Site icon Sanchika

వేములవాడ – నాంపల్లి గుట్ట దర్శన యాత్ర-1

[ఇటీవల వేములవాడ, నాంపల్లి గుట్ట దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]“ఈ[/dropcap] అక్టోబర్ 19వ తేదీన మీరు ఖాళీయేనా?” అని ఫోన్ చేశాడు సాహితీమిత్రుడు, సోదరుడు ప్రభాకర్, కరీంనగర్ నుంచి. ఆయన పూర్తి పేరు డా. వైరాగ్యం ప్రభాకర్. నాకు ఒక జోకు గుర్తొచ్చి అతనికి చెప్పాను. ఒకాయన ఇంకో ఆయనను అడిగాడట. “రేపు మీరు ఖాళీయేనా?” అని. ఆయన జవాబు ఆంగ్లంలో ఇచ్చాడు – “ఎస్. ఐ విల్ బీ ఎంప్టీ టుమారో!” అని. ఇంగ్లీషులో ఏడిస్తే అలాగే ఉంటుంది మరి!

వైరాగ్యం వారు నవ్వాడు. “అన్నా, దేంట్లోంచైనా, జోకును పీకగలవు గదా, అలవోకగా?” అన్నాడు.

“నీ మాటల్లో వృత్యనుప్రాసముంది బ్రదరూ” అన్నా నవ్వుతూ.

“అలాంటివి చెప్పాలనే, నిన్ను మా కరినగరానికి ఆహ్వానిస్తూ ఉన్నా. అక్టోబర్ 19న ఇక్కడ వాగేశ్వరీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో రెండు పుస్తకాలు ఆవిష్కరణ చేయిస్తున్నా. ఒకటి నా స్వయంకృతం ‘ఆకాశమంత’ అని. రెండవది సంకలనం ‘వజ్రబారతికి స్వర్ణభారతి’. నీవు విశిష్ట అతిథివి. వచన కవిత్వంలో కూడ లాక్షణిక విషయాలున్నాయని ఇది వరకోసారి చెప్పావు కదా అన్నా! దాని గురించి, పుస్తకాల గురించి నీవు మాట్లాడాలె” అన్నాడు.

“తప్పకుండా తమ్ముడు వస్తా. కాని నీవన్నావు చూడు, ‘స్వయంకృతం’ అని, అదే నచ్చలేదు నాకు. అదేదో తప్పులా ధ్వనించడం లేదూ?”

నవ్వాడు వైరాగ్యం.”ఏమో మరి? నీవే చెప్పాలి”

డా. వైరాగ్యం ప్రభాకర్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. నన్ను అప్యాయంగా ‘అన్నా!’ అని పిలుస్తాడు. మాలాంటి వాళ్లకు పిలిచేవాళ్లే కావాలి కదా! అదే రోజు తెల్లవారు జామున బయలుదేరి 10 గంటల లోపల కరీంనగర్ చేరుకోవచ్చు. కాని, శ్రమ అవుతుంది. నేనెప్పుడూ నా టూర్‌లను విశ్రాంతిగా ప్లాన్ చేసుకొంటా, తగినంత రెస్ట్ ఉండేలా. అదేనండోయ్, నా యాత్రా సాఫల్య రహస్యం!

సరే, 18న ఉదయం ఐదున్నరకల్లా లేచి, కాల్యములు, కృత్యములు ముగించాను. దేవీ నవరాత్రులు కదా! అమ్మవారికి శ్రీసూక్తముతో అభిషేకం, అష్టోత్తరశతనామార్చన, లక్ష్మీనరసింహునికి నిత్య పూజ చేసి, బయలుదేరాను. బ్యాగులో మా కస్తూరి మురళి తమ్ముడు సంకలనం చేసిన ‘రైలు కథలు’ పెట్టుకున్నా.

వనస్థలిపురం లోని మా యింటికి మూడువందల గజాల దూరం లోనీ, కమలానగర్ బస్ స్టాప్ ఉంది. అక్కడ హయత్‌నగర్ నుండి జె.బి.ఎస్ (జుబ్లీ బస్ స్టేషన్) కు వెళ్లే 290 నం. సిటీ బస్సులు ప్రతి పది నిమిషాలకొకటి ఉంటాయి. నేను వెళ్లి నిలుచున్న ఐదారు నిమిషాలకి ‘మెట్రో ఎక్స్‌ప్రెస్’ వచ్చింది. ఎక్కి, సీనియర్ సిటిజన్స్ సీటులో, కిటికీ ప్రక్కగా కూర్చున్నాను. అది ఎల్.బి.నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా జె.బి.ఎస్ చేరేసరికి ఎనిమిది దాటింది.

సరే, మన ఆత్మారామ్‌జీని సంతృప్తి పరచాలి కదా! బస్ స్టేషన్ క్యాంటీన్ లోనే రెండిడ్లీ, సింగిల్ వడ తిన్నాను. ఏమిటంటే ఈ ట్రిప్‍లో నా వెంట ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మా యోగానంద ఎక్కడో కర్నాటకలో కొడుకు దగ్గర ఉన్నాడు.

కరీంనగర్ వెళ్ళే నాన్-స్టాప్ సూపర్ లగ్జరీ బస్సులు వరుసగా మూడున్నాయి. బస్ స్టేషన్ కిటకిటలాడుతుంది. దసరా సెలవులు కదండీ! ఏ బస్సు లోనూ సీట్లు లేవు పొమ్మన్నారు. ‘ఔరా! ఎంత కష్టమెంత కష్టము!’ అనుకుంటూ ఉండగా, ‘రాజధాని’ ఎ.సి. బస్ వచ్చి ఆగింది. వెళ్లి ఎక్కాను. దీనికి కేవలం నూట పది రూపాయలే ఎక్కువట.

రెండు నిమిషాల్లో ‘రాజధాని’ నిండిపోయింది! తర్వాత చోదక మహాశయుడు వచ్చి తన స్థానాన్ని అలంకరించాడు. “అందరూ వచ్చి టికెట్లు తీసుకోవాల!” అని జనాంతికంగా అరిచాడు. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒకాయన, “ఇంతమందిమి నీ దగ్గర తోసులాడుకునే బదులు నీవే లోపటికి వచ్చి టికెట్లు కొట్టరాదె?” అనరిచాడు. చోదకుడు విసుగ్గా వెనక్కు చూసి, “గట్ల నడ్వద్” అన్నాడు. నాకు ఎ.జి. గార్డినర్ గారు వ్రాసిన ‘రూల్స్’ గురించిన వ్యాసం గుర్తొచ్చింది. తర్వాత, ‘నిటలాక్షుండిటు ఎత్తివచ్చినను రానీ..’ అన్న గయోపాఖ్యానము లోని పద్యమూ గుర్తొచ్చింది. ‘జలనిధు లింకుగాక!’ తాను మాత్రం ధర్మ విరుద్ధముగా చరించనని భీష్మించుకు కూర్చున్నాడు మా డ్రైవరన్న. ఆయన నిబద్ధతకు, నియమశీలతకు, నాకు ముచ్చటేసింది.

అందరూ, ఒక్కొక్కరే వెళ్లి టికెట్ తీసుకుంటున్నారు. నా పక్కన ఒక యువకుడు కూర్చున్నాడు. నా షోల్డర్ బ్యాగ్ కాళ్ల దగ్గర పెట్టుకుని, కాళ్లకు చోటు చాలక అవస్థ పడుతూంటే, ఆ అబ్బాయి చూసి,

“అంకల్, రాజధాని బస్ లలో పైన లగేజి రేక్ ఉండదు. ముందు రెండు లగేజ్ స్టాండ్లున్నాయి. మీ బ్యాగ్ యిటివ్వండి. అక్కడ పెట్టి వస్తా. అట్లే మీకు కూడ టికెట్ తెస్తా. మీరు కూర్చోండి!” అన్నాడు.

‘మా నాయినే! మా బంగారు తండ్రీ!’ అనుకొని, అతనికి ఐదు వందల నోటిచ్చాను.

“ఇంకో ఇరవై ఉంటే ఇవ్వండి. టికెట్ నాలుగువందల ఇరవై. చిల్లర లేదని విసుక్కుంటాడు” అన్నాడు బంగారుతండ్రి.

‘కస్టమర్ (ఇక్కడ ప్యాసెంజర్ అందాం) మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి. అతనికి మీరు సేవ చేయడం లేదు. ఆ అవకాశం ఇచ్చినందుకు అతనికి వారు కృతజ్ఞులుగా ఉండాలి’ అన్న మన జాతిపిత గాంధీజీ మాటలు నాకు గుర్తొచ్చాయి. ఈ కొటేషన్ ఎక్కువగా బ్యాంకుల్లో మాత్రమే కనబడుతుంది. దాన్ని వాళ్ళు ఎంత మాత్రం ఆచరిస్తున్నారో వాళ్లకంటే మనకే బాగా తెలుసు. ఇక ఆర్.టి.సి. వాళ్ల సంగతి చెప్పాలా? నాలుగాకులు ఎక్కువే చదివారు వీళ్లు! అన్నట్లు, ఆకులంటే పేజీలండీ బాబు! అప్పుడు తాటాకుల మీద రాసేవారు కదా! అది చాలా కష్టమైన పని. గంటము (పెన్స్) తో అక్షరం యొక్క రూపాన్ని రంధ్రాలు రంధ్రాలుగా చెక్కేవారు. “ఇక చాలు! అసలు విషయానికి రా స్వామీ!” ఎవరా మాట అన్నది? సరే.

టికెట్‌తో బాటు ఒక 500 మి.లీ. వాటర్ బాటిల్, ఒక స్నాక్స్ పాకెట్ కూడ తెచ్చాడా అబ్బాయి. అతని పేరు ‘హరి’. కరీంనగర్‌లో బెర్జర్ పెయింట్స్‌కు ప్రతినిధి అట. “ఈ వాటర్ బాటిల్, స్నాక్స్ పాకెట్ ఫ్రీగా ఇస్తున్నారనుకుంటాం గాని అంకల్, ఇది టికెట్ ధరలో కలుపుతారు..” అని తెలుగువారికి ఇష్టమైన ఒక తిట్టును వాడాడు. మా గురువుగారు తాటిచెర్ల కృష్ణశర్మ గారు మహా పండితుడు, వైయాకరణ శిరోమణి. ఆయన తెలుగు బూతులను ‘పైశాచీ భాష’ అనేవారు. కానీ గుణాఢ్యుడు తన ‘బృహత్కథామంజరి’ని పైశాచీ భాషలోనే వ్రాశాడు మరి. ఈశాన్య భారతంలో, ప్రాకృతభాషను, సామాన్య జనాలు, అపభ్రంశ రూపంలో వాడేవారు. అదే ‘పైశాచి’ భాష. అంతేకాని పిశాచాలు వాడే భాష కాదు! అసలు పిశాచాలకు మాటలొస్తాయా? ఏమో? గురువుగారికి ఈ మాట చెప్పేంత ధైర్యంలేదు. ‘నిరంకుశాః గురవః’ కదా! బహుశా బూతుల భాష అత్యంత హేయమైనదని ఆయన అభిప్రాయం అయి ఉంటుంది. నాకెందుకో ప్రయాణాల్లో, ఎక్కడెక్కడి సంగతులూ గుర్తొస్తుంటాయి. మా కస్తూరి వారికి చెబితే, ‘మంచిదీ పాణ్యం వారూ! వాటిని ట్రావెలాగ్స్‌లో అక్షరబద్ధం చేయండి’ అంటారు గాని వద్దనరు. ఆయన మా మంచి తమ్ముడు నాకు!

“టికెట్ ఫోర్ ట్వెంటీ అంకల్! ఇదిగోండి వంద” అన్నాడు హరి. ‘అంకుల్ అనకుండా అంకల్ అంటాడేమిటి?’ అనుకొన్నా. పోనీ, ‘గ్రాండ్‌పా’ అనలేదు కదా!

ఫోర్ ట్వెంటీ అనగానే నాకు ఇండియన్ పీనల్ కోడ్ లోని చీటింగ్ సెక్షన్ గుర్తొచ్చింది – ‘IPC 420’. పాపం ఆర్.టి.సి. వాళ్ళా ఛార్జీ యథావిధిగా పెట్టారు.

“కర్టెన్లు వేసుకోండి! ఎ.సి. కూలింగ్ బాగా వస్తది” అని అరిచాడు డ్రయివర్ – లోపలికి వచ్చి అందర్నీ లెక్కపెట్టుకున్నాడు. ఆటోమేటిక్ డోర్ మూసుకుంది. బస్‌ను రివర్స్ చేసి, బయటికి తీశాడు. కాసేపటికి చల్లబడింది లోపల. కొందరు నిద్రలోకి అప్పుడే జారుకున్నారు. అదృష్టవంతులు. నాకు ప్రయాణాల్లో నిద్ర పట్టి చావదు. రైల్లో బెర్త్ ఏదైనా ఏదో మగతగా ఉంటుంది తప్ప గాఢ నిద్ర పట్టదు. మా యోగా గాడైతే వెంటనే నిద్రాదేవి పరిష్వంగం లోకి వెళ్లిపోతాడు వెధవ! వాడు రాని లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. నేనేది చెప్పినా శ్రద్ధగా విన్నట్లే విని, చివర్లో ఏదో ఒక లాజిక్కు తీసి, నన్ను ఎగతాళి చేస్తాడు వాడు.

శామీర్‌పేట దాటడానికే ముప్పావు గంట పట్టింది. స్నాక్స్ పాకెట్ తీశాను. ఒక రస్కు, ఒక పల్లీ చిక్కీ, గుప్పెడు కారప్పూస – మొత్తం మూడు బుల్లి పాకెట్లున్నాయి. మెల్లగా తినేశాను! ఒక బైరాగి తత్త్వం గుర్తొచ్చింది.

‘అన్నమైతే నేమిరా మరి సున్నమైతే నేమిరా? అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా!’ ఎంత లౌక్యం! పైగా వేదాంతం!

“మీరేం చేస్తున్నారంకల్” అనడిగాడు హరి. చెప్పాను.

“ఎక్కడ ఉండేది మీరు హైదరాబాదులో?”

“వనస్థలిపురం బాబూ!”

“అబ్బో! చాలా దూరం ! సిటీ ఔట్‌స్కర్ట్స్!” అన్నాడు.

‘లేకపోతే, అబిడ్స్‌లో ఇల్లు కట్టుకోలేం కదా!’ అనుకోని, “ఇప్పుడు అక్కడ కూడా బాగా డెవలప్ అయింది” అన్నా. ఎందుకో అది ఒక సంజాయిషీగా అనిపించింది.

నాన్ స్టాప్ కాబట్టి, నానా స్టాప్ కాదు కాబట్టి (ఈ ప్రయోగం మా కొలీగ్ విజయప్రభ మేడంది) పదకొండున్నరకు కరీంనగర్‍లో దింపాడు. పెద్ద నగరమే. నేను ఎప్పుడో, ఇంటర్ బోర్డులో డిప్యూటీ సెక్రెటరీగా పని చేసినపుడు, బహుశా 2008లో అనుకుంటా, బోర్డు అబ్జర్వర్‌గా ఆ జిల్లాకు వెళ్లాను. అప్పడు ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది కరీంనగర్. రోడ్ డివైడర్స్, టాఫిక్ ఐలాండ్స్, ఫ్లై ఓవర్స్..

 

బస్ దిగగానే ఆటోవాళ్లు చుట్టుముట్టారు. “రాండి సార్. ఏడపోవాలె?” అని నా చేతిలోని బ్యాక్ అందుకున్నాడు ఒకతను. “ఏదైనా లాడ్జ్‌కి” అన్నా.

“మీకు నాలుగైదు చూపిస్త, సూడుండ్రి నచ్చిన కాడ దిగుదురు మల్ల” అన్నాడు.

“నీ కెంతయివ్వాలి?”

“మీకెరుకనే గద సారు!”

“నాకు అంత ‘ఎఱుక’ లేదు గాని, నీవే చెప్పు”

“యాభై యియ్యండ్రి”

నాకు ఎక్కువనిపించలేదు. ముందు ‘ప్రతిమ రెసిడెన్సీ’ అని తీసుకువెళ్లాడు. అది త్రీ స్టార్ హోటలు. చాలా పోష్ గా ఉంది. మనకంత ‘సీన్’ లేదు! పైగా చల్లగా ఉంది వెదర్. ఎ.సి. కూడ అక్కరలేదు.

“ఇంత పెద్దది వద్దుర భై. మీడియంల దిఖావ్” అన్నా. చూశారా ఎంత బాగా చెప్పానో?

ఒక గల్లీలో రెండు మూడు లాడ్జీలున్నాయి. అవి మరీ తక్కువస్థాయి. మొదటిది అతివృష్టి, ఇవి అనావృష్టి. ఆటో అతనికి ‘సమజైంది’.

“సారు, ప్రేమ్ లాడ్జి అని ఉంది. మీకు కరెక్టుగ సూటయితది” అన్నాడు.

ప్రేమ్ లాడ్జ్ బాగుంది. నాలుగు అంతస్తులు. లిఫ్ట్ ఉంది. నాన్ ఎ.సి. సింగిల్ రూం ఆరు వందలే. ఎ.సి.వి డబుల్ రూము లేనట. అవి పద్దెనిమిది వందలట. రేపు ఉదయం పదిగంటలకు వెళ్లిపోతానని చెప్పి రూం చూపించమన్నా.

బాగానే ఉంది. చిన్నదేగాని శుభ్రంగా ఉంది.

అటాచ్డ్ బాత్ రూం, డ్రెస్సింగ్ టేబుల్, ఒక ఛెయిర్, చిన్న టేబుల్, పెద్ద కిటికీ ఉంది. దానికి మందపాటి కర్టెన్స్. రూం చూపించిన ‘బాయ్’ అన్నాడు – “కిటికీ ఖుల్ల చేస్తే మంచిగ గాలొస్తది.”

ఆటో అతనికి వందరూపాయలిస్తే, యాభై తిరిగిచ్చాడు. నిజాయితీపరుడే! నేనే ఒక ఇరవైనోటు మళ్లీ యిచ్చాను.

ఎ.సి. బస్. చల్లగా ఉంది. రూం కూడా. ఫాల్స్ రూఫ్ ఉంది. స్నానం చేయాల్సిన అవసరం లేదు. లిఫ్ట్‌లో క్రిందికి వెళ్లి, మెయిన్ రోడ్ మీదే ‘టీ టైమ్’ అని ఉంది. అక్కడ ‘సుగర్ లెస్’ టీ కావాలన్నాను

“దస్ మినిట్ ఇంతజార్ కర్నా సాబ్! బనాకే దేతా హుఁ” అన్నాడు ఆ అబ్బాయి. నార్త్ యిండియన్‌లా ఉన్నాడు. ఇక్కడ కరీంనగర్‍లో ‘టీ టైమ్’ ఫాంచైజీ! “ఉద్యోగినః న దూరభూమిః” అని మా నాన్నగారు తరచు అంటూండేవారు లెండి.

టీ చాలా చాలా బాగుంది. కానీ ఇరవై రూపాయలు. మా వనస్థలిపురంలోని, విజయవాడ హైవేలో, ‘పిస్తా హౌస్’లో కూడా ఇరవయ్యే. రూముకు వెళ్ళి లుంగీ, బనియన్ ధరించి, మా వైరాగ్యం ప్రభాకర్‍కు ఫోన్ చేశాను.

“పొద్దుగాల్నే ఇంట్ల నుండి బయలెల్లి నట్లున్నవ్ గదనే” అన్నాడు ఆప్యాయంగా. “ఆరామ్ జెయ్యి! నేను ఒకటిన్నర కొస్త. లంచ్‍కు పోదాం” అన్నాడు.

“సరే తమ్ముడు!” అన్నా.

కాసేపు వాట్సాప్‌లు, ఫేస్ బుక్కు చూసాను. నీళ్ల బాటిల్ కావాలని రిసెప్షన్‌కు ఫోన్ చేశాను.

“మాతాన ఫిల్టర్ వాటర్ ఉంటది సారు. మానేరు నీళ్లు. కాదంటే మినరల్ వాటర్ బాటిల్ పంపిస్త” అన్నాడు రిసెప్షనిస్ట్.

“మీ వాటరే పంపండి” అన్నాను.

ఒంటి గంట తర్వాత ప్రభాకర్ ఫోన్ చేశాడు. “అన్నా, కింద ఉన్నా, దిగు” అన్నాడు. ప్యాంటు షర్టు వేసుకొని ఉందికి వెళ్లాను. నన్ను చూసి అతని ముఖం సంతోషంతో వికసించింది. రోడ్డు మీదే నన్ను ఆప్యాయంగా ‘హగ్’ చేసుకున్నాడు.

‘జననాంతర సౌహృదాని’ అని కాళిదాసు వారన్నట్లు బంధాలు అలా ఉంటాయి మరి.

“నిన్ను ప్యూర్ వెజ్ రెస్టారెంటుకు తీస్కబోతనే! ‘పర్ణశాల’ అని ఉంది. గీడ దగ్గర్నే” అన్నాడు.

అది వంద గజాలు కూడా లేదు. రోడ్ క్రాస్ చేశాము. ట్రాఫిక్ విపరీతంగా ఉంది.

లోపలికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయాను. ఏదో కవితాత్మకంగా పెట్టిన పేరు కాదది. నిజంగా పర్ణశాల లాగే ఉంది. పెద్దపాకలాగా చేశారు. దాదాపు మూడు వందల చదరపు గజలుంది. వెదురు కుర్చీలు, టేబుళ్ళు. రాగి జగ్గులు, గ్లాసులు.

టోకెన్స్ తెచ్చాడు తమ్ముడు. ఫుల్ మీల్స్ 120/- రూపాయలట.

“నాకు ప్లేట్ మీల్స్ చాలు ప్రభాకర్!” అన్నా.

అతడు నవ్వి, “ప్లేట్ మీల్స్ గిట్ల ఉండది. తిన్నంత తిను” అన్నాడు.

భోజనం అద్భుతంగా ఉంది. కందిపొడి, నెయ్యి, గోంగూర, మామిడికాయ ఊరగాయలు. ఆకుకూర పప్పు, బీన్స్, మజ్జిగపులుసు, కొద్దిగా వెజ్ బిర్యాని, చల్ల మిరపకాయలు, టెన్నిస్ బ్యాట్ ఆకృతిలో ఉన్న వడియాలు, ఒక గ్రేవీ కూర, సాంబారు, రసం, పెరుగు, చిన్న కప్పు సేమ్యా పాయసం, అందులో రెండు జీడిపప్పులు. చివర్లో చక్కెరకేళి అరటిపండు, పాన్ (కిళ్ళీ).

నేను కరీంనగర్‌లో ఉన్నానా, విజయవాడ దుర్గావిలాస్‌లో తింటున్నానా అని కాసేపు ‘భ్రాంతిమదలంకారం’లో విహరించాను. పెరుగు కూడ ధారాళంగా వేశాడు. కప్ కాదు!

“తమ్ముడూ! వీళ్ళు ఆంధ్రావాళ్లా ఏమిటి?” అన్నాను

“లోకలోళ్లే అన్నా! మంచిగ లేదా భోజనం?”

“శానా మంచిగుంది!” అన్నా మనస్ఫూర్తిగా.

బయటకి వెడుతూ, కౌంటర్లో ఉన్న అతనితో “భోజనం చాలా బాగుందండి! ధ్యాంక్స్” అని చెప్పాను.

“గట్లనా సారు. కస్టమర్ ఖుషీ ఐతే శాన” అన్నాడాయన. సో, తెలంగాణా వాళ్లే! హమ్ కిసీసే కమ్ నహీ! అని రుజువు చేశారు!

వైరాగ్యం అన్నాడు. “ అన్నా, కొంచెం రెస్ట్ తీసుకో. నా శిష్యుడు ఒకడిని నీ దగ్గరికి పంపిస్త. వానికి ఆటో ఉన్నది. వాడు నిన్ను మిడ్ మానేరు ప్రాజెక్టు, నాంపల్లి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, పెనుబాము (మహాసర్ప) ఆకారంలో అదే కొండ మీద నిర్మించిన నాగ దేవత మందిరం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. అన్నీ చూపించుకొని వస్తాడు. వానికి నీవేమీ డబ్బు ఇయ్యదు. నేను జూసుకుంట. వాడు, నేను లక్సెట్టిపేట హైస్కూల్లో పని చేసేటప్పుడు నా శిష్యుడు. వాని పేరు అహ్మద్ షరీఫ్. మంచి పిల్లగాడు”

“సరే తమ్ముడు! అయినా అతనికిచ్చే డబ్బు..”

“మరేం ముచ్చట వద్దే! నీవు మూడున్నర వరకు (కల్లా) రడీగా” అని చెప్పి వెళ్లిపోయాడు.

కాసేపు కునుకు తీశాను. మధ్యాహ్న భోజనం తర్వాత పట్టే సుఖ నిద్ర ఉంది చూశారూ, మహా హాయిగా ఉంటుందండి. ‘మహా హాయి’ దుష్ట సమాసమంటున్నారా? మా యిష్టం సార్! ‘నిరంకుశా కవయః’ అన్నారు కదా! ఆ నిద్రను సియస్తా (Siesta) అంటారని (ఇంగ్లీషులో a brief nap after lunch) ఆర్.కె. నారాయణ్ గారి ‘A snake in the grass’ కథలో నాకు తెలిసింది లెండి! ఇదివరకోసారి చెప్పినట్లున్నాను!

మూడుంబావుకు ఫోన్ మోగింది. “సారు. నేను అహ్మద్ షరీఫ్. మా ప్రభాకర్ సారు పంపించిండు. కిందికొస్తరా? పోదాం.”

“వస్తున్నా అబ్బాయ్” అన్నాను. పదినిమిషాల్లో కిందికి దిగాను. అహ్మద్ షరీఫ్ కుర్రవాడు. శ్రీనాథుడు చెప్పినట్లు ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి’వాడు, ‘చిదిమిన పాల్గారు చెక్కుటద్దముల’ వాడు. వాడికి నిండా ఇరవైరెండు, ఇరవైమూడేండ్లు కూడ ఉన్నట్లు లేవు. నీలం రంగు జీన్స్ ప్యాంటు మీద ఖాకీ రంగు టీ షర్టు వేసుకొన్నాడు. వాడి శరీరం “నీరజాప్తు సానబట్టిన రాపొడిచల్లి మెదిసి పదను సుధనిడి చేసెనో పద్మభవుడు” అని అల్లసాని వారన్నట్లుగా, బాగా కాగిన పాల మీగడ రంగులో కాంతులీనుతుంది. అలాంటి ప్రవరుని గని అచ్చెరువొందిన వరూధినిలా నేనూ ఆశ్చర్యమాయాను. కొంచెం గడ్డం పెంచి, ట్రిమ్ చేశాడు. హిందీ సినిమా హీరోలు వీడి ముందు దిష్టి తీయడానికి కూడా పనికిరారు! కానీ, ఆటో తోలుకుంటున్నాడు, పాపం. ఏం చేస్తాం? డెస్టినీ లీడ్స్!

నన్ను చూసి నమస్కరించాడు అహ్మద్ షరీఫ్. ఆటో కొత్తది. ఆకుపచ్చరంగులో మెరుస్తూ ఉంది. సీట్ల కవర్లు కూడా తీయబడలేదు. రెండు వైపులా డోర్లు కూడా ఉన్నాయి. కూర్చున్నాను.

“నీ ఆటో సూపర్‌గా ఉందిరా” అన్నా. వాడు నవ్వాడు! ఆ నవ్వు మనోహరంగా ఉంది. యవ్వనం, ఆత్మవిశ్వాసం మేళమించిన నవ్వది.

“ఒరే నాన్నా. ముందు మంచి చాయ్ తాగాలిరా” అన్నాను.

“నీకు జబర్దస్త్ చాయ్ తాగిపిస్త సారు” అన్నాడు. “గీడ మా కాక (చిన్నాన్న) దే చాయ్ దుక్నం ఉన్నది. మస్తుగుంటది”

‘గీతాభవన్’ అని పెద్ద రెస్టారెంట్ కనబడింది. అది దాటింతర్వాత, చిన్న గల్లీకి తిప్పాడు ఆటోను. అక్కడ ఒక పెద్దాయన టీ కొట్టుంది.

“నీవు ఆటో లోనే కుర్చో సారు! నేను తెచ్చిస్త” అన్నాడు వాడు.

తెలంగాణలో, మా రాయలసీమలో కూడ బహువచన ప్రయోగాలు అతి తక్కువ. అవి అగౌరవ సూచకాలు కాదు. పైపెచ్చు అభిమాన వాచకాలు!

“వద్దు! నేనూ వస్తా” అని దిగాను.

“కాకా! గీసారు హైదరాబాదు కెల్లి అచ్చిండు. ఎములాడ పోతున్నాం. మంచిగ చాయ్ చెయ్యి సారుకు” అన్నాడు.

పెద్దాయన పేరు దస్తగిరి అట. ‘ఇరువై ఏండ్ల సంది’ గిదే యాపారమట. ముస్లిం మత సంప్రదాయ వేషధారణలో ఉన్నాడాయన.

“షుగర్ అస్సలు వేయద్దు భయ్యా! కాని స్ట్రాంగ్‌గా ఉండాలి” అని చెప్పాను.

“బిల్‌కుల్?” అని ఆశ్చర్యపోయాడు దస్తగిరి. అతడూ, షరీఫ్ వాళ్ల నాన్నా కజిన్స్ అట.

టీ చాలా బాగుంది. అతనికి కృతజ్ఞతలు చెప్పాను. సిగ్గుపడ్డాడు. డబ్బు ఇవ్వబోతే తీసుకోడే! షరీఫ్ కళ్లతోనే సైగలు చేస్తున్నాడు తీసుకోవద్దని.

“మా తెలుగు సారు పైసలిచ్చిండు సార్. మీరేం ఫికరు చేయకుండ్రి. మల్ల రాత్రి, డిన్నరు గూడ జేపిచ్చి, నిన్ను లాడ్జి కాడ దింపే జుమేదారి నాది” అన్నాడు.

మా ప్రభాకర్ చేసిన ఏర్పాట్లుకు నాకు సంతోషమయింది.

కరీంనగర్ – వేములవాడ రహదారిలో ఆటో దూసుకుపోసాగింది. అది ఫోర్ లేన్ రోడ్డు. ఇరువైపులా పత్తి చేలు, వరి చేలు! మేదిని ఆకుపచ్చని చీర ధరించినట్లుగా ఉంది. చల్ల గాలి వీస్తోంది. కొంతదూరం వెళ్లాక, రోడ్డు నిర్మాణంతో ఉండటం వల్ల, కుదుపులు! ఇరవై నిమిషాలలో మిడ్ మానేరు ప్రాజెక్ట్ చేరుకున్నాము. మానేరు నదిపై నిర్మించిన డ్యాం అది. దాని మీదే రహదారి. ఇరువైపులా జలాశయం. నీరు సుదూరంగా పరుచుకొని ఉంది.

మిడ్ మానేరు ఆనకట్ట చాలా పెద్దది. నది స్థాయి నుండి 45 మీటర్లు (148 అడుగులు) ఎత్తుంది. పొడవు 388 మీటర్లు (1273 అడుగులు). దాని వల్ల మిడ్ మానేరు రిజర్వాయరు సృష్టించబడింది.

దీనికి 1991 లోనే శ్రీ పి.వి. నరసింహరావు శంకుస్థాపన చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోని అదనపు నీరు SRSP ప్లడ్ కెనాల్ ద్వారా మిడ్ మానేరు డ్యాంలోకి ప్రవేశిస్తుంది. దాని నిల్వ సామర్థ్యం దాటితే, నీటిని లోయర్ మానేరు డ్యాంకి వదులుతారు.

ఫ్లడ్ ఫ్లో కెనాల్ 130 కి.మీ పొడవు ఉంటుంది. కెనాల్ నిండా నీళ్లు తొణికిసలాడుతున్నాయి. ఎడమ, కుడి కాలువల వల్ల దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరందుతుంది. 2018 జూన్ నుండి, కాళేశ్వరం ప్రాజెక్టు నుండి కూడ మిడ్ మానేరు రిజర్వాయరుకు గోదావరి నీరు వస్తూ ఉంది. దానివల్ల ఆయకట్టు మరింత బలోపేతమైంది.

ఈ ప్రాజెక్ట్ వల్ల పదహారు గ్రామాలు నీట మునిగాయి. అన్నీ వేములవాడ, బోయినపల్లి, తంగళపల్లి, ఇల్లంత కుంట మండలాల్లోవే!

డ్యాం మీదికి సందర్శకులను అనుమతించరు. పక్కనుంచి చూస్తే, అపారమైన జలరాశి కనువిందు చేస్తుంది. ఇది రాజన్న సిరిసిల్లా జిల్లా లోని మాన్‍వాడ గ్రామం క్రిందికి వస్తుంది. జలాశయం వల్ల, సాగునీరే కాకుండా, మత్స్యపరిశ్రమ, తాగునీరు, కూడ మొదలగు లాభాలున్నాయి.

దీని అధికార నామం ‘రాజరాజేశ్వర జలాశయం’. ఒక మానవ నిర్మిత అద్భుతం మిడ్ మానేరు డ్యాం.

(ఫోటోల సౌజన్యం – ఇంటర్‍నెట్)

(సశేషం)

Exit mobile version