“ఒక జాతి సర్వత ఉన్మీలితమైనా రావచ్చు కాని శక్తి చావరాదు” (25వ అధ్యాయం) వేయిపడగలకు కేంద్రమైన వాక్యమిది. మూలము నుండి పెళ్లగించడం జరిగినా సహజంగా అంతరికమైన ప్రాణశక్తి నిలిచివుంటే దాన్ని పునరుజ్జీవింపజేసుకొనవచ్చును. ఈ అంశమే ఈ అధ్యాయంలో ప్రతీకాత్మకంగా చెప్పడం జరిగింది. ‘ఒక గొల్లవాడు ముసలియావునొక దానిని కబేలావానికమ్మబోవుచుండెను. ఆ యావు శక్తియుడుగనన్ని దినములు సమృద్ధిగా పాలిచ్చెను. గొల్లవాడు దానితో సుఖపడెను.’ ఈ సన్నివేశంలో పసరిక ప్రవేశించింది. పసరిక పైరుపచ్చ. ప్రకృతి, భూమికి ప్రతీక. పసరిక అధీనమైన ఆవు మళ్లీ ఉజ్జీవించింది. అ అవు “పరిలీనాగ్నియైన శమీవృక్షము వలె నెమ్మదిగా తేజోధిదేవత వలె”నడిచింది. జాతిశక్తి మళ్లీ ఉజ్జీవనం పొందింది. అందువల్ల చీకట్లు ‘దాని నడచినంత మేర పరాభూతములైనవి. ఈ అంశం నవలలో సూచ్యాంశం. నవల ఉన్మీలితమైన జాతిశక్తి అంతరమైన ప్రాణశక్తి చేత మళ్లీ పాదులో నిట్పబడి అంతదాకా ఆవరించి ఉన్న తమోమయ దశనుండి బయటపడిందని తాత్పర్యం. ఈ అంశాన్ని మూలంగా చేసికొని ఈ నవల జాతీయ పునరుజ్జీవన చైతన్యం ఎట్లా విజయం వైపుగా ప్రయాణం చేస్తున్నదో వ్యాఖ్యానించి చెప్పింది. అందువల్ల ఈ గ్రంథం నిరాశావాదాన్ని, ఓటమి తత్త్వాన్ని ప్రకటిస్తున్నదనే వాదం నిరాధారమైనది. అందుకే గార్డినరు వీరి జాతీలోని శక్తి ‘చావలేదని అంటాడు. ఈ శక్తిధరుడు మొదటి అధ్యాయం చివర దర్శనమిచ్చిన ‘మహాపురుషుడు’ ధర్మారావు. అతడు చివరి అధ్యాయంలో అరుంధతిని చూచి “నీవు మిగిలితివి. ఇది నా జాతిశక్తి’ అంటాడు. ఈ విధంగా వేయిపడగలు మొత్తం గ్రంథం ఈ శక్తి ఉద్యమాన్ని నశించిపోకుండా నిలబెట్టడాన్ని సూచిస్తూ ఉన్నది. ఈనాడు పర్యావరణ శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ఏయే అంశాలను గూర్చి చర్చిస్తున్నదో వాటిని వేయిపడగలు ఎనభై ఏళ్ల క్రితమే చర్చించింది. ప్రకృతిలో ఉండే సంతులనాన్ని భంగం చేయడం వల్ల మానవ జీవితం ఎంత దుఖభాజనమవుతున్నదో ఇంతటి అభినివేశంతో చర్చించిన నవల మన దేశంలోనే అరుదైనది. చెట్టను నిర్మూలించడం, మెట్టపొలాలను లేకుండా చేయడం, వాణిజ్యసస్యాలకు ప్రాధాన్యం వచ్చి తిండిగింజలు తగ్గిపోవడం, ఇవన్నీ పాశ్యాత్య నాగరికత తెచ్చిపెట్టిన బస్తీల పెరుగుదలతో వచ్చిన ఇబ్బంది. ఇంతేకాక సృష్టి అంతా మానవుడి సుఖభోగాలకోసమే ఏర్పడిందని భావించినట్లు ఈ నాగరికత ప్రవర్తిస్తుంది. మిగిలిన జీవకోటికి అశ్రయభూతమైన ప్రకృతి అంతా వికావికలు చేయబడింది. ఇరువదవ అధ్యాయంలో ఈ కల్లోలం అశ్చర్యకరమైన విధంగా చిత్రింపబడింది. వృషన్నిధి అన్న మేఘ వృత్తాంతం. ఆ మేఘం ఆదివటం మీద నిలుస్తుంది. ఆ చెట్టు, అ మేఘముల మైత్రి ఊరు పుట్టినప్పటి నుండి కొనసాగుతున్నది. అంటే అనంతకాలం నుండి కొనసాగుతున్నది. అది ఈ క్రొత్త నాగరికత వల్ల విశ్లేథమయింది. అదివటము విద్యుద్దీపముల కొఱకు విచ్ఛేదమైపోవడం వల్ల ఆ మేఘానికి ఆ గ్రామాన్ని గుర్తుపట్టడం కష్టమయింది. వృషన్నిధి అక్కడ కురియలేదు. అయితే వృషన్నిధికి కూడా ఒక తుపాకీ గుండు తగిలింది. ఈ గుండు సామరస్యాన్ని త్రోసివేస్తూ ఆక్రమిస్తూవున్న నాగరికత. ఈ గుండు వల్ల నాగరికతా మోహంలో అత్మ విస్మతి పొందిన ప్రజల నూతన భావరం వల్ల ఈ మేఘము ఏదో నీరక్కరలేని ఒక గుట్ట పైభాగాన కూలబడిపోయింది. మేఘాన్ని ప్రియా సందేశ వాహకంగా కాళిదాసు నిర్మిస్తే, ఆధునిక కాలంలో పృథ్వీ చైతన్యంలో ప్రాకృతిక అసంతులనం వల్ల ఏర్పడ్డ విషాదాన్ని వ్యక్తం చేయడానికి ఈ వృషన్నిధిని తీర్చిదిద్దాడు విశ్వనాథ. విశ్వనాథ సత్యనారాయణ పాశ్చాత్య ప్రక్రియలను అందిపుచ్చుకున్నప్పుడు వాటిని విస్తరించడమూ, ఉన్నతీకరించడమూ, నూతన లక్షణాలను అపాదించడమూ చేస్తుంటాడు. అయన నవలలు కూడా ఇందుకు అపవాదాలు కావు. వేయిపడగలు నవల జానపద కథల ధోరణులతో ప్రారంభమవుతుంది. ఆధునిక సామాజిక పరిణామ అంశాల చర్చలతో నిండిపోయి తెలుగు పల్లెల వాతావరణాన్ని ఋతువుల మార్పులను, కాలక్రమంలో వచ్చే వరదలు వంటి విపత్తులను చిత్రించటం జరిగింది. కావ్యం వలే ఈ నవల గిరిక ప్రవేశించినప్పటి నుండి అమె కల్యాణం కోసమా అన్నట్లుగా పరిగెత్తుకుంటూ పోతుంది. ఒక విధంగా గిరిక కల్యాణం కావ్యానికి చరమసీమగా చెప్పుకోవచ్చు. కావ్యారంభంలో ప్రకృతికి, రాజ్యవ్యవస్థకు సంఘర్షణగా ప్రారంభమై, కలలో పాము వేసిన సుబ్రహ్మణ్యుడు గిరిక ప్రవేశంతో వేణుగోపాలుడిలా మారిపోయి ప్రకృతితో పరిణయమాడినాడు. ఈ పాణిగ్రహణం భూదివముల సమావేశం. ద్యావాపృథ్వీ సంగమం. ఈ సందర్భంలో ప్రతిరోజూ- అష్టమి నుండి పూర్ణిమ పర్యంతం వెన్నెలలు నారాయణమయములై అయన దశావతారాల వైభవాన్ని ప్రవ్యక్తం చేశాయి. గిరిక నాట్యంతో మిగిలిన వాద్యకారుల సహకారంతో కూచిపూడి నృత్యం శ్రీవైకుంఠ వైభవ ప్రకాశితంగా మారిపోతుంది. బృందావనంగా శోభించింది. వేయిపడగలు ఒక మహాకావ్యమైంది. ఇది తెలుగు నవలల్లో మరి దేనికీ పట్టని సౌభాగ్యం. మనం చర్చిస్తూ వస్తున్నట్టుగా ఇన్ని కథన పార్వాలను ఇముడ్చుకున్న ఈ ఇతిహాసం, ఈ మహాకావ్యం, ఈ నవల బాహిర రూపాన్ని బట్టి అదేమిటో గుర్తించటం సులభసాధ్యం కాలేదు. ఇది నవలే కాదన్న వాళ్ల దగ్గర నుంచి దీని కంటే గొప్ప నవల లేదనే దాకా, విమర్శకులు వైవిధ్యంతో ముక్తకంఠంతో గొంతెత్తి పలికారు.