Site icon Sanchika

విదేశాలు-యాత్రలు -2

[box type=’note’ fontsize=’16’] విదేశీ యాత్రలలో సుప్రసిద్ధ కవి నీరజ్ గారి అనుభవాలపై హిందీలో డా. ప్రేమ్‍కుమార్ రచించిన వ్యాసాన్ని తెలుగులో అనువదించి అందిస్తున్నారు డా. టి.సి. వసంత. [/box]

[dropcap]2[/dropcap]004లో నేను అమెరికా వెళ్ళాను. న్యూజెర్సీలో ఉన్నాను. ఇంతకు మందు నన్ను ఎయిర్‌పోర్ట్‌కి దింపిన ఆమె కలిసింది. “మీరు గుర్తుపట్టారా” అని అడిగింది. “నాకు గుర్తుకు రావడం లేదు” అని అన్నాను. “మిమ్మల్ని నేను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకు వెళ్ళాను.” అంది. మొట్టమొదటిసారి అమెరికా అనుభవం చేదు అనుభవం అనే చెప్పాలి. అక్కడ అసలు నేను ఏది చూడలేకపోయాను. మాన్‌హటన్‌లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. సెప్టెంబర్ నెల. నేను కుర్తా వేసుకున్నాను. బట్ట సన్నగా ఉంది. జేబులో డాలర్ పెట్టుకుని వెళ్తున్నాను. ఏదైనా కొందామని అనుకున్నాను. నేను రామముర్తి గారి ఇంటికి వెళ్ళాను. “మీ జేబులోంచి డాలర్ కనిపిస్తోంది. దీనిని లోపల పెట్టుకోండి. ఎవరైనా కొట్టేస్తారు. చాకుతో ఎటాక్ చేస్తారు.” అని చెప్పారు. ఈ సంఘటన వలన అక్కడ క్రైమ్ ఎంతగా ఉందో తెలుస్తోంది. మాన్‌హట్టన్ అక్కడి మెయిన్ మార్కెట్. ‘ఛేజ్ మాన్‌హట్టన్’ అక్కడి పెద్ద బ్యాంక్. నాకెవరో చెక్ ఇచ్చారు. మార్చుకుందామని వెళ్ళాను. ఎదురుకుండా కౌంటర్ మీద కూర్చున్న వ్యక్తి వెంటనే నన్ను పిలిచాడు. ఐదు నిమిషాల్లో పని పూర్తి చేసాడు. ఇక్కడ లాగా గంటలు-గంటలు ఎదురు చూడాల్సిన పని లేదు. మాన్‍‌హట్టన్ బజారు నాకు అక్షరాలా బొంబాయి ఎయిర్‌పోర్ట్‌లా అనిపించింది. ఒకరు చేతిలో పామును పెట్టుకుని అమ్ముతున్నాడు. మరొకరు పేవ్‌మెంట్ పైన సామాను పెట్టి అమ్ముతున్నాడు. బొంబాయిలోలా సిగరెట్ ముక్కలు అక్కడ అక్కడ కనిపిస్తున్నాయి. గుంపులు గుంపులుగా జనం ఉన్నారు. ఎక్కడా కార్లు కనిపించలేదు. ఎందుకంటే అక్కడ పార్కింగ్‌కి ఏ మాత్రం చోటు లేదు. వజ్రాల వ్యాపారం అక్కడ బాగా సాగుతుంది. పెద్ద పెద్ద వజ్రాల దుకాణాలు ఉన్నాయి. “మీ దగ్గర ఒక లక్ష డాలర్లు లేకపోతే దుకాణంలోకి రావద్దు.” అని బోర్డు మీద రాసి ఉంది. సామాన్యులు ఎవరు లోపలికి వెళ్ళలేరు. అక్కడ వజ్రాల వ్యాపారుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మిస్టర్ పారీఖ్ నాకు విందు ఏర్పాటు చేసాడు. అందువలన నేను అక్కడికి వెళ్ళగలిగాను. అక్కడ హిందుస్తానీ భోజనం చాలా రుచిగా ఉంటుంది.

అమెరికా వెళ్ళినప్పుడు లండన్‌కి వెళ్ళాలని అనుకున్నాను. కాని అప్పుడు సమయం లేదు, వీసా లేదు. అందుకే వెళ్ళలేదు. హీర్తో ఎయిర్ పోర్టుని మాత్రం చూసాను. పదేళ్ళ కిందట యు.కె.కి వెళ్ళగలిగాను. అదంతా అనుకోని సంఘటన. నన్ను ఆహ్వానించిన ఆయనకి నా అడ్రస్ కూడా తెలియదు. ఆ లెటర్ నాకు అనుకోకుండా చేరింది. అడ్రస్ ఇట్లా రాసి ఉంది- ద వరల్డ్ ఫేమస్ పోయట్ నీరజ్, బాంబే/అలీఘడ్. నెల తరువాత చేరింది. బొంబాయి పోస్టాఫీసు వాళ్ళని ఎంతో మెచ్చుకోవచ్చు. వాళ్ళే అలీఘడ్‌కి పంపించారు. ఆ లెటర్ మాంచెస్టర్ దగ్గర నుండి వచ్చింది. అక్కడికి వెళ్ళడానికి ప్రోగ్రాం తయారయింది. నేను ఒంటరిగా రాలేను అని ఉత్తరం రాసాను. “ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది కలుగదు” అని వాళ్ళు అన్నారు. డా. లతా పాఠక్ నన్ను ఆహ్వనించారు. అక్కడ విజయప్రతాప్ గౌరవ్ ఇంట్లో ఉన్నాను. ఆయన ఉత్తరప్రదేశ్ నివాసి. అక్కడ నేనంటే ఇష్టపడే ఒక డాక్టర్ ఉన్నాడు – రణజీత్ సుమరా. ఆయన కాన్పూర్ నివాసి. ఆయన కలిసారు. నేను కావ్య పఠనం చేసాను. చాలా మెచ్చుకున్నారు. అక్కడ నా పేరు మారుమ్రోగిపోయింది. తరువాత 4 సంవత్సరాలు కంటిన్యూగా వెళ్ళాను. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు శశాంక ప్రభాకర్ ఒంటరిగా లండన్‌కి వెళ్ళాడు. అక్కడ మాంచెస్టర్, లండన్, బర్మింగ్‌హమ్ ఇంకా కొన్ని చోట్ల నేను కవితలను చదివాను. 2004లో అమెరికా వెళ్ళినప్పుడు ఐదవ సారి అక్కడికి వెళ్ళాను. అక్కడ నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. అందువల్ల మొదట మాంచెస్టర్, లండన్ నుండి అమెరికా వెళ్ళాను.

ఈసారి 2004లో అమెరికా వెళ్ళినప్పుడు ఆ దేశపు సౌందర్యాన్ని చూసే అవకాశం కలిగింది. ఈసారి నాతో మనోరమ కూడా వచ్చింది. ఈ సారి ఫ్లైట్‌లో కొంత, కారులో కొంత యాత్ర చేసాను. అందువలన బాగా చూడగలిగాను.

నవంబరు 2కి నేను అక్కడి నుండి వెనక్కి రావాలి. అక్టోబరులో నేను అక్కడే ఉన్నాను. అక్టోబర్‌లో ప్రకృతిలో చాలా మార్పు వస్తుంది. ప్రకృతి చెట్ల మీద గులాల్ చల్లిందా అని అనిపిస్తుంది. చెట్ల రకరకాల రంగులలో – ఎరుపు, ఆకుపచ్చ, నీలం – ఉంటాయి. నిజానికి ఇది అద్భుతమైన దృశ్యం. ఈ యాత్రలో నా దగ్గర ఉన్న సి.డి.లు, పుస్తకాలు అయిపోయాయి. అక్కడ కొందరు సి.డిలను తయారు చేసారు. అక్కడికి నేను హాస్య కవి సర్వేష్ ఆస్థానాని కూడా తీసుకు వెళ్ళాను. ఆయన యాత్రలో నాకెంతో సహాయం చేసారు. నేను వారిని ఎప్పుడు మరచిపోను. లండన్‌లో కూడా ఎంతో మంది పరిచయం అయ్యారు. ముఖ్యంగా పద్మేష్ తితిక్షా షాహ్‌ల పరిచయాన్ని నేను ఎప్పుడు మరచిపోలేను. మాంచెస్టర్‌లో రణజీత్ సుమరా, విజయ్ గౌతమ్ కలిసారు. విజయ్ గౌతమ్ కూతురు అన్ను బ్లడ్ కాన్సర్‌తో బాధపడుతోంది. కొన్ని రోజుల ముందే ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుందని తెలిసింది. మాంచెస్టర్‌లో నేను శ్రీరామ్ పాండేగారి ఇంట్లో ఉన్నాను. భార్య-భర్త ఇద్దరు జబ్బు పడ్డారు. రామ్ పాండేకి పెరాలసిస్ వచ్చింది. మాట్లడలేరు. ఆయన భార్యకు బ్లడ్ కాన్సర్ వచ్చింది. ఆ సమయంలో వాళ్ళు నా పట్ల చూపిన ప్రేమ-ఆప్యాయతలను ఎప్పుడు మరచిపోలేను. ఇంగ్లీషు వాళ్ళని మనం ఎంతో తిట్టుకున్నాము. కాని అక్కడి వాతావరణం చూసాక నాకు వాళ్ళ పట్ల గౌరవం పెరిగింది. ఆ జబ్బు పడ్డ దంపతులను చూడడానికి చుట్టపక్కల ఎవరో ఒకరు వచ్చేవారు. ఆ మహిళలు వాళ్ళు ఒంటరిగా ఉన్నారు అన్న ఫీలింగు రాకుండా ప్రవర్తించేవాళ్ళు. కర్వాచౌథ్ రోజున నేను అక్కడే ఉన్నాను. నేను ఆ సాయంత్రం అక్కడి మహిళలు ఈ వ్రతాన్ని ఎంతో వైభవంగా చేసుకోవడం చూసాను. పళ్ళాన్ని వాళ్ళు ఎంతో నేర్పుగా తిప్పుతున్నారు. నాకదంతా పెద్దగా తెలియకపోయినా వాళ్ళ కళ్ళల్లో నేను భక్తి-శ్రద్ధలను చూసాను. అక్కడ డాక్టర్ లతా పాఠక్ కూడా ఉన్నారు. భారతదేశంలో భారతీయ సంస్కృతి మెల్లి మెల్లిగా అంతరించిపోతోంది. కాని విదేశాలలో భారతీయ సంస్కృతి బతికి బట్టకడుతోంది. ఈ విషయంలో మనం ఆలోచించాలి.

కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. అక్కడ సైకియాట్రిస్ట్ శైలజా చతుర్వేది నన్ను ఆహ్వానించారు. అక్కడ కూడా భారతీయులు భారతీయ సంస్కృతి నిలబెడుతున్నారు. విదేశాలలో ఉండే చాలా మంది భారతీయులు శాఖాహారులే. ఏ స్త్రీ ఆల్కాహల్ తీసుకోవడం నేను చూడలేదు. ఇంకా ఇక్కడే స్త్రీలు తాగుడికి అలవాటు పడుతున్నారు. హిందుస్తాన్ నుండి ఎవరు ఈ దేశం వచ్చిన హృదయపూర్వకంగా అతిథి సత్కారం చేస్తారు. ప్రేమ-స్నేహాలతో ఆత్మీయంగా అదరిస్తారు. అతిథులను వాళ్ళెప్పుడు భారంగా అనుకోరు.

ఆస్ట్రేలియా హిందుస్తాన్ కన్నా రెండునర రెట్లు పెద్దది. కాని అందులో రెండొంతులు అంతా ఎడారి ప్రదేశం. అందువలన అక్కడ ఐదారు పెద్ద నగరాలు ఉన్నయి. ఇవన్నీ సముద్ర తీరాన ఉన్నాయి. నేన అడిలైడ్, సిడ్నీ, మెల్‌బర్న్, కాన్‌బెర్రా అనే నాలుగు నగరాల యాత్ర చేసాను. కాన్‌బెర్రా అక్కడి రాజధాని. అక్కడ దాదాపు పదిలక్ష జన సంఖ్య ఉంది. సిడ్నీలో జన సంఖ్య ఎక్కువ. ఒకే రోజు మూడు ఋతువులను మెల్బోర్న్‌లో చూడవచ్చు. ఇదే అక్కడి ప్రత్యేకత. ప్రజలు కారులో ప్రయాణం చేసేటప్పుడు గొడుగు, కోట్ రెండు తీసుకుంటారు. ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు, ఎప్పుడు ఎముకలు కొరికే చలి మొదలవుతుందో తెలియదు. మెల్బోర్న్‌లో జరిగిన సంఘటనను ఎప్పుడు మరిచి పోలేము. పెంగ్విన్ చూడాలని నాకెంతో కోరికగా ఉండేది. నేను జూకి వెళ్ళాను. కాని 5 గంటలకి మూసేసారు. నేను అక్కడ డ్యూటీలో ఉన్న వ్యక్తితో అన్నాను – “నేను హిందుస్తాన్ నుండి వచ్చాను. నాకు పెంగ్విన్లని చూడాలని ఎంతో కోరికగా ఉంది. మీదయ ఉంటే చూస్తాను” అని. అంతే అతడు ఎటువంటి సంకోచం లేకుండా “మీరు లోపలికి వెళ్ళండి. పది నిముషాలలో చూసి రండి” అని అన్నాడు. నిజానికి వాళ్ళ ప్రేమ ఎంతో గొప్పది. ఇక్కడ రెండున్నర కోట్ల జన సంఖ్య ఉంది. చాలా శుభ్రంగా ఉంది. అక్కడి ఐదో నగరం పెర్త్. అక్కడికి నేను వెళ్ళలేకపోయాను. గాలి తాజాగా ఉంటుంది. నీళ్ళు శుభ్రంగా ఉంటాయి. అసలు ఎక్కడా అశుభ్రత అంటూ లేనే లేదు. సిడ్నీలో, పరచూని, ఇంకా కొంత మందివి దాదాపు ఐదువందల దుకాణాలు ఉన్నాయి. అక్కడ పాన్ బహార్ దొరుకుతుంది. బీడీలు కూడా దొరుకుతాయి. అక్కడ నేను బీడీలు కొనుక్కున్నాను. అసలు అది విదేశం అని అనిపించనే అనిపించదు. అక్కడ భారతీయులు చాలా మంది ఉన్నారు. అక్కడ నా మిత్రుడైన మోహన్ గారు కలిసారు. నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. నా కవితలను వినేవారు. ఈ యాత్రలో ఇండోర్‌కి చెందిన హాస్య వ్యంగ్య ప్రసిద్ధ కవి సరోజ్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన నాతోనే ఉన్నారు. అందుకని నేను ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఆయన సంచాలన చేసేవారు. తన కవితలను కూడా చదివేవారు. నేను భారతదేశం నలుమూలలా పర్యటించాను. కాని విదేశాలలో నాకు ఎక్కువ శాంతిగా అనిపించింది.

హిందుస్తాన్ విభజనకి ముందు సర్గోధా, లాహోర్, మండిలను పర్యటించాను. అవి పాకిస్తాన్లో ఉన్నాయి. మొదటిసారిగా సర్గోధాలో దేవరాజ్ దినేష్‌తో పరిచయం అయింది. అప్పటి నుండి వారు స్వర్గస్థులు అయ్యే వరకు మా ఇద్దరి మధ్య సత్ సంబంధం ఉంది. వారి కవితలలోని రెండు పంక్తులు నాకు బాగా గుర్తు ఉన్నాయి. “యే బాత్ కిసీ కో మత్ కహనా, మై తేరే పింజరాకా తోతా, తూ మేరే పింజరేకీ మైనా…”. రెండో కవిత “తభీ మరూంగా, పహేలే ఏ బత్‌లాదో, మర్ ఘట్ తక్, పహుంచానే కౌన్ చలేగా?”. నీరజ్ గారు కొంచం సేపు మౌనంగా ఉన్నారు.

నీరజ్ గారు పెద్దగా నవ్వడం మొదలు పెట్టారు. “దేవరాజ్ ఆ పంక్తులు చదివి ఆపేసారు. ఇంతలో కొందరు – ‘హమ్ చేలేంగే, హమ్ చెలేంగే’ అంటూ అరిచారు. వారి కవిత – ‘భారత్ మా కీ లోరీ’ చాలా ప్రసిద్ధి చెందింది. ఇదే పేరు మీద పుస్తకం అచ్చయింది.”

నీరజ్ చాలా సంవత్సరాలు కిత్రం ‘లయ్’ అనే పత్రికను నడిపేవారు. ఆయన దీని సంపాదకులు. ఆ రోజులని గుర్తు చేసుకోవడం మొదలు పెట్టారు. తోటి కవులు తన నుండి దూరం అయ్యారని బాధ పడ్డారు. వాళ్ళు వేరే కుంపటి ఎందుకు పెట్టారోనని వ్యథ చెందారు. చెప్పడం మొదలు పెట్టరు – “రహీమాసుమ్ రజు అఠారహ్ సౌ సత్తావన్” ను నేను ఆత్మారామ్ అండ్ సన్స్ సంస్థాపకుడు అయిన శ్రీరామ్‌లాల్ పురీ గారితో మాట్లాడి పబ్లిష్ చేయించాను. నన్ను దానికి ఉపోద్ఘాతం రాయమని అడిగారు. నేను రాసాను. పుస్తకం పబ్లిష్ అయింది. కాని కె.పి.సింహ్ నేను రాసిన భూమికను తీసేసారు, ఎందుకో తెలియదు” అన్నారు. ‘లయ్’ ఎంతగా ప్రసిద్ధి చెందిందో, అసలు దానిని తానెందుకు మొదలు పెట్టారో చెప్పారు.

ఇదే సమయంలో ‘మంగలాయతన్’ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ చిత్రాసింహ్ ఒక మూవింగ్ చైర్ తీసుకుని వచ్చారు. ఆవిడని చూడగానే ఆయన ఎంతో భావుకుడైపోయారు. ఆవిడతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ఆవిడ తల వంచి దండం పెట్టారు. నీరజ్ ప్రేమతో ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆ కుర్చీ ఛాన్స్‌లర్ ఆఫీసు కోసం తీసుకు వచ్చారని చెప్పారు. ఆ కుర్చీ గురించి ఎన్నో ప్రశ్నలు వేసారు. ఆవిడతో వచ్చిన వ్యక్తి కుర్చీని కిందకి, మీదకి చేస్తూ చూపించారు. ‘దీని మీద కూర్చుని చూడండి ఎట్లా ఉందో? బల్ల మీద కూర్చుని చూడండి. ఎక్కువ ఎత్తుగా, ఎక్కువ కిందగా లేదు కాదూ?’ అని నా వంక చూసారు. అసలు నీరజ్ గారు ఎంత సామాన్యులుగా ప్రవర్తిస్తారు. ఎంత అమాయకులు. ఛాన్స్‌లర్ కోసం తెచ్చిన కుర్చీ మీద నన్ను కూర్చోమంటున్నారు. అది సరిగా ఉందో లేదో నన్ను చూడమంటున్నరు. ఆయన మంచం మీద కూర్చుని స్వయంగా దాన్ని పరిశీలించారు. ఇక నేను సెలవు తీసుకుందామనుకుంటున్నాను. వారు చివరి వరకు ‘లయ్’ గురించి మాట్లాడుతున్నారు. ‘లయ్’ పత్రిక మూతబడ్డది. కాని నా జీవితంలోని ‘లయ్’ ఇంకా ఉంది ఆ ‘లయ్’ నా గీతాల ద్వారా వ్యక్తం అవుతూనే ఉంటుంది. ‘లయ్’ సాగుతూనే ఉంటుంది” అన్నారు.

(అయిపోయింది)

Exit mobile version