వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-36

0
2

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. ఉచితంగా…

“పిల్లలూ, మీకు మరో పది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి కదా, అందరూ బాగా ప్రిపేర్ అయినట్లేనా?” తన స్కూల్లో పదవ తరగతి చదువుతున్న పిల్లలందరినీ అడిగాడు హెడ్మాస్టర్ శేషగిరి ఓ రోజు ఉదయాన్నే క్లాస్ ప్రారంభం కాగానే.

“చాలా బాగా ప్రిపేరయ్యాం సార్” చెప్పారు పిల్లలందరూ ఒకేసారి ఎంతో ఉత్సాహంగా.

“వెరీగుడ్, అయితే ఈసారి రిజల్ట్స్ లో మన స్కూలు కూడా ఫలితాల్లో జిల్లాలోని టాప్ టెన్ స్కూళ్ళ జాబితాలో స్థానం సంపాదించుకుంటుందని ముందుగానే అనుకోవచ్చా” అడిగాడు హెడ్మాస్టర్.

“అనుమానమే అవసరం లేదు సార్” ధీమా వ్యక్తం చేశారు ముందు వరుసలోని కొందరు పిల్లలు.

“సరే, పరీక్షలు పూర్తయ్యాక మళ్ళీ కాలేజీలు తెరిచేంతవరకు సుమారుగా మూడు నెలలు శెలవులు వుంటాయి కదా, మీలో ఎవరెవరు ఏమేం చేయాలనుకుంటున్నారో ఒక్కొక్కరే చెప్పండి చూద్దాం” అడిగాడు హెడ్మాస్టర్.

“నేను పాలిటెక్నిక్ ఎంటన్స్‌కు ప్రిపేర్ కావాలనుకుంటున్నా సార్” అన్నాడు సురేంద్ర అనే విధ్యార్థి.

“నేను సమయాన్ని వృథా చేయకుండా సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక పని చేయాలనుకుంటున్నా సార్” జవాబిచ్చాడు ఫణీంద్ర అనే అబ్బాయి.

“అంటే?” ప్రశ్నార్థకంగా చూశాడు హెడ్మాస్టర్.

“మా ఊళ్ళోనూ, చుట్టుప్రక్కల పల్లెల్లోనూ మొక్కలు నాటుతా సార్” సమాధానమిచ్చాడు ఆ అబ్బాయి.

“శెభాష్, మొక్కలు నాటడం వల్ల ఏమేం ఉపయోగాలు వున్నాయో ఒక్కొక్కరే చెప్పగలరా?” మళ్ళీ ప్రశ్నించాడు హెడ్మాస్టర్.

“వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించి, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు సార్, చెట్లతో “పచ్చదనం పెరిగితే వానలు దండిగా కురుస్తాయి సార్” ఇంకో అబ్బాయి జవాబు.

“సురేష్, నీ సంగతేమిటి?”అడిగాడు హెడ్మాస్టర్ ఓ విద్యార్థిని లేపుతూ.

“ఇవన్నీ నాకు తెలీదుగానీ సార్. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, నాణ్యత లేని పురుగు మందుల వల్ల పంటలు సరిగ్గా పండకున్నా, పండినా పంటలకు తగిన గిట్టుబాటు ధర దక్కకున్నా, ఓట్లు వేయించుకుని అవసరం తీరాక గవర్నమెంటు పట్టించుకోక, అప్పులకు వడ్డీలు చెల్లించలేని రైతులు భార్యా,పిల్లల్ని పోషించుకోలేని సందర్భాల్లో, అవమానాలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలంటే మళ్ళీ ఎవరి కాళ్ళా వేళ్ళానో పడి అప్పు చేసి పురుగు మందులు కొనాల్సిన అవసరం లేకుండా చెట్టు కొమ్మలకు తాడుతో ఉరి బిగించుకుని నయాపైసా ఖర్చు లేకనే పూర్తి ‘ఉచితంగా’ చావచ్చు సార్” చెప్పాడు ఓ నిరుపేద రైతు కొడుకైన ఆ కుర్రాడు ఎగదన్నుకుని వస్తున్న ఆయాసాన్ని కంట్రోల్ చేసుకుంటూ.

2. వెదుకులాట

“మమ్మీ, ఈసారి పరీక్షలవగానే ఎండాకాలం శెలవుల్లో ఓ రెండు నెలల పాటు రాజస్థాన్ రాష్ట్రానికి వెళ్ళి రావాలనుకుంటున్నా” కాలేజీ నుండీ ఇంటికి రాగానే చెప్పాడు వంశీ తన తల్లికి.

“మీ నాన్నను నువ్వే అడుగు, అనవసరంగా నాకు చీవాట్లు పెట్టించకు” చెప్పింది వసుంధర కొడుక్కి.

“నేను ఏది కోరినా ఇంతే, నా మీద నీకు ప్రేమే లేదులే” నిష్ఠూరంగా అన్నాడు వంశీ.

“మనకు అక్కడ బంధువులు గానీ, నీకు స్నేహితులు గానీ ఎవరూ లేరే, ఎందుకు అంత దూరం వెళ్ళడం?” అడిగింది వసుంధర.

” ఆ రాష్ట్రంలోని థార్ ఎడారిలో రాబందుల్ని చూడాలని ఎప్పటినుండీనో చూడాలని నా కోరిక, ప్లీజ్ మమ్మీ, నాన్నను ఎలాగైనా ఒప్పించు, నువ్వు ప్రయత్నిస్తే పని తప్పక జరుగుతుంది, నాన్న నీ మాట కాదనరు” చెప్పాడు వంశీ.

“అయినా అదేం కోరికరా నీకు, ఏ జైసల్మీర్ కోట చూడడానికో వెళ్ళక” కొడుకును మందలిస్తున్నట్లుగా అంది వసుంధర.

సరిగ్గా నెల రోజుల తర్వాత….

“బాబూ, నువ్వెవరో ఎన్ని కష్టాలు పడి వచ్చావో తెలీదుగానీ, సుమారుగా రెండు వారాలుగా గమనిస్తున్నా, ప్రాణాలు పోతున్నా గొంతు తడుపుకునేందుకు కనీసం ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా దొరకని ఈ భయంకరమైన ఎడారిలో రోజూ దేనికోసం వెదుకుతున్నావ్?” ఓ రోజు వంశీని అడిగింది ఆ ప్రాంతంలోని ఓ జెముడు చెట్టు ఆశ్చర్యంగా చూస్తూ.

“సజీవంగా వున్న రాబందుల్ని ప్రత్యక్షంగా చూడాలని వచ్చా” చెప్పాడు వంశీ నిలువెల్లా తడిపేస్తున్న చెమటల్ని తుడుచుకుంటూ.

“అలాగా, నువ్వు మరీ పిచ్చోడిలాగా వున్నావే, ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి మరీ రాబందుల్ని చూడడానికి ఇంత దూరం రావాలా?” జాలి ప్రకటిస్తూ అడిగింది జముడు చెట్టు.

“ఇంకెలా మరి?, ఎంతో ఆశతో వస్తే ఇక్కడ సైతం ఒక్కటి కూడా కనిపించడం లేదు” నిరాశగా అన్నాడు వంశీ.

“ఓరి వెర్రివాడా, ఎంతోకాలంగా చచ్చిన శవాల్ని మాత్రమే తినడం విసుగేసి రాబందులన్నీ ఇప్పుడు బ్రతికున్న జనాల్ని చంపుకు తినడంపై మోజు పుట్టి మీ మనుష్యుల్లాగే (?) రూపం మార్చుకుని మీ ముందే తిరుగాడుతున్నాయ్, బాగా గమనించుపో” చెప్పిందా జెముడు చెట్టు తనకున్న ముళ్ళ పళ్ళికిలించి నవ్వుతూ.

3. వెగటు

“బావా, ఈమధ్య నెల రోజులుగా గమనిస్తున్నా, మరీ సన్నగా చిక్కిపోతున్నావెందుకు?” వాగు గట్టున వున్న ఓ నేరేడు చెట్టుపై కాపురం వుంటున్న ఓ కోతి అడిగింది వాగులో నివాసం వున్న మొసలిని.

“ఏం లేదులే” నిర్లిప్తంగా జవాబిచ్చింది మొసలి.

“చెప్పడం ఇష్టం లేక అలా అంటున్నావు గానీ, సమస్య ఏంటో చెబితే నాకు తోచిన సలహా ఇస్తాగా” అంది కోతి కారణం చెప్పమన్నట్లుగా.

“మరేం లేదు, ఈ మధ్య ఆకలి సమస్య మరీ ఎక్కువయ్యింది, ఈ వాగులో నాకు తగినంత తిండి దొరకడం లేదు” సమాధానమిచ్చింది మొసలి నీరసంగా.

“వాగులో చేపలు దండిగానే వున్నట్లున్నాయే, ఏంటి సమస్య?”ప్రశ్నించింది కోతి.

“దండిగా ఎక్కడ వున్నాయి, పొరుగునే పట్నంలో వున్న జాలరులు నా నోటికి దక్కాల్సిన తిండిని తమ వ్యాపార అవసరాలకోసం వలలు వేసి మరీ ఖాళీ చేసేస్తే” ఆవేదనగా చెప్పింది మొసలి.

“అది సరే బావా, ఈ మధ్య కొందరు మనుషులు స్నానం కోసం వచ్చి వాగులో దిగి గంటల తరబడి గడుపుతున్నారు కదా, గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళను నీళ్ళ అడుగుకు లాక్కెళ్ళి కడుపు నిండా ఆరగించలేకపోయావా?”అడిగింది కోతి.

“అలాగే చేద్దామని ఓ రోజున ఆలోచన అయితే వచ్చిందిగానీ, స్నానానికి వచ్చిన వాళ్ళు గొంతు బాగా తగ్గించి తమలో తామే మాట్లాడుకునే మాటలు చాలాసార్లు విని ఆ ప్రయత్నం విరమించుకున్నా” బదులిచ్చింది మొసలి.

“ఎంతో ఆకలి మీద వుండి కళ్ళ ముందే అందుబాటులో వున్న ఆహారాన్ని కూడా నువ్వు వద్దనుకునేలా చేసే మాటలు ఏం మాట్లాడుకున్నారు బావా వాళ్ళు?” ఆసక్తిగా అడిగింది కోతి.

“ఆకలి తీరుతున్నా, తమ అవసరాలకు మించి మరీ తమ సాటి మనుషులనే డబ్బు కోసం, అధికారం, కీర్తి కోసం ఎలా మోసం చేయాలా అని వివేకం, వివేచన, ఏమాత్రం లేని మన జంతువుల కంటే దారుణంగా, హీనంగా కుతంత్రాలు పన్నడం గురించి మాట్లాడుకుంటుంటే నిలువెల్లా విషం నిండిన వాళ్ళ మాటలు విని వెగటు పుట్టి తినబుద్ది కాలేదు, ఆకలితో ఇలాగే నకనకలాడి చావనైనా చస్తాగానీ” చెప్పింది మొసలి మొహంలో ఏహ్యభావం కదలాడుతుండగా…

4. పరిహారం

“ఏరా శివా, ఇక్కడ వున్నావ్?”పట్నంలోని ఎమ్మార్వో ఆఫీసు వద్ద కనిపించిన తన సమీప బంధువు శివశంకర్‌ను పలకరించాడు సుబ్బరామయ్య.

“పట్టాదారు పాసు పుస్తకం కోసం అప్లయ్ చేసినాను మామా, దానికోసమే వచ్చా” బదులిచ్చాడు శివ.

“పని ఎంతదాకా వచ్చింది?”అడిగాడు సుబ్బరామయ్య.

“నెల రోజుల నుండీ ఒకటే తిరుగుడు మామా, ఏం చెప్పమంటావ్, పల్లెలో పనులన్నీ మానేసి రోజూ అదే పనిగా రావాల్సివస్తోంది, ఎన్నిసార్లు వచ్చినా పని పూర్తి కావడం లేదు” అసంతృప్తిగా అన్నాడు శివ.

“ఈ గవర్నమెంటు ఆఫీసుల్లో ఇంతేరా శివా, ఏ వాయిదాలు వేయకుండా పనులు జరిగితే అదొక ఎనిమిదో వింతే మరి” జోక్ వేసినట్లు పగలబడి నవ్వుతూ అన్నాడు సుబ్బరామయ్య.

“నిజమే మామా నువ్వు చెప్పేది,రా మామా, వెళ్ళి టీ త్రాగొద్దాం” ఆఫీసు ముందువైపు వున్న టీ కొట్టు వైపు దారితీస్తూ అన్నాడు శివ.

“టౌన్‌కు ఎప్పుడు వచ్చినావ్ శివా?”ప్రశ్నించాడు సుబ్బరామయ్య.

“ప్రొద్దున్నే ఫస్ట్ బస్ ఈరోజు రాలేదు మామా, షేర్ ఆటోలో వస్తి, ఇంతకూ నువ్వు ఎప్ప్పుడు వచ్చినావు మామా?” అడిగాడు శివ టీ కొట్టు వ్యక్తి అందించిన వేడి టీ గ్లాసు సుబ్బరామయ్య చేతికి ఇస్తూ.

“మన పల్లె ఎగువ వీధి నారాయణ ఓ లక్ష రూపాయలు కావాలని అడిగితే బ్యాంకులో కొంచెం డబ్బు తీసుకోవాల్సిన పని వుంటే నిన్న మధ్యాహ్నం వచ్చినా శివా, రాత్రి మా రెండో కూతురు ఇంట్లో వుంటి” చెప్పాడు సుబ్బరామయ్య.

“మామా, నువ్వు ఏమనుకోనంటే ఓ మాట చెప్తా, నువ్వు వడ్డీ డబ్బులకు ఆశపడి నారాయణకు అప్పు ఇస్తున్నావేమో, జాగ్రత్త మామా” హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు శివ.

“ఇస్తే ఏమవుతుందిరా?” ప్రశ్నించాడు సుబ్బరామయ్య సందేహంగా చూస్తూ.

“ఆయన సేద్యం చేసే ‘సన్నకారు’ రైతు కదా మామా, వానలే కురవడం లేదు, పంటలు పండక బాకీ తీర్చడం మాట ప్రక్కన పెడితే పొరపాటున ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే నీ డబ్బుకు ఏం గ్యారంటీ?” అడిగాడు శివ.

“ఓరి పిచ్చోడా, నువ్వు చెప్పినట్లు జరిగినా మన డబ్బుకు ఢోకా వుండదు లేరా, అప్పుడు గవర్నమెంటు ఇచ్చే పరిహారంతో నారాయణ భార్య మన బాకీ తీర్చుతుంది” అర్థం చేసుకోమన్నట్లుగా చెప్పాడు సుబ్బరామయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here