మహిళల మేలు కాంక్షించే కథల సంపుటి ‘విభజిత’

0
2

[విజయ భండారు గారి కథా సంపుటి ‘విభజిత’ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్]

స్త్రీల సమస్యలు, హక్కులపై పోరాడే కార్యకర్త, ఉద్యమకారిణి, రచయిత్రి విజయ భండారు గారి రెండవ కథా సంపుటి ‘విభజిత’. ఇందులో 17 కథలున్నాయి.

“స్త్రీల సమస్యల పరిష్కారాల దిశగా, ఫీల్డ్ వర్క్ చేసే క్రమంలో తనకు దగ్గరగా వచ్చిన స్త్రీల ఆవేదనలు, కష్టాలు, వాటిని కౌన్సిలింగ్ మాత్రమే కాక జీవన చిత్రాలను సాహిత్య చరిత్రలో నమోదు చేయడం భండరు విజయ సాధించిన విజయంగా అనిపిస్తుంది” అని వి. ప్రతిమ గారు తమ ముందుమాట ‘ఆమెది సామూహిక స్వరం’లో పేర్కొన్నారు.

“ఇందులోని కథలన్నీ నగర కేంద్రంగా నడుస్తాయి. పేద, శ్రామిక, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి స్త్రీల జీవితాలను చిత్రిస్తాయి” అని వ్యాఖ్యానించారు శ్రీ నిధి (బ్రహ్మచారి) ‘బహుముఖ కోణాల్లో స్త్రీల వ్యథలు’ అనే తమ ముందుమాటలో.

~

లంబాడీ కుటుంబాలలో – మగపిల్లలనే కనాలనే ఒత్తిడి ఆడవాళ్ళపై ఎంతలా ఉంటుందో, ఆడపిల్లలని కన్న అమ్మ ఎన్ని వేధింపులు ఎదుర్కుంటుందో ‘జుమ్రీ’ కథ చెప్తుంది. అయితే ఈ కథలో – ఆడపిల్ల పుడితే ఏమవుతుందోనని గర్భిణిగా ఉన్న భార్యతో పాటుగా ఆమె భర్త సైతం భయపడటం.. ఆ కుటుంబాలలో దంపతులు అనుభవిస్తున్న వేదనని చాటుతుంది. జుమ్రీ పెరిగి పెద్దదై, న్యాయవాది విధిత కుటుంబంలో ఒకర్తెగా కలిసిపోతుంది. కౌమారంలోకి వచ్చిన జుమ్రీ ఎదుర్కున్న ఇబ్బందులు, వివేక్ అనే దారి తప్పిన, సంపన్న కుటుంబపు పిల్లాడి మాటలు, బెదిరింపులు చదివితే – ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలు దుందుడుకు పిల్లలని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం అవుతుంది. వివేక్ వాడిన భాష, బెదిరింపుల వెనుక పురుషాహంకారం, ధన మదం మాత్రమే కాకుండా సమాజంలో ఇటీవల వెలుగుజూసిన నేరాల లోని నేరస్థుల ప్రవర్తన ద్యోతకమవుతుంది. మగపిల్లలను నిరంతరం గమనిస్తూ.. వాళ్ళలో ఇలాంటి ధోరణిని గుర్తించిన వెంటనే చర్యలు తీసుకుని నివారించకపోతే.. ఇలాంటి పిల్లలు పెద్దయి పెళ్ళి చేసుకున్నాకా, భార్యని హింసించడం, వేధించడం జరుగుతుంది.

అనుమతి లేకుండా మన జీవితాల్లోకి దూసుకొచ్చేసి, తమ ప్రవర్తనతో, అధికారిక హోదాతో పెనుతు తుఫాను సృష్టిస్తారు కొందరు. ‘చొరబాటుదారు’ కథ – ఎస్.ఐ. సుధాకర్ చందన ఇంట్లోకి అతి చొరవగా ప్రవేశించడం, ఆమెకి సంబంధం లేని సమస్యలలో ఇరికించడం, అతని వెకిలి చేష్టలను ఆమె భరించాల్సి రావడం గురించి చెబుతుంది. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న పోలీసులు ఎంత దారుణానికైన ఒడిగట్టగలరని చెబుతుంది. ఇలాంటి చొరబాటుదారులను బాధిత స్త్రీలే శిక్షించాలని, ఆధారాలతో సహా చట్టానికి పట్టించాలని కథ సూచిస్తుంది.

తండ్రి, సవతి తల్లి పెట్టే బాధలనించి తప్పించుకుందామనుకుని ఇంటి నుంచి పారిపోయిన జానకి అనే బాలిక – రైల్వే ఫ్లాట్‍ఫామ్ మీద నిద్ర పోతుంటే అక్కడ జరిగిన గొడవని ఆధారం చేసుకుని – రైల్వే పోలీసులు ఫ్లాట్ ఫాం మీదుండే అసహాయులందరినీ ఖాళీ చేయిస్తారు. జరిగిన గొడవకి పోలీస్ కేస్ అయి మిగతా వారితో పాటు జానకిని పోలీసులు పట్టుకుపోతారు. కోర్టు తీర్పు అనంతరం జానకిని ప్ర్రభుత్వం వారి హోమ్‍లో చేరుతుంది. కష్టపడి పదో తరగతి వరకు చదువుతుంది. ఆపై ఆ హోమ్ నిబంధనలను ప్రకారం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అన్యుల మేడమ్ సూచనల ప్రకారం ప్రైవేటు హాస్టల్‍లో ఉండి ఇంటర్ చదువుతుంది. అక్కడ ఓ స్నేహితురాలితో పార్టీకి వెళ్ళాల్సి రావడం, ఆమె కారు డ్రైవర్ అనంతుతో ప్రేమలో పడడం, పెళ్ళి – జానకి జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. అనంతు దూరమైతే, ఎన్నో కష్టాలను ఎదుర్కుని పిల్లల్ని పెంచుతుంది, బాగా చదివిస్తుంది. జానకి జీవితం వివిధ దశలుగా విభజితమై, ఒక్కో దశలో ఒక రకమైన వేదనని భరించడం, చివర్లో పిల్లలు వృద్ధిలోకి వచ్చి తల్లిని అపురూపంగా చూసుకోవంతో ముగుస్తుంది. ఎన్నెన్నో ఉద్వేగాలను కలిగిస్తుంది ‘విభజిత’ కథ.

హిజాబ్’ కథ పేరు సూచించినట్లుగానే – ముస్లిం యువతుల వస్త్రధారణపై దేశంలో పలు ప్రాంతాలలో ఈమధ్య కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా అల్లిన కథ. ఇతర మతస్తులకు లేని వివక్ష ముస్లిం మహిళలు ధరించే వస్త్రాలపై చూపటంలోనూ; ఇతర మతస్తుల సంస్కృతులను, సాంప్రాదాయాలను, అలవాట్లను వ్యతిరేకించడంలో రాజకీయ నాయకుల కుట్ర ఉందని ఈ కథ వ్యాఖ్యానిస్తుంది.

ఇడుపు కాయితాలు’ కథ ఒకే రకం సమస్యతో బాధ పడిన ఇద్దరు స్త్రీల కథ. యశోద తెగించి ఓ నిర్ణయం తీసుకుంటే సుధ సమాజానికి వెరచి ఎన్నో ఘర్షణల తర్వాత గానీ నిర్ణయం తీసుకోదు. జీవితాలు దిద్దుకోలేదు. తన పిరికితనానికి బాధపడతుంది సుధ.

మేడ్’ కథ బతుకుతెరువు కోసం పనిమనిషిగా పనిచేసే శారద కథ. శారదకి సాయం చేస్తూ అండగా ఉండే సువర్ణ – శారద పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పడు హెచ్చరిస్తుంది. సరైన మార్గంలో పెడుతుంది. “ఏ పని చేసినా డబ్బు కోసం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారిని గమనించి వాళ్ళు ఎలాంటి వారో, వారి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుని వెళ్ళడం మంచిది. మనం ఏ పని చేసినా కాస్తో కూస్తో జ్ఞానం సంపాదించుకోవాలి” అన్న సువర్ణ మాటలు అక్షర సత్యాలు.

స్త్రీలను హీనంగా చూడకుండా, వారి అభిరుచులను పురుషులు గౌరవించిన రోజున ఎలాంటి గోడలైనా కూలిపోకతప్పదని చెబుతుంది ‘కూలిన గోడలు..!’ కథ.

భరించలేని నిజాలు తెలిసినప్పుడు – ఆప్తులనుకున్నవాళ్ళే దారుణానికి ఒడిగట్టినప్పుడు – అత్యంత హీనమైన దుశ్చర్యకి పాల్పడినప్పుడు – సంబంధిత వ్యక్తుల మానసిక స్థితి ఎలా ఉంటుందో ‘నిజం’ కథ చెబుతుంది.

భర్త ఉండీ విధవరాలిగా జీవించిన ఓ మహిళ దయనీయమైన కథ ‘హాఫ్ విడో’. “అల్లారు ముద్దుగా చూసుకునే ఆడపిల్లల జీవితాలు తమ ముందే కష్టాల పాలైనప్పుడు ఆ కుటుంబం పడే యాతన ఈ కథలో కనిపిస్తుంది” అన్న నిధి (బ్రహ్మచారి) గారి అభిప్రాయాన్ని పాఠకులు కాదనలేరు.

వల’ కథ సినీరంగంపై మోజుతో హీరోయిన్ అవుదామని వచ్చి, భంగపడి, జూనియర్ ఆర్టిస్ట్‌గా మారి, బ్రోకర్ల ఉచ్చుల్లో చిక్కుకుని, తిరిగి ఇళ్ళకి వెళ్ళలేక, జీవితాన్ని నిత్య నరకం చేసుకునే అమ్మాయిల గురించి చెబుతుంది. వెండితెర వెలుగుల వెనుక ఇన్ని చీకటి గాథలుంటాయా అన్న ఆలోచన పాఠకులను కలవరపరుస్తుంది.

తన క్లాసులో చదివే చరిత్ర అనే ఓ తెలివైన అమ్మాయి హఠాత్తుగా ఉత్సాహసం కోల్పోయి, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నదానిలా కనబడుతుంటే ఆ టీచర్ ఆరా తీస్తే విస్తుగొలిపే నిజం తెలుస్తుందామెకు. ఆ చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురై, ఆత్మహత్య చేసుకోవాలకున్న చరిత్రను బుజ్జగించి నిజం తెల్సుకుని, ఆమెని వేధించిన ధూర్తుడి గురించి ఆమె తల్లిదండ్రులకు తెలిపి, కౌమారదశలో ఉన్న కూతుర్ల సమస్యల పట్ల ఎలా స్పందించాలో వివరిస్తుంది. ముఖ్యంగా లైంగిక వేధింపుల గురించి పిల్లలు తల్లితో చెప్పినప్పుడు, వాటిని తీసిపారేయకూడదని హెచ్చరిస్తుంది. ‘సూసైడ్ నోట్’ కథ ఓ హెచ్చరిక లాంటిది.

తనని కావాలనే మోసం చేయడానికి కుట్ర పూరితంగా వ్యహరించిన భర్త ఆటకట్టించేందుకు జానకి చేసిన ఓ తెలివైన పని, మలి దశలో ఆమె జీవితానికో దారి చూపుతుంది ‘జానకి నవ్వింది!’ కథలో.

పేదరికంలో మగ్గుతూ, కష్టాల కడలిని ఈదే ముస్లిం కుటుంబాలలో – ప్రస్తుత తరం పిల్లలు చదవుకుని ప్రయోజకులై తమ బతుకులని తీర్చిదిద్దుకుంటున్న వైనాన్ని ‘పరదాల వెనుక!’ కథలో ఫాతిమా, హసీనా, జహంగీర్ లాంటివారు వెల్లడిస్తారు.

ఆన్‍లైన్ క్లాసులు’లో ఆన్‍లైన్ క్లాస్‍ల వల్ల చిన్నారులలో కలిగే ఒత్తిడిని వ్యక్తపరిస్తే, ‘అనుబంధాలు’ కథ ఆన్‍లైన్ క్లాస్‍ల వల్ల టీచర్లకు కలిగే ఒత్తిడిని ప్రదర్శించింది. కరోనా వల్ల మానవ జీవితాలలో కలిగిన నిస్సహాయతను అధిగమించేందుకు బంధాలను గాఢం చేసుకునే ప్రయత్నంలో – ఆదుకోడానికి నిలిచిన స్త్రీకే మరిన్ని ఒత్తిడులు కలుగుతున్నాయని చెప్పిన కథలివి. కరోనా నేపథ్యంగా అల్లిన మరో కథ ‘మలుపు’. తన అనుకున్న వాళ్ళు తనను అర్థం చేసుకుని తనను గుర్తించినప్పుడు కలిగే ఆనందం ఎంతో బాగుంటుందని ఈ కథ చెబుతుంది.

~

ఈ సంపుటి లోని చాలా కథలు ఇంటా బయటా ఆడవారి అగచాట్లను ప్రదర్శిస్తాయి. కంటికి కనబడే ఇబ్బందులు కొన్నయితే, బాహటంగా వ్యక్తం చేయలేని సమస్యలు కొన్ని. అటువంటి సమస్యలను కథల్లోని కొన్ని పాత్రలు ఎదుర్కున్న తీరు – నిజ జీవితంలో అటువంటి సమస్యలనే ఎదుర్కుంటున్నవారికి ప్రేరణనిస్తుంది. ఆయా సమస్యల లోంచి బయటే మార్గాన్ని వెతికేందుకు ప్రోత్సహిస్తుంది. కొన్ని కథలు కలవరపరుస్తాయి. కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఆలోచింపజేస్తాయి. ఏ వర్గంలోనివారైనా బాధిత, పీడిత మహిళకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తాయీ కథల్లోని పాత్రలు.

“పితృస్వామిక భావజాలం సమాజంలో ఎంతలా వేళ్ళునుకునిపోయిందో, దాని ప్రభావం వల్ల కుటుంబ వ్యవస్థలో స్త్రీ ఎన్ని రూపాలలో శారీరికంగా, మానసికంగా విభజించబడుతుందో, ఈ ‘విభజిత’ కథా సంపుటిలో ఉన్న ప్రతి కథలోని పాత్ర మీకు తెలియజేసి, మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేస్తుందని నమ్ముతున్నాను” అన్నారు రచయిత్రి ‘నా మాట’లో. ఈ కథలు చదివాకా, పాఠకులు ఈ మాటలతో ఏకీభవిస్తారు.

***

విభజిత (కథా సంపుటి)
రచన: విజయ భండారు
ప్రచురణ: హస్మిత ప్రచురణలు
పేజీలు: 175
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
రచయిత్రి ఫోన్: 8801910908, 9347357402
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/vibhajitha
https://www.flipkart.com/vibhajitha/p/itmaffd9a15c7758

 

~

విజయ భండారు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-vijaya-bhandaru/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here