వీనుల నుండి వినువీథుల దాకా! వేటూరి పాట బాట

8
1

[box type=’note’ fontsize=’16’] తెలుగు సినీ సాహితీ రంగంలో ఇలా దూషణ భూషణ తిరస్కార ఆరాధనలకు కేంద్రబిందువైన పండిత కవి ఒకరని వేటూరి గారి గురించి చెబుతూ, ఆయన వ్రాసిన పాటలు ఎంత ప్రేరణాత్మకంగా ఉంటాయో వివరిస్తున్నారు రాజన్. పి.టి.ఎస్.కె “వీనుల నుండి వినువీథుల దాకా! వేటూరి పాట బాట” అనే రచనలో. [/box]

[dropcap]వి[/dropcap]శ్వనాథ వారికి జ్ఞానపీఠాన్నిచ్చిన కల్పవృక్షం వెనుక రాముడున్నాడు. రంగనాయకమ్మ గారికి మరింత కీర్తి తెచ్చిన విషవృక్షం వెనుకా రాముడే ఉన్నాడు.

రాముడి పని రాముడు చేసుకుపోతే, పొగిడి ఒకరూ, తెగిడి ఇంకొకరూ వాసికెక్కారు. వీరిద్దరూ రాముడినే ఎంచుకోవడానికి కారణం…”స్థాయి”. రాముడి స్థాయివానిని పొగిడినా తెగిడినా ప్రసిద్ధికాని, ఎవడో అగస్త్యభ్రాతని తగులుకుంటే ఉపయోగం ఏముంది?

తెలుగు సినీ సాహితీ రంగంలో ఇలా దూషణ భూషణ తిరస్కార ఆరాధనలకు కేంద్రబిందువైన పండిత కవి ఒకరున్నారు. అయిదువేలకు పైగా పాటలు, వందల సినిమాలకు సింగిల్ కార్డులు, ఒక నేషనల్ అవార్డ్ ఆయన ఖాతాలో ఉన్నాయి.

విశ్వనాథ్ క్లాసికల్ హిట్స్ వెనుకా, రాఘవేంద్రరావు మాస్ హిట్స్ వెనుకా, జంధ్యాల ఫుల్ లెంగ్త్ కామెడీ హిట్స్ వెనుకా ఆయన అక్షరాలున్నాయి. రామోజీరావు, అశ్వినీదత్, నవతా కృష్ణంరాజు వంటి నిర్మాతలకు పెన్ను దన్నూ ఆయనే. సిరివెన్నెల, వెన్నెలకంటి వంటి రచయితలకు స్ఫూర్తి మూర్తీ ఆయనే . సినీ సాహితీ సవ్యసాచిగా ముళ్లపూడి వారు శ్లాఘించిన ఆ తెలుగు వెలుగు…శ్రీ వేటూరి సుందర రామమూర్తి. ఆ శ్రీరాముడికి మల్లే ఈ సుందర రాముడికీ చప్పట్ల హోరుతో పాటు, విమర్శల జోరూ తప్పలేదు. అక్కడ రాముడి ఘనకీర్తికొచ్చిన నష్టమేమీలేనట్టే…ఇక్కడ వేటూరి ఘనతకొచ్చిన కొరత కూడా ఏమీ లేదు. ప్రఖ్యాత విమర్శకుడు ఎమ్వీయల్ అన్నట్టు సినీలాకాశంలో ఇంద్రధనుష్పాణి మన వేటూరి.

నవరసాలలో ఏ రసాన్నీ వదలకుండా ప్రేక్షకులని పరవశింపజేసిన వాడు వేటూరి. సరదా పాటలలో చరిత్రని, రొమాంటిక్ పాటలలో వేదాంతాన్ని కలిపి పలికించడం వేటూరి పాటలలో ఉన్న ఒక ప్రత్యేకత.

ఇక ప్రబోధాత్మక గీతాల విషయానికి వస్తే…నేరుగా ఆ సందర్భానికి రాసిన గీతాలే కాకుండా…ఎన్నో ప్రేమ గీతాలలో కూడా ఆయన ఉత్తేజాన్ని నింపే పంక్తులను ప్రయోగిస్తుంటారు.

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు”  అన్న గీతం  తెలుగు సినిమా ప్రబోధాత్మక గీతాలన్నింటిలోకీ మకుటాయమానమైనది.

ఒకప్పటి విజయవాడ పోలీస్ కమీషనర్ గా తెలుగు వారందరికీ పరిచమైన పేరు సురేంద్ర బాబు I.P.S.  ఆయన పోలీస్ శాఖలోకి రావడానికి, ఈ స్థాయిలో ప్రఖ్యాతి పొందడానికి కారణం ఈ పాట ఇచ్చిన ప్రేరణే.  దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో సురేంద్ర బాబు స్వయంగా చెప్పిన విషయమిది.

ఇక తెలుగులో నవలా రచయితలుగా విఖ్యాతులైన మల్లాది వెంకట కృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్ లకు వేటూరి పాటలు భావావేశం కలిగించే ఉత్ప్రేరకాలు.

“జాబిలి మీద సంతకం” అన్న వేటూరి ప్రయోగాన్ని తన నవలకు టైటిల్‌గా వాడుకున్నాననీ, ఆయన పాటలలోని కొన్ని చరణాలను కూడా సందర్భం వచ్చినప్పుడు తన రచనల్లో వాడుకున్నాననీ వినమ్రంగా చెప్పుకున్నారు మల్లాది.

ఇక యండమూరి అయితే సరే సరి. తనకు మూడ్ సరిగా లేనప్పుడు, భావావేశం పొందటం కోసం వేటూరి పాటలను వింటూ ఉంటానని ఓ నవల ముందుమాటలో రాసుకున్నారు.

ఇక మళ్లీ పాటల్లోకొస్తే…

ఉషాకిరణ్ మూవీస్ వారి ప్రతిఘటన సినిమాలోని “ఈ దుర్యోధన దుశ్సాసన దుర్వినీత లోకంలో” అనే పాట ఆ సందర్భానికే కాదు ఏ కాలానికైనా సరిపోయే చైతన్య గీతం.

ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురు చేసి

పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా?

కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర,

ఏనాడొ మీరుంచిన లేత పెదవి ముద్రా?” అని వేటూరి పాట ప్రశ్నిస్తుంటే కదలని హృదయాలు, తడవని నయనాలు ఉండవు.

ఉషాకిరణ్ వారి మరో మూవీ “అశ్వినీ”లో “చెయ్ జగము మరచి జీవితమే సాధన” అన్న పాటలో

ఆశయమన్నది నీ వరం

తలవంచును అంబరం

నీ కృషి నీకొక ఇంధనం

అది సాగర బంధనం” అన్న పంక్తులు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

ఇక “ఈ ఉషాకిరణాలు తిమిర సంహరణాలు” అంటూ మొదలయ్యే ఈటీవి టైటిల్ సాంగ్ రాసింది కూడా వేటూరే.

వేటూరితో ఆణిముత్యాలవంటి పాటలను రాయించుకున్న దర్శకులలో సింగీతం శ్రీనివాసరావు గారు ఒకరు. “సొమ్మొకడిది సోకొకడిది” సినిమాలో ఒక పాట కోసం వేటూరి దగ్గరకు వెళ్లారట సింగీతం గారు. సందర్భం విన్నాక..ఈ పాట ఎవరి మీద చిత్రీకరిస్తున్నారు అని అడిగారట వేటూరి. కమల్ హాసన్ మీద అని చెప్పగానే..అయితే sky is the limit అంటూనే “ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా” అనే పాటని 5 నిమిషాలలో రాసిచ్చేసారట వేటూరి. ఈ విషయాన్ని పాడుతా తీయగా కార్యక్రమానికి జడ్జిగా విచ్చేసినప్పుడు సింగీతం గారే స్వయంగా చెప్పారు. ఈ పాటలో అక్షరాల నిండా ఉత్తేజమే. ఉదాహరణకి ఆఖరి చరణం:

నుదుటిరాత నువ్వు మార్చి రాయరా

నూరేళ్ళ అనుభవాలు నీవిరా

అనుకొన్నది పొందడమే నీతిరా

మనకున్నది పెంచడమే ఖ్యాతిరా

మనిషి జన్మ మరువలేని ఛాన్సురా

ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా

సుడిలోకి దూకాలిరా

కడదాకా ఈదాలిరా

నీ ఒడ్డు చేరాలంటే తడాఖా మజాకా చూపరా

కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాలకి వచ్చిన ఖ్యాతిలో సింహభాగం సంగీతసాహిత్యాలకి దక్కుతుంది.

సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం, సప్తపది, శుభలేఖ, సాగరసంగమం వంటి అంత్యంత ప్రేక్షకాదరణ పొందిన సినిమాలలో పాటలన్నీ వేటూరివే. ఈ సినిమాలు కొన్నింటిలో వేటూరితో పాటు వేరే ఎవరి పేరైనా టైటిల్స్ లో ఉంటే అది అన్నమయ్యదో, త్యాగరాజుదో అవుతుంది. ఆ వాగ్గేయకారుల కీర్తనలకు తగ్గ స్థాయిలోనే ఉంటాయి వేటూరి పాటలన్నీ.

సప్తపదిలో “ఏ కులము నీదంటే గోకులము నవ్వింది” అన్న పాటలో

ఆదినుంచి ఆకాశం మూగది

అనాదిగా తల్లి ధరణి మూగది

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు

ఈ నడమంత్రపు మనుషులకే మాటలు

ఇన్ని మాటలు” అన్న మాటలతో లోక స్వభావాన్ని అలవోకగా చెప్పేశారు వేటూరి.

 ఇక “గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన” పాటలో

“పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు

అల్లనమోవికి తాకితే గేయాలు” అంటూ వేటూరి అల్లిన పదబంధం నభూతో నభవిష్యతి.

భార్యాభర్తల సంబంధం గురించి, స్నేహ బంధం గురించి వేటూరి చేసిన ప్రయోగాలు చాలా గొప్పగా ఉంటాయి.

“రాధా గోపాళం” సినిమాలో భార్యాభర్తలు ఎలా ఉండాలో చెబుతూ ఒక పాట రాశారు వేటూరి.  “ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడూ పార్వతీ” అన్న మాట వినగానే ఒళ్లు పులకరిస్తుంది. ఇది పూర్వకవులు కూడా చేయని ప్రయోగం. అమోఘం.

బాపూ గారి మరో సినిమా మంత్రి గారి వియ్యంకుడులో స్నేహం కోసం చెబుతూ…

విడిపోకు చెలిమితో

చెడిపోకు కలిమితో

జీవితాలు శాశ్వతాలు కావురా

దోస్తీ ఒకటే ఆస్తిరా“అంటూ ప్రబోధిస్తాడు వేటూరి.

 దేశభక్తిని మనలో ప్రజ్వలింపజేయగల గుణం కూడా వేటూరి కలానికుంది.

మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి

కలికి పదములు కడలి కడిగిన కళ ఇది” అని అంటూ మొదలై

వివిధ జాతుల వివిధ మతముల

ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయహో” అని ముగిసే సరికి మనలో ఉన్న దేశభక్తి హిమాలయాశిఖరాన్నెక్కి నిలబడుతుంది. పరదేశి సినిమా – “జగతి సిగలో జాబిలమ్మకు వందనం” పాటలోని పంక్తులివి.

హీరో తాగి తూలిపోతూ పాడే పాటలో కూడా ఉత్తేజాన్నిచ్చే మాటలను వాడటం వేటూరికే చెల్లింది. “ఏరారోయ్ సూరీడ్ని జాబిల్లి వాటేసుకుంది” అనే పాట చరణాలలో “రేపన్నదే లేదని ఉమరు ఖయ్యమూ అన్నాడురా. నేడన్నదే నీదని గుడిపాటి చలమయ్య చెప్పాడురా” అంటూ మనతో ఆలోచింపజేస్తాడు వేటూరి.

ఇంచుమించు ఇలాంటి భావాలనే “నేడేరా నీకు నేస్తము రేపే లేదు -నిన్నంటే నిండు సున్నరా రానే రాదు” అంటూ గీతాంజలి “జగడ జగడ జగడం” పాటలో రాశారు.

“బస్ స్టాప్” సినిమాలో ఆయన రాసిన “రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా” అన్న పాట చాలా ప్రాచుర్యాన్ని పొందింది.

రేపటికే సాగే పయనం నిన్నటినే చూడని నయనం

గమ్యాలే మారే గమనం ఆగదు ఏమాత్రం

బ్రతుకంతా ఈడుంటుందా చివరంతా తోడుంటుందా

నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం” అంటూ సాగే ఈ గీతం ప్రేమికులని తమని తాము తరచి చూసుకునేలా చేయగల శక్తిగలది.

వేటూరి రాసిన ఉత్తేజకరమైన పాటలలో మరో మణిపూస “జీవితమే ఒక ఆట – సాహసమే పూ బాట“. వేటూరి సాహిత్యానికి తోడు ఇళయరాజా సంగీతం ఈ పాటని చిరస్థాయిగా నిలబెట్టింది. “అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడిగా నేనుదయిస్తా- గుడిసె గుడిసెనూ గుడిగా మలచీ దేవుడిలా నే దిగివస్తా” అంటూ సాగే ఈ పాట వింటుంన్నంతసేపూ మనల్ని స్థిరంగా కూర్చోనివ్వదు.

ఎదలోతుల్లో ఒక ముల్లున్నా

వికసించాలె ఇక రోజాలా

కన్నీటి మీద నావసాగనేల

నవ్వవే నవమల్లికా” అంటూ మరణం వైపు అడుగులేస్తున్న యువతికి ఆమె గురువు ధైర్యం చెప్పినా,

పాయసాన గరిటై తిరిగే

పాడు బతుకులెందుకు మనకూ

పాలలోన నీరై కరిగే

బంధమొకటి చాలును తుదకు” అని దిగాలు పడ్డ భర్తను అనునయిస్తూ భార్య చెప్పినా…ఇవన్నీ వేటూరు మార్కు జీవిత సత్యాలు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇక దీనికి అంతే ఉండదు. సాహితీసృజనలో వేయిపడగల ఆదిశేషవు వేటూరి. అందులో ఒక పడగను స్పృశించి కళ్లకద్దుకున్నానిక్కడ.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వేటూరి గురించి అన్న ఆప్తవాక్యంతో ఇక స్వస్తి చెబుతాను.

గానం కోరుకునే గీతం వేటూరి – గాయకుడు కోరుకునే కవి వేటూరి

–రాజన్ పి.టి.ఎస్.కె

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here