విదేశాలు-యాత్రలు -1

0
2

[box type=’note’ fontsize=’16’] విదేశీ యాత్రలలో సుప్రసిద్ధ కవి నీరజ్ గారి అనుభవాలపై హిందీలో డా. ప్రేమ్‍కుమార్ రచించిన వ్యాసాన్ని తెలుగులో అనువదించి అందిస్తున్నారు డా. టి.సి. వసంత. [/box]

[dropcap]ఆ[/dropcap]యన మైమరచి పడుకున్నారు. గాఢ నిద్రలో ఉన్నారు. కూర్చోనడానికి నేను కుర్చీ లాగాను. చప్పుడయింది. ఆయన కళ్ళు తెరిచారు. నా వైపు తిరిగారు. అసలు నేను ఏమీ అడగలేదు. ఆయన ఏదీ వినలేదు. మాట్లాడం మొదలు పెట్టారు. మొట్టమొదట కంఠం మామూలుగా ఉంది. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా పెరిగింది.

“ఇవాళ నేను నా విదేశీ యాత్రలను గుర్తుకు తెచ్చుకుంటాను. ఇప్పుడు దీని గురించే మాట్లాడతాను. మొట్టమొదట 1983లో నేను అమెరికా, కెనెడాకి వెళ్ళాను. నాతో పాటు శ్రీమతి ప్రభా ఠాకూర్, నందకిషోర్ నౌటియల్, ఇంకా మరి కొందరు ఉన్నారు. మమ్మల్ని భారతీయ విద్యాభవన్, న్యూయార్క్ శాఖ సంస్థాపకులు శ్రీ జయరామన్ ఆహ్వానించారు. ఆరోగ్యం బాగా లేదు. అందుకే వెళ్ళనా వద్దా అని ఆలోచించాను. అయినా ఆకర్షణ. ఒక రోజు నేను ఆలీఘఢ్‌లో ఎటు వైపో వెళ్తున్నాను. అనుకోకుండా పహాడీ పండిత్‌జీ కలిసారు ఆ సమయంలో. ఆయన పేరు ప్రతిష్ఠలు కల పండితులు. “పండిత్‌జీ! అమెరికాకి నాకు వెళ్ళాలని లేదు కాని ఏం చేయను” అని అడిగాను. ఆయన కొంచెం సేపు ఆలోచించారు. “మీకు వెళ్ళాలని ఉన్నా లేకపోయినా, మీరు వెళ్తున్నారు.” అని ఆయన అన్నారు. 1973లో నేను బొంబాయి వెళ్తున్నప్పుడు కూడా వారిని అనుకోకుండా కలిసాను. “నీరజ్‌గారూ! ఎక్కడికి వెళ్తున్నారు?” అని అడిగారు. “బొంబాయి వెళ్తున్నాను” అని చెప్పాను. “మీరు బొంబాయిలో నిలకడగా ఉండలేరు. పదిహేను రోజుల తరువాత వెనక్కి వస్తున్నారు.” అని ఆయన అన్నారు. అదే జరిగింది. “వారు ఎంత మహా పండితులు” అంటున్నప్పుడు ఆయన కళ్ళు మెరిసాయి.

చివరికి పాస్‌పోర్ట్ చేయించాను. యాత్రకి ఏడు రోజులు ముందు అమెరికన్ ఎంబసీకి వెళ్ళాను. న్యూయార్క్ శాఖకి తగినంత ఆర్ధిక స్థితి లేనందున వీసా ఇవ్వము అని వాళ్ళన్నారు. పోనీలే అని నేను నిశ్చింతగా ఉన్నాను.

నేను అక్కడి నుండి అటు ఇటు తిరుగుతూ హిందూస్తాన్ టైమ్స్ ఆఫీసుకు వెళ్ళాను. అక్కడ నా అమెరికా వెళ్ళడం గురించి చర్చ జరుగుతోంది. అక్కడ సురేంద్రవర్మ ఉన్నారు. “అమెరికా వెళ్తున్నారు కదూ!” అని ఆయన అడిగారు. “ఎట్లా వెళ్తాను? అసలు వీసా దొరికితేగా!” అన్నాను. వినంగానే ఆయన ఆశ్చర్యపోయారు. ఆయనకి సంగతంతా చెప్పాను. “యు.ఎస్.ఐ ఆపీసు ఎదురుగానే ఉంది. పదండి. మీకు వీసా ఎట్లా ఇవ్వరో తేల్చుకుందాం” అని ఆయన అన్నారు. అక్కడ చార్ల్స్ లవరేజ్ అనే అతను డైరెక్టర్‌గా ఉన్నారు. వారితో పరిచయం చేసారు. “ఇట్ ఈస్ స్ట్రేంజ్, దె హవ్ రెఫ్యూజూడ్ విసా టు యూ! వుయ్ ప్రమోట్ రైటర్స్ టు గో అవర్ కంట్రీ” అని ఆయన ఆశ్చర్యంగా అన్నారు. “అప్లికేషన్ ఉందా, రెండు పోటోలు ఉన్నాయా? ఇప్పుడే నేను ఎంబసీకి ఫోను చేస్తాను. ఒక వేళ వీసా రికార్డ్ కాకపోతే ఇక్కడి నుండి రెండింటికి వీసా దొరుకుంతుంది” అని ఆయన అన్నారు. నేను అప్లికేషన్ రాశాను. ఫోటోతో సహా ఇచ్చాను. ఆశ్చర్యం అక్కడి నుండి 5 సంవత్సరాల కోసం వీసా తయారయింది. డైరెక్టర్ ఆఫీసుకు వచ్చింది. నేను ఎయిర్ ఇండియా ఆపీసుకి నా టికెట్ రిజర్వేషన్ గురించి అడగడానికి వెళ్ళాను. అక్కడ కంప్యూటర్ ద్వారా తెలిసింది, రిజర్వేషన్ కాలేదు. నేను జయరామన్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన అన్నారు రిజర్వేషన్ అయిందని. రెండు రోజుల తరువాత వెళ్ళమని చెప్పారు. రెండో రోజు వెళ్ళి చూస్తే రిజర్వేషన్ అయింది. ఆ రోజు పహడీ పండిత్‌కి ఉన్న జ్ఞానం చూసి ఆశ్చర్యపోయాను. ఆనాటి నుండి ఆయన పట్ల నాకు ఇంకా గౌరవం పెరింది.”

ఇప్పుడు నీరజ్‌గారు లేచి కూర్చున్నారు. మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు. “మొత్తానికి నేను అమెరికా వెళ్ళాను. న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాను. అక్కడంతా గుంపులు గుంపులుగా ఉన్నారు. కొంచెం గాభరా అనిపించింది. క్లియరెన్స్‌కి పెద్ద క్యూ ఉంది. అక్కడే కూర్చున్నాను. రెండు మూడు గంటల తరువాత బయటపడ్డాను. మాన్‌హట్టన్ ముఖ్యమైన వ్యాపార కేంద్రం. దక్షిణ భారతీయుల ఇంట్లో నా బస ఏర్పాటు చేసారు. వాళ్ళ పేర్లు గుర్తుకు రావడం లేదు. మెల్లి మెల్లిగా అమెరికాలోని ఎన్నో నగరాలను చూసాను. కెనడా కూడా వెళ్ళాలి.”

“నేను, నంద కిషోర్ నౌటియల్ కెనడాకి వెళ్ళము. కాని ప్రభా ఠాకుర్ రాలేదు. దీనిని ఏర్పాటు చేసిన ఆఫర్‌దార్ జీ బాధ పడ్డారు. నేను రెండున్నర గంటలు ఏక ధాటిగా కావ్య పఠనం చేస్తానని కార్యక్రమం బాగా జరగుతుందని హామీ ఇచ్చాను. కెనడాలో నాలుగు చోట్ల, అట్టావా, టోరంటో, హెమిల్‌టన్, విన్నీపెగ్ – లో ఏర్పాటు చేయించారు. నాలుగు నగరాలలో నా కార్యక్రమం చాలా బాగా జరిగింది. విన్నీపెగ్‌లో ఒక సంఘటన జరిగింది. దీన్ని గురించి చెప్పాలి. నేను వేదాంత్ జీ ఇంట్లో ఉన్నాను. ఆయన కాయస్థులు. కాని పూర్తిగా శాఖాహారి. ఆయనకి తెలిసింది నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం అని. “నేను తినను కాని చేసి పెడతాను” అని ఆయన భార్య అన్నది. ఆ రాత్రి నాకు చికెన్ సర్వ్ చేశారు. ఎంతో రుచిగా ఉంది. “వదినగారు, ఇది మీరు చేయలేరు అని నాకనిపిస్తోంది. ఎవరో ముస్లిం చేసారని నాకు అనిపిస్తోంది” అన్నాను. ఆమె నవ్వడం మొదలు పెట్టింది. అక్కడ అతియా అని ఒక అమ్మాయి ఉంది. “అంకుల్ నేనే చేసాను. నేను ఆలీఘడ్ వాసిని” అని ఆ అమ్మాయి అన్నది. “బేటా! నీవు చాలా రుచిగా చేసావు” అన్నాను. ఆ అమ్మాయి నన్ను పట్టుకుని ఏడవడం మొదలు పెట్టింది. “చాలా కాలం తరువాత బేటా అన్నమాట విన్నాను. ఇక్కడ ఎవరు ఇట్లా పిలవరు” అంది. “భారతీయ సంస్కృతి ఉన్నాక హిందూ-ముస్లింలు అన్న భేద భావం ఉండదు” అని నేనన్నాను. కళ్ళు ముసుకుని ఏదో గుర్తు తెచ్చుకుంటున్నారు. బహుశ అప్పటి ఆ క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ అందులోనే మళ్ళీ ఒకసారి జీవిస్తున్నట్లున్నారు.

కొంచెం సేపయ్యాక కళ్ళు తెరిచారు. “నాకు ఈ సంఘటన అట్టావాలో జరిగిందా టోరంటోలోనా, గుర్తుకు రావడం లేదు. నేను కావ్య పఠనం మధ్యలో ఇంటర్‌వెల్‌లో బాత్ రూమ్ వెళ్ళడానికి బయటకి వచ్చాను. ఒక యువ జంట అక్కడ నిల్చోవడం చూసాను. వాళ్ళు బయటకి వెళ్ళాలా, లోపలికి! ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారని అనిపించింది. నేను ఆ యువకుడిని అడిగాను – “మీరు రషీద్ అహమ్మద్ బుఖారీ కొడుకు కదూ!” అని. ఆ అబ్బాయి ఇచ్చిన జవాబు వినగానే నేను అవాక్కయిపోయాను. “అవును” అని అతనన్నాడు. వారు ఉన్నారా అని అడిగాను. “ఉన్నారు.” అని చెప్పి, “ఆయనకి 90 సంవత్సరాలు మాతోనే ఉంటున్నారు” అని అతడన్నాడు. “గోపాల్ మీకు సలామ్ చెబుతున్నాడు, డెహరాడున్‌లో ఉర్దూ ముషాయిరాలో జిగర్ సాహెబ్ ఎదురుకుండా కావ్య పఠనం చేసిన గోపాల్” అని చెప్పండి. ముషాయిరా తరువాత, ఇక ఢిల్లీకి వెళ్ళ వద్దు, నీవు గవర్నమెంటుకి వ్యతిరేకంగా కావ్య పఠనం చేస్తున్నావని నిన్ను అరెస్ట్ చేస్తారని అంటున్నారు అని గోపాల్‌కి చెప్పారు. 1944లో మీరు డెహరాడూన్‌లో డెప్యూటి కలెక్టర్‌గా పని చేసేటప్పుడు ఇదంతా జరిగింది అని వారికి చెప్పండి.” అన్నారు.

దీర్ఘశ్వాస తీసుకున్నారు. కొంచెం సేపు మౌనంగా ఉన్నారు. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు – “అసలు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నలభై సంవత్సరాల తరువాత నా ఇంటి జ్నాన్ ఎట్లా చెప్పగలిగింది అతడు బుఖారీ సాహెబ్ కొడుకు అని. అసలు నేనెప్పుడు అతనిని చూడలేదుగా. ఈ సంఘటన చూసాక నాకు అనిపిస్తోంది, ఒక్కొక్కసారి భవిష్యత్ గురించిన నిజం దానంతట అదే నోట్లోంచి వస్తుంది. బహుశ వ్యక్తి ఉపచేతనలో ఇదంతా ఉండి ఉండవచ్చు. స్కూల్లో చదివే రోజులలో కూడా ఇట్లాగే జరిగింది. అప్పుడు నేను ఒక టీచరు మృత్యువు గురించి చెప్పాను. రెండో ప్రపంచ యుద్ధం గురించి చెప్పాను. రెండు నిజమయ్యాయి. ఈ సంఘటనలను గుర్తు చేసుకుంటూ నేను కవితను రాసాను. “ఉస్ కీ అన్‌గిన్ బూందోం మే స్వాతి బూంద్ కౌన్, యే బాత్ స్వయం బాదల్ కో భీ మలూమ్ నహీం” అని. ఇదంతా సబ్‌కాన్షస్‌లో ఉండే మాట.”

అక్కడే జరిగిన మరొక సంఘటన. ఇది డాక్టర్ల ఇంటలిజన్స్ గురించి… అక్కడ నాకు నాలిక కింద ఒక పుండు వచ్చింది. విన్నీపెగ్‌లో ఇది జరిగింది. అక్కడ హఠాత్తుగా ఒక డాక్టర్‌తో పరిచయం అయింది. ఆయన పేరు కిషన్ నిగమ్, ఆయన మాయు బాబు పెదనాన్న కొడుకు. 1942లో కాన్‌పూర్‌లో ‌వాళ్ళ ఇంట్లో ట్యూషన్ చెప్పే వాడిని. గోపాల్ దాస్ నీరజ్ కావ్య పఠనం చేయడానికి వస్తున్నడని ఆయన తల్లికి తెలిసింది. వచ్చే ఆయన నీరజ్ అంటే గోపాల్ దాసేనా అని అడిగింది. ఆ తరువాత కిషన్ నన్ను కలవడానికి వచ్చాడు. నేను గుర్తుపట్టాను. ‘కిషన్’ అని నేనన్నాను. ఆయన నన్ను పలకరించాడు. నేను ఆయనతో పుండు విషయం మాట్లాడాను. ఆయన వెంటనే డాక్టర్లని సమావేశ పరిచాడు. ఇక్కడ అంతా ఫ్రీగానే జరుతుంది అని ఆయన అన్నాడు. అమెరికాలో ఎన్ని డాలర్లు ఖర్చవుతాయో ఎవరికి తెలుసు? డాక్టర్లు నన్ను పరీక్ష చేసారు. “మీ పళ్ళ వరసలో పై పన్ను ఒకటి షార్ప్‌గా ఉంది. నాలికకి అది తగులుతోంది అందుకే పుండు పడ్డది” అని అన్నాడు ఒక డాక్టరు. నాకు నవ్వు వచ్చింది. పై పన్ను నాలుకకు ఎట్లా తగులుతుంది. అతడు భయపడుతూ చికిత్స చేయించుకోమని చెప్పాడు. సరియైన చికిత్స జరగాలి అన్నది అక్కడ నియమం. ఆ పుండుకి ఒక సిక్టర్ అతికించాడు. ఒక సీసా ఇచ్చాడు. దాని మీద పేషెంట్ పేరు, డాక్టర్ పేరు, ఎక్కడ కొన్నారో ఆ షాపు పేరు రాసి ఉంది. అసలు ఈ పుండు ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. అక్కడ కమోడ్ సిస్టమ్ నాకు అలవాటు లేదు. అందువలన నాకు సరిగ్గా విరోచనం అయ్యేదికాదు. అమెరికా వచ్చాక నేను నా చూర్ణాన్ని తీసుకున్నాను. చూర్ణం తీసుకున్నాక విరోచనం అయింది. దాని తరువాత పుండు తగ్గిపోయింది. అక్కడ కూడా హిందుస్తాన్‌లో ఉన్నట్లుగానే డాక్టర్లు ఉన్నారు. ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళి చికిత్స చేయించుకుంటారు. నాకు నవ్వు వచ్చింది. అక్కడ నాకు విరోచనం సరిగ్గా అయ్యేది కాదు. అక్కడ నాకు బోర్ కొట్టింది. నేను నెల రోజులు ఉండాలి. కాని నేను మధ్యలో వదిలేసి వచ్చాను. ఆ సమయంలో యు.ఎన్.ఓ.లో ఇందిర గారి స్పీచ్ ఉంది. నాకు అక్కడికి వెళ్ళాలని కోరిక ఉండేది. కాని వెళ్ళలేకపోయాను. అక్కడికి నందకిషోర్ నౌటియాల్ వెళ్ళారు. కెనెడాలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. ఈ సంఘటన అక్కడి వాళ్ళ నైతికతను తెలుపుతుంది. వాళ్ళు మనకు చేసే సహాయానికి సంబంధించింది. అమెరికాకి వెళ్ళడానికి టోరెంటో నుండి బఫెలో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి. అక్కడికి ఫైట్‌లో వెళ్ళాలి. టోరెంటో బఫెలో మధ్యలో నయాగరా ఫాల్స్ ఉంది. అమెరికాలో, సగం కెనడాలో ఉంది. టోరెంటోలో నన్ను బస్‌లో కూర్చో పెట్టారు. సర్దార్ గారిని బస్‌లో వెళ్ళితే నాకు బాత్‌రూమ్‌కు వెళ్ళాల్సి వస్తే ఎట్లా? అని అడిగాను. ఇది కారు కన్నా ఎంతో మెరుగు. ఇందులో వెనక టాయ్‌లెట్ కూడా ఉంది. నయాగరా ఫాల్స్ నుండి వెళ్ళే సమయంలో అమెరికాలో ప్రవేశించే ముందు పాస్‌పోర్ట్ చెకింగ్ అవుతుంది. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే బస్ మొదట బఫెలో యాత్రికులని డ్రాప్ చేస్తుంది. తరువాత ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తుంది. చెకింగ్ ఆలస్యం అయింది. అందువలన డ్రైవర్ యాత్రికులతో, ముందు నగరానికి వెళ్ళకుండా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్దాం, లేకపోతే వాళ్ళకి ప్లేన్ మిస్ అవుతుంది అని అన్నాడు. ఏ యాత్రికుడు అభ్యంతరం చెప్పలేదు. ముందు ఎయిర్‌పోర్ట్‌కి తీసుకు వెళ్ళాడు. మాకు ఫ్లయిట్ అందింది. ఇదంతా అక్కడే చూడగలుగుతాం, హిందుస్తాన్‌లో బహుశా ఇట్లా జరగదు. ఇక్కడైతే త్వరగా వెళ్ళాలి అంటే ముందే బయలుదేరాలి కదా అని డ్రైవర్ అంటాడు.

అక్కడి నుండి వచ్చేటప్పుడు ఒక్కడినే రావాల్సి వచ్చింది. వాళ్ళు నాకు రెండు రోజుల ముందు టికెట్ కొని ఇచ్చారు. ఒక్కడినే రావాలంటే నాకు కొంచెం గాభరా అయింది. న్యూజెర్సీ నుంచి వస్తున్న ఒక మహిళ కనిపిపించింది. న్యూజెర్సీ న్యూయార్క్ నుండి నలభై, ఏభై మైళ్ళు దూరంలో ఉంది. “మీరు గాభరా పడకండి, మిమ్మల్ని నేను ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తాను” అని ఆ మహిళ అన్నది. బహుశా ఆమె పేరు మాలతి. ఆమె గుజరాతీ. సమయానికి ముందు ఆమె వచ్చింది, నన్ను కారులో తీసుకు వెళ్ళి ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసింది. ఇప్పటికీ నేను ఆవిడకి కృతజ్ఞడినే. ఆవిడ గుర్తుకు వస్తే నా కళ్ళు చెమరుస్తాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here