Site icon Sanchika

వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-9

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. గొప్పదనం

“ఏమండీ, మన మ్యారేజ్ డే సందర్భంగా గ్రీటింగ్స్ చెప్పడానికి మా అన్నయ్య కాల్ చేశారు”స్నానం చేసి బాత్రూంలో నుండి వచ్చిన భర్తకు చెప్పింది కావ్య.

“నేను ఆఫీస్‌కి వెళ్ళాక బావగారితో తాపీగా మాట్లాడతాలే” అన్నాడు వెంకట్.

“ఇవాళ సెలవు పెట్టండీ, అంటే మళ్లీ ఆఫీస్ అంటున్నారే” నిష్ఠూరంగా అంది కావ్య.

“ఆడిట్ జరుగుతోంది, వెళ్లక తప్పదు, అయినా ఇది మన తొలి పెళ్లి రోజు కాదు కదా, సాయంత్రం త్వరగా వచ్చేస్తా, గుడికెళ్ళి మన పేర్ల మీద అర్చన చేయిద్దాం” అన్నాడు వెంకట్.

“నేను రానండీ, దేవుడంటే భక్తి ఉంది కానీ, గుడికి రావడమంటేనే ఎందుకో పెద్దగా ఇష్టం ఉండదు” చెప్పింది కావ్య అదోలా మొహం పెట్టి.

“ఎందుకలా?”ఆశ్చర్యపోతూ అడిగాడు వెంకట్.

“అక్కడున్న బిచ్చగాళ్లను చూస్తే ఎందుకనో నాకు అసహ్యం వేస్తుంది” చిరాగ్గా చెప్పింది కావ్య.

“మనకు చేతనైతే వాళ్లకు సహాయం చేయాలి కానీ, అలా హీనంగా మాట్లాడకూడదు కావ్య, అనుకుంటే వాళ్లు మనకంటే నిజంగా గొప్ప వాళ్ళు” అన్నాడు వెంకట్.

“బొచ్చ పట్టుకొని అందరినీ అడుక్కుతినడం గొప్పతనమా” హేళనగా అంది కావ్య.

“మనలాగా వాళ్ళు ఉద్యోగాలు సంపాదన సంసారం అని ఒత్తిళ్ల మధ్య కాక, ఉన్నా లేకున్నా నిత్యం గుడిమెట్ల మీదనే గడుపుతుంటారు కదా, నిజంగా ఆ భాగ్యం ఎందరికి దక్కుతుందో చెప్పు” భార్యకు బిచ్చగాళ్ళ పట్ల ఉన్న భావాన్ని తగ్గించాలి అన్నట్లుగా అన్నాడు వెంకట్.

2. సిఫార్సు

“ఉదయం మీ కోసం పల్లెలోమన పొలం వ్యవహారాలు చూసే రంగయ్య వచ్చి వెళ్లారండీ” రాత్రి భర్త జగన్నాథం ఇంటికి రాగానే చెప్పింది రుక్మిణమ్మ.

“కౌలు సొమ్ము ఇచ్చి వెళ్ళాడా?”అడిగాడు జగన్నాథం.

“ఈ నెలలో సర్దుబాటు కాలేదటండీ, మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాడట” చెప్పింది రుక్మిణమ్మ.

“దేని గురించి?” ప్రశ్నించాడు జగన్నాథం.

“వాళ్ల అబ్బాయి నిరంజన్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళుతున్నాడట ఆ విషయం గురించి” చెప్పింది రుక్మిణమ్మ.

“దాని గురించి నేనేం చెయ్యాలట” అర్థం కానట్లు అన్నాడు జగన్నాథం.

“ఎస్సై ఉద్యోగాలకు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మీ బాల్య మిత్రుడు, ముఖ్య స్నేహితుడు రంగనాథం గారు ఉన్నారట కదా, మీరు ఓ చిన్న మాట సాయం చేస్తే పని జరుగుతుందట” రంగయ్య వచ్చిన పని గురించి వివరించింది రుక్మిణమ్మ.

“ఈ రకమైన సాయం చెయ్యమని ఖచ్చితంగా చెప్పేయ్” మరో మాటకు తావులేనట్లు అన్నాడు జగన్నాథం.

“రంగయ్య పల్లెల్లో మన కోసం ఎంతో కష్టపడుతున్నాడు కదండీ”చెప్పింది రుక్మిణమ్మ.

“రంగయ్య కొడుకు నా సిఫారసు ద్వారా ఉద్యోగం తెచ్చుకుంటే, నిజమైన ప్రతిభ గల మరో నిరుద్యోగికి నా వల్ల పూర్తిగా అన్యాయం జరిగినట్లు కాదా, పైగా తగినంత ప్రతిభ లేనివాడు అధికారిగా పని చేస్తే అతను తీసుకునే నిర్ణయాల వల్ల సమాజ గతి సవ్యంగా సాగుతుందా?” అసలు కారణం చెప్పాడు జగన్నాథం.

3. అసలు నిజం

“రామకృష్ణ గారూ, సెకండ్ ఇయర్‌లో వుండే శేషాద్రిని ఒకసారి పిలిపించండి” బోటనీ లెక్చరర్‌తో చెప్పాడు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు.

“సరే సార్, ఇప్పుడే పిలిపిస్తా, అయినా సంగతేంటి?”అడిగాడు రామకృష్ణ.

“వాడు ఈ మధ్య చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నాడని నా అనుమానం, దాని గురించి అడిగేందుకే” చెప్పాడు ప్రిన్సిపాల్.

“ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు సర్, కానీ ఈ మధ్యకాలంలో కొన్నిసార్లు కాలేజీకి కూడా సరిగా రావడం లేదు” అన్నాడు రామకృష్ణ ఏదో ఆలోచిస్తూ.

ఓ పది నిమిషాల తర్వాత…

“శేషాద్రీ, ఈమధ్య నువ్వు కాలేజీకి సరిగా రావడంలేదట నిజమేనా?” తనముందు చేతులు కట్టుకుని నిల్చుని వున్న శేషాద్రిని ప్రశ్నించాడు ప్రిన్సిపాల్.

“నిజమే సార్” మెల్లగా గొణిగినట్లుగా అన్నాడు శేషాద్రి తల దించుకుంటూ.

“గత కొద్దికాలంగా తాగుడుకు అలవాటు పడుతున్నావు కదూ?” మరో ప్రశ్న వేశాడు ప్రిన్సిపాల్.

“లేదు సార్” బదులిచ్చాడు శేషాద్రి తల కాస్తంత పైకెత్తి.

“నిజం చెప్పరా, రోజూ రాత్రిళ్లు మా ఇంటికి వెళ్ళేదారిలోవున్న బార్ వద్ద నువ్వు వుండడం నేను కళ్ళారా చూస్తున్నా. నన్నే బుకాయిస్తున్నావే” శేషాద్రి చెంప ఛెళ్ళుమనిపిస్తూ రౌద్రాన్ని ప్రదర్శించాడు ప్రిన్సిపాల్.

“అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు సార్, నెల రోజుల క్రితం వాళ్ళ నాన్నకు పక్షవాతం వచ్చి మంచానికి పరిమితమైతే తండ్రి మందుల కోసం ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నాడు వాడు” తనకు తెలిసిన ‘అసలునిజం’ చెబుతూ అప్పుడే స్టాఫ్ రూంలోకి అడుగుపెట్టాడు మరో లెక్చరర్ శ్రీనివాస్.

4. అవసరం

“ఏమండీ, పల్లెలో మన పొలం చుట్టుపక్కల ఉన్న పొలాలకు మంచి ధరలు పలుకుతున్నాయట” సాయంత్రం భర్త స్కూల్ నుండి ఇంటికి రాగానే చెప్పింది సుశీల.

“ఎవరు చెప్పారు నీతో?”భార్యను అడిగాడు జనార్ధన్.

“మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు మా పిన్ని చెప్పింది, మనం కూడా మన పొలాన్ని ఇప్పుడే అమ్మేసుకుంటే పోలా”చెప్పింది సుశీల.

“పొలం అమ్మి వేయాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది సుశీలా?”అడిగాడు జనార్ధన్.

“పదేళ్లుగా మనం చేతి నుండి పెట్టుబడి పెట్టడం తప్ప ఏం లాభాలొస్తున్నాయని?” నిరుత్సాహంగా చెప్పింది సుశీల.

“నష్టం వచ్చినా పర్వాలేదు కానీ, పొలం అమ్మేయాలని ఆలోచన మాత్రం నీ మనసులోకి ఏ మాత్రం కూడా రానివ్వవద్దు” మందలింపుగా అన్నాడు జనార్ధన్.

“అది అమ్మేస్తే వచ్చే సొమ్మును బ్యాంకులో వేసుకుంటే కాస్తో కూస్తో వడ్డీ అయినా వస్తుంది, పైగా మనకు పొలం పనుల మీద పల్లెకు వెళ్లే శ్రమ కూడా తప్పుతుంది కదా?” భర్తకు నచ్చచెప్పుతున్నట్లుగా అంది సుశీల.

“వయసు పైబడిన మనం ఆసుపత్రులు అందుబాటులో ఉంటాయని టౌన్‌లో ఉన్నా, పొలం పనుల కోసమే పల్లెకు వెళ్లి వస్తున్నాము కదా, ఉన్న ఆ కాస్త పొలాన్ని తెగనమ్ముకుంటే ఆ వైపు అసలు వెళ్లాల్సిన అవసరం రాక అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు, అక్కడి బంధుత్వాలు పూర్తిగా తెగిపోవా?”పొలం అమ్మడం ఎందుకు ఇష్టం లేదో చెప్పాడు జనార్ధన్ భార్యతో.

Exit mobile version