[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘విదేశీ పూల పరిమళం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]“కౌ[/dropcap]సల్య సుప్రజా రామా” అంటూ బామ్మ శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాతం చదివి పూజ చేసి నివేదన పెడుతుంది. ఈలోగా అంతా రెడీ అయి వచ్చి ప్రసాదం తిని అల్పాహారం చేస్తారు.
“ఈ ఏడు పిల్ల పెళ్లి చెయ్యాలి రా రాఘవా” అన్నది సుబ్బలక్ష్మి గారు. ఆమె సుప్రజ బామ్మ. “మీ నాన్నగారికి ఈ మాత్రం ఓపిక ఉన్నప్పుడే చేస్తే మంచిది” అంది.
“అలాగే అమ్మా” అన్నాడు రాఘవ.
“ఇంటర్ పూర్తి అయ్యింది. డిగ్రీ అంటే ఇంకా మూడేళ్ళు చదవాలి. పెళ్లి చేస్తే, ఆ చదువువేదే అత్తవారికి ఇష్టం ఉంటే వాళ్ళే చదివించుకుంటారు” అన్నది
“సరే చూస్తాను. దగ్గరవారు, తెలిసున్న వారు ఉంటే సరి; లిస్ట్ తెప్పిస్తారు”
“సరే మంచిది చూడు. ఇప్పటినుంచి మొదలు పెడితే ఇంకా రెండేళ్ళు పడుతుంది” అంది.
చాలా సంబంధాలు చూశారు. అందులో ఒకటి బామ్మకి నచ్చింది. బామ్మకు దూరం చుట్టం అని చెప్పారు. వాళ్ళ వాళ్ళు చాలా స్థితిమంతులు. అతిథి అభ్యాగతి అన్ని మంచీ లక్షణాలే. అయన మంచి కంపెనీలో మేనేజర్‍గా చేసి రిటైర్ అయ్యాడు. ఒక్క కొడుకు. లేక లేక పుట్టాడు. పిల్ల జమీందారులా పెంచారు. మంచివాడు, స్నేహ ధర్మానికి ప్రాణం ఇస్తాడు. అక్క పెళ్లి, చెల్లి పెళ్లి అయితే కానీ చేసుకోను అన్నాడు. అలాగే కూర్చుని పెళ్ళిళ్లు చేశాడు. చెల్లి పెళ్ళికి చాలా కష్టపడ్డాడు. చెల్లి రోజు వంట చెయ్యలేదు, అందుకే దుబాయ్ సంబంధం చేశారు. అది పుట్టింట్లోనే ఉంటుంది, బావగారు వచ్చి వెడతారు.
వాళ్ల అదృష్టం అలా! ఇద్దరు అల్లుళ్ళు తుమ్మ బంకలా భార్యల పుట్టింటికి వచ్చి వెడుతూ అత్తమామల సేవలు చేస్తూ ఉంటారు. కూతుళ్లు కూడా అమ్మా అమ్మా అంటూ ఉంటారు. తల్లేమో, కూతుళ్ళ ఇష్టమే తన ఇష్టం అంటుంది. ఇక కొడుకు అమ్మ కూచి అనే చెప్పాలి.
సరే ఇంట్లో అంతా తల్లి ఇష్టమే అని అంటారు. ఆవిడ మహారాణుల మాదిరి ఘనంగా చీరలు నగలు ధరిస్తుంది ఇంట్లో ఖరీదైన వస్తువులు పెట్టుకుంటారు.
ఆ సంబంధం చెప్పగానే సుబ్బలక్ష్మి మా మనుమరాలికి ఓకె అన్నది. పెళ్లిచూపులు అవి నామ మాత్రమే. అన్ని ఫోన్లో జరిగాయి. తెలుసున్న కుటుంబాన్ని కాదని పెళ్లి కుదిర్చి చేశారు. ఘనంగా చేశారు.
అల్లుడు విదేశాల నుంచి వచ్చి విదేశీ సామాను తెచ్చాడు. అందరూ అందంగా ఉంటారు, మంచి బట్టలు కడతారు. ఇప్పుడు హంగులకి ఆర్భాటాలకు విలువ ఏమిటి?
“మీ పిల్లని డిగ్రీ పూర్తి చెయ్యమనండి. నా పిల్లలు పిజి చేశారు. రేడియో టాక్స్ ఇస్తారు. అన్ని పనులు వచ్చు, మా ఇల్లు ఎంత బాగుందో చూడండి” అన్నది అలమేలు మంగ, సుప్రజ అత్తగారు.
అలా పెళ్లి అయిపోయింది. సుప్రజని అత్తవారింటికి పంపేశారు
“సారె మాకు అవసరం లేదు. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. మీ పిల్లకి కూడా అన్ని మేమే చూసుకుంటాము” అన్నారు.
ఎంత మంచి వాళ్ళు అని అనుకున్నారు సుప్రజ తల్లిదండ్రులూ, బామ్మ.
***
అలమేలు మంగ కోడుకు శ్రీనివాస వివేక్ మంచివాడు. కానీ అవిడ బాగా మాటకారి. కొడుకు మాట వింటుందే కానీ ఆచరించే స్వభావం కాదు. యింట్లో అంతా మేధావులే, మాటల వీరులు.
సూర్యోదయం మొదలు, ఇంటికి వచ్చిన ప్రతి వారిని “కాఫీ తాగారా, టిఫిన్ చేశారా? మా ఇంట్లో తినండి, పర్వాలేదు. అయ్యో అలా ఏం మొహమాటం వద్దు” అంటూ అతిథి మర్యాదలు ఉంటాయి. ఇంట్లో ఉన్న వాళ్ళు అంతా కూడా బాగానే తింటారు.
ఎటొచ్చీ కోడలు విషయంలో అన్ని అడ్డంకులే. ఆమెకి ఉదయమే టిఫిన్ అలవాటు. అది కొంచెం పద్ధతిగా తింటుంది. వాళ్ళు తెల్లవారగట్ల లేచి కాఫీలు తాగి కలహాలు మొదలు పెడతారు. ఇంటి ఆడబడుచు అయితే “అమ్మా వదిన అలా చేసింది, ఇలా చేసింది” అంటూ అతి సన్నని మెత్తని మాటలతో తల్లికి, అన్నకి చెపుతుంది. ఒకరకంగా కలహాల కాపురం అనే చెప్పాలి. సుప్రజ ఇంకా లేవలేదు అంటుంది, కొత్త పెళ్లికూతురులా అలా ఉంటావు అంటారు, భాద్యతలు లేవు.
వంట మనిషి వంట, పనిమనిషి పని చేసి వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళకి అత్తగారు క్యారేజ్ సర్ది పెడుతుంది. పెళ్లయి మొగుడు దుబాయ్‌లో ఉండే ఆడబడుచు పుట్టింట్లోనే ఉంటూ ఒక కాన్వెంట్‌లో పనిచేస్తుంది. ఇంకా పిల్లలు లేరు.
“నేను అత్తగారింటికి వెళ్ళను. నా భర్త లేనప్పుడు అక్కడ ఎందుకు? నా పుట్టింట్లోనే ఉంటే మంచిది” అంటూ ఇక్కడే ఉద్యోగంలో చేరింది.
వికసించిన పుష్పం లాంటి మనసు ఆడవారిది. దానికి అత్తవారు, భర్త ఊరుకున్నారు.
“నీ పుట్టింటి నుండి చెంచా కూడా నువ్వు తేవద్దు తల్లి” అన్నారు. ఇది ఏదో వింతగా ఉన్నది. అత్తారింటికి పంపేవారు సారె పెడతారు కానీ ఈవిడ “ఏదీ వద్దు. నా కొడుకు కావాలని పెళ్లి చేసుకున్నాడు. మాతో పాటు కలో గంజి మేము పెడతాను అంతేకాని మీ ఇంటి నుంచి ఏమి వద్దు” అంటూ సాగదీసింది.
రోజు పట్టు చీరెలు కడుతుంది. అల్లుడు డబ్బు బాగా ఉన్నవాడు. అత్తగారికి నించుంటే పట్టు చీర కూర్చుంటే పట్టు చీర ఇలా పెట్టారు.
వీళ్ళ పెద్ద పిల్ల పెళ్ళయి అత్తగారింటికి వెళ్లి ఉంటుందని అనుకున్నారు. కానీ అతనే ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడికి వచ్చాడు. కాస్త దూరంలో ఇల్లు తీసుకున్నారు. వాళ్ళకి ఒక కూతురు, కొడుకు. పిల్లాడ్ని సెమీ హాస్టల్ లో పెట్టారు. భర్త ఆఫీస్‌కి వెడుతూ కార్లో కూతురును, భార్యని ఇక్కడ దింపుతాడు. తనేమో ఆఫీస్ క్యాంటీన్లో తింటాడు.
ఇంక పెద్ద కూతురు వచ్చి తల్లికి కుడి భుజం. ఎప్పుడూ ఏవో కబుర్లు చెపుతూ ఉంటుంది. అన్నీ బురిడీ కబుర్లు. గొప్ప కబుర్ల తిప్పలు తప్పవు మరి.
సుప్రజ అత్తారింట్లో వంట వార్పు అవసరం లేదు, కానీ బాగా తినాలి అంతే. కానీ ఒక వారం తిండి ఉంటే ఘనంగా ఉంటుది, కానీ అరగదు. కడుపు నొప్పి వచ్చేది. పుట్టింలో సుప్రజ జాజి మొగ్గలా నాజూకుగా పెరిగింది. దానితో
ఇక్కడ అంతా హెవీ ఫుడ్ అయ్యింది. రెండు రకాల టిఫిన్స్, ఒక నూనె వంటకం, ఒక అవిరి వంటకం. స్వీట్, ఒక హాట్ కూడా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు బాగా పుష్టి గా తినేవారు. సుప్రజ తినలేకపోయేది. రెండు రోజుల బాగుంటే నాలుగు రోజులు మూలుగుతూ ఉంటుంది.
“మీ అమ్మాయిని పెండ్లి చేసుకుంటాము, సుప్రజ నాకు నచ్చింది” అంటూ అలమేలు మంగ ఇంటికి కబురు పంపి మరీ కొడుక్కి చేసుకుంది. కానీ ఆ ఇంట్లో సుప్రజకు భర్త నుంచి ప్రేమ, అభిమానము ఒక్క రోజు కూడా దక్కలేదు.
అత్తగారు మాత్రం “ఇప్పుడే పిల్లల బాదరబందీ వద్దు” అంటూ శాసించి, సాధించింది. అలమేలు మంగ కొడుకును “నువ్వు కూడా దుబాయ్ వెళ్ళి, సంపాదించుకురా” అనే ఆజ్ఞాపించింది. బహుశా కూతురుకి లేని సుఖం కోడలికి ఉండకూడదనేమో ఆమె భావన.
సుప్రజని కావాలని మరీ చేసుకున్న శ్రీనివాస్ మనసుని చాలా తమాషాగా మార్చింది అలమేలు మంగ. పంతం పట్టి కొడుకు శ్రీనివాస్‌ని మొత్తనికి గల్ఫ్ పంపింది. అతను నెల వారి డబ్బు ఆవిడ పేరున బ్యాంక్‌లో వేస్తాడు.
ఇదంతా తెలిసిన బంధువులు – “ఇంక పెళ్లి ఎందుకు? మీ అబ్బాయిని దూరం పంపేసి, కోడల్ని బాధపెట్టడం ఎందుకు? మీలాంటి కుటుంబాల్లో పిల్లలకి పెళ్లి అనవసరం” అంటూ విమర్శించారు.
సుప్రజ మౌనంగా ఉండిపోయింది. భర్త వెళ్ళేటప్పుడు స్నేహితులకు ట్రీట్ ఇచ్చాడు అప్పుడు అందరు పెద్ద పెద్ద బోకెలు ఇచ్చారు. ఇద్దరికీ దండలు వేసి మంచి హడావిడి చేశారు. ఎంతో ఆనందంగా పెళ్లి రిసెప్షన్‌లా హడావిడి చేశారు. మామూలు పూల దండలు వాడిపోతో చెట్టుపై వేశారు. కానీ ఆర్టిఫీషియల్ విదేశీ పూలు శాశ్వతంగా ప్రతి నిత్యం కళ్ళ ముందు స్థిరంగా ఉన్నాయి.
ఇల్లంతా పువ్వుల కొమ్మల అలంకరణకు చక్కగా ఉంటుంది. ఇంటి నిండా ఖరీదైన సోఫా సెట్లు, పువ్వుల, మొక్కల కుండీలు, గిన్నెలు అమర్చి ఉంటాయి. అయితే వాటికి సరైన మెయిన్‍టెనెనన్స్ లేదు.
సుప్రజ వెళ్ళాక అన్ని ఒక పద్ధతిలో నీట్‍గా అమర్చి ఉంచింది.
ఇల్లు విశాలంగా శుభ్రంగా శుచిగా చేసి రూమ్ స్ప్రే వేసింది. గృహాలంకరణ ఒక కళ. అందరికీ రాదు. ఇది జపనీస్ ఇష్టంగా చేస్తారు. ఇందులో ఎన్నో అందాలు సృష్టిస్టారు. ఆ కళ పుస్తకాల్లో చూసి సుప్రజ నేర్చుకున్నది.
వాళ్ల పుట్టింట్లో కావాల్సిన పుస్తకాలు, వస్తువులు అన్ని కొని ఇస్తారు, వద్దు అనరు. వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎన్నో అలంకారాలు అందాలు ఉంటాయి.
తన కళ చూసి అత్తగారింట్లో ఆనందపడతారు అనుకున్నది సుప్రజ. కానీ అత్తగారికి కావల్సింది డబ్బు. ఆ తరువాత ఇంటి పని బాగా చెయ్యాలి. ఎంత బాగా చేసిన వంకలు పెడతారు. “అబ్బే నీకు అన్ని వచ్చు అనుకున్నాను, కానీ ఏమీ రావు. నా కొడుకు నీ మోజులో పడి చేసుకున్నాడు. వాడి వల్ల ఒక ఇంటి గృహిణి అయ్యావు” అంటూ దెప్పుతునే ఉంటుంది అలమేలు మంగ.
కోడల్ని మెచ్చుకుంటే కొడుకు. పెళ్ళాం మాట వింటాడు అనే భయం ఆమెది.
దాంతో కోడలు ఎక్కడ కొడుకు ప్రేమ పొందుతుందో అనే భయంతో “మా ఇల్లు సర్దవద్దు, ఎలా ఉన్నది అలా ఉంచు” అనేది. కొడుకు వచ్చే సమయనికి కూతురు చేత కాఫీ కలిపి ఇప్పించేది.
ఇవన్నీ గ్రహించిన సుప్రజ అత్తగారి వల్లే అన్నీ ఇలా అపసవ్యంగా జరుగుతున్నాయి అని తల్లికి తండ్రికి చెప్పింది.
కొందరు డబ్బుకోసం పెళ్లి చేసుకుంటారు. ఇంకొందరు పెళ్లి కుదుర్చుకుని, చెల్లెలు పెళ్లి చేసి, పెళ్ళిళ్ళు వాయిదా వేసి మళ్ళీ మేము డబ్బు తిరిగి ఇస్తాము అన్నవాళ్ళు ఉన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులు మగపిల్లల తల్లిదండ్రులకు కట్నం రూపంలో అప్పు ఇచ్చే వ్యక్తుల మాదిరి ప్రవర్తించే వారూ ఉన్నారు.
***
ఒక జమీందారు కుటుంబంలో కొడుకుల చదువులకి పుట్టిల్లు అవసరమై డబ్బు కట్నం రూపంలో పుచ్చుకున్నారు. తర్వాత “నాకు మీ అమ్మాయి వద్దు. చెల్లెలిలా చూసాను. కనుక ఏమి అనుకోవద్దు మావయ్యా, నీ డబ్బు తిరిగి ఇస్తాను. మంచి సంబంధం చూసి చెయ్యి” అన్నాడట మేనల్లుడు. దానికి ఆయనికి కోపం రాకపోయినా ఆ పిల్లకి కోపం వచ్చి దులిపి పారేసిందట.
ఎవరి జీవితం వారిది అని తల్లి తండ్రి ఒప్పించి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. ఇలాంటి విషయాలు వింటే ఎవరు పెళ్లి చేసుకోరు, ఇష్టత చూపరనే చెప్పాలి. ప్రేమ పెళ్ళిళ్ళు కూడా ఇలాగే ఉన్నాయి.
కరెన్సీ కాగితం విలువ తప్ప ప్రేమ ఆప్యాయతలు, అనురాగము, రక్త సంబంధం ఏమి లేవు అనే ఫిలాసఫీ లోకి వెళ్ళారు జనాలు. ఆడపిల్లల్ని ఏడిపించామన్న బాధ కించిత్తైనా లేదు.
సుప్రజ తల్లి తండ్రి కూతురి కాపురం విషయం తెలుసుకుని, అల్లుడు మనసు మారి రావాలి అనుకున్నారు. కానీ పండుగ పేరుతో పిల్లని తెచ్చుకోవాలని అనుకున్నారు.
***
అందమైన విదేశీ పువ్వులు మామూలు పువ్వులు కన్నా బాగుంటాయి. ఇప్పుడు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం పువ్వుల కుండీలు పెట్టి అలంకరిస్తున్న తీరు ఎక్కువ. ఇంట్లోకి వెళ్ళగానే పువ్వులు సుగంధ వాసన ఉండాలి. అది ఎంతో మంచిదని శాస్త్రాలు చెపుతున్నాయి.
అపార్ట్మెంట్‍లలో ఒరిజినల్ పువ్వులు తక్కువ కనుక ఇలా విదేశీ పువ్వులు ఎక్కవ ఉన్నాయి. సుప్రజ పువ్వుల్ని పొందికగా ఇకెబెన పద్ధతిలో అమర్చింది. అందులో అన్ని రకాలు కూడా వాడుతారు. అవీ ఇసుక రాళ్ళు, ఎండు కొమ్మకు ఈత ఆకులు కొబ్బరి మట్టలు ఈనెలు, ఈకలు పాత జాడీలు, ఇత్తడి కుండీలు, ప్లాస్టిక్ బౌల్స్ వంటివీ, ఇంకా అట్టపెట్టెలు అన్ని వాడుతారు. వాటిని చూస్తూ సుతారంగా తీసి పట్టుకుని, నవ్వుకుంది సుప్రజ.
అన్ని ప్లాస్టిక్ పువ్వుల నవ్వులు సొగసులు సోయగాలు. జీవితంలో సుగంధ పుష్పాల కంటే విదేశీ ప్లాస్టిక్ పువ్వులు సెంట్ వేసిన ఘమ ఘుమ పరిమళాలు వెదజల్లేవి చాలా వచ్చాయి. అత్తవారింట అన్ని అవే ఉన్నాయి. ప్లాస్టిక్ ప్రేమలు, పరిమళం లేని జీవితాలు.
అటు చిన్నాడబడుచు జీవితం, ఇటు తన భర్త జీవితం అంతా ఒకటే! పెళ్ళిళ్ళు అయ్యాయి కానీ ఎవరికీ సుఖం లేదు, ఎవరు జీవితం వారిది. అత్తగారు మాత్రం గొప్పలు చెపుతుంది. ఇప్పుడు అన్నీ వీడియో కాల్ ప్రేమలు పెళ్ళిళ్ళు. పెద్దలు నేటి తరంలో విచిత్ర ప్రవర్తనలో ఉంటున్నారు.
సుప్రజ ఆలోచించి అత్తగారి దగ్గరకు వెళ్ళి “నన్ను పండుగలకి పిలవడానికి మా నాన్న వస్తారు. మీరంతా కూడా రండి” అన్నది
“మా కెందుకు పండుగ, మీకు దండుగ. నువ్వు వెళ్ళు చాలు” అన్నది అలమేలు మంగ.
ఇలాగేనా పెద్దావిడ మాటలు చెప్పడం అనుకుంది సుప్రజ. బాధపడింది. అందరూ అంతే. హార్డ్‌వేర్ మాటలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.
తండ్రి రావడంతో పండుగకి పుట్టింటికి వెళ్ళింది సుప్రజ. విషయమంతా అమ్మానాన్నలకి చెప్పింది. ఇంక తను వెళ్లి అక్కడ బాధపడలేనని చెప్పింది.
ప్రైవేట్‌గా చదువు పూర్తి చేసి, పీజీకి కట్టి చదువుతూ ఒక ఉద్యోగంలో చేరాలని అనుకున్నది.
***
పండుగకి వెళ్ళిన కోడలు రాలేదు. ఎన్నో సార్లు చేశారు కానీ ఫోన్‌లో ఏమి చెప్పలేదు కూడా. కాలం గడుస్తోంది.
సుప్రజ పుట్టింటి ఊరులో ఒక జాబ్‌లో చేరింది. అక్కడ అంతా బాగా తెలుసు. జీతం తక్కువ అయినా ప్రశాంతత కోసం చేరింది.
పండుగ అయిన వెంటనే కోడలు రాలేదు అంటూ బందువులు కూడా కబురు చేశారు.
నాలుగైదు ఫోన్‌లో మాట్లాడుతూ “పిల్ల లేందే బెంగగా ఉంది, మా కోడల్ని పంపండి” అన్నది అత్తగారు.
“మీ అబ్బాయి వచ్చి తీసుకు వెడితే వస్తుంది మా అమ్మాయి” అన్నారు. “మీ అమ్మాయిని మీ ఇంట్లో అల్లుడు వచ్చేవరకు పెట్టుకొన్నారు, మేము అంతే అనుకోండి. మా అల్లుడు ఎప్పుడు వస్తే అప్పుడు పిల్లని పంపుతాము” అన్నారు. కూతురు అత్తింటి పరిస్థితి గ్రహించిన తల్లి తండ్రి ఇలా ఆలోచించి, నిర్ణయం తీసుకున్నారు.
సుప్రజ ఆఫీస్‌కి వెడుతుంది, వస్తుంది. మౌనంగా తన బాధ మాత్రం పైకి తెలియనివ్వక మనసులోనే ఉంచుతుంది. నేటి తరంలో చాలా మంది అమ్మాయిలు ఇదే పద్ధతిలో ఉంటున్నారు. దీనికి కారణం అత్తింటి బాధలు. కొందరు చెపుతారు, మరికొందరు బాధని ప్రక్కన పెట్టుకొని జీవితం సాగిస్తారు. పుట్టింటి బాధలు వేరు, అత్తింటి సమస్యలు వేరు. జీవితంలో ఆర్థిక స్తోమత పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఎందరో విదేశాలకు వెళ్లి జీవిస్తున్నారు.
సుప్రజ ప్రశాంతత కోసం సంగీతం మొదలు పెట్టింది. శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో – నానాటి బ్రతుకు నాటకము – అన్నట్లు గానే చాలా జీవితాలు జీతాలు చుట్టూ పరుగులు పెడుతున్నాయి.
సూర్య గ్రహం చుట్టూ ఇతర గ్రహాలు తిరిగే మాదిరి అత్తింటి చుట్టూ ఆడపిల్లల తిరుగుతున్నారు. మనసు మాత్రం భర్త వెంట పరుగులు!
ఇది సీత మహా సాధ్వి పుట్టిన దేశం. అత్తింట బాధలు పడుతు, భర్త ప్రేమ కోసం ఎంత వెంపర్లాడతారో ఆడపిల్లలు! ఏమిటో చిత్రం, మూడు ముళ్ల బంధం అంత గొప్పది. ఆ కాలంలో ఒక కైక, ఒక మంథర, ఒక శూర్పణఖ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటిలో ఉన్నారు అని ఆడపిల్లల తల్లి తండ్రి వాపోతున్నారు.
***
సుప్రజ తల్లిదండ్రులూ, నానమ్మ సుబ్బలక్ష్మి కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
“ఈనాటి తరంలో చాలా పెళ్ళిళ్ళు ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకు మంటున్నట్లు ఘనంగా చేసి జీవితాల్లో వెలుగులు విరజిమ్మే కిరణాలు కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. ఒక్క పిల్ల ఆనందం కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు, కానీ జీవితంలో సంతోషం ఒక ఒయాసిస్ మాదిరి మిగిలింది. డబ్బుకి లోటు లేదు, కానీ ఆనందం కొనలేని పరిస్థితి.”
“వివాహంతో మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఆడపిల్లల చదువు ఎంత పెద్దదైన శైలిలో ఉన్నా, అత్తారింట సమస్యలు తప్పవు.”
“వంట వార్పు లు తప్పవు. నీ కోసమైనా వండు కోవాలి కదా అంటారు. కలిసి రాని భర్త అయితే ఎంత బాగా తెలివి ఉన్నా పనికి రాదు. ఏ మాత్రం ఇంటి సహకారం ఉండదు. పెళ్లి తరువాత ఆడపిల్లకి స్థిరత్వం వస్తుంది అంటారు, కానీ మనసులో అస్థిరత్వం పెరుగుతుంది. మనసులో టార్చర్ పెరుగుతుంది. అయినా తప్పదు పెళ్లి.”
“ఎక్కడో ఏ కొందరో ఎదుగుతారు, వారిని ఆదర్శంగా పెట్టుకుని అందరు ఎదగాలి అంటారు.”
“మహిళ దినోత్సవాలు టివి రేడియో పేపర్స్ గ్రూప్స్ సంస్థలు అన్ని ఘనంగా చేస్తూనే ఉన్నాయి. దేశంలో ఎక్కడో ఒక అమ్మాయి ఎదుగుతుంది, దాన్ని మీడియా అదే పనిగా చెపుతుంది. ఇంకా ఆడవాళ్ళు అంతా పరుగులు మెరుగులు అంటు వెడితే ఇంట్లో మెతుకులు ఎవరు పెడతారు?”
“ఇప్పటికీ గృహిణి వంట ఎంతో రుచి అని గృహ ప్రియ, వంటిల్లు, గృహిణి వంట, గృహ సుధ అంటూ పేర్లు పెడుతున్నారు.”
కాసేపు మాటలు ఆపారు.
‘ఈ ఏడాది పిల్ల పెళ్లి చేసెయ్యాలి’ అంటు పంతం పట్టింది సుబ్బలక్ష్మి. ఆ మాటకి గౌరవం ఇచ్చి తెలుసున్న సంబంధం అని సుప్రజ పెళ్ళి చేశారు. కానీ పరిస్థితి ఇలా అయింది.
“పెళ్లికి ముందు పెద్ద ఉద్యోగం ఉండవచ్చును, పెళ్లి తరువాత మార్పులు రావచ్చును. అందరూ మన విశాలి మాదిరి ఉండరు.” అంది సుప్రజ తల్లి.
‘విశాల ఎవరు? ఆ కథ ఏమిటి?’ అనే కుతూహలం చూపింది సుబ్బలక్ష్మి.
సుప్రజ అమ్మ చెప్పసాగింది:
“విశాల మన సుప్రజ ఫ్రెండ్ తల్లి. వాళ్ల నాన్న గారు పెళ్లికి ముందు పెద్ద మెడికల్ కంపెనీ మేనేజర్. ఆ రోజుల్లో నెలకు యాభై వేలు సంపాదన వచ్చేది. పెళ్లికి విశాల ఆంధ్ర బ్యాంక్‌లో క్యాషియర్‌గా చేస్తోంది. టజాతకాలు కుదిరాయి, మీ అమ్మాయి అయితే భవిష్యత్ కుదురుతుంది’ అంటూ వెంటపడి వాళ్ళ పర్మిషన్ తీసుకుని పెద్దల అభిప్రాయాలు తెలుసుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళవగానే, ఉద్యోగానికి రాజీనామా చేసేయమన్నారు. ‘అదేంటి కష్టపడి రిటెన్ టెస్ట్ లు రాసి, ఉద్యోగం సంపాదించి, పోస్టులో చేరాను, లాంగ్ లీవ్ పెడతాను’ అంది విశాల. ‘అలా కాదు, నువ్వు ఉద్యోగం పై ఉన్న శ్రద్ధ నా కుటుంబం పై చూపవు’ అన్నాడు భర్త శ్రీరామమూర్తి. చేసేదేం లేక రిజైన్ చేసింది.
పెద్ద పిల్లాడి తర్వాత రెండో పిల్లాడు కూడా పుట్టాడు. అత్తగారు పెద్దావిడ. మామగారు బాగానే ఉండేవారు. ఆడబడుచుల పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎవరి ధోరణి వారిది. పెళ్లికి బంధువుల మాదిరి వచ్చి వెళ్ళిపోయారు. పెద్ద బావగారు కెనడా, రెండవ బావగారు ఆస్ట్రేలియా. ఈ మహాశయుడు శ్రీరామమూర్తి మాత్రం భారతదేశం ఘనమైన దేశం, నేను వదిలి రాను అన్నాడు. సరే అమ్మ నాన్న సేవ చేసుకో అన్నారు వాళ్ళు.
ఒక శుభోదయాన ‘విశాలా’ అంటూ వచ్చి కూర్చుని, ‘నీది ఎంతో విశాల హృదయం, నన్ను క్షమించు’ అన్నాడు.
‘దేనికి?’ అంది.
‘ముందు క్షమించమని అంటున్నాను’ కదా అన్నాడు.
‘సరే అలాగే’ అంటూ ఏడుస్తున్న రెండో పిల్లాడిని ఊరుకోమని అంటోంది. పెద్దవాడు తల్లి కొంగు పట్టుకుని తండ్రి వంక భయంగా చూస్తున్నాడు.
‘నేను జాబ్ రిజైన్ చేశాను’
‘ఏమి ఇన్నాళ్లుగా చేస్తున్న మీరు ఆ జాబ్ వదిలేస్తే కంపెనీ ఏమి అవుతుంది?’
‘ఆ ఓనర్‍కీ నాకు గొడవైంది.’
‘పోనీ మీరు కాస్త తగ్గవచ్చును కదా’
‘అదిగో నువ్వు నా ఈగో మీద దెబ్బ తీస్తున్నావు’
‘అది కాదు, ఏదో మాటా మాటా వస్తాయి. అంత మాత్రాన ఉద్యోగం వదిలేస్తారా?’
‘నా అదృష్ట దేవతవి నువ్వు ఉండగా నాకేమీ’ అన్నాడు.
‘నువ్వు మళ్లీ ఉద్యోగానికి వెళ్ళు’ అన్నాడు.
‘ఎలా?’
‘నువ్వు ఎం.ఎ. చదివావు ఏదైనా కాలేజీలో లెక్చరర్‌గా వెళ్ళు’ అన్నాడు.
‘ఇలా డిగ్రీ చాలదు, కొన్నాళ్ళకి పిహెచ్ డి లేదని అంటారు. ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే నేను పీహెచ్ డీ చెయ్యాలి. పిల్లలను పెంచుతూ పక్క బట్టలు ఉతికి ఆరేసిన నాకు సబ్జెక్ట్ జ్ఞాపకం లేదు’ అంటూ నవ్వింది.
‘నువ్వు పి.హెచ్.డి చెయ్యి, డబ్బు నేను కొంత, మీ పుట్టింటి వారు కొంత పెడతాం’
‘హ హ. ఇప్పటికే నా రెండో చెల్లి, దానితో పాటు తమ్ముడు పెళ్లి వద్దంటున్నారు. మా సొమ్ము మేము తింటాము. హాయిగా ఏ పోరు లేకుండా బతుకుతున్నాం అంటున్నారు.’ అంది.
‘వాళ్ళకి ఇంకా కల్యాణ తార రాలేదు. నువ్వు పిహెచ్.డి చేసే వచ్చేవరకు నాకు మా అమ్మ వండి పెడుతుంది. నువ్వు పిల్లల్ని మీ పుట్టింట్లో వదిలి వెళ్ళు’ అన్నాడు
ఆమె ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కనుక పిహెచ్.డి సీటు రావడం, అందులో మళ్లీ గోల్డ్ మెడల్ రావడంతో గవర్నమెంట్ గ్రూప్ సర్వీసెస్ రాసింది విశాల.
ఎప్పటి కప్పుడు జాతకం చూసుకుంటూ ఆమెను వెన్నంటి ఉన్నాడు శ్రీరామమూర్తి.
‘నేను చక్రం బాగా వేస్తాను, రీడింగ్ చెపుతాను’ అంటాడు. కట్టుకున్న పాపానికి ఆ పెళ్ళాం – భర్త చేసిన అప్పులన్నీ తీర్చి కుటుంబాన్ని పోషించింది. విశాల ఈ తరం పిల్ల కాదు. ఇప్పటి వాళ్ళయితే ఆ మొగుడికి దండం పెడతారు. పిల్లలు పెరిగి పెద్ద అయ్యేలోగా ‘నా పిల్లాడు అదృష్ట వంతుడు’ అంటూ భార్యకు జాబ్ రాగానే సంబరం చేశాడు శ్రీరామమూర్తి.
విశాలకు ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగం వచ్చింది. నెల జీతంలో కొంత ఖర్చులకి, కొంత మొగుడికి ఇచ్చి మిగిలినది దాస్తోంది. ఏ ఆస్తి ఎప్పుడు అవసరం వస్తుంది, ఏది ఎప్పుడు కావాలి అన్నది తెలుసుకొని దాచుకోవాలి.
ఆడదానికి తెలివి ఉండి దాస్తే అది అవసరానికి వస్తుంది. ముందే అన్ని మొగుడికి ఇస్తే, అవసరానికి ఏమి ఉండదు. విశాలకి ఇద్దరు మగ పిల్లలు కావడం అదృష్టం అనే చెప్పాలి. చదువుతో పాటు ఉద్యోగం ఉండాలి లేదా ఏదైనా ఉపాధి ఉండాలి. విశాల అంత కష్టంలోను భర్తను, పిల్లల్ని వదిలి ఎంతో శ్రద్ధ, స్థిరత్వంతో విద్య నేర్చుకుని జీవితంలో విజయం సాధించింది. అందరికీ అలా జరగాలని లేదు. కానీ కీడెంచి మేలు ఎంచాలి” అని ఓ సుదీర్ఘ నిట్టూర్పు విడిచింది సుప్రజ తల్లి.
తల్లి విశాల గురించి చెబుతున్నప్పుడే అక్కడి వచ్చింది సుప్రజ.
అమ్మ చెప్పిన మాటలు విన్న సుప్రజ ఆలోచనలో పడింది.
“పెళ్లి తరువాత చదువు అందరికీ కుదరదు. అసలు అత్తింటికి పుస్తకాలు కాదు, బట్టలు పెట్టె మాత్రమే పట్టుకు వెళ్ళాలి. మన సుప్రజ అంత తెలివైన పిల్ల కాదు. గడుసరి కబుర్లు చెప్పలేదు. నెమ్మదస్థురాలు. ఒక్కడే పిల్లాడు అయితే అత్త వారు కోడల్ని ప్రేమగా చూస్తారు” అంటూ బామ్మ సలహాలు ఇచ్చింది. “అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాక, వాళ్ల పిల్ల అవుతుంది. అందుకు వాళ్ళు బాగానే చూసుకుంటారు” అంది.
“ఈ తరంలో అలా లేదు బామ్మా. వారి పిల్లలు ఒక ఎత్తు, పరాయి పిల్ల ఎన్ని తెచ్చినా మరో ఎత్తు అనుకుంటున్నారు” అంది సుప్రజ.
“అవునా?” అంది బామ్మ.
“అమ్మా, నేను ఓ ఉదాహరణ చెప్తాను” అంటూ చెప్పసాగాడు రాఘవ.
***
“మా స్టాఫ్ ఫ్రెండ్ ఒకాయన పెద్ద అగ్రికల్చర్ ఆఫీసర్. అయన భార్య ప్రభుత్వోద్యోగి. పెళ్లి కోసం స్టేట్ మారింది. దాంతో సర్వీస్ పన్నెండు ఏళ్ళది వదిలేసి, న్యూ పోస్టింగ్ వలె జాయిన్ అయ్యింది. వాళ్ళకి ఒక పిల్ల, పిల్లాడు. పిల్ల లావుగా ఉంటుంది. కళ్ళజోడు. బి.ఎ. మ్యాథ్స్ చదువుతోంది. ఏదో సంబంధం వచ్చి, హాస్టల్ నుంచి పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి జరిగింది. అల్లుడు మెరైన్ ఇంజనీర్. అరు నెలలు భూమి మీద, ఆరు నెలలు షిప్‌లో సముద్రంలో ఉంటాడు. పెళ్లయిన నెలకి అతను వెళ్ళిపోయాడు. రెండో నెలలో పిల్లని చూడటానికి వాళ్ళిద్దరూ వెడితే కూతురు తప్ప అందరూ గొప్ప కబుర్లు చెపుతున్నారు. మా పిల్ల ఏది అని అడిగితే, వంటింట్లో ఉన్నది పిలిస్తే వస్తుంది అన్నది అత్తగారు. తల్లి తండ్రి వచ్చినా అత్తగారు పిలిస్తే కానీ కోడలు రాకూడదు.
అప్పుడు అత్తగారు పిలుస్తుంటే తల్లి ‘నే లోపలికి వెళ్ళాలి’ అన్నది. ‘ఆహా వద్దు లెండి’ అంటూ అత్తగారు పిలిచే లోపు తల్లి వెళ్ళింది. ఏముంది? అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు. కూతురు చమటలు కక్కుతూ మామూలు స్టవ్ దగ్గర పూరీలు వత్తి వేచుతు ఉన్నది. తల్లి వెళ్లి సాయం చేసింది. ‘అల్లుడు వెళ్ళాక వారంలో పంపండి’ అన్నది, కానీ సమాధానం లేకపోవడంతో వాళ్ళే వచ్చారు. కూతురు పరిస్థితి చూసి ‘మా పిల్ల మా అల్లుడు వచ్చేవరకు పుట్టింట్లో ఉంటుంద’ని తీసుకు వెళ్ళారు. ఆ పిల్ల ఆ భర్త దగ్గర ఉండటం కష్టమే అని చెప్పింది. అతని కేమి పట్టదు. అన్నీ అక్కా తల్లి చూసుకుంటారు. అతను డబ్బు తెచ్చి ఇచ్చే యంత్రము. భార్యకు చూపించే ప్రేమ లేదు. అతని ఇష్టం ఏమి లేదు, ఆరు నెలలు ఇలా టార్చర్ పడటం నా వల్ల కాదు అని బాధపడింది.
తల్లి విద్యావంతురాలు, ఉద్యోగస్థురాలు కూడా అవడం వల్ల కూతురును పిజిలో చేర్చింది. తర్వాత ఆ అమ్మాయి మంచి కంపెనీ జాబ్ లోకి జాయిన్ అయ్యింది. ఇక ఆ పెళ్లి విషయం వదిలేసి వృత్తిలో సెటిల్ అయ్యింది. మరో ఫ్రెండ్ కొడుకు ఈ విషయం తెలిసి ఆదర్శంగా నేను చేసుకుంటాను అన్నాడు. అయినా కూతురు ఇష్టం కదా, కంపెనీ వారు విదేశాలకు పంపుతూ ఉంటారు, అది నీకు ఇష్టమేనా అంటే అలాగే అని చేసుకున్నాడు.
మనం ఇక్కడ రెండు రకాల జీవితాలు తరిచి చూస్తే ఏమి అనిపిస్తుంది? ఆడపిల్లకి పెళ్లి చెయ్యడం తప్పదు. అది బాగుంటే సరే లేకపోతే సరిదిద్దాలి కదా. మంచివాడు దొరకడం మహా కష్టంగా ఉన్నది. పెళ్లి పేరంటం అంతంత మాత్రంగా జీవితాలు ఉంటున్నాయి.
పాతికేళ్ళు పెంచిన తల్లి తండ్రి పెళ్లి చేసి చెంచాతో సహా ఇవ్వాలి, నెల వారీ ఖర్చులు ఇవ్వాలి. ఎంత పెట్టినా తృప్తి లేని వాళ్ళు కొందరు, బంగారు బాతు మాదిరి అన్ని అడిగి మరి పుచ్చుకుంటూ ఉన్నారు. మన సుప్రజ అత్తగారు పెళ్లికి ముందు ఏమి వద్దు అంది కానీ, మీకు అన్ని తెలుసు అంది.
సుప్రజ అత్తగారికి స్వార్థం వచ్చింది. కొడుకు మనమ్మాయే కావాలని పెళ్లి చేసుకున్నాడు. అతను పెళ్ళాం పరం అయితే, ఈ కుటుంబం ఎలా గడుస్తుంది? కనుక తప్పక కోడలు మాట వినకుండా చెయ్యాలి అనుకున్నది. అదే తడువు కొడుకుని రాపాడిస్తూ కొడుక్కి కోడలిపై చాడీలు చెపుతుంది” అన్నాడు రాఘవ.
సుబ్బలక్ష్మి నిట్టూర్చింది. కాసేపటికి అంతా భోజనాలకి లేచారు.
***
తానే పట్టుబట్టి మనవరాలికి ఆ సంబంధం చేయించానని సుబ్బలక్ష్మి బాధపడింది. సుప్రజ జీవితం సవ్యంగా అవ్వాలని కోరుకుంది. గుడిలో పూజారి గారికి అడిగితే, ఆయన జాతకం చూసి సుప్రజ గ్రహస్థితి బాలేదు, జపం చేయమని చెప్పడంతో, జపమాల తీసుకుని జపం మొదలుపెట్టింది. కొన్నాళ్ళకి అన్ని తప్పుకున్నాయి, గ్రహలు సర్దుకున్నాయనీ, అమ్మాయికి మంచిరోజులొస్తాయని పూజారి చెప్పారు.
ఒకరోజు సుప్రజ ఒక ఛానెల్ వారు నిర్వహించిన పోటీలో ‘కులుకక నడవరో కొమ్మలాల’ అనే అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కీర్తన పాడింది. ఫస్ట్ వచ్చింది. ఆ కార్యక్రమాన్ని ఛానెల్ ద్వారా సుప్రజ భర్త చూసాడు. ఆనందించాడు. సుప్రజే కావాలని పెళ్లి చేసుకున్నాడు, కానీ తల్లి చెల్లి వల్ల అగాధం వచ్చింది. తన జీవితాన్ని విశ్లేషించుకున్నాడు. అతనిలో అంతర్మథనం జరిగింది. అతనిలో మార్పు వచ్చింది. మార్పు రావడంతో భార్యపై అభిమానం కలిగింది.
‘ఈ రోజుల్లో మగపిల్లలకి ఆడపిల్లలు దొరకటం లేదు, అందునా ఒకే కులం వారు ఎక్కడా లేరు, కనుక పెళ్లి చేసుకున్న భార్యను కష్ట పెట్టకూడదు’ అనుకున్నాడు.
మామగారిని కాంటాక్ట్ చేసి భార్యను పలకరించాడు. త్వరలో ఇండియాకి వచ్చేస్తాననీ, కొత్త జీవితం గడుపుదామనీ సుప్రజని ఒప్పించాడు.
ఆరు నెలల తరువాత వాళ్ళిద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు.