వేయిపడగలు ఎందుకు చదవాలి?

    1
    2

    ఇంకా మూలాల్లోకి వెళ్తే ఈ కథావేదికయైన సుబ్బన్నపేట గ్రామ ఆవిర్భావ వృత్తాంతం. ఇది మొదటి అధ్యాయంలోనే ఉన్నది. ఆ ప్రాంతం అంతా ఒక దట్టమైన అరణ్యం. ఆ అరణ్యం మధ్యలో చిన్ని పల్లెటూరు. అక్కడ ఒక రైతు గోవును పెంచుకుంటూ ఆ పాలను విక్రయించుకుంటూ జీవితం సుఖంగా గడుపుతున్నాడు. హఠాత్తుగా ఒక సాయంకాలం అ అవు తిరిగి వచ్చేప్పటికి ఆవు పొదుగు రిక్తమై ఉన్నది. ఈ విషయం క్రమంగా కొన్ని రోజులు అట్లాగే గడిచింది. రైతు ఎంతో ఓపికతో దాని వెంటపడి ఆ రహస్యాన్ని కనుక్కున్నాడు. ఆ అవు ఎవరికీ తెలియకుండా ఒక పుట్ట దగ్గర నిల్చుని పాలను స్రవింపజేస్తుంటే.. ఒక పాము వాటిని త్రాగుతున్నది. అది సహజంగా ఒక పడగతోనే కనిపించినా, రెండు పడగలతోనూ, నాలుగు పడగలతోనూ ఉన్నట్టుగా అతనికి తోచింది. కొద్దిరోజులకు అతని స్వప్నంలో వేయిపడగలతో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకు గుడి కట్టించమని కోరాడు. క్రమంగా ఒక ధనవంతుడు, ఒక భూస్వామి రావటం.. క్రమంగా నాగేశ్వర స్వామి దేవాలయం ఏర్పడటం జరిగిపోయింది. ఇలాంటి గ్రామ వృత్తాంతాలు తెలుగుదేశంలో కోకొల్లలుగా వినపడుతూ ఉంటాయి. సుప్రసిద్దమైన తిరుమల క్షేత్రంలో స్వామి వృత్తాంతం కూడా ఈ కథను పోలి ఉంటుంది. దీన్ని మనం గమనించినప్పుడు వేయిపడగల మూలాలు గ్రామీణ ప్రజాజీవనంలో విశ్వాసాలను అల్లుకుని ఉన్న మూలాలలోనుంచి వెలువడినట్లుగా స్పష్టమవుతుంది. ఇక నవల ప్రధాన కథలోకి ప్రవేశించే ముందు దానిలోని విభిన్న భాగాలను వింగడించి చూసుకోవాలి. ఒకటి కథారంభంలో ధర్మారావు ప్రవేశించడానికి ముందే జరిగిపోయిన రామేశ్వర శాస్త్రి వృత్తాంతం. ఇదంతా ధర్మారావు వ్యాజంగా విస్తరించి చెప్పబడింది. దీనిలో ప్రధాన అంశం రామేశ్వర శాస్త్రి గ్రామాధికారంలో మంత్రి స్థానంలో ఉండటం. ఆ మంత్రి క్రమంగా అధికారాన్ని కోల్పోవడం.. నిరంతర దానశీలత వల్ల దారిద్ర్యాన్ని పొందడం ఒక అంశమైతే, రెండవ అంశం భారతీయ సమాజంలోని నాలుగు వర్ణాలను సంయోజించి సమన్వయ పరచడానికి ప్రతీకగా ఆ నాలుగు వర్ణాల స్త్రీలను వివాహమాడి ఆయా సంతానం ద్వారా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మాలను నిలబెట్టే ప్రయత్నం చేశాడని, ఆ ప్రయత్నాలన్నీ నలుగురిలోనూ వైఫల్యం చెందినట్లు చెప్పబడింది. ఈ ప్రతీకాత్మాకమైన వివాహము లాంటి అంశాలు ఆధునిక నాగరిక సమాజంలో కాకుండా ప్రాచీన గాథల్లో కనపడతాయి. రామేశ్వర శాస్త్రి ప్రయత్నం విఫలం కావటం, తన అధికారం పోగొట్టుకోవటం, విచక్షణ లేని దానం వల్ల దారిద్ర్యాన్ని పొందడం, అశయాలలో అతను ఎంత ఉన్నతుడైనా, ఆచరణలో వైఫల్యం పొందినట్లు రచయిత జాగ్రత్తగా సూచిస్తున్నాడు. నవల ఆరంభం నాటికే వ్యక్తీకృతమైన ఈ వైఫల్యాన్ని పట్టించుకోని విమర్శకులు దాన్ని వర్తమానంలోకి తెచ్చుకొని అన్వయం చేయలేక వర్ణాశ్రమములను రచయిత నిలబెట్టడానికి చేసిన ప్రయత్నంగా భావించి దానికి అప వ్యాఖ్యానం చేశారు. ఈ నవలను గూర్చి అనేక చర్చలు ఇక్కడే ప్రారంభమై, ముందుకు వెళ్లలేక వైఫల్యం పొందడం మనం గుర్తించవచ్చు. ఈ అసహజమైన వివాహ వ్యవస్థ ప్రతీకాత్మకమైందనీ రచయిత అర్దోక్తిగా చెప్పినా మనవాళ్లు పట్టించుకోలేదు. ప్రాచీన గాథల్లో ప్రాగ్రూపాల వివేచనలో లోతుల్లోకి పోలేకపోవటం వల్ల రామేశ్వర శాస్త్రి తన జీవితంలో పొందిన వైఫల్యాన్ని గుర్తించకపోవటం వల్ల అనేక దోషాలు ఇక్కడ సంక్రమించటం జరిగింది.

    మరొక గమనించదగిన అంశం రామేశ్వరశాస్త్రికి సావిత్రమ్మతో జరిగిన సవర్ణ వివాహం తప్ప మిగిలినవన్నీ ప్రేమమూలక వివాహాలే. ప్రాచీన గాథా సంపుటాలలో అరణ్యక, నాగరక స్త్రీపురుషుల మధ్య వివాహాలు ప్రేమమూలాలే. ఇందుకు ప్రబలమైన ఉ దాహరణం చెంచులక్ష్మి, నరసింహస్వామి కథ. ఈ దృష్ట్యా నాటికి పాశ్చాత్య భావనా వ్యాప్తి వల్ల సమాజంలో పెరుగుతున్న ప్రేమ వివాహాల ప్రాబల్యం ఈ సన్నివేశంలోనూ కనిపిస్తుంది.

    దక్షిణాపథంలో దేవాలయాలలో దేవదాసీ వ్యవస్థ అతి ప్రాచీన కాలం నుంచే ఉన్నది. పూరీ జగన్నాథ అలయం దగ్గర నుంచి కన్యాకుమారి దాకా అనేక దేవాలయాలలో తమ జీవితాన్ని తమ నృత్యగాన అభినయ విశేషాలను స్వామికి అర్పణం చేసే ఉపాసనా మార్గం ప్రబలంగానే ఉన్నది. ఈ దేవదాసీలు వేశ్యలు కారు. సామాజికంగా ఆ అభినయ విద్యను సప్రమాణికంగా నిలబెట్టడం దానిని భగవంతుడికి అర్పించటం ప్రవృత్తిగా కలవారు. అభినయ విద్యాపారంగతలైన కొందరు ఎవరినో మహానుభావుని ఆశ్రయించి, వారి వల్ల సంతానం పొంది, ఆ సంతానాన్ని భగవదుపాసనకు అర్పించటం ఈ దేవాదాసీ వృత్తి యొక్క పరమార్థం. ఈ నవలలో రత్నగిరి రామేశ్వర శాస్త్రిని ఆశ్రయించటం, అయన వల్ల సంతానాన్ని పొందటం ఒక విధంగా వసంతసేన.. చారుదత్తుల వృత్తాంతం లాంటిదే. వసంతసేన, రత్నగిరి లాంటి వారు వివాహం కాకున్నా పతి లగ్నైక జీవులే. అందువల్ల వారి జీవితం భగవదర్పణకు హేతువైన తన్ను తాను సమర్పించుకోగల గిరిక వంటి సంతానాన్ని పొందేందుకు భావనా రూపమైన ధ్యానంలో నిలిచి సంసారాన్ని నిర్వహించారు. వేయిపడగలలో మూడవ అధ్యాయం చివర రత్నగిరి రాజాస్థానంలో నర్తకిగా తన అధికారాన్ని నిరూపించుకునేందుకు వచ్చింది కానీ, ఏ సన్మానాన్నో, ఇతర ఫలాన్నో ఆశించి కాదు. అందుకే ఆమె విసురుగా వెళ్లిపోతూ జారిపోతున్న అందియను అందించినా అందుకోకుండా తిరస్కార భావంతో నిష్క్రమించింది. రామేశ్వరశాస్త్రి సంబంధం చేత ఆమెకు సహజంగానే ఆస్థాన నర్తకి పదవి లభించినట్టుగా ఆమె భావించింది. అయితే గిరిక విషయంలో రామేశ్వరం తూలనాడినట్టుగా మాట్లాడితే ఆమె తీవ్ర స్వరంలోనే సమాధానం చెప్పింది. ఈ సందర్భంలో గిరికను ఆస్థానానికి రాజుతో రమ్మని కాసావానిని పంపించే సన్నివేశం మహాభారతంలోని ద్రౌపదిని బలవంతంగా లాగుకొని రమ్మని ప్రాతిగామిని, దుశ్శాసనుని పంపించిన సన్నివేశం గుర్తుకు వస్తుంది. భారతంలో భీష్మద్రోణులు చేయలేని పని ఇక్కడ ధర్మారావు నిర్వర్తించాడు.

    వేయి పడగలలో గిరిక ప్రవేశమే ఒక అద్భుతమైన దివ్య స్పర్శ గల సన్నివేశం. గిరిక ఒక గోదాదేవి వలె, ఒక మీరాబాయి వలె జన్మ ప్రభృతి తన్ను తాను వేణుగోపాల స్వామికి సమర్పించుకున్నది. ఆమెను ప్రవేశపెట్టిన తీరులో మూడు నాలుగు వాక్యాలలో ఈ దివ్యత్వ లక్షణం గోచరిస్తుంది. “ఆ నవ్వినది పన్నెండేళ్ల పిల్ల. దాని యొడలిపైకి తెలియకుండ మన్మథుడు వచ్చుచున్నాడు. దాని తెల్లని పలువరుస. సుదర్శనాయుగపుటంచుల వలె పదునుపెట్టినట్లుండెను. దాని చెవులు శ్రీకారములై పాంచజన్యములట్లుండెను. దాని కన్నులు కమలములు. దాని నాసిక కౌమోదకి. దాని భ్రూయుగము శార్ణము ద్విధా విభక్తమైనట్లుండెను. దాని మూర్తి వికుంఠమై మనోజ్ఞమయ్యెను. దాని పేరు దేవదాసి.”

    దేవదాసిని-గిరికను ప్రవేశపెట్టినప్పుడు ఆమె మందస్మితమును వర్ణించటంలో మందస్మిత ప్రభాపూర మద్యత్ కామేశ మానసా అన్న లలితా సహస్రనామంలోని వాక్యం గుర్తుకు వస్తుంది. పన్నెండేళ్ల వయసులో అమెను ప్రవేశపెట్టడంతో ద్వాదశాదిత్య మండలాత్మకమైన అనాహతమును సూచించే ఆమె చేయబోయే ఉపాసన అంతా హృదయ విద్య అని దానిలో అమె సాఫల్యం పొందిన రీతి, అమె ముక్తి సందర్భంలో అంతరాదిత్య విద్యా ఉపాసనా ఫలాన్ని పొందటాన్ని సూచిస్తున్నాడు రచయిత. తరువాత వేయి పడగల్లోని కథా వృత్తాంతమంతా ధర్మారావు చుట్టూ, గిరిక చుట్టూ వారిద్దరి ఊర్థ్వముఖ అరోహణ చుట్టూ పరిభ్రమిస్తుంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here