Site icon Sanchika

వెన్నెలా.. ఓ.. వెన్నెలా..!

[dropcap]వె[/dropcap]న్నెలా.. ఓ.. వెన్నెలా
నెత్తుటి వెన్నెలా
తనువంతా తడియైన వెన్నెలా
నీవొక నల్లటి వెన్నెలవు
నీవొక నీలి వెన్నెలవు
నీవొక ఎరుపు వెన్నెలవు
ఎన్ని రూపాల్లో ఉన్నా కూడా
చివరికి చిక్కిశల్యమైపోతున్నావు..!

ప్రేమకై తపించిన వెన్నెలవు
నిన్ను చూస్తుంటేనే
నా ఊరు కళ్ళ ముందు కదలాడింది
వాడ వాడలా రెపరెపలాడిన జెండాలు
వెదజల్లిన చైతన్యపు పరిమళాలు
వీడిపోని సుగంధాల్లా అల్లుకునిపోయావు..!

నా యవ్వన కాలపు కడలిలో
నినాదాలు ఫిరంగుల్లా పేలుతుండేవి
దున్నేవానికే భూమి కావాలని
విప్లవం వర్ధిల్లాలని
గోడల మీద రాసిన
రక్తాక్షరాల కాగడాలవి
నిన్ను చూసినంతనే
గత జ్ఞాపకాల పుట్టలు పగిలినవి..!

వెన్నెలా.. ఓ.. వెన్నెలా
చెదరని చిరునవ్వు నీది
ఉర్రూతలుగించిన జనం పాటలు
అగ్నిని రగిలించిన అగ్రహాపు కవితలు
ఒక్కొకటిగా పలకరిస్తున్నవి
జయ జయ ధ్వానాలు గొట్టిన
బలమైన పోరాటంలోనే మమేకవైతివి..!

వెన్నెలా.. ఓ.. వెన్నెలా
అజరామరమైన వెన్నెలా
నీ చుట్టూ నీడలా తిరిగిన
ఉద్యమాల తండ్లాటలోనే
ఎందరో మహానుభావులున్నారు
ఎంతో భవితను త్యాగం చేసి
హృదయాంతరాలలో నిలిచిపోయారు..!

వెన్నెలా.. ఓ.. వెన్నెలా
నిన్ను ఎదగనీయకుండా
ఎవరాప గలిగిండ్లు
ఊరూరా అడ్డుతెరలను తొలగించుకుని
తలెత్తడం నేర్పిన కొత్త పాఠాలెన్నో
అమరత్వం పొందిన జీవితాలెన్నో
హక్కుల చరిత్రలను లిఖించిన చేతులెన్నో కాలభ్రమణంలో
వెన్నెలకు మరణం లేదు
వేకువకు అలసట లేదు..!

Exit mobile version