వేరు వేరు మనుషులు

1
1

[box type=’note’ fontsize=’16’] తమిళంలో ‘బవా చెల్లదురై’ అన్న రచయిత వ్రాసిన కథను అనువదించి ‘వేరు వేరు మనుషులు’ పేరిట అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ.[/box]

[dropcap]ఆ[/dropcap]యనకంటూ ఒక పేరు ఉండటమే అందరూ మరిచిపోయారు. వయస్సు, అనుభవం, రూపం, తెల్లబడ్డ తల వెంట్రుకలు, అవీ రాలిపోయి ముందువైపు బట్టతల, ఎప్పుడూ తొడుక్కునే ఇస్త్రీ చేసిన తెల్లటి దుస్తులు… ఇవే జేకబ్ అయ్యవారి పేరు చెప్పి ఎవరినీ పిలవనియ్యకుండా ‘సార్’, ‘నాయకా’, ‘అయ్యా’ ఇలాగంతా పిలిచేలా చేశాయి.

ఆయన ఎస్.ఆర్. పుస్తకం., పి.ఎఫ్., ఆర్.టి., పెన్షన్ అన్నీ సరిచూసి, లెక్క టాలీ చేస్తుంటే…. నేను ఆ స్కూల్లో పనికి చేరాను. అది ఇంకా ఒకట్రెండు సంవత్సరాలలో ఆయన రిటైర్డ్ అయ్యేందుకు సూచనలు.

మనిషి అప్పుడే వాతరోగంతో బాగా అవస్థ పడేవారు. పంచెను లాగి లాగి వదిలేందుకే ఎడమ చెయ్యి బాగా అలవాటైనట్టుంది. నడుస్తున్నప్పుడు చాలా కష్టపడేవారు. అయినప్పటికీ ఆ బాధ ఏదీ ఆయనకున్నది లేదు.

ఎప్పుడూ నవ్వుతుండే ముఖం ఆయనకు లభించింది. ఆయన్ను తలుచుకోగానే మొదటగా కనిపించేది ఎప్పుడూ ఆయన చంకలో పెట్టుకుని ఉండే గొడుగే.

స్కూలు క్యాంటీన్లో మేమెవరు తింటున్నా, టీ తాగుతున్నా ఆయనొస్తే ఆయన ఏం తిన్నా ఆ లెక్క మా లెక్కలో జమ అయ్యేది. అందుకు మేమెప్పుడూ బాధపడ్డది లేదు. మాకందరికీ ఏదో రకంగా ఆయనెంతో ప్రియమైన వ్యకిగా ఉండేవారు. వయసుకు తగ్గట్టు ఆయన్ను దాటుకుని చకచక నడిచే పాదాలు, ఆయన మాకు చెప్పిన ఎన్నో కథలు, అనుభవాలను మించి వదిలి వెళ్లాయి. వయసు వ్యత్యాసం లేకుండా అందరికీ చెప్పిన ఆ ఊటీ కథ ఎప్పుడూ పెదాలమీదే ఉండేది.

ఈయనకు మొదటి అపాయింట్‌మెంట్ ఊటీలోని ఒక ఇంగ్లీష్ కాన్వెంట్ అట. “ఇవన్నీ ఏం స్కూళ్లు? ఇక్కడున్న స్టాఫ్ రూమ్, అక్కడున్న కారుషెడ్డుకు కూడా చాలదు!” ఈ సమయంలో ఎవరైనా వస్తున్నారా అని వెనక్కు తిరిగి చూసేవారు. అప్పుడంతా కోటు వేసుకుని టై కట్టుకునేవారట. ఎప్పుడైనా కోటుకు రోజాపువ్వును పెట్టుకునేవారట. కథ చెబుతున్న గొంతే మారిపోయి వేరే ఒక సున్నితమైన ప్రేమపూర్వకమైన లోకంలోకి ఆయన ప్రవేశించటం ఈ రోజాపువ్వు వచ్చే సందర్భంలోనే.

“ఊ…” అన్న ఒక సుదీర్ఘమైన నిట్టూర్పుతో… “ఆ తెల్ల అమ్మాయిని మాత్రం చేసుకుని ఉంటే ఇప్పుడెందుకిలా ఒక సింగిల్ టీకి ఉబలాటపడతాను.” అని మెల్లమెల్లగా ఆమె రంగు గురించీ, రూపం గురించీ, సరళమైన ఇంగ్లీషు గురించీ, ఈయనమీద ఆమె ఉంచిన ఇష్టంతో కూడిన ప్రేమ గురించి అంతా ఈ మొదటి అధ్యాయంలోనే చెప్పి ముగించేవారు.

“సరే అవన్నీ వదిలిపెట్టు నాయకా, అన్నీ జరిగిపొయ్యాయా?” అని ఒక రకమైన ఎగతాళితో ఎవరైనా అడిగినప్పుడు మెల్లగా ముఖం మారేది. ఎంతో వేదనా దుఃఖమూ కలిసిన ఒక శోకంతో కూడిన ముఖం ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యేది.

“ఛఛ… ఆమె కూడా నన్ను ఆ రకంగా భావించలేదు. నేనూ ఆమెను ఆ రకంగా అనుకోలేదు.” ఆయనకు ట్రాన్స్‌ఫర్ అయ్యి చివరగా ఆమెనుండి వీడ్కోలు తీసుకున్న సంఘటనను ఆయన వివరించే అందం ఎలా రాయను? ‘ఐ వాంట్ టు మేరీ యూ’ అని ఆమె లాగానే ఆంగ్లంలో మాట్లాడి, చేతుల్ని ఆడించి చూపించేవారు. స్టాఫ్ రూమ్‌లో మేజాలను చరిచి మేము ఆనందంగా వెళ్లేవాళ్లం.

దీంతో కథ ముగిసినట్టుగా చాలామంది వెళ్లి పొయ్యేవాళ్లు. అయితే ఆ తర్వాతే ఆయనకు చెప్పటానికి చాలా కథలుండేవి. అయితే స్వారస్యం లేని కథలు. డెయ్‌సి ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే, ఆయన పెళ్లి చేసుకోవటం, తర్వాత నలుగురు కూతుళ్లూ, ఆ తర్వాత ముగ్గురు కొడుకులూ పుట్టటం, ఒక్కో కూతురికీ పెళ్లి చెయ్యటానికి ఆయన పడ్డ అవస్థలు, మ్యారేజ్ లోన్లు, చేసిన అప్పు, కట్టిన వడ్డీ… అయినా చివరి ఇద్దరి కూతుళ్లూ మిగిలిపోవటమూ, “రిటైర్ అయిన డబ్బు వచ్చాకేనయ్యా ఏదైనా ఒక దారి చెయ్యాలి.” అని ముగించేవారు.

“ఏంటి సార్ ఇదీ, నడుస్తున్నప్పుడు అసహ్యంగా ఉంది, ఒక ఆపరేషన్ చెయ్యించుకోవచ్చుగా.” అని ఒక రోజు టీ కొట్లో నేను అడిగినప్పుడు…. “ఎక్కడ దొరా, జానెడు వెళితే మూరెడు జారుతోంది. రిటైర్ అయిన డబ్బు వచ్చాకే మొదటి కార్యంగా ఒక ఆపరేషన్ చెయ్యించుకోవాలి.” అన్నారు.

1989 మే 31వ తేదీతో ఆయన ఉపాధ్యాయ ఉద్యోగం ముగుస్తుంది. అయినా ఏప్రిల్‌లో జరిగిన వార్షికోత్సవాన్ని ఎలా మరిచిపోగలం?

మామూలుగా… విచ్చేసిన అతిథులను సంతృప్తి పరచటానికి మాట్లాడే ప్రశంసాపూర్వకమైన మాటలు, బుద్ధి తెలిసిన రోజుల నుండే మనం చూసే నాటికలు, గ్రూపు డ్యాన్సులు అంటూ ఉత్సవాల మీదే అయిష్టం ఏర్పడి ఉండటాన్ని మీరి ఒక్క నిమిషం కూడా కదలకుండా నేను కూర్చొని ఉండటానికి కారణం… కార్యక్రమం చివర్లో జేకబ్ సారు సత్కరించటాన్ని చూడ్డానికే.

కలెక్టర్‌కు వేసిన పూలమాలలో నుండి ఒక్కొక్కటిగా పువ్వు రాలి పడుతోంది. నా నిమిషాలూ అంతే. కలెక్టర్ చేతుల మీదుగా జేకబ్ సారు అసోషియేషన్ తరపున ఒక సవరన్లో ఉంగరం ప్రదానం చెయ్యటం జరిగింది.

ఇక జీవితంలో ఎప్పటికీ జేకబ్ సారును – ఆ గంభీరమైన నవ్వుతోనూ, అభిమానంతోనూ ఎవరూ చూడలేరు. కానీ సుందరను ప్రశంసించే తీరాలి. చాలా చక్కగా కలర్లో ఆ నవ్వును అలాగే తన కెమెరాలో బంధించాడు. జేకబ్ సార్‌కు తెలియకుండా నాకూ ఒక కాపీ కావాలి అని అడిగి పది రూపాయలు ముందుకు చాపినప్పుడు ఆశ్చర్యపోయాడు. దానికి కొనసాగింపుగా జరిగిన సంఘటనను ఎప్పుడు గుర్తు చేసుకున్నా నవ్వుకోవచ్చు. మా గ్రూపు తరపున ఆయనకు వేదికమీదే ఒక జింక మార్క్ గొడుగును అందచేశాం. స్టూడెంట్స్, టీచర్స్, కలెక్టర్, కలెక్టర్ గారి భార్య అంటూ అందరూ నవ్వులు చిందించిన సాయంత్రం అది. అప్పుడే మొదటి వరుసలో కూర్చొని ఉన్న ఆయన భార్యను చూశాను. రెండు చేతులతోనూ చెంపల్ని ఆనించుకుని ఆమె సిగ్గుపడ్డ అందం… ఛ… ఈ సుందర్ ఎక్కడికెళ్లాడో?

జాన్ నెలలో స్కూలు ప్రారంభం కావటమన్నది ఒకవైపు ఉత్సాహంగా ఉన్నప్పటికీ, మే నెలంతా పూర్తిగా ఇల్లు, విశ్రాంతి, స్నేహితులు, పుస్తకాలు అంటూ ఉండిపోయి, ఉన్నపళంగా వాటిని తెంచుకొని పాఠశాలకు వెళ్లి ఆ పరిస్థితులతో ఇమడటానికి ఒక వారం రోజులు పడుతుంది. దాదాపు ఆ ఒక్క వారమంతా జేకబ్ సార్ గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. అయితే ఆ తర్వాతి వారంలో, ఒక గురువారం మధ్యాహ్నం వేగంగా వీస్తున్న గాలులకు ఎగురుతున్న కాగితాలను సర్దుతున్న సమయంలో… చంక కింద గొడుగుతో ఆయన స్కూలు కాంపౌండు లోపలికి అడుగుపెట్టటమూ నేను టీ కోసం క్యాంటీన్ కేసి నడవటమూ ఒకేసారి జరిగింది.

నన్ను చూసి ముందుగా ఆయనే నమస్కారం పెట్టారు. ఆయనతో అలవాటుగా హాస్యంతో మాట్లాడటానికి నాకు భయంగా అనిపించింది. మనిషి ఆకారమూ, విరక్తీ, ముఖంలో అలుముకున్న దిగులూ అన్నీ నా ఉత్సాహాన్ని హెచ్చరించాయి.

“రండి సార్, కాఫీ తాగుదాం.” అని మెల్లగా మొదలుపెట్టాను.

“కాఫీలన్నీ ఉండనీ దొరా…” అని చేతిలో పట్టుకున్న పసుపు రంగు సంచిలో నుండి నీలి రంగులోని ఒక పుస్తకాన్ని బయటికి తీసి తెరిచాడు.

“ఇది నా ఎస్.ఆర్. దొరా. మొత్తం ముప్పైమూడేళ్ల సర్వీసు. అయితే నా ఊటీ సర్వీసును ఇందులో కలపనే లేదు. నా తర్వాత ఉద్యోగంలో చేరినవాళ్లంతా ఆరువందల రూపాయలకు పైన పెన్షన్ తీసుకుంటున్నారు. నాకు నాలుగువందల యాభయ్యే రాలేదు. ఎందుకయ్యా నాలాంటి పేదవాళ్లతోనే జీసస్ ఇలా ఆడుకుంటాడు?” అని రెండు చేతుల్ని గట్టిగా పట్టుకున్నారు. కళ్లు ఒకలాగా అటుఇటు తిరిగి స్థిరంగా నిలిచాయి. నీళ్లల్లో నిండిన నీళ్లు ఏ సమయంలోనైనా కిందికి జారటానికి సిద్ధంగా ఉన్నాయి.

“గ్రాట్యుటీ, పెన్షన్, పి.ఎఫ్., డబ్బు ఏదీ చేతికి అందలేదు. తప్పులన్నీ రివైజ్ చెయ్యటానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుందంటున్నారు…” అంటున్నప్పుడు ఆయన్ను మీరి రెండు మూడు బొట్లు జారిపడ్డాయి.

“అయ్యయ్యా, ఏంటి మీరు చిన్నపిల్లవాడి లాగా ఏడుస్తున్నారు… అదంతా ఏమీ కాదు… డి.ఇ. ఓ… ఆఫీసులో మన బాలూ సార్ తో చెప్పి తొందరగా వెయ్యమందాం. ఇప్పుడు ఒక కాఫీ తాగండి.” అని చెబుతుండగానే గబగబా ఆఫీసు రూమ్ కేసి నడిచారు.

అయ్యో… ఎలా ఉన్న మనిషి… ఎప్పుడూ గుత్తులు గుత్తులుగా నవ్వులూ, మాటలూ… అన్నీ ఏవీ? ఆయన… చేతిలో ఉండే సర్వీస్ రిజిష్టర్లో వెతికి చూడాలి.

తర్వాత వారంలో ఒక మంగళవారం పగటిపూట మరొక సమస్య వచ్చి పడింది. మా స్టాఫ్ రూమ్ లో వి.పి.సింగ్ నుండి మొదలుపెట్టి… మా స్థానిక ఎమ్మెల్యే గతవారం ఒక టీచరు కొడుకు విషయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చినంత వరకూ మాటలు కొనసాగాయి. అప్పుడే ఉన్నట్టుండి పురుషోత్తమన్ ఎందుకో జేకబ్ సారును గుర్తుకు తెచ్చాడు. ఎందుకు గుర్తుకు తెచ్చాడా అనిపించింది.

“ఒక్కొక్కడికీ వేల పనులున్నాయన్న విషయమే ఆ మనిషికి తెలియటం లేదు సార్… ఎప్పుడు చూసినా చేతిలో ఎస్.ఆర్‌తో వచ్చి ఇక్కడ తప్పా, అక్కడ తప్పా అని అడుగుతూ… గత ఆదివారం వైఫ్‌తో కలిసి సినిమాకెళ్లాను. దార్లో తగులుకున్నాడు…. టిక్కెట్లు దొరక్క ఇంట్లో మంచి డోస్. “సినిమాకు వెళ్లామా వొచ్చామా అని కాకుండా దార్లో కనిపించిన ప్రతి వాడి దగ్గర నిలబడి పనికిమాలిన మాటలు మాట్లాడితే ఎలా టిక్కెట్లు దొరుకుతాయని అడుగుతోంది.” తట్టుకోలేక పోయాను. ఠక్కున లేచి బయటికెళ్లి వేపచెట్టు గాలి కోసం నిలబడి అక్కడే చాలాసేపు ఉండిపోయాను.

ఆ ఆదివారం చర్చిలో ఆయన భార్యను అనుకోకుండా చూడ్డం జరిగింది. నమ్మలేకపోయాను ఆమేనా అని. స్కూలు వార్షికోత్సవంలో ఆయనకు గొడుగును ఇచ్చినప్పుడు ఒంట్లోని రక్తమంతా ముఖంలోకి ప్రవేశించి సిగ్గుపడ్డ ముఖమేనా అది? ఇవ్వాళ ఆమెను చూసే వాళ్లెవరైనా దగ్గరికెళ్లి దుఃఖాన్ని పంచుకుంటారు.

చర్చి ముగిసి బయటికొస్తున్నప్పుడు నన్ను చూసి స్తోత్రం చెప్పింది. చెబుతున్నప్పుడే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జంకుతూ జంకుతూనే చాలా విషయాలు చెప్పింది. రాత్రీపగలూ ఆయన కలిసే అందరితోనూ, “’ఇలా అయ్యిందే… ఇలా అయ్యిందే’ అని గొణగటాన్నీ… కూతురు, కోడలు, టీ కొట్టూ అంటూ ఆ సంఖ్య పెరుగుతూ పోవటాన్నీ…

ఒకరోజు అర్ధరాత్రి ఇద్దరు కూతుళ్లనూ దగ్గర కూర్చోబెట్టుకుని తల వంచుకొని, “నన్ను క్షమించండర్రా… నాకు ఇప్పటికి ఆ డబ్బంతా వస్తుందన్న నమ్మకం లేదు. మీరు ఎవరినైనా లవ్ చేసి పూలదండలతో వచ్చినా సరే నేను అడ్డుచెప్పను!” అని ఏడవటాన్నీ…

మెల్లమెల్లగా భోజనాన్ని కూడా మానేసి ‘ఎక్కడో తప్పు జరిగింది, ఎలా జరిగింది’ అని ఒంటరిగా గొణగటం మొదలైనప్పటి నుండి… నాలుగు రోజుల ముందు ఆయన్ను ‘బాగాయం’ మెంటల్ ఆసుపత్రిలో బలవంతంగా చేర్చారట. అందుకు స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర రెండువేల రూపాయలు అప్పుగా తీసుకోవటాన్నీ…

ఆసుపత్రిలో ఆయన భార్యను చూసే ‘మేడమ్ నా కూతుళ్ల పెళ్లిళ్లు, నాకు ఒక ఆపరేషన్, అన్నీ జరగాలి మేడమ్. కాస్త ఎవరితోనైనా చెప్పి సాయం చెయ్యండి మేడమ్.” అని అడగటాన్నీ… ఈ విషయాన్ని చెబుతున్నప్పుడే… అది చర్చి ప్రాంగణం అన్న విషయం కూడా మరిచిపోయి భోరుమని ఏడ్చింది.

“ఆయనకు వచ్చే డబ్బు, నా కూతుళ్ల పెండ్లిండ్లకు కూడా వొద్దు సార్. ఆయన మునుపటిలా తిరగాడటానికి ఉపయోగపడితే అంతే చాలు.” అని కళ్లు తుడుచుకుంది.

తర్వాతి ఆరాధనకు చర్చి గంట మోగింది.

ఆమె తొందర తొందరగా పరుగెడుతుంటే గమనించాను. ఎప్పుడూ ఆయన్నుండి దూరంకాని మేము ఇచ్చిన జింక మార్క్ గొడుగు… ఆమె చేతిలో ఉంది!

తమిళ మూలం: బవా చెల్లదురై

అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here