అశ్రుకణాల్లాంటి కథలు- ‘వెంట వచ్చునది’

1
3

[dropcap]క[/dropcap]థ అందమెక్కడుంటుందంటే చాలాసార్లు నిరాసక్తంగా చదవటం మొదలెడతాం.. లేదంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా expectations లేకుండా మొదలుపెడతాం. లేదంటే పేజీలు తిరగేస్తూ యధాలాపంగా మొదలెడతాం. నెమ్మది నెమ్మదిగా ఆ  కథ మనల్ని తనలోకి లాక్కుంటుంది.. ఇక ఆ దారంటా వెళ్ళొచ్చేస్తాం.. కొన్ని పాత్రల్ని పలకరిస్తాం.ఒక కొత్త వాతావరణంలో తిరిగొస్తాం. ఒక దృశ్యం మనసులో నిక్షిప్తమై ఎప్పుడో ఓసారి తట్టిలేపుతుంది. కథాంశం సామాజిక స్పృహను నింపుకున్న అంశమైతే మనల్ని వెంటాడుతుంది. మానసికంగా మనల్ని కలవరపెడుతుంది. ఆలోచనలను కాస్త నిజాయితీతో కడిగి బాధ్యత దుస్తులను తొడిగి మంచిబాటను పట్టిస్తుంది. ఇన్ని చేయగలిగన కథను ఆ కథకుడు ఎలా చెక్కాడో ఎంతందంగా మలిచాడో అన్నదానిమీద కథ విజయం ఆధారపడి ఉంటుంది…

అదే ఒక కథల సంపుటిని చదివినప్పుడు ఆ కథల చప్పుడు మన గుండె చప్పుడవుతుంది. ఎక్కడో అంతరాంతరాలలో దాగున్న లోపలి మనిషి ప్రశ్నించటం మొదలుపెడతాడు. అదీ కథకున్న శక్తి.. అయితే కథను సరైన పాళ్ళలో కూర్చగలిగినప్పుడే అదో విస్ఫోటనమై మనలోని చీకటిని పేల్చుతుంది. మంచితనపు లావా పెల్లుబికేలా చేయగలుగుతుంది.. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కథకున్న శక్తిని తక్కువ చేయకండి అని చెప్పటానికి…

కథకుడు కవి కూడా అయ్యుంటే అక్కడక్కడా గుండెను తట్టే వాక్యాలు పరిమళమై తాకుతాయి. ఆర్ద్రపు చినుకులు వర్షిస్తాయి.. కవి కథకుడు ఎమ్వీరామిరెడ్డి గారు అలాంటి అనుభూతిని పంచారు వారి *వెంటవచ్చునది* కథా సంపుటితో.. మొత్తం పందొమ్మిది కథలున్నాయి. ఈ కథలన్నీ నమ్మకాన్ని వమ్ము చేస్తున్న  సమాజంతో దొమ్మీ చేస్తాయి. కాస్త ఆశను ప్రేమగా వెలిగిస్తాయి. జీవితాల్ని ఆర్పేసే వాళ్ళ మీద కూడా కాస్త ప్రేమను ఒలికిస్తాయి… ముఖ్యంగా రైతు దుఃఖాన్ని కష్టాన్ని కొలిచే ప్రయత్నం చేస్తాయి.రేట్లకు రెక్కలొచ్చి నేలకు కరెన్సీ కాయలు కాసినప్పుడు అవి చిమ్మే విషాన్ని చూపే ప్రయత్నం చేస్తాయి.. రాజధాని ఏర్పడే చోట రైతుల భూములను కోల్పోతున్నప్పండు లేదా స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు కలిగే బాధ, రెక్కలొచ్చిన రేట్లతో డబ్బు పైత్యంతో పతనమయే మనుషులు కళ్ళముందు కనిపిస్తారు. రామిరెడ్డి గారి కథలలో అంతర్లీనంగా మాయమైపోతున్న మనిషిని జాగర్తగా కాపాడుకోవాలనే తపన స్పృహ కనిపిస్తాయి. అందుకే ప్రతి కథా మనిషి చెమ్మతో నిండి ఉండి మన కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది..

ఈ కథల్లో కథకుడు చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా చోట్ల స్పష్టంగా చెబుతాడు. రెండు మూడు కథల్లో మాత్రమే మేజిక్ రియలిజం శిల్పాన్ని ఎంచుకుంటాడు. కొన్ని కథలను మానవీయ ఆర్తితో చెప్పే క్రమంలో కొన్ని లిబర్టీస్ కథకుడు తీసుకున్నాడేమో అనిపించక మానదు. అవేవీ కధావరణాన్ని కథ నడకను తగ్గించవు. కొంత నిస్సహాయతను జతచేసుకున్నా పాత్రలు దృఢంగా సాగుతాయి. కథ నడవటంలో నడపటంలో పాత్రకున్న ఔచిత్యాన్ని రచయిత విస్మరించడు… *ఋణాత్మకం* కథలో బాలరాజు అనే బక్కరైతు ప్రదర్శించిన ధీరత్వం ఒక గొప్ప మోటివేషన్ లెక్చర్ కేమీ తక్కువ కాదు. చివరివరకూ విలువలకి కట్టుబడి ఋణాన్ని తీర్చుకోవటం కోసం రోడ్డుపై పడినా అదే చెరగని చిరునవ్వు ఆ పాత్రని elevate చేయటమే కాదు కష్టాలకు స్పందించాల్సిన తీరును ఆవిష్కరిస్తుంది…

మరోకథ “పొలాల తలాపున”లో రచయిత గమ్మత్తుగా రెండు సమస్యలు ప్రవేశపెడతారు. మహమ్మారి లాంటి కేన్సర్ మనిషిని పీల్చేస్తుంటే దాన్ని ఎదుర్కొనే క్రమంలో జరిగే చికిత్స చూపించే నరకాన్ని మన ముందుంచుతూనే ఇష్టపడి ప్రేమించిన మట్టి దూరమైనప్పుడు మనిషి పడే వేదనను కలిపి చూపటం రచయిత ప్రతిభకు తార్కాణం. ఆ వేదన ఆవేదన మనకు *పొలాల తలాపున* కథలో కనిపిస్తాయి. రేడియేషన్ కీమోథెరపీలలో ఉండే వ్యథను అధిగమించటానికి తన పొలమే తనకు రక్ష అనుకున్న పానకాలు పాత్రను మర్చిపోలేం.. “తలాపున ఉన్న పైరుమీదుగా…దూరంగా సూర్యుడు అస్తమిస్తున్నాడు..పానకాలు రెండుచేతులు  ధీమాగా గుండెలపై వేసుకుని కళ్ళు మూసుకున్నాడు.

పొద్దుగుంకింది”

అన్న వాక్యాలు ఒక కేన్సర్ రోగి ఏం కోరుకుంటాడో చెబుతాయి.. ఆ వ్యక్తొక రైతయితే ఏం కోరుకుంటాడో చెబుతాయి…

భూమిని కోల్పోవటమంటే రైతును జీవచ్ఛవం చేసేస్తుందంటారు రచయిత. రాజధానికి భూములను ధారాదత్తంచేసినా, కన్నీటి తర్పణంలా విడిచేసినా రైతు దుఃఖం పొరలు పొరలుగా గూడుకట్టుకుని మట్టిపెళ్ళల్లా బాధ గుండెలో  రాలుతుందంటారు రచయిత. స్వయంగా చూసిన అనుభవాలకు కాస్త ఉద్వేగాలనద్ది రాగాల కథాపూలగా మలిచారు అంతే.ఆ కోవలో వెలువడ్డ కథలు *రేపటిబీడు*, *ఋణాత్మకం* వంటివి..

ఇవేకాకుండా ఈనాటి చదువులమీద కార్పొరేట్ కళాశాలల యమపాశాలమీద చురకలున్న కథలున్నాయి.. మంచినీటి సమస్యతో తల్లడిల్లే గ్రామాలకో పరిష్కారం చూపాలనే తపన ఉంది.. బ్లూవేల్ గేమ్‌కు బలయ్యే చిన్నారులను సంస్కరించేందుకు గ్రామీణ పాఠశాలలను ఎలా ఉపయోగించవచ్చో చెప్పే తెలివిడుంది… తక్షణ స్పందనలో కథ కొంచెం ఆలస్యమవుతున్నా కథ చూపే పరిష్కారాలెంత బలంగా ఉంటాయో రచయిత చెప్పిన తీరు ఆశ్చర్య పరుస్తుంది..

*వెంటవచ్చునది* మకుట కథ.. చిన్న అంశంతో కూడినది.. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనమెలా స్పందిస్తామో అంటూ మన అంతరంగాన్ని పట్టుకునే కథ…

ఈ కథలన్నీ చాలావరకు ఆశావాద దృక్పథంతో ముగుస్తాయి. జీవితం పట్ల వ్యక్తుల పట్ల అపార ప్రేమున్న రచయితకు వ్యవస్థ పట్ల ఉన్న తీవ్ర అసంతృప్తి కథలంతటా పరుచుకునుంటుంది.. వ్యవస్ధను తమకనుగుణంగా మలుచుకునేవారు, పోరాడేవారు ఇలా వైవిధ్యంతో కూడిన పాత్రల్లో మనల్ని లీనం చేస్తారు…

చురుకైన వాక్యాల కథనం, పదునైన పలుకుబళ్ళు ఈ కథలను చదునుచేసి కొత్త ఆశలను మొలకెత్తిస్తాయి… కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటి నిర్వహిస్తున్న రచయిత ఎంతో బాధ్యతతో రాసిన కథలివి. మేలిమి ముద్రణ పుస్తకాన్ని హత్తుకోమంటే వేకువ విరబూసిన పసిడి వెలుగుల్లా ఈ కథలన్నీ స్వచ్ఛమైన కాంతికెరటాలై పాఠకున్ని స్పృశిస్తాయి.. ఒక అశ్రు కణం అప్రయత్నంగా ఆలోచనల కొలిమిని కడుగుతుంది.

***

వెంటవచ్చునది (కథాసంపుటి)

రచన – ఎమ్వీరామిరెడ్డి

ప్రచురణ- మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్, పెదపరిమి, గుంటూరు.

పేజీలు 240, వెల ₹ 160/-

ప్రతులకు:

ఎం.వి. రాజ్యలక్ష్మి, #102, శ్రీకోట రెసిడెన్సీ, మియాపూర్, హైదరాబాద్-49. ఫోన్: 9866777870

అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here