వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-38

0
2

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. తప్పు

“అమ్మా, మధ్యాహ్నం కాల్ చేసినపుడు పండుగ శెలవులు గడపడానికి సుచీ, పిల్లలు వచ్చారన్నావు, ఎక్కడా కనబడ్డం లేదే” సాయంత్రం ఆఫీసు నుండీ రాగానే చెల్లెలు సుచరిత గురించి తల్లిని అడిగాడు కిరణ్.

“తను బెడ్ రూంలో ఎవరితోనో మొబైల్‌లో మాట్లాడుకుంటోంది, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్‌కు వెళ్ళారు” చెప్పింది రాజేశ్వరమ్మ కొడుక్కి.

రాత్రి భోజనాళ వేళ…

“అమ్మా, సుచీని కూడా రమ్మను, అందరం కలిసే భోంచేద్దాం” చెప్పాడు కిరణ్ తల్లికి.

“తను డాబా మీద ఎవరో స్నేహితురాలితో కాల్‌లో బిజీగా వుందిరా, నువ్వు కానివ్వు” చెప్పింది రాజేశ్వరమ్మ.

మరుసటి రోజున, ఉదయం తొమ్మిది గంటల వేళ…

“అమ్మా, సుచీ నిన్ననగా వచ్చింది, ఇప్పటికీ కనిపించి పలకరించలేదు, కనీసం ఇప్పుడన్నా రమ్మను, కలిసి టిఫిన్ చేస్తాం” ఆఫీసుకు బయలుదేరబోతూ తల్లితో చెప్పాడు కిరణ్.

“సుచీ ఎవరితోనో చాటింగ్‌లో బిజీగా వున్నట్లుంది, టిఫిన్ ఇప్పుడే వద్దట, తన కోసం వెయిట్ చేయకులే, తినేసి ఆఫీసుకు బయలుదేరు” జవాబిచ్చింది రాజేశ్వరమ్మ.

మరుసటిరోజున ఉదయం ఆరు గంటల వేళ….

“పార్వతమ్మా, అమ్మకు గానీ, మా అన్నయ్యకు గానీ నా మొబైల్ ఫోన్ తీయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు, రాత్రి ఒంటి గంట సమయంలో పడుకునేటప్పుడు బెడ్ మీదే పెట్టుకుని పడుకున్నా, నువ్వే తీసింటావ్, ఎక్కడ పెట్టావో నిజం చెప్పు. దొంగముండా” నిద్ర లేచీ లేవకనే పనిమనిషి మీద రంకెలేస్తూ నిలదీసింది సుచరిత.

“నేను అస్సలు చూడలేదమ్మ గారూ, దేవుడి మీద ఒట్టు” చెప్పింది పనిమనిషి.

“సుచీ, పనిమనిషిని అనవసరంగా ఇంకో మాట అన్నా బాగోదు” చెల్లెలికి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్.

“తనను దొంగ అంటే నీకెందుకు అన్నయ్యా, అంతగా రోషం పొంగుకొస్తోంది?” కోపంగా అడిగింది సుచరిత కిరణ్‌ను.

“నీ మొబైల్ తీసింది పనిమనిషి కాదు, నేనే తీసి వీధి కాలువలోకి విసిరేశా” చెప్పాడు కిరణ్.

“ఎందుకన్నయ్యా?” అడిగింది సుచరిత అర్థం కానట్లుగా చూస్తూ.

“నువ్వు వచ్చి రెండు రోజులు కావస్తోంది, అయినా ఆ ఫోన్‌తో ఎప్పుడూ బిజీగా వుండి కనీసం నన్ను పలకరించను కూడా వీలు లేనట్లుగావుంటే” చెల్లెలుకు కోపంగా జవాబిచ్చాడు కిరణ్ ఇకనైనా తన తప్పు తెలుసుకుంటుందన్నట్లుగా.

2. అబద్ధం

“ఏమండీ, ఇవాళ మధ్యాహ్నం మా అమ్మ కాల్ చేసి వచ్చే వారం నుండీ దశరా శెలవులు వస్తున్నాయిగా, మనల్ని అందరినీ ఓ వారం గడిపి వెళ్ళేందుకు అక్కడికి రమ్మని పిలిచిందండీ” చెప్పింది గీత రాత్రి భోజనాళ వేళ భర్తతో.

“తన ఆరోగ్యం ఇప్పుడెలా వుందట?” అడిగాడు సురేష్ భార్యను.

“బాగానే కుదురుకుందట గానీ, రేపు మీరు ఆఫీస్ నుండీ వచ్చేటప్పుడు మన అందరికీ టికెట్లు రిజర్వు చేసుకు రండి” చెప్పింది గీత.

“గీతా, మరేం అనుకోకు, ఈసారి పండుగ మనం ఇక్కడే మన ఇంట్లోనే చేసుకుందాం” చెప్పాడు సురేష్ భార్యకు.

“ఎందుకలా?” అడిగిందామె భర్తను.

“సోమవారం నుండీనే నాకు ఆఫీసులో పది రోజులపాటు ఇనస్పెక్షన్ జరగబోతోంది, శెలవు పెట్టడం కుదరదు” చెప్పాడు సురేష్.

“సరే మీకు కుదరదంటున్నారు, కనీసం నేను, పిల్లలన్నా వెళతాం మరి” అంది గీత.

“అయ్యో, నువ్వు వెళితే ఎలా, నాకు వారం రోజులపాటు హోటల్ తిండి పడక కడుపునొప్పితో మళ్ళీ అనారోగ్యం తిరగబెడితే” భయంగా అన్నాడు సురేష్.

“సరే, వెళ్ళము లెండి” నిరాశగా అంది గీత.

సరిగ్గా పదిహేను రోజుల తర్వాత….

“ఏమండీ,ఇందాకే మీ కొలీగ్ రవి భార్య సునీత మార్కెట్‌లో కనిపించి శెలవుల్లో ఊరికి వెళ్ళలేదా అని అడిగితే ఆఫీసులో ఇనస్పెక్షన్ వల్ల వెళ్ళలేకపోయామని చెప్పా, కానీ ఏ ఇనస్పెక్షన్ జరగలేదటనే, నాకెందుకు అబద్ధం చెప్పారు?” ఆఫీసు నుండీ రాగానే కోపంగా భర్తను నిలదీసింది గీత.

“ఏం లేదు గీతా, క్రితం ఏడాది మీ నాన్నగారు చనిపోయిన దిగులుతో మంచం పట్టిన అత్తయ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది, పైగా ఇప్పుడు తనకు టైలరింగ్ తప్పిస్తే పెద్దగా ఆదాయం కూడా లేదు,ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి మనం ఆవిడకు భారం కావడం ఇష్టం లేకనే అబద్ధం చెప్పా” భార్యకు బదులిచ్చాడు సురేష్ గొంతులో నిజాయితీ ధ్వనిస్తుండగా.

3. ధర్మం

“పార్వతీ, అన్నయ్య ఫోన్ చేశాడు, అమ్మకు మరీ బాగాలేదట, త్వరగా ఓ రెండు జతల బట్టలు సర్దు, మరో అరగంటలో వెళ్ళే ట్రైన్ వుంది, దాన్ని క్యాచ్ చేయాలి” భార్యతో చెప్పాడు నరేంద్ర ఆఫీసు నుండీ హడావుడిగా ఇంటికి వస్తూనే.

“తనకు మరీ బాగుండకపోవడం, మీ అన్నయ్య ఇలా కాల్ చేయగానే మీరు పరుగెత్తుకుంటూ వెళ్ళడం ప్రతిసారీ మామూలే కదా” భర్తను దెప్పిపొడిచినట్లుగా అంది పార్వతి.

“ఈసారి శరీరం చికిత్సకు అస్సలు ఏమాత్రం సహకరించలేదట, అన్నయ్య మాటలు కూడా పరోక్షంగా చివరిచూపులకు రమ్మన్నట్లుగా వున్నాయి” చెప్పాడు నరేంద్ర .

“మీరు ఇప్పుడు వెళ్ళడం అంత తప్పని సరా?” కోపంగా అడిగింది పార్వతి.

“వెళ్ళక తప్పదు” జవాబిచ్చాడు నరేంద్ర భార్య మీద కోపాన్ని దిగమింగుకుంటూ.

“ఆవిడ మీ విషయంలో ఏం ఒరగబెట్టిందని అంతగా ఎగేసుకుని పోతున్నారు?”నరేంద్ర వెళ్ళడం తనకు ఇష్టం లేనట్లుగా అంది పార్వతి.

“కొడుకుగా ఈ దశలో ఆవిడను చూడడం నా ధర్మం కాబట్టి” చెప్పాడు నరేంద్ర.

“తల్లిగా ఆవిడ తన ధర్మం ఏనాడూ నెరవేర్చలేదే, పెద్ద కొడుక్కు జీతం చాలా తక్కువ, పిల్లలు, ఖర్చులు కూడా మనకంటే ఎక్కువ అంటూ మీ నాన్నగారు పోయాక ఆవిడ పేరిట ప్రతి నెలా వచ్చే పదివేల పెన్షన్, మామయ్య తన పేరిట రిజిష్టర్ చేయించిన ఇల్లు, పొలం, బంగారు అంతా తనకు ఒక్కడే కొడుకు అన్నట్లుగా మీ అన్నయ్యకే ఇచ్చేసింది తప్ప మీకు చిల్లిగవ్వ అయినా ఇవ్వలేదే” భర్తకు అడ్డుపడింది పార్వతి.

“నాన్న పోయిన కొత్తల్లో ఆవిడ దిగులుతో మంచాన పడితే అత్తయ్య అని కాకుండా, కనీసం సాటి ఆడమనిషి అని కూడా చూడకుండా సేవలు చేయడానికి విసుక్కుని నాతో వేరు కాపురం పెట్టించావ్, నువ్వు చెప్పే అన్నింటిలో అసలు నీకు భాగం ఎందుకివ్వాలి?” అడిగాడు నరేంద్ర.

“ఆవిడ మీ అన్నయ్యలా మిమ్మల్ని కూడా కనిందే తప్ప కక్కలేదుగా, ఎందుకిలా మిమ్మల్నే చిన్నచూపు చూడడం అని?” మొండిగా అంది పార్వతి.

“నువ్వు చెప్పేవన్నీ ఇవ్వకపోయినా నేను కడుపులో వుండి ప్రసవ సమయంలో అడ్డం తిరిగితే నన్ను ప్రాణాలతో ఈ భూమి మీదకు తెచ్చేందుకు. ఎన్నో కత్తికోతల్ని పంటిబిగువున భరించి తల్లిగా నాకోసం తన ప్రాణాలనే త్యాగం చేసేందుకు సిద్దపడింది, అది చాలు” విసురుగా అంటూ కాలు బయటపెట్టాడు నరేంద్ర.

4. కిరీటం

“ఏమయ్యా, పొద్దున్నే పొలం కాడికి పొయ్యేటప్పుడు ఇంత సద్ది తినేసి పొమ్మంటే అట్లే ఎల్లబారిపోతివి, ఇప్పుడు చూడు టయిం ఎంతయిండాదో” భర్తకు అన్నం వడ్డిస్తూ అంది చంద్రమ్మ.

“నేను ఇంటికాడ బయలుదేరేటప్పుడు వుండే కరెంటు తీరా మడి కాడికి పోతానే కట్ అయ్యింది, మల్లా సప్లై వొచ్చి నీల్లు కట్టేటప్పిటికి ఈ టయిం అయింది, బాయికాడ నేనేమన్నా ఆడుకుంటా వుంటిననుకుంటివా?” భార్యతో నిష్టూరంగా అన్నాడు సాంబయ్య.

“సరేలే, రేపుట్నుండీ అంత తినేసిపో, మల్లా ఇంటికి ఎబ్బుడు వొచ్చినా నిన్ను అడిగేవాల్లు వుండరు గానీ, ఔనయ్యా, సుబ్బయ్య చిన్నాయనకు ఈ మద్దెన మతి సరిగ్గా లేక పిచ్చి పట్టిందంటనే?” అంది చంద్రమ్మ.

“అవునా, ఎవురు చెప్పిరే చెంద్రీ నీకు?” ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు సాంబయ్య.

“పొద్దన్నే వాల్ల పక్కింటి పుల్లమ్మత్త చెప్పింది, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తా, అర్తం, పర్తం లేకుండా మాట్లాడతా వుండాడంట” బదులిచ్చింది చంద్రమ్మ.

“అవునా, మొన్నటిదాకా బాగుండెనే, ఇంతకూ ఏం మాట్లాడతాండాడంటమ్మే?” అడిగాడు సాంబయ్య.

“ఏందోనయ్యా, ఎబ్బుడు చూసినా తలకాయ పట్టుకోని నాకు కిరీటం, సింహాసనం కావల్ల, చేపిచ్చండి, కిరీటాలు చేపిస్తామని ఇరబై ఏండ్లకు పైగా చెప్పబడ్తిరి, ఇంగా ఎన్నేండ్లకు చేపిస్తారు, ఆ లోపల మా పానాలు పోవా?” అని నీల్లు, నిద్ర గూడా లేకుండా ఒగటే ఏడుస్తా, గెట్టిగా అరుస్తా ఎర్రి చూపులు చూస్తా గుడ్డలు గుడా చింపుకుంటావుండాడంట” భర్తకు చెప్పింది చంద్రమ్మ.

“అట్లనా, అయ్యో పాపం అయితే సుబ్బయ్యకు ఈ ముసిలి వయస్సులో నిజంగానే పిచ్చి పట్టినట్లుండాదే పాపం” జాలిగా అన్నాడు సాంబయ్య భార్యతో.

“అవునా, ఇంతకూ ఆ చిన్నాయన మాట్లాడతాండే మాటలకు అర్తం ఏందయ్యా?” భర్తను అడిగింది చంద్రమ్మ సందేహంగా చూస్తూ.

“ఏంలేదే చెంద్రీ, ఇరబై ఏండ్లనుండీ మన నాయకులు ఎబ్బుడు ఎలక్సన్లు వొచ్చినా ఓట్ల కోసరం రైతును రాజుగా చేస్తామని చెప్తాండారుగదా, ఈ యెర్రినాకొడుకు ఆ మాటలు నిజమేనని నమ్మినట్లుండాడు, పొద్దస్తమానం అదే ఆలోచించి కిరీటం, సింహాసనం అని కలవరించి పిచ్చి పట్టినట్లుంది” చెప్పాడు సాంబయ్య కంచంలో చెయ్యి కడుగుతూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here