Site icon Sanchika

విడచి

[dropcap]”బూ[/dropcap]మ్మీద మనిషిగా పుట్టిన ప్రతి వాడు తాను చచ్చే లోపల ఈడ తన గుర్తుగా ఏదో ఒకటి విడచి పోవాల. మీరేం విడచి పోతారో చెప్పండ” అంటా అన్న మమ్మల్ని అడిగె.

“నేను నా కవితలను విడచి పోతావుండ” ఓ కవి అనె.

“నేను నా పాటని విడచి పోతావుండ” ఓ గానపదుడు అనె.

“నేను కనుగొన్న శాస్త్ర సాంకేతికను విడచి పోతావుండ” శాస్త్రవేత్త చెప్పే.

“నేను విద్యను దానం చేసి పోతావుండ” విద్యావేత్త అనె.

“నేను నా ఉసురు (ప్రాణం) విడచి పోతావుండ” ఓ ఆధ్యాత్మిక వేత్త అంటానే, “యోవ్వ్, అయోగ్య సామ్రాణి ఉసురు ప్రకృతిది. ఇచ్చిన ప్రకృతి తిరిగి తీసుకొంటుంది. నువ్వేం విడిచేది” అని తిట్టి నా పక్కకి తిరిగి చూసే అన్న.

“కూలి చేస్తే కూడు లేకుంటే బిడు, అట్లా బదుకు నాది. నేనేం విడిచిపోయేదినా” అని అందరి పక్క చూస్తిని.

“అట్లేలరా చూస్తావు, కూలికి పోయే తావనో, కావళి (బీడు భూమి) పక్కలానో, రోడ్డు పక్కలానో, నాలుగు చెట్లు పెంచిపో, అదే నీకు పెద్ద గుర్తు” అనే అన్న.

అన్న చెప్పింది అక్షరాలా నిజం. మీరు మీకు గుర్తుగా ఈ బూమ్మీద ఏదో ఒకటి విడచి పోండా.

***

విడచి = వదిలి

Exit mobile version