వేయి పడగలలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ శైథిల్యం చెప్పటం ఎంత ముఖ్యమైన అంశమో, కుటుంబ వ్యవస్థకు మూలమైన దాంపత్య జీవనం వివాహ వ్యవస్థ శిథిలమైన సంగతి చెప్పటమూ ముఖ్యాంశమే. రాధాపతి, మంగమ్మ, రామేశ్వరం మొదలైన వారు వివాహ వ్యవస్థకు విరుద్దంగా ప్రవర్తించి సమాజంలో సంక్షోభాన్ని సృష్టించగా, అది విష తరంగాలు తరంగాలుగా ఒక ప్రళయానికి కారణమైంది. రామేశ్వరంలోని అధికార దర్పము, ధనము మంగమ్మ వంటి వారిని ప్రలోభ పెట్టడానికి ఉపయోగపడితే, మిగిలిన వారి వృత్తాంతాల్లో భావనామాత్రమైన ప్రణయం సమాజం యొక్క మనుగడకు సంబంధం లేని ప్రయాణం ఎలా నిష్ఫలమవుతుందో తెలియజేయటం జరిగింది. కుమారస్వామి, శ్యామలల మధ్య వర్ణాంతర వివాహాన్ని వేయిపడగలు సమర్థించింది. ఈ ఇతిహాసంలో మూడు రకాల దాంపత్యాల వైభవం శిఖరాయమానంగా చిత్రింపబడింది. ఒకటి అరుంధతి ధర్మారావుల దాంపత్యం. సమాజపు ఆర్థిక సంబంధాలు అనవసరమైన ఒత్తిడులు తెచ్చినా దారిద్ర్యం పరస్పర అవగాహనకు దూరం చేసినా, భార్యాభర్తల మధ్య ఉండే అనురాగము, ఆప్యాయత, ఆరాధన, సమర్పణ అన్న నాలుగు భావాలు క్రమంగా వారిని సమాజంలోని ఉత్తమ శిఖరాల వద్దకు ప్రయాణింపజేశాయి. వివాహము ఉత్తమోత్తమమైన దాంపత్య ధర్మానికి సమాజ బాధ్యత నిర్వహణానికి ఎలా దోహదం చేయగలదో ఈ వివాహం నిరూపించింది. చిన్ని చిన్ని కలహాలు అనవగాహనలు వారి నడిమి సంబంధం క్రమంగా గాఢతరం చేస్తూనే వచ్చాయి. 1920లలో తెలుగు సాహిత్యంలో వెల్లువలా ముంచెత్తిన ప్రణయ సిద్ధాంతాన్ని ఒక దారికి మళ్లించి క్రమబద్దీకరించిన ఘనత ఈ రచయిత విశ్వనాథ సత్యనారాయణది. స్వేచ్ఛా ప్రణయం, అమలిన శృంగారం అనే పేర నిత్యజీవితంతో సంబంధం లేని సిద్దాంతాలు పర్శాం కాక తప్పలేదు. రాయప్రోలు తను ప్రతిపాదించిన అమలిన శృంగారాన్ని రూపనవనీతంలో విఫలమైనట్టుగా అంగీకరించాడు. చలం కృష్ణశాస్త్రి ప్రభృతులు ప్రతిపాదించిన స్వేచ్ఛా ప్రణయ సిద్దాంతం సమాజాన్ని ఎంత చికాకు పరిచిందో, ఎంత సంక్షోభానికి దారి తీసిందో అ రచనలే సాక్ష్యం. మైదానం నుంచి జీవితాదర్శం దాకా ప్రయాణించిన చలం తన సిద్దాంతంలోని ఒక్కొక్క వాదనను క్రమంగా కోల్పోతూ వచ్చాడు. చివరకు నిలిచి గెలిచింది విశ్వనాథ ప్రతిపాదించిన కులపాలికా ప్రణయం. ఇది విశ్వనాథ రచనలన్నింటిలోనూ ప్రధాన ప్రతిపాదితాంశమే. కిన్నెరసాని పాటలలో కుటుంబ కాఠిన్య దాంపత్యాన్ని ఎట్లా విషాదమయం చేస్తుందో వివరించాడు. ఆభిజాత్యము, అధికార దర్పము ప్రణయాన్ని సఫలం కాకుండా ఎలా అడ్డుకుంటాయో అనార్కలిలో చూపించాడు. దుష్టకామ భావన అధికారం తోడైనప్పుడు రాజ్యవ్యవస్థను కూడా తిరస్కరించే స్థాయికి కామము ఎట్లా ప్రవర్తిస్తుందో నర్తనశాలలో నిరూపించటం జరిగింది. గాలిలో నిలిచే ప్రణయం పురుషులు పురుషులనే వివాహము చేసుకోవచ్చనే తీవ్రదశకు చేరుకున్నప్పుడు ఎంత విషాదం అలముకుంటుందో వేనరాజులో చూడవచ్చు. స్త్రీపురుషుల మధ్య సామరస్యము చెలియలి కట్ట వంటిది. దానిని దాటినప్పుడు మొత్తం సమాజం సంక్షుభితం కాక తప్పదు.
వేయిపడగలు నవలకు ప్రధాన ఇతివృత్తం ఈ వివాహ వ్యవస్థ. సమాజాన్ని నిలబెడుతున్న ఎన్ని వ్యవస్థలైనా నశించిపోవచ్చు. వాటి స్థానంలోకి కొత్త వ్యవస్థలు రావచ్చు. కొత్త ప్రత్యామ్నాయాలు ఏర్పడవచ్చు. కానీ, స్త్రీపురుష సంబంధం వివాహం వంటి ధర్మసూత్రానికి నిబద్దమై సమాజ నిర్వహణకు కేంద్రంగా రూపొందవలసి ఉంటుంది. అందువలననే కులపాలికా ప్రణయంలో ప్రణయిని మెట్లు మెట్లుగా అధిరోహిస్తూ పరదేవతగా తన్నుతాను ఆవిష్కరించుకున్నది. అరుంధతి ధర్మారావుల తరువాత మరొక్క ముఖ్య దాంపత్య జీవితం, కిరీటి శశిరేఖలకు సంబంధించినది. ఈ వృత్తాంతాన్ని బట్టి దీని వెనక శశిరేఖ అభిమన్యుల గాధ ప్రాగ్రూపంగా ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఆర్థికమైన, సామాజికమైన సంబంధాలతో పరస్పరం సమర్పించుకున్న కిరీటి శశిరేఖల నడుమ ఎన్నో విఘ్నాలు ఏర్పడ్డవి. చివరకి అ వృత్తాంతం సఫలంగా ముగియడం ఒక గొప్ప ప్రేమ విజయం. ఇతర ప్రణయకవులు కొంతదూరం వచ్చి ఆగిపోయిన సన్నివేశం కిరీటి శశిరేఖల ప్రణయ యాత్రలో పరిపూర్ణతను పొందింది.
చివరి వివాహం అభౌమము, దివ్యము అయిన గిరిక, వేణుగోపాల స్వాముల వృత్తాంతము. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద ఈ విషయంలో రాజమార్గం వేయగా, ఆ దారిలో సువర్ణ ప్రేమ సౌధాలు నిర్మించి శ్రీరంగంలో స్వామి, శ్రీవిల్లిపుత్తూరు దాకా ప్రయాణించి వచ్చేట్లుగా చేసుకున్న ఘనత ఆండాళమ్మది. గిరిక అభినయం ద్వారా, నిత్య భావన ద్వారా, నిరంతర ధ్యానం ద్వారా, వేణుగోపాల స్వామి కల్యాణోత్సవాలలో తన్నుతాను క్రమక్రమంగా కరిగించుకుంటూ పోయింది. యమునానది, కృష్ణ సముద్రంలో కలిసినట్లుగా గిరిక స్వామి సముద్రంలో సంగమించింది. ఆమె సిద్ధి పొందిన క్షణంలో లౌకిక మరణమన్న స్ఫూర్తి కానీ, విషాద రేఖ గానీ వేయిపడగలు స్ఫురింపనీయలేదు. గిరిక ముక్తి పొందినప్పుడు జ్ఞానులైన అక్కడి వారు పొందిన అనుభవ విశేషం వేరు, అరుంధతి చనిపోయినప్పుడు ధర్మారావు పొందిన దు:ఖం వేరు. ధర్మారావు పొందిన దు:ఖంలో లోకస్పర్శ ఉన్నది. రస స్పర్శ ఉన్నది. అపరిమితంగా దుఖిస్తున్న ధర్మారావును చూచి రథంతరి నీవేమో యోగీశ్వరుడనుకున్నానయ్యా.. ఇట్లా దు:ఖిస్తున్నావని అక్షేపణతో కూడిన ఓదార్పు వాక్యం పలుకుతుంది.
ఇక్కడ వేయిపడగలులో సులభంగా పరిష్కారం కాని ఒక గ్రంథగ్రంథి ఉన్నది. అది చిన్న అరుంధతి వివాహం. రచయిత తను ఆత్మకథాత్మక ధోరణిలో పడి నవలానిర్మాణ శిల్పాన్ని ప్రక్కకు నెట్టినాడా అన్న ప్రశ్న వస్తుంది. నవల ఆరంభం నుంచి దీన్లో రెండు పడగలైనా మిగులుతవి అన్న ఒక భావన అనుస్యూతంగా వస్తుంది. అరుంధతి మరణంతో ఆ భావన భగ్నమవుతుంది. ఆ కాలంలో వివాహ వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలు, చర్చలు, ఆధునికులనబడే వాళ్ల అనుకూల్యం ఇవన్నీ రచయిత ఒక సంశయాన్ని సంకోచాన్ని కలిగించాయేమో అనిపిస్తుంది. అయితే దాన్లో అతడు ఎక్కువకాలం నిలవలేదు. వెంటనే దాన్నుండి బయటపడ్డాడు. సమాజంలోని అన్ని వ్యవస్థలకు, అన్ని ధర్మాలకు, అన్ని పురోగామి శక్తులకు, అన్ని జీవన మాధుర్యాలకు, అన్ని పరలోక సంభావనలకు, అన్ని విశ్వ కుటుంబ తత్త్వములకు, ఈ వివాహ వ్యవస్థ మూలమని, ఈ దాంపత్యమే మూలమని రచయిత గాఢంగా విశ్వసించాడు. అందుకే సమాజవ్యవస్థ ఆధారంగా చేసుకున్న ఒక వివాహాన్ని ప్రణయం మూలాధారంగా ఉన్న మరొక వివాహాన్ని శరీరాలకు అతీతంగా జీవాత్మ పరమాత్మల సంయోగ హేతువుగా సంసిద్ధిగా మరొక వివాహాన్ని అయన మూడు కేంద్రాలుగా నిర్మించి ఈ త్రిభుజం చుట్టూ పరిక్రమించవలసిన మానవ జీవన ధర్మచక్రాన్ని వేయిపడగల పేర ఆయన నిర్మించాడు.
1982లో పోతన పంచశతి ఉత్సవాలలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు మాట్లాడుతూ “మనం స్వాతంత్ర సంగ్రామంలో క్రియాశీలంగా వర్తించగా విశ్వనాథ సత్యనారాయణ గారు తన రచనల ద్వారా పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు” అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభించిన సాంస్కృతిక సామ్రాజ్య వాద వ్యతిరేక ఉద్యమం ఇంకా కొనసాగవలసే ఉన్నది. మన చరిత్రలో వ్యక్తిత్వం లేనివారుగా చిత్రించి, అర్య ద్రావిడులుగా విభజించి, మన మతాలను, అపరిణత వ్యవహారాలుగా ప్రదర్శించి, మన వేదాలను ప్రకృతికి భయపడ్డ మానవుని ఆర్త గీతాలుగా చిత్రించి, మనల్ని మన మూలాల నుంచి దూరంగా విసరి వేసే ప్రయత్నం చేసిన మహా ప్రయత్నం నుంచి మనం విముక్తులం కాలేదు. విశ్వనాథ తనకు పూర్వం హెన్రీ డిరోజియో, రాజా రామ్మోహనరాయ్, దయానంద సరస్వతి, వివేకానంద, శ్రీఅరబిందో మొదలైన వారు సాగించిన ఈ అధ్యాత్మిక, సాంస్కృతిక పారాలన్నింటినీ సమన్వించుకుని భారతీయ సమాజాన్ని పునరున్మీలితం చేయటానికి వాజయం ద్వారా ఉద్యమం సాగించాడు. ఈ గొప్ప ఉద్యమం సందర్భంలో కొన్ని కొన్ని అవగాహనలు ఈనాడు మనకు సమంజసంగా కానరాకపోవచ్చు. కానీ సమగ్ర దృష్టితో చూస్తే ఆయన ప్రాణాలు దేశం కోసం, సంస్కృతి కోసం, భాషల కోసం, నిరంతర జాగరూకత కోసం ప్రయత్నించబడ్డవి. ఈ సందర్భంలో వేయి పడగల్లో కొన్ని అంశాలను మనం పరిశీలించవచ్చు.