Site icon Sanchika

వేపపూలు

[dropcap]వే[/dropcap]పచెట్టు ఆవరణలో ఉంటే
ఒక తియ్యని చేదు పరిమళం
ఇల్లంతా విస్తరిస్తుంది
మన మేలుకోరే ఆత్మీయతాస్పర్శ
ప్రతి కొమ్మ కదలికలో వినిపిస్తుంది
ఒక్క చిన్న పుల్ల విరిచినా
నాన్నకి చాలా కోపం వచ్చేది
తన ఎముక విరిచినట్లేనని
భావించేవారు
ఎండిన ఆకులు ఊడవలేక
అమ్మ కొన్నికొమ్మలు నరికిద్దామనుకున్నప్పుడల్లా
అమ్మకీ నాన్నకీ పెద్దయుద్ధం జరిగేది
ఇదంతా చూస్తూ చిద్విలాసంగా నవ్వేసుకునే వేపచెట్టు
మా ఇలవేల్పుగా నిలబడింది
సబ్బు బుడగల్లాంటి చిన్న చిన్న తెల్లని పూలు గాలిలో ఎగురుతూ
అమ్మ తులసిచెట్టుకు నీళ్ళు పోసి వస్తుంటే
ఒకటిరెండు అమ్మ వెంట్రుకల్లో చిక్కు కున్నాయి
విచిత్రమేమంటే ఆ పూలు ఎప్పుడూ విప్పారేఉంటాయి
అవి ముడుచుకోవటం నేనెప్పుడూ చూడలేదు
గుల్ మొహర్.. మందారాల్లా
రంగు రంగులుగా కూడా నవ్వవు
కానీ దానిలోఉన్న శక్తి వికసించటం కన్నా భిన్నమైంది
ఆనందంకన్నా గొప్పది
ఇప్పుడు కూడా ఆ పెద్ద దీర్ఘాయు వృక్షం గుర్తువస్తుంటుంది
ఒక ఉపనిషత్ లాగా, ఒక నిరాడంబర మునిలా
దాని నిరంతర శాంతిఛాయలో
ఒక విచిత్ర ఉదారమహిమ
ఎండలో కూడా చల్లదనాన్ని పంచేది
కాండం హృదయంలో వేడిదాచుకుంటుంది అమ్మలా
ఒక మంచి స్నేహితునిలా పరిమళం పంచుతుంది
నాన్నలా
చెట్టుకింద అందరికోసం పులి జూదం బాల్యం ఆట ఙ్ఞాపకం
వేపచెట్టు కింద ఉంచిన నాన్న పార్ధివ శరీరం మీద
ప్రేమతో చెట్టు కురిపించిన పూల వర్షం
నాటి పెంచిన ప్రేమ రుణం తీర్చుకోటానికేనా
చిన్న చిన్న పూలు అమ్మ తల మీద కన్నీటి బిందువుల్లా వర్షిస్తూ
సాంత్వన ఇస్తున్నట్లు..
ఆ చెట్టు మాఇంటి సభ్యురాలుగా
శోకించటం నాన్నకి అర్థమౌతుందేమో!

Exit mobile version