[box type=’note’ fontsize=’16’] “అన్నింటినీ ఒక్కసారి హృదినిండా నింపుకుంటే చాలు, సప్త స్వరాలతో మది కోటిరాగాలు పలికినట్టు అనిపిస్తుంది. అంతటి అద్భుతమైనంది వెనిస్ సౌందర్యం” అంటూ తమ వెనిస్, రోమ్ పర్యటనల విశేషాలు వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]
వెన్నెలను వర్ణించగలమా!? పోనీ సూర్యోదయాన్ని…? ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది కదూ..? ఏదో మిస్ అయ్యామే అనిపిస్తుంది కదూ..? ఎంత చెప్పినా, ఎలా వర్ణించినా సంపూర్ణంగా చెప్పలేకపోయానే అనిపిస్తుంది కదా..? అచ్చం వెనిస్ నగర సౌందర్యం కూడా ఇలాగే అనిపిస్తుంది…! ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ వెళ్లాలని, చూడాలనిపిస్తుంది. అందుకే ఈ నగరాన్ని చూడటానికి రెండు సార్లు వెళ్లడం. నీటిలో తేలియాడే భవన నిర్మాణాలు, నగరంమంతా పరుచుకున్న ఊయల్లాంటి వంతెనలు. సందర్శకులను చేరవేసే పడవలు. ఆ పడవల్లోనే సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు. వీటిని తలదన్నే అక్కడి జీవన సౌందర్యం. అన్నింటినీ ఒక్కసారి హృదినిండా నింపుకుంటే చాలు, సప్త స్వరాలతో మది కోటిరాగాలు పలికినట్టు అనిపిస్తుంది. అంతటి అద్భుతమైనంది మా ఇటలీ ప్రయాణం.
ఇటలీకి మాతోపాటూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రామచంద్రరావు దంపతులు కూడా వస్తామంటే నలుగురం కలిసి బయలుదేరాం. హైదరాబాద్ నుండి ఇటలీకి సుదూర ప్రయాణమనే చెప్పాలి. విమాన ప్రయాణం 13 నుంచి 16 గంటల సమయం పడుతుంది. అది కొంచెం కష్టంతో కూడుకున్న పనే అనుకోవచ్చు. నేడు ఇటలీకి దేశంలోని బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విమాన సౌకర్యం ఉంది. కాస్త ఇబ్బందీ అయిన ఇటలీ సందర్శన ప్రతి ఒక్కరికీ జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా గుర్తుండిపోతుందని మాత్రం చెప్పవచ్చు.
అయితే ఇరవై ఏండ్ల కాలంలో రెండు సార్లు ఇటలీని సందర్శించిన మాకు కాలంతోపాటూ మారిపోయిన ఇటలీ, తనలో దాచుకున్న పాత కొత్త వింతలను, విశేషాలను అపురూపంగా చూపిస్తూ వుంటే మరిచిపోలేని అనుభూతి మిగిల్చిందనే చెప్పవచ్చు.
ఇటలీ నేర్పిన పాఠం…!
నీటిపై తేలియాడే నగరం…!
వెనిస్ నగరాన్ని ఇటాలియన్‌లో Venesia లేదా Venexia అని పిలుస్తారు. నార్త్ ఈస్ట్ ఇటలీలో ఒక ప్రముఖ నగరం ఇది. 117 చిన్న చిన్న దీవుల సమాహారం. ఈ దీవులన్నీ అందమైన కాలువలు, అద్భుతమైన వంతెనలతో అనుసంధానించబడి ఉంటాయి. వెనిస్ నగరానికి అనేక పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా లాడామినెంటె, సెరెనిస్సియా, అడ్రియాటిక్ క్వీన్, సిటీ ఆఫ్ వాటర్, సిటీ ఆఫ్ మాస్క్, సిటీ ఆఫ్ బ్రిడ్జెస్, ది ఫ్లోటింగ్ సిటీ, సిటీ ఆఫ్ కెనాల్స్, యూరప్ దేశపు శృంగార నగరం ఇలా అనేక పేర్లు ఉన్నాయి. దీనిని క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో నిర్మించారు. నగరం మొత్తం యునెస్కో వారసత్వపు నగరంగా గుర్తింపు పొందింది. నగరం అంతా చిన్న చిన్న ద్వీపాలుగా ఉంటుంది. నగరం నిండా నీళ్ళతో నిండిన కాలువలే కనిపిస్తాయి. ప్రజలు ఈ కాలువల్లో చిన్న చిన్న పడవలలో ప్రయాణిస్తూ ఉంటారు. వందలాది సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం.
వెనిస్ నగరంలో పడవ ప్రయాణం…
వెనిస్‌లో ట్రైన్ దిగిన వెంటనే అందరం ఒక హోటల్ వెతికి అక్కడికి నడుచుకుంటూ వెళ్లాం. అయితే ఆ హోటల్లో మా సామాన్లు పెట్టామో లేదో మా వారు పెట్టి గబగబ బయటకు వెళుతున్నారు. నేను ఎక్కడికి వెళుతున్నారూ అని ప్రశ్నిస్తే అలా బయటకు వెళ్లి చూసి వస్తాను అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. మేము మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాం, మేము కూడా వస్తాము అని ఆయనతో పాటూ బయటకు వెళ్లి ఆ రాత్రి సమయంలో రోటీలు తెచ్చుకొని తిని పడవలో ఎక్కాము. అయితే వెనిస్‌లో ఎక్కడికన్నా వెళ్లాలంటే మన దగ్గరిలా బస్సులు, టాక్సీల్లో ప్రయాణాలు ఉండవు. వెనిస్‍లో రవాణా అంతా పడవలపై ఆధారపడి ఉంది. ఇది శతాబ్దాలుగా ఉన్న సాంప్రదాయం. ఇక్కడి పబ్లిక్ రవాణాకు నీటి ఆధారిత బస్సులు, ప్రైవేటు వాటర్ టాక్సీలు నిత్యం అందుబాటులో ఉంటాయి. ప్రతి పడవనూ ఎనిమిది రకాల చెక్కలతో తయారు చేస్తారు. ఒక్కో పడవ సరాసరి 11 మీటర్ల పొడవుతో 600 కిలోల బరువు ఉంటాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులంతా చేయాల్సిందంతా పడవ ప్రయాణంమే. మేము కూడా ఒక పడవను చూసుకొని అందరం అందులోకి ఎక్కాం. ఎక్కిన తర్వాత మా వారిని ఎక్కడికి వెళుతున్నామని అడిగితే ఈ పడవ ఎక్కడి వరకూ వెళితే అక్కడి వరకూ వెళదాం అన్నారు. ఆ పడవ పోతూ పోతూ రాత్రి 10.30 ఒక చోట ఆగింది. అక్కడి వాళ్లు ఇదే చివరి స్టేజ్ ఇక దిగిపోండి అన్నారు. సరే అని చెప్పి అక్కడ దిగాము. దిగిన తర్వాత అసలు కథ మొదలైంది.
కాలినడకన వెనిస్ వీధుల్లో…
ఆ రాత్రి వేళల్లో మేము ఎక్కిందే చివరి చివరి ట్రిప్ అని చెప్పారు. తిరిగి వెళ్లాలన్నా ఉదయం వరకూ వేచి చూడాలని వాళ్లు చెప్పేశారు. ఈ విషయాలేవి తెలియక మేము చాలా దూరం ప్రయాణం చేశాం. మేము దిగింది. ఏ స్టేజో కూడా మాకు తెలియదు. తిరిగి వెళ్లాలంటే ఎటువంటి వాహనం అందుబాటులో లేదు. అక్కడక్కడ సైకిలు తప్ప మాకు ఏవీ కనిపించలేదు. ఇక చేసేదేమీ లేక నడక ప్రారంభించాం. అసలే రొట్టెముక్కలు తిన్నాం కాబట్టి ఆకలికి అప్పుడే గుర్తుకు వచ్చినట్లు కడుపులో గొడవ చేస్తుంది. ఎక్కడైన తిందామంటే చాలా ఖరీదుగా ఉన్నాయి. ఏదీ ముట్టుకున్న ధరలు భగ్గుమంటున్నాయి. హోటల్‌కు వెళ్లాక అన్నమే తిందాం అనేసి మళ్లీ నడక ప్రారంభించాము. రాత్రి 11 గంటల సమయం అది. వెండి వెన్నెల్లో ప్రశాంతమైన వాతావరణం బాగుంది కానీ ఒకవైపు ఆకలి దంచేస్తుంటే గమ్యం తెలియని ప్రయాణం కాస్త ఇబ్బందే అనిపించింది.
ఈ రాత్రి వేళల్లో మాతో ఫోటో దిగుతామంటున్నారంటే మేము వింతగా కనిపిస్తున్నామా అనే అనుమానం కూడా వచ్చింది. అయితే మేము వెళ్లినప్పుడు అక్కడ చాలా చలిగా ఉండటంతో నెత్తిన టోపీలు చేతులకు గ్లవుజులు వేసుకొని ఉన్నాము. వాళ్లు అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి వాళ్లకి పెద్దగా చలివేయడం లేదనుకుంటా. అయితే వాళ్ల మాకున్న గ్లవుజ్లు, టోపీలు చూసి ఫోటోలు దిగాలి అనుకున్నారేమో అని డౌట్ వచ్చింది. ఎందుకైన అడిగి తెలుసుకుందామని ‘మాతో ఎందుకు దిగాలనుకుంటున్నారు’ అని ఒక అమ్మాయిని అడిగాను. ఆ అమ్మాయి ‘నేను ఒక ఇండియన్ అబ్బాయిని లవ్ చేశాను, నా బాయ్ ఫ్రెండ్ ఇండియన్. మీరు ఇండియన్స్ కదా మీతో ఫోటో దిగి మా బాయ్ ఫ్రెండ్ కు పంపుతాను’ అంటూ నవ్వుతూ చెప్పింది. సరే అని మేము గ్లౌజ్ అన్నీ తీయబోతుంటే ‘వద్దు, వద్దు వాటిని మీరు అలాగే ఉంచుకోండి మీతో అలాగే ఫోటో దిగుతాము’ అన్నారు. వాళ్ల కోరిక మన్నించి కొన్ని ఫోటోలకు ఫోజు ఇచ్చి, వాళ్లతో మేము కూడా ఫోటో దిగి హాపీగా నడుస్తూ వచ్చాము.
దారిపొడవున అవన్నీ చూస్తూ మెల్లిగా నడుచుకుంటూ మా హోటల్‌కు చేరే సరికి రాత్రి 1.30 అయ్యింది. అర్ధరాత్రి వేళల్లో ఇలా నడిపించినందుకు మావారిని అయితే మనసులో తిట్టుకున్నాను. ఆయన దారిన ఆయన ఏదో వెళుతుంటే మేము అనవసరంగా వస్తాం వస్తాం అని ఈయన వెనుకబడి పోయాం తగిన శాస్తి జరిగింది అనుకున్నాను. ఆ రాత్రికి ఆకలి దంచేస్తుంటే అన్నం వండుకొని, నెయ్యి, పచ్చడితో తినేసి పడుకున్నాము.
మురానోలో దొంగలు…!
మురానోకు వెళుతుంటే నాకు గతంలో వచ్చినప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. మురానోకు ఒక పడవలో వెళ్లాం. పడవ తప్ప ఇంకే మార్గం లేదు అక్కడ. ఈ పడవ కూడా మధ్యలో అక్కడక్కడా ఆగుతూ వెళ్లింది. ఆ ప్రయాణం ఎలాగుండింది అంటే, మనం రాజమండ్రి నుండి పాపికొండలుకు వెళుతుంటే మధ్య మధ్యలో ఆగి అక్కడి ప్రదేశాలను చూశాక ఎలాగైతే ముందుకు కలుగుతుందో ఈ మురానో ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. అలా వెళుతున్నప్పుడు ఒక ప్లేస్‌లో ఆగినప్పుడు వెళ్లిన తర్వాత మాతో పాటు వచ్చిన ఒక అమ్మాయి సడన్‌గా అరుస్తూ కనిపించింది. ఏంటా అని ఆరాతీస్తే ఆమె లగేజ్ పోయిందని తెలిసింది. ఆమె సూటుకేసును ఎవరో ఎత్తుకొని పోయారు. ఆ ఎత్తుకెళ్లిన వ్యక్తిని నేను చూశాను కూడా. సహజంగా మధ్యలో దిగుతున్న వ్యక్తులు తమ లగేజీ తీసుకొని దిగుతారు కదా అలాగే అక్కడ దిగిన వ్యక్తి తన లగేజ్ తీసుకొని వెళ్లాడు అనుకున్నాను కానీ ఎత్తుకెళుతున్నాడని అనుకోలేదు. ఆ విషయం నాకు ఎలా గుర్తుంది అంటే ఆ స్టేషన్లో దిగింది. ఆయన ఒక్కడే కాబట్టి గుర్తుంది కానీ ఆయన ముఖ కవళికలు మాత్రం ఎంత ఆలోచించిన గుర్తుకు రాలేదు. ఆమె తన సామాను పోయినందుకు ఏడుస్తూ ఆ పడవ వ్యక్తితో గొడవ పడింది కానీ ఫలితం లేకపోవడంతో కంప్లైంట్ ఇచ్చింది. ఆ తర్వాత పడవ బయలుదేరింది. తర్వాత అక్కడున్న వాళ్లు కథలు కథలుగా చెప్పుకున్నారు – నా వస్తువు పోయిందీ, నీ వస్తువు పోయింది అని. ఇది 1993లో జరిగిన సంఘటన అంటే అప్పట్లో చాలా మంది దొంగలు ఉండేవారు ఇటలీలో. ఇప్పుడు అలా లేదేమో అనిపిస్తుంది పరిస్థితులను చూస్తుంటే.
మురానోలో మాకు తెలిసిన వ్యక్తి…!
భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్లు, మనం ఎక్కడొక్కడో తిరిగినా మనకు తెలిసిన మనుసులు కూడా అక్కడక్కడా తారసపడుతూ మనల్ని కలిసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఈ విశాలమైన ప్రపంచం కూడా చాలా చిన్నదేమో కదా అనిపిస్తుంటుంది. అటువంటి సంఘటనే ఈ మురానో ప్రయాణం ఒకటి జరిగింది. మేము ఆ చిన్ని పడవలో మురానోకు వెళుతుంటే మేము నలుగురం కాకుండా ఇంకో నలుగురు మాతోపాటూ ప్రయాణం చేశారు. అందులో ఒక ఆయన అమెరికా నుండి వచ్చిన వ్యక్తి. అయితే అతను చూడటానికి ఇండియన్ లాగా కనిపిస్తే, ఇండియా నుండే ఇక్కడికి వచ్చారేమో అనుకున్నాను. నేను అనుకున్నట్లు అతను ఇండియనే కానీ అమెరికాలో సెటిల్ అయినట్లు చెప్పాడు. తోటి ప్రయాణికుడు కాబట్టి మాటల మధ్య మీ పేరు ఏంటీ అని అడిగితే సూద్ అని చెప్పాడు. సూద్ అంటే ఎక్కడో విన్న పేరులా అనిపించింది. అదే సూద్ అనే పేరుతో మా వారికి ఒక ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్నాడు అని చెప్పాను. అతని పేరు అశ్వని సూద్ అని చెప్పగానే, అతను మా తమ్ముడే హైదరాబాద్లో ఉంటాడు అని నవ్వుతూ చెప్పాడు. ఈయన మాకు తెలిసిన వ్యక్తి వాళ్ల అన్న అని తెలియగానే కాస్త ఆశ్చర్యం, అనందం వేసింది నాకు. ఎక్కడి ఇండియా, ఎక్కడి వెనిస్. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఒక తెలిసిన వ్యక్తి అనుకోకుండా కలవడం, పలకరించడం భలేగా అనిపించింది నాకు.
అతను ఇక్కడి నుండి తిరిగి వెళ్లేటప్పుడు తన భార్య బర్త్ డే కోసం ఒక గాజు వస్తువును గిఫ్ట్ ఇవ్వాలని ఉందనీ చెప్పాడు. మంచి ఆలోచన అని అభినందించాం. అయితే అతను ఏమనుకున్నాడో ఏమో నన్ను ఒక గిఫ్ట్ సెలక్ట్ చేసి పెట్టమని చెప్పాడు. ‘అయ్యో ఇదేంటీ’ అని అడిగితే అతను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా ‘ఆడవాళ్ల టేస్టులు సాధారణంగా ఒకేలా ఉంటాయి’ కాబట్టి ఆవిడ కోసం ఒకటి సెలక్ట్ చేయమని. మేము అక్కడున్న వాటిలో కోడి బొమ్మలా ఉన్న ఒకదాన్ని వెతికి, ‘ఇది బాటుంటుంది తీసుకోండి’ అని చూపించాం. ఆయన కూడా దాన్ని చూసి ‘ఒకే బాగుంది’ అనేసి దాన్ని కొనుకున్నాడు. దాని రేటు ఎంత ఉందో అని కనుక్కుంటే మా నోట మాట రాలేదు. ఆ చిన్న కోడి బొమ్మ రేటు అక్షరాల రెండు లక్షల రూపాయలు…! మైండ్ బ్లాక్ అయింది మాకైతే. వామ్మో అనుకున్నాము. ఆయన చాలా ధనికుడు కావొచ్చు అంత ధర ఉన్నా మారుమాట్లాకుండా కొనేశాడు దాన్నీ.
వెనిస్ నగరానికి చేరాక మేము అందరం పడవ దిగి వస్తుంటే ఆయన మమ్మల్ని బోజనం చేద్దాం రండని ఆహ్వానించాడు. మేము వద్దులెండీ మా హోటల్‌కు వెళ్లి తింటాం అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా పట్టుబట్టి ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. అది ఎగ్జాటీ వెనిస్ నగరంలోని నీటి ఒడ్డున ఉన్న ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్. దాన్ని చూడగానే అమ్మో ఇందులోకి వద్దులెండీ అనేశాం. అయినా ఆయన వినకపోవడంతో, ఆయన తింటుంటే మేము కాఫీతో సరిపుచ్చుకుందాం అనే ఉద్దేశంతో ఆయనతోపాటూ నడిచాం. ఆయనతోపాటూ హోటల్ లోపలికి వెళుతున్నామో లేదో గేటు దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇది చాలా కాస్ట్‌లీ హోటల్, యు కాంట్ బేర్ ఇట్ అన్నాడు. అలా అనేసరికి ఆయనకు ఎంత ఉక్రోషం, కోపం వచ్చేసిందంటే, “నువ్వు ఎవడివిరా చెప్పడానికి, వి కాంట్ బేరిట్ అని, వాట్ డూ యు థింక్ అబౌంట్ యువర్ సెల్స్, ప్లీజ్ అరేంజ్ ద సీట్స్ ఫర్ ఫైవ్ ఆఫ్ అజ్” అని చెప్పి ఆయన ఆర్డర్ ఇచ్చాడు. ఆ వ్యక్తి కాస్త భయపడి గబగబ పరిగెత్తి సీట్లను ఆరేంజ్ చేశాడు. ఏదో రెండు మూడు ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. ఆ బిల్లు వచ్చింది కదా, దాన్ని చూస్తే నా కళ్లు తిరిగిపోయాయి. తిన్న కాస్త దానికి 25 వేల రూపాయల బిల్లు వేసుకొచ్చాడు వాడు..! దాన్ని చూడగానే ‘ఓ మైగాడ్’ ఆన్నాను. నాకు చాలా భయమేసింది కూడా మాకు. వద్దని చెప్పినా ఇతను ఇక్కడకు తీసుకొచ్చాడు, ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఒకరి ముఖాలు ఒకరం చూసుకొని, సరే ఇక తప్పదు అనుకొని తలా ఇంత షేర్ చేసుకోవాలనుకొని మా నలుగురికి ఎంత అవుతుందో చెబితే మేము కూడా కొంత పే చేస్తామని చెబితే ఆయన ఒప్పుకోలేదు దానికి. హోటల్‌కు ఇన్వట్ చేసింది నేను కాబట్టి మొత్తం నేను కడతానని అంతా ఆయనే కట్టేశాడు.! నాకు ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది. ఏంటీ ఆయన. భలే విచిత్రంగా ఉన్నాడు. అంత ఖర్చు పెట్టి గిఫ్టులు కొన్నాడు, ఇంత బిల్లును కట్టేశాడు అని.
రోమ్‌లో…
మర్నాడు మేము రోమ్‌ని చూడటానికి వెళ్లాం. ఎన్నో సార్లు రోమ్ గురించి, అక్కడి చక్రవర్తుల గురించి కథలుగా వినడమే కానీ అది ఎలా ఉంటుందో చూడలేదు కాబట్టి అక్కడికి వెళుతున్నామంటే ఒకరకమైన ఆసక్తి కలిగింది. పైగా ఎన్నో సినిమాల్లో క్రమశిక్షణాయుతమైన రోమన్ సైన్యం గురించి, అక్కడి చక్రవర్తుల క్రూరత్వం గురించి చూసి ఉన్నాము కాబట్టి మరికాస్త ఆసక్తి పెరిగింది. రోమ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది అక్కడి ‘కలోసియం’.
క్యాథలిక్‌ల పుణ్యక్షేత్రంలో….
మర్నాడు వాటికన్‌కి వెళ్ళాం. వాటికన్ అనేది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఒక రకంగా ఇది దేశంలోని దేశం అనుకోవచ్చు. ఇటలీ దేశంలోని ఒక స్వతంత్ర దేశం. రోమ్ అనే నగరంలో వున్న ఒక చిన్న దేశం! 1929లో ఇటలీ దేశంనించీ బయటికి వచ్చి స్వతంత్ర దేశం అయింది. క్రిస్టియన్ మతంలో పెద్ద శాఖ అయిన కాథలిక్‌లకు కేంద్రంగా ఉంది. కేవలం 109 ఎకరాల్లో, వెయ్యి లోపు మాత్రమే ఇక్కడ జనాభా ఉంటుందట. కానీ ప్రతి రోజూ ప్రపంచం నలుమూలల నించీ యాత్రీకులు కొన్ని లక్షల్లో ఇక్కడికి వచ్చిపోతూ ఉండటంతో ఆ ప్రాంతం అంతా సందడిగా ఉంది. కాథలిక్లు పుణ్యక్షేత్రంగా భావించే ఈ ప్రాంతం నుండే ప్రపంచ దేశాలను పోప్ సందేశం ఇస్తు ఉంటాడు. ప్రతి బుధవారం, ప్రొద్దున్న పదిగంటలకు పోప్ బెనెడిక్ట్ బయటికి వచ్చి, అందరి మధ్య నించీ వెడుతూ దర్శనమిస్తాడట. అయితే మేము వెళ్లిన రోజు బుధవారం కాదు కాబట్టి మాకు ఆయన దర్శనం కాలేదు.
అక్కడే కింది ప్లోర్‌లో చనిపోయిన ప్రతి పోప్ ను అక్కడే సమాధి చేసేలాగా విధంగా ఆ రోజుల్లోనే నిర్మాణాలు చేసి పెట్టారు. ఇక వాటికన్ మ్యూసియంలో 1400 గదులు వున్నాయట. ఇక్కడ కొన్ని చిత్రపటాలు 3000 సంవత్సరాల క్రితంవి కూడా వున్నాయని అక్కడి వారు చెప్పారు. సిస్టిన్ చాపల్ 1473-1481 ప్రాంతంలో కట్టారట ఇక్కడి నుండే పోప్ ఎన్నికలు నిర్వహిస్తారట. అయితే బసీలికా చర్చి దగ్గర 1506 నుండి స్విస్ కాపలాదార్లు కాపలా కాసేవారుట. కానీ ఇప్పుడు కాపాలాదారులు స్విస్ వారు కాకపోయినా, స్విస్ దుస్తులు వేసుకుని కదలకుండా అలా నిల్చుని వుంటాడటం మాకు కనిపించింది.
క్రైస్తవ పర్వదినాల్లో, పండుగల్లో అయితే జనాలతో కిక్కిరిసి మన తిరుపతి దేవాలయంలో పెద్ద క్యూలు ఉన్నట్లు ఉంటారట. కానీ మేము వెళ్లిన సమయంలో ఎటువంటి పండుగలు కానీ, పర్వదినాలు కానీ లేకపోవడంతో ప్రశాంతంగానే అన్నీ తిరిగి అక్కడి నుండి మేము వెనిస్‌కు తిరిగి వచ్చాం.
ట్రేవీ ఫౌంటెన్..
లీనింగ్ టవర్ ఆఫ్ పీసా…
మేము మాత్రం ఆ టవర్‌ను ఎంచక్కా దగ్గరినుండే చూసి తనివితీరా ఆనందించి దాని దగ్గర ఫోటోలు కూడా దిగాం. అయితే ఈ టవర్ చూస్తున్నప్పుడు స్టీవ్ రీవ్స్ నటించిన ‘సూపర్‌మాన్’ (ఓల్డ్ సినిమా) సినిమా గుర్తుకు వచ్చి భలే నవ్వు వచ్చింది. ఆ సినిమాలో ఈ టవర్‌కు సంబంధించి ఒక హాస్య సన్నివేశం ఉంటుంది. పీసా టవర్ పక్కనే ఒకతను చిన్న చిన్న పింగాణీవి, వంగిన టవర్లు అమ్ముతుంటాడు. ఆకాశంలో ఎగురుతూ వెడుతున్న సూపర్ మాన్, హఠాత్తుగా వంగిపోయిన టవర్ని చూసి దిగి వస్తాడు. అది పడిపోతున్నదనుకుని, నిటారుగా నిలబెట్టి వెళ్ళిపోతాడు. అది చూసి షాపు అతను, ఏం చేయాలో తెలియక, షాపులోని పింగాణీ టవర్లు అన్నిటినీ విసిరి పగలగొట్టేస్తాడు. మళ్ళీ నిటారుగా నిలుచున్న టవర్లు తయారు చేయించి, అమ్మకం మొదలు పెట్టబోతుంటాడు. తన తప్పు గ్రహించిన, సూపర్‌మాన్ తిరిగి వచ్చి, టవర్ని ముందు ఎలా వంగి వుందో అలాగే వంచి, ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. షాపు అతనికి మళ్ళీ ఏం చేయాలో తెలీక, తన పింగాణీ టవర్లని కోపంతో విసిరేసి పగలకొడతాడు. ఎంతో హాస్యభరితంగా చిత్రించిన సంఘటన. అక్కడి నుండి మేము అల్బెరబెల్లో అనే ప్లేస్‌ను చూడటానికి వెళ్లాము..
అల్బెరబెల్లో
ఈ అల్బెరబెల్లో అనేది ‘బారీ’ అనే ప్రదేశానికి దగ్గరలో ఉంది. బారీకి ట్రైన్లో వెళ్లి, బారీ నుండి ఒక కారు తీసుకొని అల్బెరబెల్లో అనే ప్రదేశానికి వెళ్లాము. ఇక్కడ ఎన్నో శతాబ్దాల క్రితం వాడిన పలకల్లాగా ఉన్న వాటిని ఇంటి కప్పుకు వాడుతున్నారు. వీటిని ఎన్ని శతాబ్దాలు గడిచిన మార్చకుండానే వాడుతున్నారు. ఇలాంటి ఇండ్లు కొన్ని వందలు కనిపించాయి. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపుపొందిన ఈ ప్రాంతానికి నిత్యం యాత్రికులు వస్తుంటారని అక్కడ చూస్తే అర్థమైంది. ఆ ప్రదేశంలో కొన్ని ఫోటోలు దిగి తిరుగు ప్రయాణం అయ్యాం మేము.
ఎన్నో ప్రత్యేకలు ఉన్న ఇటలీ దేశం అనేక అనుభూతుల్ని కలిగిస్తే ఆ దేశ పర్యటన సందర్భంగా మాకు పరిచయం అయిన ఒక ఆవిడ గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించాలి ఇక్కడ. ఎంతో ఖర్చుతో ముగియాల్సిన మా యాత్ర, ఆవిడ పరిచయం మూలాన తక్కువ ఖర్చుతో ముగించుకొని ముగించుకొని వచ్చామనే చెప్పాలి. మనలో మంచితనం ఉంటే మనం చేసే చిన్న చిన్న సహాయాలు కూడా ఉహించని ప్రతిఫలాలను కూడా ఇస్తుందని ఈ యాత్ర మాకు మరోసారి గుర్తుచేసింది. మేము వాటికన్ నుండి ఇటలీకి వెళ్లే దారిలో ఎయిర్‌పోర్టులో ఒక ఫాం తీసుకొని దాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నాం. అక్కడికి వచ్చిన ఒక ఆవిడ కూడా అదే పనిలో ఉన్నట్లు కనిపించింది. కానీ దాన్ని ఎలా నింపాలో తెలియక కష్టపడుతున్నట్లు అనిపించింది. బహుశా ఆవిడకు ఇటాలియన్ తప్ప ఇంగ్లీష్ రాకపోవచ్చు అనిపించింది. ఆవిడ దగ్గరకు నేను, మా బాబు ఇద్దరం వెళ్లి ఆ ఫాం నింపడానికి హెల్ప్ చేసి, ఆవిడను మీరు ఇక్కడ ఉండండి క్యూ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వచ్చి మాతో కలుద్దురు కాని అని చెప్పాం. ఈ చిన్న సహాయానికి ఆవిడ సంతోషపడి మాకు థ్యాంక్స్ చెప్పడమే కాకుండా మా ఇంటికి వచ్చి అక్కడ ఉండండి అని ఆహ్వానించారు. మేము అవసరం ఉంటే చూద్దాం లే అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్లి చూస్తే హోటల్స్ చాలా ఖరీదుగా ఉన్నాయి. అప్పుడు ఆవిడ గుర్తుకు వచ్చింది. పిలిచింది కదా అనా వెళితే ఎలా ఉంటుందో అని ఆలోచించాం. ఎందుకైన ఒక సారి ఫోన్ చేసి చూద్దాం ఆవిడ మంచిగా రెస్పాండ్ అయితే వెళదాం లేదంటే వేరే ఏదో ఆలోచిద్దామని అవిడకు ఫోన్ చేసి మీ ఇంటికి రావచ్చా అంటే, ఆవిడ మాత్రం సంతోషంగా మాట్లాడుతూ రండి అని ఆహ్వానించింది. ఆమె ఇంట్లో మూడు రాత్రులు ఉన్నాము. అక్కడ ఉండే ఈ ప్లేసెస్ అన్నీ చూశాం. ఒక చిన్న సహాయానికి ఆమె ఆతిథ్యం, వసతి ఇచ్చారు. మేము తిరిగి వస్తునన్నప్పుడు ఆల్ఫ్ పర్వతంపై ఎన్నో సంవత్సరాలకు ఒకసారి పూచే ఒక అరుదైన పువ్వును డ్రై చేసి దాన్ని ఒక ఫ్రేములో పెట్టి నాకు జ్ఞాపకంగా ఇచ్చింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
నేను చేసిన ప్రయాణాల్లో నాకు పరిచయం అయిన వాళ్లను నేను కొన్ని బహుమతులు ఇచ్చాను. నాకు కొంతమంది ఇచ్చారు. కానీ ఈవిడ ఆతిథ్యం.. ఆప్యాయత. మాపట్ల ఆవిడ చూపిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేను. ఇటలీ ప్రయాణం ఎన్నో జ్ఞాపకాల్ని మిగిల్చితే ఆవిడ పరిచయం మరిచిపోలేని అనుభూతి అని చెప్పవచ్చు.