Site icon Sanchika

వేయిపడగలు ఎందుకు చదవాలి?

[box type=’note’ fontsize=’16’] “ఈ నవల బాహిర రూపాన్ని బట్టి అదేమిటో గుర్తించటం సులభసాధ్యం కాలేదు. ఇది నవలే కాదన్న వాళ్ల దగ్గర నుంచి దీని కంటే గొప్ప నవల లేదనే దాకా, విమర్శకులు వైవిధ్యంతో ముక్తకంఠంతో గొంతెత్తి పలికారు” అని వివరిస్తున్నారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యవేయిపడగలు ఎందుకు చదవాలి?” అనే ఈ వ్యాసంలో. [/box]

[dropcap]వే[/dropcap]యిపడగలు 80 ఏళ్ల క్రితం రచింపబడినా, ఈనాటికీ బహుళంగా చదువబడుతూ చర్చింపబడుతున్నది. వ్యాఖ్యానింపబడుతున్నది. అనేక క్లిష్ట వివాదాలకు కారణమవుతున్నది. సజీవంగా, సాహిత్యరంగంలో నిలబడి ఉన్నది. ఇన్నేళ్లలో లక్ష పైగా ప్రతులు వెలువడటం, అవిచ్ఛిన్నంగా పాఠకులు ఆసక్తి చూపుతూ ఉండటం, మరే నవల విషయంలోనూ ఉన్నట్టుగా కనపడదు. ఈ నవల ఒక విస్తృతమైన మానుష ప్రపంచాన్ని ప్రకృతిని, చరాచర జగత్తును తనలో సంలీనం చేసుకున్నది. ఋతువులు తమ పరిక్రమణంలో వైషద్యాన్ని కథాగమనంలో భాగం పంచుకుంటూ ఒక మహాభారతం తప్ప భారతీయ ఇతిహాసంలో ఇంతగా అమితాఖ్యానక శాఖలు కలిగిన గ్రంథం మరొకటి కనిపించదు. నన్నయ్యభట్టు ధర్మతత్త్వజ్ఞులు అన్న పద్యంలో భారతాన్ని గూర్చిన విశ్వముఖీనమైన అంశాన్ని వెల్లడి చేసిన విధం దీనికీ అన్వయిస్తుంది… మహాభారతం జనమేజయుడి సభలో, తరువాత నైమిశారణ్యంలో ప్రపంచింపబడి విస్తృత రూపాన్ని పొందింది. మౌఖిక సంప్రదాయం నుంచి లేఖన సంప్రదాయంలోకి మారుతూ వచ్చింది. వేయి పడగలు కూడా రచయిత చెప్పినప్పుడు మౌఖిక మార్గంలో తరువాత నాలుగేళ్లకు ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడినప్పుడు లేఖన సంప్రదాయంలోకి పరిణమించింది. జాగ్రత్తగా పరిశీలిస్తే రచనలో మౌఖిక సంప్రదాయ లక్షణాలు, జానపద ముద్రణలు పురాగాథల అవశేషాలు ఎన్నో మనం గుర్తు పట్టవచ్చు. ఇతర నవలల కంటే ఈ నవలను ఈ ఎఱుకతో పరిశీలించాలి. ఒక ఏకవీర లాగా ఈ నవలను చూస్తే ఒక కాళిదాసు కావ్యాన్ని మహాభారతంతో పోల్చిచూసినట్టవుతుంది. మన విమర్శకులు చాలామంది ఇక్కడ సరైన పరిప్రేక్ష్య ధోరణిలో ఆలోచించక నిర్ణయాలు చేయటంలో పొరబడ్డారు. వేయిపడగలను విమర్శించిన సందర్భంలో తెలుగు విమర్శలో అధునిక ఇతిహాసం లేదా నవలేతిహాసం అన్న మాటలు పుట్టాయి. నవలను ఒక ప్రక్రియగానే కాకుండా నవలా ప్రపంచాన్ని అనేక ప్రక్రియల సమాహారంగా చూడవలసిన అవసరం 60, 70 లలో విమర్శకులు పుట్టించారు. నవలలలో కావ్యాలు, ఇతిహాసాలు, కథాగుచ్ఛాలు సంవాద వైఖరులు గల రచనలు, అత్మకథాత్మకాలు, శాస్త్ర గర్భితాలు, శిల్ప వైవిధ్య ప్రయోగాలు, చైతన్య స్రవంతి రూపాలు ఇలా అనేకమైన ప్రక్రియా వైవిధ్యం మనకు గోచరిస్తుంది. ఇది కాక కేవలం వస్తు దృష్టితో చూసినప్పుడు సంప్రదాయమనీ, స్త్రీవాదమనీ, మార్క్సిజమనీ, చరిత్రాత్మకమనీ, జాతీయమనీ, ఇలా అనేక ధోరణులు ఉన్నాయి. 60ల తరువాత వచ్చిన విమర్శలో వస్తునిష్ట ప్రధానంగా కనిపిస్తుంది. వస్తు చిత్రణ సహజ జీవన సంవేదనల డాక్యుమెంటరీస్ అని ఈ అంశాలు ఈ 20, 30 ఏళ్ల విమర్శలో ప్రాధాన్యం వహించాయి. సామాన్యంగా ఏ కళారూపమైనా పికాసో బొమ్మలాగా వాస్తవాన్ని స్వప్నరూపంలోకి, ప్రతీక రూపంలోకి పరివర్తింపజేస్తుంది. ఈ పరివర్తనాక్రమంలోనే కుమ్మరిపురుగు సీతాకోకచిలుక అవుతుంది. కుమ్మరిపురుగు వాస్తవం. సీతాకోకచిలుక కళాభివ్యక్తి. అవి మనస్సులో జరిగే పరివర్తనలో వస్తువు తన్నుతాను కళారూపంగా పరిణమించటానికి అతని అవచేతనం సమష్టి అవచేతనం ప్రాధాన్యం వహిస్తాయి. కేవలం జాగ్రదావస్థలో ఉన్నప్పుడు ఈ పరిణామం జరగదు. కవి రచనావేళ ఒకానొక వ్యక్తావ్యక్త స్థితిలో సంధి దశలో విశ్వచైతన్య గర్భం నుంచి ఎన్నుకున్న అంశాలు ప్రతీకలై బింబాలై ఉపమాది అలంకారాలై శిల్పమార్గాన పయనించి లౌకిక స్థితిని అలౌకిక స్థితిగా పరిణమింపజేస్తాయి. అందువల్లే రచయిత ఆ తాదాత్మస్థితిలో నుంచే ‘వేయిపడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకున్నదీ కలలోన రాజునూ’ అని ప్రారంభిస్తాడు. ఈ గీత ప్రారంభం అవచేతనలోంచి వెలువడిందే. ఈ అవచేతనలోంచి వెలువడిన గీతం ప్రవహిస్తూ, ప్రవహిస్తూ సాగిపోయి కథానాయకుడు అన్నీ కోల్పోయిన స్థితిలో పోలిక సరిపోదు కానీ, స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజులాగా మిగిలిపోయి ‘నీవు మిగిలితివి, నా జాతి శక్తివి’ అనడంతో పూర్తవుతుంది. కథాకథన దశలో ఈ మొత్తం నవలలోనూ రచయిత ఒక పారవశ్య దశలో ఉంటాడు. ఈ పారవశ్యంలోంచి అప్పుడప్పుడూ జాగ్రద్దశలోకి వచ్చినట్లు కనిపించినా మళ్లీ పారవశ్యస్థితికి, స్వప్నస్థితికీ తిరిగి ప్రయాణం చేస్తుంటాడు. ఈ భూమిక మీద ఈ నవలలో రచయిత సూత్రధారుడవుతాడు, కథానాయకుడవుతాడు.. కథ చెప్పుతూ చెప్పుతూ తన ఆత్మకథలోకి వెళ్లిపోతాడు. ఆత్మకథలోనుంచి సాగి, జగత్కథను ఇహపర లోకాల అనుబంధాన్ని వాడి అవినాభావ స్థితినీ వ్యాఖ్యానిస్తాడు. ప్రాయిడ్ మనస్తత్వ శాస్త్రాన్ని బట్టి సర్పము దమితమైన వాంఛలకు ప్రతీక. భారతీయ యోగ శాస్త్రంలో సర్పము ఈశ్వరాభిముఖ చైతన్య క్రమణానికి ప్రతీక. ఈ నవలలో ఈ రెండు అంశాలు కలిసిపోయినట్లు గోచరిస్తుంది. మరొక అంశం పసరిక వృత్తాంతం. పసరిక పామే. పసరిక వ్యవసాయానికి పంటలకు పృథ్విలోని జీవపోషక లక్షణానికి ప్రాతినిథ్యం వహిస్తుంది. మన సమాజ జీవనం మీద గ్రామీణ వ్యవస్థమీద, గ్రామ స్వరాజ్యస్థితి మీద, నాగరిక సమాజం పరాయి పరిపాలన దాడి చేసిన సందర్భంలో పసరిక మరణించే పరిస్థితి వచ్చింది. దాడి జరిగింది. ఈ దాడి దేశం యొక్క సహజమైన ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. ఈ ప్రశ్న పందొమ్మిదో శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో వచ్చింది. ఆరోజుల్లో లాలా లజపతిరాయ్, రమేశ్చంద్రదత్, బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధీ ఈ నలుగురూ గ్రామ శైథిల్యం వల్ల నలుడు బాహుకుడైనట్టు భారతదేశం మారిపోవడాన్ని ప్రశ్నించారు. గాంధీజీ గ్రామస్వరాజ్ భావాన్ని ఈ సందర్బంలో పుట్టిందే. ఈ గ్రామశైథిల్యం వెనుక వృత్తులు పోయినవి. బ్రతుకుతెరువు పోయింది. వాణిజ్యపంటలు పెరిగినవి. మెట్టపొలాలు పోయినవి. ప్రజలు మూలాల నుంచి పెటీకివేయబడి, అప్పుడే ఏర్పడుతున్న నగరాల్లోకి పొట్ట చేత పట్టుకుని విసిరివేయబడ్డారు. ఈ మూలచ్చేదనలో గ్రామ పరిపాలన అక్కడి నుంచి మహానగరాలకు ఎగిరిపోయింది. గ్రామపరిపాలకుడు నిస్తేజుడు కాగా, రెండవ జమీందారు చెన్నై నుంచి పరిపాలన సాగించడం.. పరిపాలన పరాయీకరణకు ప్రకటరూపమైంది. డబ్బు గ్రామం నుంచి మహానగరం నుంచి ఇంగ్లండు దాకా ప్రవహించటం ప్రారంభమైంది. మొదటి జమీందారు కాలంలో జమీందారు గ్రామ చైతన్యానికి ప్రతీకగా మమైక్యమై పాలనంతా గ్రామ స్వాయత్తత కేంద్రంగా నిర్వహించగా, రెండవ జమీందారు దాన్ని విచ్ఛేదం చేశాడు. గ్రామస్వాయత్తతకు ప్రతీకయైన ప్రభువు గ్రామానికి ఆత్మ, అతడు చేసిన మేలును గూర్చి చెప్పితే తెలుగు విమర్శకులు జమీందారీ దోపిడీ వ్యవస్థను సమర్థించడంగా విశ్లేషించారు.

వేయిపడగలు ఇతిహాసం తాళం తెరిచేందుకు ముఖ్యంగా కావలసింది జానపదగాధా విజ్ఞానం. జానపద కథల్లో స్థావర, జంగమ, జలచర, భూచర, గగన చర, భౌమ, దివ్య, జీవిత, ప్రేత ఇత్యాది అనేక ప్రాణ ప్రకటనలు (లైఫ్ మానిఫెస్టేషన్) కలిసి ఉంటాయి. వీటిలో నదులూ, పర్వతాలూ భాగమే అవుతాయి. అందువల్ల ఈ నవలలో అరుంధతికీ, సుబ్రహ్మణ్యస్వామి దర్శనమిచ్చినా, వృషన్నిధి అదివటముల వృత్తాంతమైనా, గిరిక చరిత్రలోని కొన్ని సన్నివేశాలైనా, ఒక అలౌకిక స్పర్శను కలిగి ఉంటాయి. భౌతిక వాస్తవిక ధోరణితో చూస్తే ఇది వ్యాఖ్యాన గమ్యం కాకుండాపోదు. ఈ జానపద గాథా ప్రవృత్తిని ప్రవేశపెట్టడంతో ఈ ఇతిహాసం భూమ్యాకాశాల మధ్య సేతువుగా నిలువబడ్డది. ఒక గణాచారి పాత్ర నిర్మాణంలో విశ్వజీవనంలోని భూతభవిష్యదంశాలు మన చుట్టూ ఉన్న అంతరిక్షంలో వ్యాపించి ఉన్న ప్రాచీన విశ్వాసాలను ప్రతిఫలింపజేస్తాయి.

ఇంకా మూలాల్లోకి వెళ్తే ఈ కథావేదికయైన సుబ్బన్నపేట గ్రామ ఆవిర్భావ వృత్తాంతం. ఇది మొదటి అధ్యాయంలోనే ఉన్నది. ఆ ప్రాంతం అంతా ఒక దట్టమైన అరణ్యం. ఆ అరణ్యం మధ్యలో చిన్ని పల్లెటూరు. అక్కడ ఒక రైతు గోవును పెంచుకుంటూ ఆ పాలను విక్రయించుకుంటూ జీవితం సుఖంగా గడుపుతున్నాడు. హఠాత్తుగా ఒక సాయంకాలం అ అవు తిరిగి వచ్చేప్పటికి ఆవు పొదుగు రిక్తమై ఉన్నది. ఈ విషయం క్రమంగా కొన్ని రోజులు అట్లాగే గడిచింది. రైతు ఎంతో ఓపికతో దాని వెంటపడి ఆ రహస్యాన్ని కనుక్కున్నాడు. ఆ అవు ఎవరికీ తెలియకుండా ఒక పుట్ట దగ్గర నిల్చుని పాలను స్రవింపజేస్తుంటే.. ఒక పాము వాటిని త్రాగుతున్నది. అది సహజంగా ఒక పడగతోనే కనిపించినా, రెండు పడగలతోనూ, నాలుగు పడగలతోనూ ఉన్నట్టుగా అతనికి తోచింది. కొద్దిరోజులకు అతని స్వప్నంలో వేయిపడగలతో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకు గుడి కట్టించమని కోరాడు. క్రమంగా ఒక ధనవంతుడు, ఒక భూస్వామి రావటం.. క్రమంగా నాగేశ్వర స్వామి దేవాలయం ఏర్పడటం జరిగిపోయింది. ఇలాంటి గ్రామ వృత్తాంతాలు తెలుగుదేశంలో కోకొల్లలుగా వినపడుతూ ఉంటాయి. సుప్రసిద్దమైన తిరుమల క్షేత్రంలో స్వామి వృత్తాంతం కూడా ఈ కథను పోలి ఉంటుంది. దీన్ని మనం గమనించినప్పుడు వేయిపడగల మూలాలు గ్రామీణ ప్రజాజీవనంలో విశ్వాసాలను అల్లుకుని ఉన్న మూలాలలోనుంచి వెలువడినట్లుగా స్పష్టమవుతుంది. ఇక నవల ప్రధాన కథలోకి ప్రవేశించే ముందు దానిలోని విభిన్న భాగాలను వింగడించి చూసుకోవాలి. ఒకటి కథారంభంలో ధర్మారావు ప్రవేశించడానికి ముందే జరిగిపోయిన రామేశ్వర శాస్త్రి వృత్తాంతం. ఇదంతా ధర్మారావు వ్యాజంగా విస్తరించి చెప్పబడింది. దీనిలో ప్రధాన అంశం రామేశ్వర శాస్త్రి గ్రామాధికారంలో మంత్రి స్థానంలో ఉండటం. ఆ మంత్రి క్రమంగా అధికారాన్ని కోల్పోవడం.. నిరంతర దానశీలత వల్ల దారిద్ర్యాన్ని పొందడం ఒక అంశమైతే, రెండవ అంశం భారతీయ సమాజంలోని నాలుగు వర్ణాలను సంయోజించి సమన్వయ పరచడానికి ప్రతీకగా ఆ నాలుగు వర్ణాల స్త్రీలను వివాహమాడి ఆయా సంతానం ద్వారా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మాలను నిలబెట్టే ప్రయత్నం చేశాడని, ఆ ప్రయత్నాలన్నీ నలుగురిలోనూ వైఫల్యం చెందినట్లు చెప్పబడింది. ఈ ప్రతీకాత్మాకమైన వివాహము లాంటి అంశాలు ఆధునిక నాగరిక సమాజంలో కాకుండా ప్రాచీన గాథల్లో కనపడతాయి. రామేశ్వర శాస్త్రి ప్రయత్నం విఫలం కావటం, తన అధికారం పోగొట్టుకోవటం, విచక్షణ లేని దానం వల్ల దారిద్ర్యాన్ని పొందడం, అశయాలలో అతను ఎంత ఉన్నతుడైనా, ఆచరణలో వైఫల్యం పొందినట్లు రచయిత జాగ్రత్తగా సూచిస్తున్నాడు. నవల ఆరంభం నాటికే వ్యక్తీకృతమైన ఈ వైఫల్యాన్ని పట్టించుకోని విమర్శకులు దాన్ని వర్తమానంలోకి తెచ్చుకొని అన్వయం చేయలేక వర్ణాశ్రమములను రచయిత నిలబెట్టడానికి చేసిన ప్రయత్నంగా భావించి దానికి అప వ్యాఖ్యానం చేశారు. ఈ నవలను గూర్చి అనేక చర్చలు ఇక్కడే ప్రారంభమై, ముందుకు వెళ్లలేక వైఫల్యం పొందడం మనం గుర్తించవచ్చు. ఈ అసహజమైన వివాహ వ్యవస్థ ప్రతీకాత్మకమైందనీ రచయిత అర్దోక్తిగా చెప్పినా మనవాళ్లు పట్టించుకోలేదు. ప్రాచీన గాథల్లో ప్రాగ్రూపాల వివేచనలో లోతుల్లోకి పోలేకపోవటం వల్ల రామేశ్వర శాస్త్రి తన జీవితంలో పొందిన వైఫల్యాన్ని గుర్తించకపోవటం వల్ల అనేక దోషాలు ఇక్కడ సంక్రమించటం జరిగింది.

మరొక గమనించదగిన అంశం రామేశ్వరశాస్త్రికి సావిత్రమ్మతో జరిగిన సవర్ణ వివాహం తప్ప మిగిలినవన్నీ ప్రేమమూలక వివాహాలే. ప్రాచీన గాథా సంపుటాలలో అరణ్యక, నాగరక స్త్రీపురుషుల మధ్య వివాహాలు ప్రేమమూలాలే. ఇందుకు ప్రబలమైన ఉ దాహరణం చెంచులక్ష్మి, నరసింహస్వామి కథ. ఈ దృష్ట్యా నాటికి పాశ్చాత్య భావనా వ్యాప్తి వల్ల సమాజంలో పెరుగుతున్న ప్రేమ వివాహాల ప్రాబల్యం ఈ సన్నివేశంలోనూ కనిపిస్తుంది.

దక్షిణాపథంలో దేవాలయాలలో దేవదాసీ వ్యవస్థ అతి ప్రాచీన కాలం నుంచే ఉన్నది. పూరీ జగన్నాథ అలయం దగ్గర నుంచి కన్యాకుమారి దాకా అనేక దేవాలయాలలో తమ జీవితాన్ని తమ నృత్యగాన అభినయ విశేషాలను స్వామికి అర్పణం చేసే ఉపాసనా మార్గం ప్రబలంగానే ఉన్నది. ఈ దేవదాసీలు వేశ్యలు కారు. సామాజికంగా ఆ అభినయ విద్యను సప్రమాణికంగా నిలబెట్టడం దానిని భగవంతుడికి అర్పించటం ప్రవృత్తిగా కలవారు. అభినయ విద్యాపారంగతలైన కొందరు ఎవరినో మహానుభావుని ఆశ్రయించి, వారి వల్ల సంతానం పొంది, ఆ సంతానాన్ని భగవదుపాసనకు అర్పించటం ఈ దేవాదాసీ వృత్తి యొక్క పరమార్థం. ఈ నవలలో రత్నగిరి రామేశ్వర శాస్త్రిని ఆశ్రయించటం, అయన వల్ల సంతానాన్ని పొందటం ఒక విధంగా వసంతసేన.. చారుదత్తుల వృత్తాంతం లాంటిదే. వసంతసేన, రత్నగిరి లాంటి వారు వివాహం కాకున్నా పతి లగ్నైక జీవులే. అందువల్ల వారి జీవితం భగవదర్పణకు హేతువైన తన్ను తాను సమర్పించుకోగల గిరిక వంటి సంతానాన్ని పొందేందుకు భావనా రూపమైన ధ్యానంలో నిలిచి సంసారాన్ని నిర్వహించారు. వేయిపడగలలో మూడవ అధ్యాయం చివర రత్నగిరి రాజాస్థానంలో నర్తకిగా తన అధికారాన్ని నిరూపించుకునేందుకు వచ్చింది కానీ, ఏ సన్మానాన్నో, ఇతర ఫలాన్నో ఆశించి కాదు. అందుకే ఆమె విసురుగా వెళ్లిపోతూ జారిపోతున్న అందియను అందించినా అందుకోకుండా తిరస్కార భావంతో నిష్క్రమించింది. రామేశ్వరశాస్త్రి సంబంధం చేత ఆమెకు సహజంగానే ఆస్థాన నర్తకి పదవి లభించినట్టుగా ఆమె భావించింది. అయితే గిరిక విషయంలో రామేశ్వరం తూలనాడినట్టుగా మాట్లాడితే ఆమె తీవ్ర స్వరంలోనే సమాధానం చెప్పింది. ఈ సందర్భంలో గిరికను ఆస్థానానికి రాజుతో రమ్మని కాసావానిని పంపించే సన్నివేశం మహాభారతంలోని ద్రౌపదిని బలవంతంగా లాగుకొని రమ్మని ప్రాతిగామిని, దుశ్శాసనుని పంపించిన సన్నివేశం గుర్తుకు వస్తుంది. భారతంలో భీష్మద్రోణులు చేయలేని పని ఇక్కడ ధర్మారావు నిర్వర్తించాడు.

వేయి పడగలలో గిరిక ప్రవేశమే ఒక అద్భుతమైన దివ్య స్పర్శ గల సన్నివేశం. గిరిక ఒక గోదాదేవి వలె, ఒక మీరాబాయి వలె జన్మ ప్రభృతి తన్ను తాను వేణుగోపాల స్వామికి సమర్పించుకున్నది. ఆమెను ప్రవేశపెట్టిన తీరులో మూడు నాలుగు వాక్యాలలో ఈ దివ్యత్వ లక్షణం గోచరిస్తుంది. “ఆ నవ్వినది పన్నెండేళ్ల పిల్ల. దాని యొడలిపైకి తెలియకుండ మన్మథుడు వచ్చుచున్నాడు. దాని తెల్లని పలువరుస. సుదర్శనాయుగపుటంచుల వలె పదునుపెట్టినట్లుండెను. దాని చెవులు శ్రీకారములై పాంచజన్యములట్లుండెను. దాని కన్నులు కమలములు. దాని నాసిక కౌమోదకి. దాని భ్రూయుగము శార్ణము ద్విధా విభక్తమైనట్లుండెను. దాని మూర్తి వికుంఠమై మనోజ్ఞమయ్యెను. దాని పేరు దేవదాసి.”

దేవదాసిని-గిరికను ప్రవేశపెట్టినప్పుడు ఆమె మందస్మితమును వర్ణించటంలో మందస్మిత ప్రభాపూర మద్యత్ కామేశ మానసా అన్న లలితా సహస్రనామంలోని వాక్యం గుర్తుకు వస్తుంది. పన్నెండేళ్ల వయసులో అమెను ప్రవేశపెట్టడంతో ద్వాదశాదిత్య మండలాత్మకమైన అనాహతమును సూచించే ఆమె చేయబోయే ఉపాసన అంతా హృదయ విద్య అని దానిలో అమె సాఫల్యం పొందిన రీతి, అమె ముక్తి సందర్భంలో అంతరాదిత్య విద్యా ఉపాసనా ఫలాన్ని పొందటాన్ని సూచిస్తున్నాడు రచయిత. తరువాత వేయి పడగల్లోని కథా వృత్తాంతమంతా ధర్మారావు చుట్టూ, గిరిక చుట్టూ వారిద్దరి ఊర్థ్వముఖ అరోహణ చుట్టూ పరిభ్రమిస్తుంది.

వేయి పడగలలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ శైథిల్యం చెప్పటం ఎంత ముఖ్యమైన అంశమో, కుటుంబ వ్యవస్థకు మూలమైన దాంపత్య జీవనం వివాహ వ్యవస్థ శిథిలమైన సంగతి చెప్పటమూ ముఖ్యాంశమే. రాధాపతి, మంగమ్మ, రామేశ్వరం మొదలైన వారు వివాహ వ్యవస్థకు విరుద్దంగా ప్రవర్తించి సమాజంలో సంక్షోభాన్ని సృష్టించగా, అది విష తరంగాలు తరంగాలుగా ఒక ప్రళయానికి కారణమైంది. రామేశ్వరంలోని అధికార దర్పము, ధనము మంగమ్మ వంటి వారిని ప్రలోభ పెట్టడానికి ఉపయోగపడితే, మిగిలిన వారి వృత్తాంతాల్లో భావనామాత్రమైన ప్రణయం సమాజం యొక్క మనుగడకు సంబంధం లేని ప్రయాణం ఎలా నిష్ఫలమవుతుందో తెలియజేయటం జరిగింది. కుమారస్వామి, శ్యామలల మధ్య వర్ణాంతర వివాహాన్ని వేయిపడగలు సమర్థించింది. ఈ ఇతిహాసంలో మూడు రకాల దాంపత్యాల వైభవం శిఖరాయమానంగా చిత్రింపబడింది. ఒకటి అరుంధతి ధర్మారావుల దాంపత్యం. సమాజపు ఆర్థిక సంబంధాలు అనవసరమైన ఒత్తిడులు తెచ్చినా దారిద్ర్యం పరస్పర అవగాహనకు దూరం చేసినా, భార్యాభర్తల మధ్య ఉండే అనురాగము, ఆప్యాయత, ఆరాధన, సమర్పణ అన్న నాలుగు భావాలు క్రమంగా వారిని సమాజంలోని ఉత్తమ శిఖరాల వద్దకు ప్రయాణింపజేశాయి. వివాహము ఉత్తమోత్తమమైన దాంపత్య ధర్మానికి సమాజ బాధ్యత నిర్వహణానికి ఎలా దోహదం చేయగలదో ఈ వివాహం నిరూపించింది. చిన్ని చిన్ని కలహాలు అనవగాహనలు వారి నడిమి సంబంధం క్రమంగా గాఢతరం చేస్తూనే వచ్చాయి. 1920లలో తెలుగు సాహిత్యంలో వెల్లువలా ముంచెత్తిన ప్రణయ సిద్ధాంతాన్ని ఒక దారికి మళ్లించి క్రమబద్దీకరించిన ఘనత ఈ రచయిత విశ్వనాథ సత్యనారాయణది.  స్వేచ్ఛా ప్రణయం, అమలిన శృంగారం అనే పేర నిత్యజీవితంతో సంబంధం లేని సిద్దాంతాలు పర్శాం కాక తప్పలేదు. రాయప్రోలు తను ప్రతిపాదించిన అమలిన శృంగారాన్ని రూపనవనీతంలో విఫలమైనట్టుగా అంగీకరించాడు. చలం కృష్ణశాస్త్రి ప్రభృతులు ప్రతిపాదించిన స్వేచ్ఛా ప్రణయ సిద్దాంతం సమాజాన్ని ఎంత చికాకు పరిచిందో, ఎంత సంక్షోభానికి దారి తీసిందో అ రచనలే సాక్ష్యం. మైదానం నుంచి జీవితాదర్శం దాకా ప్రయాణించిన చలం తన సిద్దాంతంలోని ఒక్కొక్క వాదనను క్రమంగా కోల్పోతూ వచ్చాడు. చివరకు నిలిచి గెలిచింది విశ్వనాథ ప్రతిపాదించిన కులపాలికా ప్రణయం. ఇది విశ్వనాథ రచనలన్నింటిలోనూ ప్రధాన ప్రతిపాదితాంశమే. కిన్నెరసాని పాటలలో కుటుంబ కాఠిన్య దాంపత్యాన్ని ఎట్లా విషాదమయం చేస్తుందో వివరించాడు. ఆభిజాత్యము, అధికార దర్పము ప్రణయాన్ని సఫలం కాకుండా ఎలా అడ్డుకుంటాయో అనార్కలిలో చూపించాడు. దుష్టకామ భావన అధికారం తోడైనప్పుడు రాజ్యవ్యవస్థను కూడా తిరస్కరించే స్థాయికి కామము ఎట్లా ప్రవర్తిస్తుందో నర్తనశాలలో నిరూపించటం జరిగింది. గాలిలో నిలిచే ప్రణయం పురుషులు పురుషులనే వివాహము చేసుకోవచ్చనే తీవ్రదశకు చేరుకున్నప్పుడు ఎంత విషాదం అలముకుంటుందో వేనరాజులో చూడవచ్చు. స్త్రీపురుషుల మధ్య సామరస్యము చెలియలి కట్ట వంటిది. దానిని దాటినప్పుడు మొత్తం సమాజం సంక్షుభితం కాక తప్పదు.

వేయిపడగలు నవలకు ప్రధాన ఇతివృత్తం ఈ వివాహ వ్యవస్థ. సమాజాన్ని నిలబెడుతున్న ఎన్ని వ్యవస్థలైనా నశించిపోవచ్చు. వాటి స్థానంలోకి కొత్త వ్యవస్థలు రావచ్చు. కొత్త ప్రత్యామ్నాయాలు ఏర్పడవచ్చు. కానీ, స్త్రీపురుష సంబంధం వివాహం వంటి ధర్మసూత్రానికి నిబద్దమై సమాజ నిర్వహణకు కేంద్రంగా రూపొందవలసి ఉంటుంది. అందువలననే కులపాలికా ప్రణయంలో ప్రణయిని మెట్లు మెట్లుగా అధిరోహిస్తూ పరదేవతగా తన్నుతాను ఆవిష్కరించుకున్నది. అరుంధతి ధర్మారావుల తరువాత మరొక్క ముఖ్య దాంపత్య జీవితం, కిరీటి శశిరేఖలకు సంబంధించినది. ఈ వృత్తాంతాన్ని బట్టి దీని వెనక శశిరేఖ అభిమన్యుల గాధ ప్రాగ్రూపంగా ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఆర్థికమైన, సామాజికమైన సంబంధాలతో పరస్పరం సమర్పించుకున్న కిరీటి శశిరేఖల నడుమ ఎన్నో విఘ్నాలు ఏర్పడ్డవి. చివరకి అ వృత్తాంతం సఫలంగా ముగియడం ఒక గొప్ప ప్రేమ విజయం. ఇతర ప్రణయకవులు కొంతదూరం వచ్చి ఆగిపోయిన సన్నివేశం కిరీటి శశిరేఖల ప్రణయ యాత్రలో పరిపూర్ణతను పొందింది.

చివరి వివాహం అభౌమము, దివ్యము అయిన గిరిక, వేణుగోపాల స్వాముల వృత్తాంతము. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద ఈ విషయంలో రాజమార్గం వేయగా, ఆ దారిలో సువర్ణ ప్రేమ సౌధాలు నిర్మించి శ్రీరంగంలో స్వామి, శ్రీవిల్లిపుత్తూరు దాకా ప్రయాణించి వచ్చేట్లుగా చేసుకున్న ఘనత ఆండాళమ్మది. గిరిక అభినయం ద్వారా, నిత్య భావన ద్వారా, నిరంతర ధ్యానం ద్వారా, వేణుగోపాల స్వామి కల్యాణోత్సవాలలో తన్నుతాను క్రమక్రమంగా కరిగించుకుంటూ పోయింది. యమునానది, కృష్ణ సముద్రంలో కలిసినట్లుగా గిరిక స్వామి సముద్రంలో సంగమించింది. ఆమె సిద్ధి పొందిన క్షణంలో లౌకిక మరణమన్న స్ఫూర్తి కానీ, విషాద రేఖ గానీ వేయిపడగలు స్ఫురింపనీయలేదు. గిరిక ముక్తి పొందినప్పుడు జ్ఞానులైన అక్కడి వారు పొందిన అనుభవ విశేషం వేరు, అరుంధతి చనిపోయినప్పుడు ధర్మారావు పొందిన దు:ఖం వేరు. ధర్మారావు పొందిన దు:ఖంలో లోకస్పర్శ ఉన్నది. రస స్పర్శ ఉన్నది. అపరిమితంగా దుఖిస్తున్న ధర్మారావును చూచి రథంతరి నీవేమో యోగీశ్వరుడనుకున్నానయ్యా.. ఇట్లా దు:ఖిస్తున్నావని అక్షేపణతో కూడిన ఓదార్పు వాక్యం పలుకుతుంది.

ఇక్కడ వేయిపడగలులో సులభంగా పరిష్కారం కాని ఒక గ్రంథగ్రంథి ఉన్నది. అది చిన్న అరుంధతి వివాహం. రచయిత తను ఆత్మకథాత్మక ధోరణిలో పడి నవలానిర్మాణ శిల్పాన్ని ప్రక్కకు నెట్టినాడా అన్న ప్రశ్న వస్తుంది. నవల ఆరంభం నుంచి దీన్లో రెండు పడగలైనా మిగులుతవి అన్న ఒక భావన అనుస్యూతంగా వస్తుంది. అరుంధతి మరణంతో ఆ భావన భగ్నమవుతుంది. ఆ కాలంలో వివాహ వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలు, చర్చలు, ఆధునికులనబడే వాళ్ల అనుకూల్యం ఇవన్నీ రచయిత ఒక సంశయాన్ని సంకోచాన్ని కలిగించాయేమో అనిపిస్తుంది. అయితే దాన్లో అతడు ఎక్కువకాలం నిలవలేదు. వెంటనే దాన్నుండి బయటపడ్డాడు. సమాజంలోని అన్ని వ్యవస్థలకు, అన్ని ధర్మాలకు, అన్ని పురోగామి శక్తులకు, అన్ని జీవన మాధుర్యాలకు, అన్ని పరలోక సంభావనలకు, అన్ని విశ్వ కుటుంబ తత్త్వములకు, ఈ వివాహ వ్యవస్థ మూలమని, ఈ దాంపత్యమే మూలమని రచయిత గాఢంగా విశ్వసించాడు. అందుకే సమాజవ్యవస్థ ఆధారంగా చేసుకున్న ఒక వివాహాన్ని ప్రణయం మూలాధారంగా ఉన్న మరొక వివాహాన్ని శరీరాలకు అతీతంగా జీవాత్మ పరమాత్మల సంయోగ హేతువుగా సంసిద్ధిగా మరొక వివాహాన్ని అయన మూడు కేంద్రాలుగా నిర్మించి ఈ త్రిభుజం చుట్టూ పరిక్రమించవలసిన మానవ జీవన ధర్మచక్రాన్ని వేయిపడగల పేర ఆయన నిర్మించాడు.

1982లో పోతన పంచశతి ఉత్సవాలలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు మాట్లాడుతూ “మనం స్వాతంత్ర సంగ్రామంలో క్రియాశీలంగా వర్తించగా విశ్వనాథ సత్యనారాయణ గారు తన రచనల ద్వారా పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు” అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభించిన సాంస్కృతిక సామ్రాజ్య వాద వ్యతిరేక ఉద్యమం ఇంకా కొనసాగవలసే ఉన్నది. మన చరిత్రలో వ్యక్తిత్వం లేనివారుగా చిత్రించి, అర్య ద్రావిడులుగా విభజించి, మన మతాలను, అపరిణత వ్యవహారాలుగా ప్రదర్శించి, మన వేదాలను ప్రకృతికి భయపడ్డ మానవుని ఆర్త గీతాలుగా చిత్రించి, మనల్ని మన మూలాల నుంచి దూరంగా విసరి వేసే ప్రయత్నం చేసిన మహా ప్రయత్నం నుంచి మనం విముక్తులం కాలేదు. విశ్వనాథ తనకు పూర్వం హెన్రీ డిరోజియో, రాజా రామ్మోహనరాయ్, దయానంద సరస్వతి, వివేకానంద, శ్రీఅరబిందో మొదలైన వారు సాగించిన ఈ అధ్యాత్మిక, సాంస్కృతిక పారాలన్నింటినీ సమన్వించుకుని భారతీయ సమాజాన్ని పునరున్మీలితం చేయటానికి వాజయం ద్వారా ఉద్యమం సాగించాడు. ఈ గొప్ప ఉద్యమం సందర్భంలో కొన్ని కొన్ని అవగాహనలు ఈనాడు మనకు సమంజసంగా కానరాకపోవచ్చు. కానీ సమగ్ర దృష్టితో చూస్తే ఆయన ప్రాణాలు దేశం కోసం, సంస్కృతి కోసం, భాషల కోసం, నిరంతర జాగరూకత కోసం ప్రయత్నించబడ్డవి. ఈ సందర్భంలో వేయి పడగల్లో కొన్ని అంశాలను మనం పరిశీలించవచ్చు.

“ఒక జాతి సర్వత ఉన్మీలితమైనా రావచ్చు కాని శక్తి చావరాదు” (25వ అధ్యాయం) వేయిపడగలకు కేంద్రమైన వాక్యమిది. మూలము నుండి పెళ్లగించడం జరిగినా సహజంగా అంతరికమైన ప్రాణశక్తి నిలిచివుంటే దాన్ని పునరుజ్జీవింపజేసుకొనవచ్చును. ఈ అంశమే ఈ అధ్యాయంలో ప్రతీకాత్మకంగా చెప్పడం జరిగింది. ‘ఒక గొల్లవాడు ముసలియావునొక దానిని కబేలావానికమ్మబోవుచుండెను. ఆ యావు శక్తియుడుగనన్ని దినములు సమృద్ధిగా పాలిచ్చెను. గొల్లవాడు దానితో సుఖపడెను.’ ఈ సన్నివేశంలో పసరిక ప్రవేశించింది. పసరిక పైరుపచ్చ. ప్రకృతి, భూమికి ప్రతీక. పసరిక అధీనమైన ఆవు మళ్లీ ఉజ్జీవించింది. అ అవు “పరిలీనాగ్నియైన శమీవృక్షము వలె నెమ్మదిగా తేజోధిదేవత వలె”నడిచింది. జాతిశక్తి మళ్లీ ఉజ్జీవనం పొందింది. అందువల్ల చీకట్లు ‘దాని నడచినంత మేర పరాభూతములైనవి. ఈ అంశం నవలలో సూచ్యాంశం. నవల ఉన్మీలితమైన జాతిశక్తి అంతరమైన ప్రాణశక్తి చేత మళ్లీ పాదులో నిట్పబడి అంతదాకా ఆవరించి ఉన్న తమోమయ దశనుండి బయటపడిందని తాత్పర్యం. ఈ అంశాన్ని మూలంగా చేసికొని ఈ నవల జాతీయ పునరుజ్జీవన చైతన్యం ఎట్లా విజయం వైపుగా ప్రయాణం చేస్తున్నదో వ్యాఖ్యానించి చెప్పింది. అందువల్ల ఈ గ్రంథం నిరాశావాదాన్ని, ఓటమి తత్త్వాన్ని ప్రకటిస్తున్నదనే వాదం నిరాధారమైనది. అందుకే గార్డినరు వీరి జాతీలోని శక్తి ‘చావలేదని అంటాడు. ఈ శక్తిధరుడు మొదటి అధ్యాయం చివర దర్శనమిచ్చిన ‘మహాపురుషుడు’ ధర్మారావు. అతడు చివరి అధ్యాయంలో అరుంధతిని చూచి “నీవు మిగిలితివి. ఇది నా జాతిశక్తి’ అంటాడు. ఈ విధంగా వేయిపడగలు మొత్తం గ్రంథం ఈ శక్తి ఉద్యమాన్ని నశించిపోకుండా నిలబెట్టడాన్ని సూచిస్తూ ఉన్నది. ఈనాడు పర్యావరణ శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ఏయే అంశాలను గూర్చి చర్చిస్తున్నదో వాటిని వేయిపడగలు ఎనభై ఏళ్ల క్రితమే చర్చించింది. ప్రకృతిలో ఉండే సంతులనాన్ని భంగం చేయడం వల్ల మానవ జీవితం ఎంత దుఖభాజనమవుతున్నదో ఇంతటి అభినివేశంతో చర్చించిన నవల మన దేశంలోనే అరుదైనది. చెట్టను నిర్మూలించడం, మెట్టపొలాలను లేకుండా చేయడం, వాణిజ్యసస్యాలకు ప్రాధాన్యం వచ్చి తిండిగింజలు తగ్గిపోవడం, ఇవన్నీ పాశ్యాత్య నాగరికత తెచ్చిపెట్టిన బస్తీల పెరుగుదలతో వచ్చిన ఇబ్బంది. ఇంతేకాక సృష్టి అంతా మానవుడి సుఖభోగాలకోసమే ఏర్పడిందని భావించినట్లు ఈ నాగరికత ప్రవర్తిస్తుంది. మిగిలిన జీవకోటికి అశ్రయభూతమైన ప్రకృతి అంతా వికావికలు చేయబడింది. ఇరువదవ అధ్యాయంలో ఈ కల్లోలం అశ్చర్యకరమైన విధంగా చిత్రింపబడింది. వృషన్నిధి అన్న మేఘ వృత్తాంతం. ఆ మేఘం ఆదివటం మీద నిలుస్తుంది. ఆ చెట్టు, అ మేఘముల మైత్రి ఊరు పుట్టినప్పటి నుండి కొనసాగుతున్నది. అంటే అనంతకాలం నుండి కొనసాగుతున్నది. అది ఈ క్రొత్త నాగరికత వల్ల విశ్లేథమయింది. అదివటము విద్యుద్దీపముల కొఱకు విచ్ఛేదమైపోవడం వల్ల ఆ మేఘానికి ఆ గ్రామాన్ని గుర్తుపట్టడం కష్టమయింది. వృషన్నిధి అక్కడ కురియలేదు. అయితే వృషన్నిధికి కూడా ఒక తుపాకీ గుండు తగిలింది. ఈ గుండు సామరస్యాన్ని త్రోసివేస్తూ ఆక్రమిస్తూవున్న నాగరికత. ఈ గుండు వల్ల నాగరికతా మోహంలో అత్మ విస్మతి పొందిన ప్రజల నూతన భావరం వల్ల ఈ మేఘము ఏదో నీరక్కరలేని ఒక గుట్ట పైభాగాన కూలబడిపోయింది. మేఘాన్ని ప్రియా సందేశ వాహకంగా కాళిదాసు నిర్మిస్తే, ఆధునిక కాలంలో పృథ్వీ చైతన్యంలో ప్రాకృతిక అసంతులనం వల్ల ఏర్పడ్డ విషాదాన్ని వ్యక్తం చేయడానికి ఈ వృషన్నిధిని తీర్చిదిద్దాడు విశ్వనాథ. విశ్వనాథ సత్యనారాయణ పాశ్చాత్య ప్రక్రియలను అందిపుచ్చుకున్నప్పుడు వాటిని విస్తరించడమూ, ఉన్నతీకరించడమూ, నూతన లక్షణాలను అపాదించడమూ చేస్తుంటాడు. అయన నవలలు కూడా ఇందుకు అపవాదాలు కావు. వేయిపడగలు నవల జానపద కథల ధోరణులతో ప్రారంభమవుతుంది. ఆధునిక సామాజిక పరిణామ అంశాల చర్చలతో నిండిపోయి తెలుగు పల్లెల వాతావరణాన్ని ఋతువుల మార్పులను, కాలక్రమంలో వచ్చే వరదలు వంటి విపత్తులను చిత్రించటం జరిగింది. కావ్యం వలే ఈ నవల గిరిక ప్రవేశించినప్పటి నుండి అమె కల్యాణం కోసమా అన్నట్లుగా పరిగెత్తుకుంటూ పోతుంది. ఒక విధంగా గిరిక కల్యాణం కావ్యానికి చరమసీమగా చెప్పుకోవచ్చు. కావ్యారంభంలో ప్రకృతికి, రాజ్యవ్యవస్థకు సంఘర్షణగా ప్రారంభమై, కలలో పాము వేసిన సుబ్రహ్మణ్యుడు గిరిక ప్రవేశంతో వేణుగోపాలుడిలా మారిపోయి ప్రకృతితో పరిణయమాడినాడు. ఈ పాణిగ్రహణం భూదివముల సమావేశం. ద్యావాపృథ్వీ సంగమం. ఈ సందర్భంలో ప్రతిరోజూ- అష్టమి నుండి పూర్ణిమ పర్యంతం వెన్నెలలు నారాయణమయములై అయన దశావతారాల వైభవాన్ని ప్రవ్యక్తం చేశాయి. గిరిక నాట్యంతో మిగిలిన వాద్యకారుల సహకారంతో కూచిపూడి నృత్యం శ్రీవైకుంఠ వైభవ ప్రకాశితంగా మారిపోతుంది. బృందావనంగా శోభించింది. వేయిపడగలు ఒక మహాకావ్యమైంది. ఇది తెలుగు నవలల్లో మరి దేనికీ పట్టని సౌభాగ్యం. మనం చర్చిస్తూ వస్తున్నట్టుగా ఇన్ని కథన పార్వాలను ఇముడ్చుకున్న ఈ ఇతిహాసం, ఈ మహాకావ్యం, ఈ నవల బాహిర రూపాన్ని బట్టి అదేమిటో గుర్తించటం సులభసాధ్యం కాలేదు. ఇది నవలే కాదన్న వాళ్ల దగ్గర నుంచి దీని కంటే గొప్ప నవల లేదనే దాకా, విమర్శకులు వైవిధ్యంతో ముక్తకంఠంతో గొంతెత్తి పలికారు.

Exit mobile version