వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-5

0
2

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. స్టేట్ ఫస్ట్ ర్యాంక్

“సుబ్బారావు గారూ, మా ఛానల్ లో ఓ అరగంట సేపు మీ అబ్బాయి ‘మహతీకృష్ణ’తో స్పెషల్ ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నామండీ” కాల్ చేసి అడిగాడు పాపులర్ ఛానల్ స్పెషల్ కరస్పాండెంట్.

“మరో అరగంటలో మా అబ్బాయితో సహా మీ స్టుడియోలో ఉంటా సార్” సంతోషంతో ఉక్కిరి బిక్కిరి బిక్కిరి అవుతూ సమాధానమిచ్చాడు సుబ్బారావు.

సరిగ్గా గంట తర్వాత……

“బాబూ నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో నువ్వు’స్టేట్ ఫస్ట్ ర్యాంకు’ సాధించావు కదా ఎలా ‘ఫీల్’ అవుతున్నావు” కొన్ని వ్యక్తిగత వివరాలు రాబట్టాక అడిగాడు ఛానల్ ప్రతినిధి.

“పెద్దగా ఏం అనిపించలేదు అంకుల్”నిర్లిప్తంగా జవాబిచ్చాడు మహతీకృష్ణ.

“రాష్ట్ర స్థాయిలో ఇంత గొప్ప చరిత్ర సృష్టించినా నీ మొహంలో సంతోషం ఏ మాత్రం కనిపించడం లేదు?” మళ్లీ ప్రశ్నించాడు కరస్పాండెంట్.

“నేను కూడా మిమ్మల్ని ఓ ప్రశ్న అడగవచ్చా అంకుల్?” మెల్లగా అడిగాడు మహతీకృష్ణ.

“ఓకే బాబూ” ఉత్సాహపరుస్తున్నట్లుగా చెప్పాడు కరస్పాండెంట్.

“మీరంటున్న ఈ గొప్ప చరిత్ర ఐదేళ్ల వయసు నుండి ఇప్పటి దాకా నేను కోల్పోయిన అందమైన బాల్యాన్నీ, దూరం చేసుకున్న ఎన్నో సంతోషాలను నాకు తిరిగి వాపసు తెచ్చి ఇవ్వగలదా అంకుల్?” ప్రశ్నించాడు మహతీకృష్ణ పక్కనే కూర్చునివున్న తండ్రి సుబ్బారావు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.

2. సాయం

“ఏరా, సుబ్బయ్యా! దారితప్పి వచ్చినట్లున్నావే?” తన ఇంటివద్దకు వచ్చిన ఎగువపల్లి సుబ్బయ్యను ప్రశ్నించాడు గ్రామనాయకుడు భూషణం.

“యాభైవేలు ‘ లెక్క’ కావల్లప్పా, మీరే సాయం చెయ్యల్ల” తల గోక్కుంటూ అభ్యర్థిస్తున్నట్లుగా అన్నాడు సుబ్బయ్య.

“అంత పెద్ద మొత్తం ఎందుకురా?” అడిగాడు భూషణం.

“నా కొడుకు కాలేజీ సదువు సదివి కూడా నాలుగేండ్లుగా ఏ ఉద్యోగమూ రాలేదు సామీ, కోయెట్ దేశానికి పోతానంటాండాడు,నా భూమి నీ పేరుతో రాసిస్తాలే” వినయంగా అన్నాడు సుబ్బయ్య.

“పిల్లవాడి కోసం అంటున్నావు, మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్ళు” చెప్పాడు భూషణం.

అదేరోజు సాయంత్రం……

“నాన్నా, ఆ సుబ్బయ్య మన ప్రత్యర్థి వర్గం రాయుడి మనిషి అని తెలిసి కూడా అడిగిన వెంటనే డబ్బు ఎందుకు ‘సాయం’ చేశావు?” నిష్ఠూరంగా భూషణాన్ని ప్రశ్నించాడు అతని కొడుకు గ్రామ యువ నాయకుడు శేఖర్.

“వాడికి సాయం చేస్తే మన వర్గం లోకి వస్తాడు, పైగా వాడి కొడుకును కోయెట్కు పంపేందుకు ‘సాయం’ చేయకుంటే వచ్చే పంచాయతీ ఎలక్షన్ వాళ్ళ కులానికే రిజర్వేషన్ వస్తే మన తరపున నిలబెట్టే మనిషి మీదనే పోటీ చేయ్యొచ్చు, ఎంతైనా సదువుకున్నోడు గదా”ఒకే దెబ్బతో రెండు పిట్టలన్నట్లు చెప్పాడు కొడుకుతో భూషణం.

3. అ(పా)ర్థం

“వారం రోజుల్లో మీ బావగారికి ఇవ్వాల్సిన పాతికవేల కట్నం బాకీ  సొమ్ము నేను సర్దుతాను గానీ వెళ్లి ఇచ్చేసి రండి” ఎక్కడా అప్పు పుట్టక ఎంతో ఆందోళనతో ఉన్న భర్త శంకరానికి చెప్పింది పార్వతి.

“నా చెల్లి పెళ్లి కోసం ఇదివరకే నీ మెడలోని బంగారు గొలుసు కూడా ఇచ్చేశావు, మళ్లీ ఎలా సర్దగలుగుతావు?” నిర్లిప్తంగా ప్రశ్నించాడు శంకరం.

సరిగ్గా వారం రోజుల తర్వాత..

“అన్నయ్యా, సమయానికి సొమ్ము తెచ్చి అత్తవారింట్లో నా పరువు కాపాడావు, ఈ డబ్బు కోసం మళ్లీ అప్పు చేశావా?” అడిగింది పద్మ, శంకరం చెల్లెలు.

“మీ వదిన సర్దుబాటు చేసిందమ్మా” చెప్పాడు శంకరం.

“వదిన పుట్టింటి వాళ్ళు కూడా పెద్దగా జరుగుబాటు లేని వాళ్లే కదా, కొంపదీసి ఆవిడ ఈ డబ్బు కోసం తను పాచిపని చేసే ఎవరి ఇంట్లోనన్నా దొంగతనం చేసిందేమో” అనుమానంగా గొణిగింది పద్మ లోగొంతుకతో.

“కాదమ్మా, తన కడుపున పుట్టిన సొంత బిడ్డను కూడా అర్థాకలితో పస్తులు ఉంచి తల్లి పాలు పడని ఎవరో ఉన్న వాళ్ళ చంటి పిల్లాడికి ఆరునెలల పాటు తన పాలతో ఆకలి తీర్చేందుకు ఒప్పుకొని నీ కోసం ఈ సొమ్ము సర్దుబాటు చేసిందమ్మా మీ వదిన” పూడుకుపోయిన గొంతుతో చెప్పాడు శంకరం.

వదినను అమ్మతో ఎందుకు పోలుస్తారో అర్థమౌతూ ఉండగా ఆమెను అపార్థం చేసుకున్నందుకు అన్న మొహం లోకి చూసే ధైర్యం చేయలేక పోయింది పద్మ.

4. పుట్టినరోజు

“విష్ యు హ్యాపీ బర్త్ డే బంగారూ” కూతురు పన్నెండేళ్ల సంజనను నాలుగింటికే నిద్రలేపి గ్రీటింగ్స్ చెప్పింది మాధవి.

“థ్యాంక్యూ మమ్మీ”రెండు చేతులతో తల్లి మెడను కావలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ అంది సంజన.

“బాత్రూంలోకి పద, తలంటు పోస్తా, త్వరగా రెడీ అయితే గుడికి తీసుకెళతా. మళ్లీ బోలెడు పనులు చేసుకోవాలి” అంది హైరానాగా మాధవి.

“మమ్మీ, ఏమనుకోనంటే నిన్నోమాటడుగుతా, గత నాలుగేళ్ళుగా గమనిస్తున్నా, నువ్వెందుకో నా ప్రతి పుట్టినరోజు నాడూ ఎంతో సంతోషంగా ఉండక చాలా దిగులుగా కనిపిస్తావేం?” తల్లిని ప్రశ్నించింది సంజన.

“ఆ రోజునుండే కదమ్మా, ఈ ఇంట్లో నాకు నరకం మొదలయ్యింది” చెప్పింది మాధవి.

“ఎందుకలా?”ఆశ్చర్యంగా చూస్తూ మళ్ళీ ప్రశ్నించింది సంజన.

“నిన్ను మగపిల్లాడిగా కాక ఆడపిల్లగా కన్నానని మీ నాన్నమ్మా, వంశాకురాన్నివ్వక గుండెలమీద గుదిబండను సిద్ధం చేశానని మీ నాన్నా నన్ను సూటి పోటి మాటలతో దెప్పిపొడవడం నువ్వు పుట్టినరోజు నుండీనే కదమ్మా మొదలయ్యింది” చుట్టూ పరికిస్తూ మెల్లగా గొణిగినట్టుగా వేదనతో అంది మాధవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here