
“దేశంలోని చాలామంది రచయితలు, కవులు ఇవన్నీ మీ సొంతరచనలు ఏ మాత్రం కావని, మీ సాహితీ సృజన వెనుక ఎవరో అదృశ్య రచయిత ఉన్నట్లుగా చెప్పుకుంటారు, నిజమేనా?” అడిగాడు విలేఖరి.
“స్వల్ప కాలంలోనే నాకు వస్తున్న పాపులారిటీని చూచి ఓర్వలేని వాళ్లే ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు” చెప్పాడు కొండారెడ్డి
“కొన్ని పత్రికలకు మీరు సిఫార్సు చేయించి, మరి కొన్ని పత్రికలవారిని కాకాలు పట్టి బాకాలు వూది మీ సాహిత్యాన్ని ప్రచురింప చేసుకోవడం, సమీక్షకుల్ని అభ్యర్థించి మీ రచనపై వ్యాసాలు రాయించుకోవడం చేస్తారట, ఈ సంగతి అంగీకరిస్తారా?” మరో ప్రశ్న సంధించాడు విలేఖరి.
“అవన్నీ గిట్టని వాళ్లు చేసే అబద్ధపు ప్రచారాలేనండీ” చిరాగ్గా బదులిచ్చాడు కొండారెడ్డి.
“ఈ మధ్య కొన్ని పత్రికల్లో అచ్చయిన మీ కవితలు గతంలో ప్రచురితమైన అచ్చం తన కవితల్లాగే వున్నాయని ఓ కవి పూర్తి ఆధారాలతో సహా ఆరోపించారు, అవి మీరు కాపీ కొట్టిన రచనలేనని ఒప్పుకుంటారా?” అడిగాడు విలేఖరి.
“అవన్నీ నేను అనువాదం చేసిన రచనలండీ, పత్రికవాళ్లు వాటిని నా అనువాద రచనలు అని ముద్రించడం మరిచిపోయినట్లున్నారు” జబాబు ఇచ్చాడు కొండారెడ్డి.
“మరైతే ఆ కవిగారి కవితలు, మీ కవితలు కూడా ఒకే భాషలోనే, పైగా అచ్చ తెలుగులోనే ఉన్నాయి కదా సార్?” ఏం సమాధానం చెబుతావు అన్నట్లు చూచాడు విలేఖరి.
“తెలుగు రచనల్ని తెలుగు భాషలోకి అనువాదం చేయకూడదనే చట్టం ఎక్కడైనా ఉందటండీ, పైగా మీరు గమనించారో లేదో ప్రతి కవితలోను ఒకటి అర పదాలకు సమానార్థం వచ్చే పదాలనే మార్చి రాశా కదా, వాటిని కాపీ రచను అనీ ఎలా అంటారు?” మొహం గంటు పెట్టుకుంటూ కోపంగా అన్నాడు కొండారెడ్డి, ఏమీ అర్థం కాక మతిపోయిన విలేఖరి నేలకు జారగిబడుతుండడం చూచి.
(అంకితం… ఈ హాస్య కథకు పేరు సూచించిన కవి, రచయిత పి.శ్రీనివాసగౌడ్ గారికి…)
2. రక్తపరీక్ష
“మ్మా, ఆస్పటల్ వాళ్ళు ఏం చెప్పినారు మ్మా” రెండు రోజులనుండీ జ్వరంతో బాధపడుతూ గవర్నమెంటు ఆసుపత్రికి వెళ్ళి వచ్చిన తల్లి నారాయణమ్మను అడిగాడు ఇంటి వద్దనే వున్న అయిదో తరగతి చదివే ఆమె పదేళ్ళ కొడుకు కుమార్.
“నాలుగు మాత్తర్లిచ్చి రక్తపరీచ్చ బయట నన్నే చేపిచ్చుకోని రమ్మని చెప్పినారు, దావలో ప్రవేటు ఆస్పటల్ కాడ అడిగితే ఇన్నూరు రూపాయలు అవుతాదని చెప్పినారప్పా, అంత లెక్క నా కాడ లేదు” నీరసంగా బదులిచ్చింది నారాయణమ్మ.
“నువ్వు రోజూ పని చేసేదానికి పోతావే, ఆ ఇండ్ల కాడ వాళ్ళను అడిగి బదులుగా ఇప్పించుకోని వస్తా మ్మా” తల్లిని అడిగాడు కుమార్.
“నిన్ననే మూడు నాలుగు ఇండ్లల్లో అడిగినా, ఎవురూ ఇవ్వలా, నువ్వు గమ్మునా వుండు రేపో మొన్నాడో అదే తగ్గిపోతాది గానీ” చెప్పిందామె.
“నాయిన బతికుంటే మనకు ఇట్ల వుండేది కాదు గదమ్మా” ఏడుపు గొంతుతో అన్నాడు కుమార్ తల్లితో చనిపోయిన తండ్రిని గుర్తు చేసుకుంటూ.
“ఇబ్బుడొస్తాండేటివి చానా చెడ్డ జొరాలని మా ఐవారు గుడా చెప్పినాడు మ్మా, నువ్వు ఎట్లనోగట్ల రేపైనా రక్తపరీచ్చ చేపిచ్చుకో” పట్టుబట్టినట్లు అన్నాడు కుమార్ మళ్ళీ తనే మౌనంగా వున్న తల్లితో.
“ఇబ్బుడు మన కాడ అమ్మేదానికి గుడా ఏం లేవు, దుడ్లు కుదిరితే అట్లనే చూస్తాంలే గానీ, నువ్వు బాగ సదువుకుంటే మనకు ఈ బాధలుండవు”చెప్పిందామె.
సరిగ్గా మరుసటి రోజున..
“మ్మా, ఈ చిల్లరంతా ఇన్నూటా పది వుండాది, తీసుకోని రక్తపరీచ్చ చేపిచ్చుకోనిరా పో”అన్నాడు ఇంటికొచ్చిన కుమార్ తల్లితో.
“ఎక్కడిదిరా నీకు ఇంత ‘లెక్క’, ఈ దుడ్ల కోసరం యాడన్నా దొంగతనం చేసినావా?” చెంపల మీద వాయిస్తూ కోపంగా అడిగింది నారాయణమ్మ చిరుగులు పడ్డ కొడుకు చొక్కాను, మోకాలి వద్ద రక్తమోడుతున్న గాయాన్ని గమనిస్తూ.
“నారాయణత్తా, రాత్రి పక్కవీధిలో సచ్చిపోయిండే సావుకారు శెట్టిని బూడ్సిపెట్టేదానికి తీసకపొయ్యేటబ్బుడు వాల్లు ఆయప్ప మింద సల్లిండే చిల్లర నేను ఏరుకుంటాంటే మీ కుమారు గాడు నన్ను కొట్టి అదంతా వాడే ఏరుకోనొచ్చినాడు త్తా” తన కొడుకు మీద ఫిర్యాదు చేస్తూ అప్పుడే గుడిశెలోకి దూసుకొచ్చిన తొమ్మిదేళ్ళ శీను మాటలు వింటూ నోట మాట రాక అలాగే నిలుచుండిపోయింది నారాయణమ్మ.
(అంకితం: నా కొడుకు కథలు రాస్తాడు అని అదేదో పెద్ద గొప్ప అన్నట్లు అందరికీ అదేపనిగా చెప్పుకునే మా అమ్మ శ్రీమతి పద్మావతమ్మకు…..)
3. బర్త్‌డే గిఫ్ట్
“ఏమండీ, ఇవాళ సాయంత్రం కాస్తంత ముందుగా రాగలరా?” ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆఫీసుకు బయలుదేరుతున్న భర్తకు కాఫీ కప్పు అందిస్తూ అడిగింది ప్రసన్న.
“ఈ రోజు కుదరకపోవచ్చు, ఇంతకూ ముందుగానే రావాలంటున్నావ్, ఏదైనా పని వుందా?” అడిగాడు మధు.
“వచ్చే గురువారం నాడు మన అబ్బాయిది పుట్టినరోజు కదా, ఈ కరోనా మహమ్మారి వల్ల కేక్ కట్ చేయడం, వాడి ఫ్రెండ్స్‌ను పిలిచి ఫంక్షన్ జరపడం ఎలాగూ చెయ్యలేము, కనీసం బజారుకు వెళ్ళి వాడికి ఓ క్రొత్త డ్రస్, ఏదైనా ఓ మంచి గిఫ్ట్ తీసుకుని వద్దామని” చెప్పింది ప్రసన్న.
“వాడికి డ్రస్, గిఫ్ట్ రేపు తెద్దాం గానీ, ఇవాళ రాత్రికి నేను రావడం మరీ ఆలశ్యం అవుతుంది, మా అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ బదిలీ అయ్యాడని చెప్పాగా, ఈ రోజు అతడి రిలీవింగ్ ఫంక్షన్, చిన్న పార్టీ వున్నాయి” చెప్పాడు మధు.
“ఈసారి ఓ చిన్న పని చేద్దామండీ, మన టింకూకి ఈ బర్త్ డే గిఫ్ట్‌గా ఏదో ఒకటి కాక వాడినే అడిగి, ఏది ఇష్టమో అదే ప్రెజెంట్ చేద్దాం” భర్తతో తన ఆలోచన చెప్పింది ప్రసన్న.
మరుసటి రోజు ఉదయాన్నే…
“టింకూ, వచ్చే గురువారం నాడు నీ పుట్టినరోజు కదా, ఏం గిఫ్ట్ కావాలో అడుగు” అడిగాడు మధు అప్పుడే నిద్ర లేచిన కొడుకు ఎనిమిదేళ్ళ టింకూను.
“డాడీ, నా గిఫ్ట్ కోసం మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు?” అడిగాడు టింకూ.
“ఓ రెండు వేలు అనుకో” చెప్పాడు మధు.
“అయితే ఆ మొత్తానికి సరిపడా మాస్కులు తీసుకురండి” జవాబిచ్చాడు టింకూ.
“నీకు ఏ గిఫ్ట్ కావాలంటే మాస్కులు తీసుకురమ్మంటున్నావేంటి?” అన్నాడు మధు.
“వూరవతల గుడిశెల్లో వున్న బీద పిల్లలందరికీ నా బర్త్‌డే గిఫ్ట్ వాటిని పంచుదామని”తండ్రికి బదులిచ్చాడు టింకూ.
“ఎందుకలా?” అడిగాడు మధు.
“సరయిన అవగాహన లేక, నోటికి మాస్కు కట్టుకోనందున మన పనిమనిషి రంగమ్మ కొడుకులా మరి కొంతమంది పిల్లలు ఈ వ్యాధికి బలయి చనిపోకూడదని, ఈ అంటురోగాన్ని మరింత మందికి వ్యాప్తి చేయకూడదని నా వంతుగా…” అంత చిన్న వయస్సులోనే సమాజ హితాన్ని కాంక్షిస్తూ కొడుకు చెబుతున్న మాటలు విని ఉప్పొంగిపోగింది మధు హృదయం.
4. మానవత్వం
“వదినా, ఒంట్లో నలతగా వుండి ఆయన మార్కెట్‌కు వెళ్ళలేదు, నాలుగు టమోటాలు వుంటే ఇవ్వండి, మళ్ళీ రేపో, ఎల్లుండో తీసుకురాగానే ఇచ్చేస్తా” ప్రక్కింటి కామాక్షిని అడిగింది వనజ.
“అయ్యో, కాస్తంత ముందుగా అడిగి వుండరాదా, రెండంటే రెండే వుంటే ఉదయాన్నే కూరకు వాడేశా” నొచ్చుకుంటున్నట్లుగా అంది కామాక్షి ఇంట్లో ఫ్రిజ్‌లో రెండు కిలోల టమోటాల వున్నా కూడా.
“సరేలే వదినా, ఇవాల్టికి వేరే ఏదైనా కూర చేసి సర్దేస్తాలే గానీ” చెప్పింది వనజ.
“ఇంకేంటి వనజా, విశేషాలు?” అడిగింది కామాక్షి.
“ఈ మాయదారి కరోనా మహమ్మారి వల్ల స్కూళ్ళు లేక పిల్లలు బొత్తిగా చదవడం లేదు వదినా, వాళ్ళ గురించే బెంగ అంతా” ఆవేదనగా అంది వనజ.
వీళ్ళు ఇలా పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా…
“అమ్మా, నిన్నట్నుండీ ఇడ్సకుండా వాన కురుస్తాంటే బయిటికి రాలేదు, బాగా ఆకలిగా వుండాది, రాత్రి మిగిలిండే సద్ది వుంటే కొంచెం పెట్టు తల్లీ” అడిగాడో యాభయ్యేళ్ళున్న బిక్షగాడు కామాక్షి ఇంటి ముందు నిలబడి.
“పెద్దాయనా, నీకు ఆశ మరీ ఎక్కువగా వున్నట్లుందే” అంది కామాక్షి బిక్షగాడి భుజానికి వ్రేళ్ళాడుతున్న జోలె లోని గిన్నెల్లో నుండీ బయటకు కనిపిస్తున్న అన్నం, కూరల వంక గమనిస్తూ.
“ఎందుకమ్మా, అలా అంటున్నారు?”మెల్లగా గొణుగుతున్నట్లుగా అడిగాడు బిక్షగాడు.
“మరేం లేదు,నువ్వు ఇవాల్టికి తినగా ఇంకా మిగిలిపోయే బోలెడంత అన్నం, కూరలు ఆ జోలెలో వున్నాయి కదా, ఇంకా అడుక్కుంటున్నావెందుకు?” అడిగింది కామాక్షి మాటల్లో చులకన భావాన్ని వ్యక్తపరుస్తూ.
“ఇది నా ఒక్కడికే కాదు తల్లీ, నేను వుంటున్న గుడి వద్ద ఇంకా ఇద్దరు నాలాంటి బిక్షగాళ్ళే వున్నారు” చెప్పాడు బిక్షగాడు.
“వాళ్ళ తిండి కూడా నువ్వే సంపాదించాలా, వాళ్ళు స్వంతంగా అడుక్కోలేరా?” ప్రశ్నించింది కామాక్షి.
“వాళ్ళల్లో ఒకరికి జ్వరం, మరొకరికి కాలు విరిగి నడవలేకుంటే నేనే ఇలా చేస్తున్నానమ్మా, మనిషిగా సాటి మనిషికి సాయం చేయదగిన స్థితిలో వుండి కూడా ఆ మాత్రం చేయకుంటే ఎలా” చెప్పాడు బిక్షగాడు తనలోని మానవత్వాన్ని ప్రకటించుకుంటూ.