Site icon Sanchika

వేములవాడ – నాంపల్లి గుట్ట దర్శన యాత్ర-2

[ఇటీవల వేములవాడ, నాంపల్లిగుట్ట దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

మళ్లీ హైవే ఎక్కాము. కుర్రవాడన్నాడు. “సారూ, ముందుగాల నాంపల్లిగుట్టకు పోదాము. గాడ మందిర్ ఏడు గంటలకు మూసేస్తారని మా తెలుగుసారు చెప్పాప్పినాడు. ఎములాడ రాజన్న గుడి మాత్రం రాత్రి తొమ్మిదిన్నర వరకు తెరిచే ఉంటుంది.”

“గుడ్! పోదాం పద”

ఒక పదిహేను కిలోమీటర్లు ప్రయాణించాము. ‘వేములవాడ ఐదు కి.మీ.’ అని రోడ్డు పక్క మైలురాయి చూపిస్తూంది. అక్కడ కుడి వైపున ఒక ఆర్చ్ (ప్రవేశద్వారం) దర్శనమిచ్చింది. దాని మీద ‘శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము, నాంపల్లి గుట్ట’ అని రాసి ఉంది. ఆర్చి మీద స్వామివారున్నారు. నా మనసు పులకరించింది. స్వామికి నమస్కరించాను.

అక్కడనుంచి దాదాపు నాలుగు కిలో మీటర్లు ఘాట్ రోడ్. అప్పుడు టైం ఐదున్నర. సంధ్యాభానుడు తన బంగారు కిరణాలను కొండమీద ఉన్న అడవి పై పరచి, హరిత వర్ణం మీద లేత పసుపురంగు అలదినట్లు, ప్రకాశింప చేస్తున్నాడు. ఆ రంగుల కలయిక అపురూపం, అసామాన్యం!

మెట్ల దారి దగ్గర ఆటో ఆపాడు షరీఫ్. కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుందని మా ప్రభాకర్ చెప్పాడు గాని, చూస్తే, చాలా ఉన్నాయి. అక్కడ కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు అమ్మే చిన్న కొట్టు ఉంది. అతన్ని అడిగాను ఎన్ని మెట్లుంటాయని.

“రెండువందల ముఫై నాలుగు సారు” అన్నాడతడు. ఒక వాటర్ బాటిల్ అతని దగ్గర కొనుక్కున్నాను. అతడు కొట్టు కట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు.

“తొందరగా వెళ్లుర్రి. జనం లేరు. పూజారి కూడ గుడి మూసి వచ్చేస్తాడు” అన్నాడు. గత నెలలో యాద్గిరి – మంత్రాలయం – హంపీ టూర్‍లో మైలార లింగేశ్వర స్వామి (మల్లయ్య) కొండ ఎక్కి శివ దర్శనం చేసుకున్నాను. అవి 280 మెట్లు. అప్పుడు నా మిత్రుడు దివాకర్ తోడుగా ఉన్నాడు.

ఇవి ఒక యాభైయ్యే కదా తక్కువ. పైగా మా నరసింహ స్వామివారు! అభిమాన నటులున్నట్లు అభిమాన దేవతలు కూడా ఉంటారండోయ్! నాకు మా స్వామి వారితో గల అనుబంధం మీకు తెలుసు. మల్లయ్య మెట్లు ఎక్కేటప్పుడు ‘హరహర మహా దేవ! శంభో శంకర!’ అని (పైకే) అనుకుంటూ ఆ మెట్లు ఎక్కాను.

ఇప్పుడు, ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యోర్‌ నమామ్యహం’ అన్న నరసింహ మంత్రాన్ని జపిస్తూ ఎక్కితే సరి. అయినా, నేనెక్కేదేముంది? ఎక్కించేవాడు ఆయనైతే!

పిల్లవాడు సాయిబు కదా, నాతో బాటు తోడుగా రమ్మని అడగడానికి జంకాను.

కాని వాడు “సారు, పెద్దోనివి నీవొక్కనివి ఎందుకు ఎక్కుతవు? నేను భీ నీతో వస్తా” అని బయలుదేరాడు. అతని లౌకిక స్ఫూర్తికి నాకు ముచ్చటేసింది. అనవసరంగా భయపడతారు గాని, అన్నిమతాల్లో మంచివాళ్లుంటారు, చెడ్డవాళ్లుంటారు.

మెట్ల దారి పైన రూఫింగ్ ఉంది. దారిపొడవునా లైట్లు వేశారు. మెట్లు ఎత్తు తక్కువగా ఉండి, నాలాంటి వారికి సైతం ఎక్కడానికి వీలుగా ఉన్నాయి. నరసింహ మంత్రం గట్టిగానే జపిస్తూ, ఎక్కసాగాను. రెండువైపులా రెయిలింగ్ కూడా ఉంది కానీ ఎత్తు తక్కువగా ఉండి, దాన్ని పట్టుకోవడానికి కొంచెం వంగవలసి వస్తూంది.

షరీఫ్, వాటర్ బాటిల్ తన కిమ్మన్నాడు. మధ్యలో నోరు తడుపుకుంటా, యాభైరవై మెట్లకొకసారి ఒకచోట ఆగి కాసేపు సేద తీరుతూ, ముందుకు సాగాము. వాడు ఒక్కసారి రెండు మెట్లు గెంతుతూ ఎక్కగలిగిన యువ కిశోరం. కాని నా కోసం నెమ్మదిగా, నాతో బాటు వస్తున్నాడు.

ఇరువైపుల కొండ విస్తరించి ఉంది. మెట్లతో పని లేకుండా, డైరెక్ట్‌గా బండరాళ్లపై, కాల్లు గ్రిప్ పెట్టడానికి వీలుగా చెక్కి ఉన్న మరో దారి ఉంది. కాని చాలా స్టీప్‌గా ఉంది. కొండమీద రకరకాల చెట్లున్నాయి. చీకటిపడినందు వల్ల సరిగా కనిపించడంలేదు.

మేం పైకి చేరుకోవడానికి 37 నిమిషాలు పట్టింది. ఏ మాత్రం ఆయాసం రాలేదు! క్రెడిటంతా స్వామి వారిదే!

క్రింద కొట్టతను చెప్పినట్లు, పూజారి గుడి మూయబోతున్నాడు. మా అలికిడి విని ఆగాడు.

చిన్న గుడి. ముందు ధ్వజస్తంభం ఉంది. స్వామి వారు ఉన్న చోటు గుహాంతర్భాగం వలె ఉంది. దీపారాధన వెలుగులో సింహవదనుడు ప్రకాశిస్తున్నాడు. నా గొంతు గద్గదమయింది. కన్నీరు రాసాగింది. “తండ్రీ, నృసింహపరబ్రహ్మ! రక్షించు!” అని మనసులోనే ఆక్రోశించాను. అహ్మద్ షరీప్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే పూజారి ఊరుకొమ్మని సైగ చేశాడు. నాలాంటి భక్తులను ఆయన ఎందర్నో చూసి ఉంటాడు. స్వామి మూర్తి ఒక బండ రాయిపై చెక్కబడి ఉంది.

స్వామివారికి కర్పూరహారతి ఇచ్చాడాయన; గోత్రనామాదులడిగి. ‘లోకకల్యాణ సిధ్యర్థం’ అని సంకల్పంలో ఆయనకు అందించాను. హారతి పళ్లెంలో యాభై రూపాయలు వేశాను. ఆ పిల్లవాడు కూడ హారతి కళ్లకద్దుకున్నాడు.

నా నోటి నుండి స్వామివారి శ్లోకం వెలువడింది!

అప్రయత్నంగా. నా గొంతు అంతరాలయంలో ప్రతిధ్వనించింది.

‘ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుకశౌనక హృన్నివాస!
భక్తానురక్త పరిపాలన పారిజాత!
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్’

ఆదిశంకర కృతమైన కరావలంబ స్తోత్తములోని శ్లోకమిది. ఈ స్తోత్రాన్ని నేను తెలుగు లోకి, ఇంగ్లీషులోకి అనువదించుకున్నాను, ‘ఓయి నరసింహ! నాకు చేయూత నీవె’ అనీ, ‘Lord, extend your lending hand’ అనే మకుటాలతో. ‘కరావలంబము’ అంటేనే చేయూత. ఆ ఆది దేవుని కరుణతోనీ ఇంతవరకూ నా జీవితంలో ఆనందంగా కొనసాగగలుగుతున్నాను.

“మేం కాసేపు కూర్చుంటాం పూజారిగారు! వీరు వెళ్లండి!” అన్నాను. ఆయన వెళ్లిపోయారు.

మేమిద్దరం అక్కడ ఉన్న చిన్న తిన్నె మీద పావుగంట కూర్చున్నాం.

“నీవు ముస్లిం వైనా, స్వామిని..” అనబోతుంటే, చిరునవ్వుతో ఆ పిల్లవాడు – “నా దోస్తుల్లో శానామంది హిందువులే సారు. వాండ్లు మా రంజాను రోజు మా ఇంటి వచ్చి ఖీర్ తాగుతారు. మేం గణేశ్ మంటపాలకు పోతం! అందరు దేవుండ్లు ఒకటే గాదా సారు!” అన్నాడు. ‘ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి’ అన్న సూక్తిని తన మాటల్లో సింపుల్‌గా ఆవిష్కరించిన ఆ ముస్లిం యువకునికి మనసుతోనే జోతలర్పించాను.

నాకు బలంగా అనిపించింది – ‘No one can annihilate the Secular fabric of India, that is Bharat!’ అని.

క్రిందికి దిగడం పారంభించాము. దిగడానికి ఇరవైమూడు నిమిషాలే పట్టింది.

అక్కడ నుంచి చూస్తే, కొంచెం దిగువన ‘నాగ దేవత’ గుడి కనబడుతూంది. దూరంగా, నాగేంద్రుని పడగ, సమున్నతంగా, లైట్ల వెలుగుతో మెరిసిపోతుంది.

ఆటోలో ఐదు నిమిషాలు ప్రయాణించాము. అదొక అద్భుత కృత్రిమ ఆధునిక శిల్పచాతుర్యం. కొండ మీద దాదాపు వెయ్యిన్నర చదరపు గజాల విస్తీర్ణంలో గోధుమ వర్ణంలో, మహా సర్పాన్ని తయారు చేశారు. సర్ప శరీరం మీద పొలుసులు కూడ స్పష్టంగా తీర్చిదిద్దారు. చుట్టచుట్టుకుని, ఆ మహానాగం, పడగ విప్పుకొని నిలబడి ఉంది.

నాగదేవత ఆలయం (పగటి పూట తీసిన చిత్రం, ఇంటర్‍నెట్ సౌజన్యంతో)

ఆ మహాసర్పంలోకి భక్తులు వెళ్లవచ్చు. అది ఒక టన్నెల్ లాగా, పొడవుగా ఉంది. లోపల లైట్లు వేశారు. పొడుగునా ప్రహ్లాద చరిత్రములోని ముఖ్యఘట్టాలను విగ్రహాల రూపంలో పెట్టారు

నాంపల్లి గ్రామం రాజరాజనరేంద్రుని పాలనలో ఉండేది. ఒకసారి శివుడు ఆయనకు స్వప్నంలో సాక్షాత్కరించి, తనకు నాంపల్లి గుట్టపై ఒక గుడి కట్టమని ఆదేశించాడట.

సర్ప సొరంగం చివర, నరసింహుడు హిరణ్యకశిపుని వధిస్తూన్న విగ్రహం, శరీరం గగుర్పాటుకు గురయ్యేలా చెక్కబడి ఉంది. నాగదేవతల అతి పురాతన విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి.

దూరంగా మూలవాగు ప్రవహిస్తుంది. ఇంకోవైపు మానేరు వాగు. పూర్వం ఈ గ్రామాన్ని ‘నామపల్లి’ గా పిలిచేవారు. స్వామివారి ఆలయం ఆరు శతాబ్దాల క్రిందట నిర్మించబడినట్లు ఐతిహ్యం. క్రీ.శ 11వ శతాబ్దంలో రాజరాజనరేంద్రుడు ఇక్కడ కోనేటిని త్రవ్వించి, మెట్లు కట్టించాడని చెబుతారు. రాణి రత్నాంగీ దేవి ఈ గుట్టపైన తపస్సు చేయగా, ఆమెకు సారంగధరుడు జన్మించాడని ప్రతీతి. పెళ్లి ఐన నూత్న వధూవరులు ‘సత్సంతానం కలిగితే మళ్ళీ వచ్చి మొక్కు చెల్లించు కోవడం’ ఇక్కడ అనవాయితీగా వస్తూంది. అందుకే నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి వారిని ‘సంతాన నరసింహుడ’ని పిలుస్తారు. లోపల ఆంజనీయస్వామి వారి రాతి శిల అద్భుతమైనది. హనుమంతుడికి భక్తులు ఇక్కడ మండల దీక్షలు పూనుతారు

గుట్టపైన, కొండచరియల మధ్య, రెండు సహజసిద్ధమైన కోనేరులు ఉన్నాయి.

క్రీ.శ. 9, 10వ శతాబ్దాలలో ‘నవనాథులు’ అనే సిద్ధులు ఇక్కడ తపస్సు చేశారట. వారు తపసు చేసిన గుహ ఆలయం దాపునే ఉంది. అక్కడనుంచి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సొరంగమారం ఉండేదనీ, ఆ నవనాథులు ప్రతిరోజూ దాని ద్వారా వెళ్లి రాజేశ్వరుని దర్శనం చేసుకునేవారనీ భక్తుల నమ్మకం.

గుట్టపై పార్వతీ పరమేశ్వర కల్యాణోత్సవాలు జరగడం విశేషం. శివకేశవులకు అభేదమని ఈ విషయం ఋజువు చేస్తున్నది.

‘శివాయ విష్ణు రూపాయ
శివరూపాయ విష్ణవే
శివస్యహృదయం విష్ణుః
విష్ణూశ్చ హృదయగం శివః
యథా శివమయో విష్ణుః
ఏవం విష్ణుమయ శివః’

అన్న మంత్రం అక్షరసత్యం. ఇదే తత్త్వాన్ని తిక్కన సోమయాజులవారు తమ మహాభారత అవతారికలో అద్భుతంగా ఈ పద్యంలో ఆవిష్కరించారు

ఉ॥
శ్రీయన గౌరినా బరగు చెల్వకు జిత్తము పల్లవింప; భ
ద్రాయితమూర్తియై, హరిహరంబగు రూపము దాల్చి, విష్ణురూ
పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు, వైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వము గొల్చెద నిష్టసిద్ధికిన్

ఆ కాలంలో శైవ వైష్ణవ మతాల మధ్య విభేదాలుండేవి. వాటిని దృష్టిలో పెట్టుకొని రాసిన పద్యమంటారు. ‘సోషియల్ రెలెవెన్స్’ కవిత్వానికి ప్రాణం! సోషియల్ రెస్పాన్సిబిలిటీ కూడా!

చెన్నమనేని విద్యాసాగర్ గారి పూనికతో ఆయన హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నపుడు, ఈ నాగదేవత ఆలయానికి 50 లక్షలు గ్రాంట్ తెచ్చారు. ఈ మహాసర్పం ఐదు తలలు కలిగి ఉంటుంది. ఈ ఆలయం కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చేత దత్తత తీసుకోబడింది. పంచ శిరస్సులపై, నృత్యం చేస్తున్న కృష్ణవిగ్రహం అద్భుతం.

మేము ఘాట్ రోడ్ దిగుతూ ఉన్నపుడు ఒకచోట ఆగమన్నాను. ప్యారాపెట్ వాల్ దగ్గరనుంచి, నాంపల్లి గ్రామం ఆ రాత్రివేళ విద్యుద్దీప సమూహంలా కనబడింది. కరీంనగర్ -వేములవాడ రహదారిపై వెళుతున్న వాహనాల హెడ్ లైట్లు దీపాల తోరణంలా అగుపించాయి. మేము ‘ఆర్చి’ చేరుకునేసరికి ఏడున్నర. అక్కడ నుంచి వేములవాడ కేవలం నాలుగు కి.మీ. దూరమే. రాజరాజేశ్వరస్వామి వారి దేవస్థానం చేరుకున్నాము. ఆటోకు గుడి వద్ద పార్కింగ్ లేదనీ, తాను దూరంగా ఉంటాననీ, నేను దర్శనం పూర్తిచేసుకొని వచ్చి, తనకో ఫోన్ చేస్తే వచ్చేస్తాననీ చెప్పాడు షరీఫ్.

(సశేషం)

Exit mobile version