Site icon Sanchika

గమ్మత్తయిన జ్ఞాపకాల లోకి తీసుకువెళ్ళే పుస్తకం

[dropcap]తె[/dropcap]లుగు సినిమాలను చూసే పాతకాలం వారందరికీ సినిమా కథల పుస్తకాలు, పాటల పుస్తకాల జ్ఞాపకాలు ఉంటాయి. అతి తక్కువ ధరకు అందే ఆ పుస్తకాలు, ఆ కాలంలో ఇప్పట్లో వీడియోలు, సీడీలు, 24 గంతల సినిమా ఛానెళ్ళు లేనప్పుడు, థియేటర్‌లో తప్ప మరెక్కడా సినిమా చూసే అవకాశం సామాన్యుడికి లేనప్పుదు, ఒక సినిమాను పదేపడే చూడాలన్న కోరికను పరోక్షంగా తీర్చే సాధనాలుగా పనికివచ్చేవి. అందుకే సినిమా ఆదరణతో సమానంగా, కొన్ని సందర్భాలలో సినిమా కన్నా అధికంగా ప్రాచుర్యం పొందేవి ఈ సినీ కథల/పాటల పుస్తకాలు. అలాంటి సినిమా కథల పుస్తకాల గురించి పరిశోధించి సేకరించిన వివరాలను ‘వెండి చందమామలు’ అన్న పుస్తకంలో పొందుపరిచారు సినీ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, వడ్డి ఓం ప్రకాశ్ నారాయణలు.

ఈ పుస్తకంలో ఏ ఏ సినిమాలకు వెండితెర నవలలు వచ్చాయి? ఎవరు ఎవరు రాశారు? నవలలు రాసిన వారి జాబితా, వారు చెప్పిన మాటలు వంటి వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. వెండితెర నవల చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్న వాళ్లకే కాదు, సినిమా ఉత్సాహం ఉన్న అందరికీ ఈ పుస్తకం మంచి విషయం అందిస్తుంది అని రావి కొండలరావు తన ముందుమాట ‘ గొప్ప పరిశోధన’లో అభిప్రాయపడ్డారు.

‘మళ్లీ వెండితెర నవలలు వస్తే బాగుంటుంద’ని వంశీ రాసిన ముందుమాటలో ‘పులగం చిన్నారాయణ, ఓం ప్రకాష్ కలిసి వెండితెర నవలలని చక్కగా చిక్కగా పరిశీలిస్తూ తెస్తున్న పుస్తకం వంటిది ఇంతకు ముందు తెలుగులో రాలేద’ని అంటూ ‘ఎవరైనా సరే మొదటిపేజీ చదవడం మొదలెడితే ఆక్కుండా చివరి పేజీ వరకు వెళ్లి పోవాల్సిందే’ అభిప్రాయం ప్రకటించారు.

ఈ పుస్తకం రావటానికి ‘దర్శకులు వంశీనే ఇన్‌డైరెక్టుగా కారకులన్న’ అభిప్రాయాన్ని పులగం చిన్నారాయణ వ్యక్తపరిస్తే, ‘అలా తొలి బీజం పడిందంటూ’ పుస్తక రచనకు ప్రేరణ ఎలా కలిగిందో వివరిస్తూ వడ్డి ఓంప్రకాశ్ నారాయణ ‘ఈ పుస్తకాన్ని తీసుకురావటానికి రాజీలేని ప్రయత్నం మేము చేసినప్పటికీ ఇది అసంపూర్ణం అనే భావన మాకు లేకపోలేదు’ అన్నారు.

ఈ పుస్తకంలో సినిమా  నవలల పరిచయం, తీరుతెన్నుల వివరణాత్మక వ్యాసంతో పాటు, వెండితెర నవలలపై ముళ్ళపూడి వెంకటరమణ, గోటేటి శ్రీ రామారావు, శ్రీ రమణ, వేమూరి సత్యనారాయణ, ‘నవోదయ’ రామ్మోహనరావు, కాట్రగడ్డ నర్సయ్య, సింగీతం శ్రీనివాసరావు, ఇలపావులూరి మురళీమోహనరావు, డాక్టర్ దివాకర్ రావు యర్రంశెట్టి వంటి ప్రముఖుల అభిప్రాయాలు వెండితెర నవలలపై ఉన్నాయి. చివరలో వెండితెర నవల చిట్టా ఉన్న అనుబంధంలో సినిమా విడుదలైన సంవత్సరం, వెండితెర నవల, సినిమా దర్శక నిర్మాతలు, నవలా రచయిత వివరాల పట్టికను పొందుపరిచారు. సినిమా పట్ల ఆసక్తి ఉన్న ప్రతివారు కొని దాచుకోదగ్గ రిఫరెన్స్ పుస్తకం ఇది. ముఖ్యంగా వెండితెర నవలలు, పాటల పుస్తకాలతో పరిచయం ఉన్న వారందరిన గతకాలం గమ్మత్తయిన జ్ఞాపకాల లోకి తీసుకువెళ్ళే పుస్తకం ఇది.

***

వెండి చందమామలు
రచన: పులగం చిన్నారాయణ, వడ్డీ ఓం ప్రకాశ్ నారాయణ,
పేజీలు: 92, వెల: ₹ 50
ప్రతులకు:  నవోదయ బుక్ హౌస్, తెలుగు బుక్ హౌస్,
సాహిత్య నికేతన్, ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు.

Exit mobile version