[శ్రీమతి గీతాంజలి రచించిన ‘వెన్నెల అడవిది!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
~
[dropcap]అ[/dropcap]డవి కాచిన వెన్నెల అని ఎందుకంటావు నువ్వు?
పచ్చని.. అవ్యక్త .. బీభత్స.. సమ్మోహక సౌందర్యంతో నిండిన
అడవిలో వెన్నెల వర్షించకూడనిది ఎందుకయ్యింది?
అడవి వెన్నెలని ప్రేమించకూడనిది.. పరాయిదీ ఎందుకయ్యింది?
వెన్నెల నీ ఇంటిమీదో.. నీ మీదో..
నగరంలో మాత్రమే కురవాలని నువ్వెలా చెబుతావు?
చంద్రుడికీ.. అడవికీ మధ్య జల్లెడనెందుకు పడతావు?
వెన్నెల దిశని ఎందుకు మళ్లిస్తావు??
***
వెన్నెల అడవి మీద మాత్రమే..
అడవి లోపల.. మాత్రమే పరుచుకోవడానికి ఇష్టపడుతుందేమో?
వెన్నెలకీ అడవంటేనే ప్రేమేమో.. మోహమేమో?
పాములు.. తోడేళ్ళు ఉంటాయంటావా, ఉండనీ..
వాటినీ స్పష్టంగా చూపిస్తుంది.. వెన్నెల కదా మరి?
వెన్నెల అడవితో పాటు వాటినీ ప్రేమిస్తుంది.
నీకు తెలీదు.. అడవి వెన్నెలను కొత్తగా నిర్వచిస్తుంది.
లేకపోతే వెన్నెలే అడవికి కొత్త రంగునద్దుతుంది!
అడవి యుగాల దాహంతో వెన్నెలను తాగేస్తుంది..
తనలో తాదాత్మ్యం చేసుకుంటుంది.
అడవి వెన్నెలని ఆవాహనం చేసుకుంటుంది.
అడవి వెన్నెల దుప్పటిని కప్పి
క్రూరమృగాలను మచ్చిక చేసుకుంటుంది.
***
అవును.. నువ్వనే అడవి కాచిన వెన్నెల…
మోదుగ పూలకి మెరుపునిస్తుంది.
వెన్నెల, కనిపించని రుధిర సరస్సులని
ఈ లోకానికి చూపిస్తుంది.
వెన్నెల దారి దీపంలా అమరత్వాన్ని
అడవి శిఖరం మీద వెలిగిస్తుంది.
రాత్రి అడవి కాచిన వెన్నెల
తెల్లవారేకల్లా కొత్త సూర్యుళ్ళను కంటుంది.
అడవి కాచిన వెన్నెలేం చేస్తుందో తెలుసా..
అడవి కన్న రహస్యపు స్వప్నాలను
అరణ్యాన్ని దాటిస్తుంది.
వెన్నెల ఇంకా ఏం చేస్తుంది..
అడవిని ఆదివాసీ నృత్య డమరుకాలతో..
భయద సౌందర్యవంతురాలిని చేస్తుంది.
వెన్నెల అడవికి పుస్తకాలని ఇస్తుంది.
పలక మీద అక్షరాలని దిద్దిస్తుంది.
వెన్నెల.. అడవి తనదైన రాజ్యాన్ని నిర్మించుకోవడం
కళ్ళారా చూస్తూ పులకరిస్తుంది.
అందుకే.. వెన్నెల అడవిన కాచిందని అని వాపోకు!
చంద్రుడు నేరుగా వెన్నెలను అడవి మీదే గుమ్మరిస్తాడు!
వెన్నెల అడవి మీదే కాయాలి!
వెన్నెల అడవిది మాత్రమే!
వెన్నెల అడవిని ఎన్నడూ మనిషిలా మలినపరచదు!
గుర్తు పెట్టుకో..
అడవి కాచిన వెన్నెల ఎప్పటికీ వృథా కాదు!