Site icon Sanchika

విధి బలీయం

[శ్రీ షేక్‌ మస్తాన్‌ వలి రచించిన ‘విధి బలీయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఎల్‌[/dropcap].ఎల్‌.బి. చివరి సంవత్సరం చివరి పరీక్ష రేపే. అదైపోతే నా.. లా చదువు అయిపోయినట్లే. దాంతో.. ఇన్ని ఏళ్ళ నా శ్రమ, తపనలు ఫలిస్తాయి. అందుకే రాత్రి నా గదిలో పట్టుగా చదువుకుంటున్నా. అమ్మానాన్నలు ప్రక్క గదిలో నిద్రపోతున్నారు. మెల్ల మెల్లగా టైం పదకొండైంది. పాఠ్యాంశాల పునశ్చరణ పూర్తయింది. ఇక పుస్తకాలు మూసేసి పక్కపై చేరుకున్నా.

ఇంతలో సెల్‌ఫోన్‌ మ్రోగింది. ‘ఈ వేళప్పుడెవరబ్బా?’ ఆత్రంగా ఫోనెత్తా. స్క్రీన్‌పై ‘కల్పన’ అని చూడగానే నాలో అలజడి మొదలైంది. ఆలశ్యం చేయకుండా ఫోన్‌ చెవి దగ్గరగా పెట్టుకొని బిగ్గరగా “హలోఁ!” అన్నా.

“ఆఁ నేనేనే.. కవితా!” అవతలి కంఠం.. ఖళ్‌!.. ఖళ్‌!!.. మని దగ్గుతున్న శబ్దం కర్ణ కఠోరంగుంది.

“మెల్లగానే తల్లీ! ఎందుకలా ఆత్ర పడతావ్‌! అయినా ఇంత రాత్రివేళ కాల్‌ చేశావేంటే?”

“అదేనే! చెప్పాలి..” మళ్ళా దగ్గు తెర కంఠాన్ని అదిమేసింది.

“ఏమైందే చెప్పు.. చెప్పు!” నా ఆతురత తారాస్థాయినుంది.

“ఏమోనే.. నా బ్రతుకు యివ్వాళో రేపో అన్నట్లుంది! నువ్వొకసారి రావే.. ఎందుకో.. నిన్ను చూడాలనిపిస్తోంది. నీతో ఏవేవో మన చిన్ననాటి ముచ్చట్లు పంచుకోవాలని వుందే!” కల్పన గొంతు జీరపోయింది.

“ఛా.. పిచ్చిదానా! అలా అధైర్యపడకు! నువ్వు నిండు నూరేళ్లు బ్రతుకుతావే. అలాగే.. నే వస్తాగా! అయితే.. వెంటనే బయల్దేరలేనే! రేపే నా డిగ్రీ ఆఖరి పరీక్ష! అదవ్వగానే బయల్దేరుతా! ఎల్లుండి కంతా.. నీ దగ్గర వాలుతాగా! ఓకే..నా!” విషయాన్ని విపులీకరిస్తూ చెప్పా.

“ఎంత.. అత్యాశగా వున్నావే.. కవిత.. నాకు ఎల్లుండనేది వుంటేగా.. మనం కలుసు కో..టా..ని..కి!” పెల్లుబికిన దుఃఖంతో అవతలి కంఠం మాగబోయింది. ఆపై ఫోన్‌ ఆపేసిన శబ్దం వినిపించింది.

“ఏం చేయాలి? ఏం.. చేయాలి!” నాకేమీ తోచలేదు.

“వెంటనే బయల్దేరితే.. ఇంతదాక వచ్చిన విద్యా సంవత్సరం వృథా అయిపోద్దీ. అలా అని వెళ్ళకపోతే.. అక్కడేమన్నా అవాంఛితం జరిగితే.. దాని కోర్కె తీర్చలేని అభాగ్యురాలినౌతానేమో? హే భగవాన్‌! ఏమిటీ పరీక్ష? ఏమిటీ నా.. ఈ అశక్తత? ఏమైనా నా కల్పనకేమి జగక్కూడదు!’ అంతరంతరాల్లో దేవుడ్ని వేడుకున్నాను.

మొత్తానికి తర్జన భర్జనల మధ్య మరునాటి పరీక్ష అయిపోగానే కల్పన దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకొని పక్కపై చేరా. రాత్రంతా ఏవేవో పీడకలలు వేధించాయి.

ఇక ఉదయాన్నే అమ్మానాన్నలకు రాత్రి కాల్‌ విషయం వివరించి, సాయంత్రం చెన్నయ్‌కు రైల్లో తత్కాల్‌ బుక్‌ చేయమని చెప్పి కాలేజ్‌కు వెళ్ళా. అనుకున్నట్లే పరీక్ష బాగా రాశా. దాంతో నా జీవిత లక్ష్యమైన ప్లీడర్‌ డిగ్రీ పూర్తయింది. ఆపై పట్టా చేతికి రాగానే మిగిలింది ఓ సీనియర్‌ దగ్గర కోర్టు ప్రాక్టీసే.

రాత్రి రైల్లో చెన్నయ్‌కు బయల్దేరిన నాకు అమ్మా నాన్నలు హృద్యంగా బై బై చెప్పారు. స్టేషన్‌ వదిలేక బెర్త్‌పై పడుకున్న నాకు ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. మనస్సంతా.. కల్పన ఆలోచనలతో కలగాపులగమై నా ఎదుట గతం కదలాడసాగింది.

***

నా తొలి చదువు నెల్లూరులో మొదలైంది.

అప్పటి నా వయస్సు మూడేళ్ళు. మా నాన్న క్రొత్తగా ఆ ఊరికి బదిలీపై వచ్చారు. రాగానే అద్దె యిల్లు సమకూర్చుకోవటంతో పాటు, నా నర్సరీ చదువూ వాళ్ళకు సమస్య అయింది.

ఎలాగో చక్కటి యిల్లు దొరికింది. ఇక నా స్కూల్‌కై వెతికి ‘విద్యా భారతి’ మంచి సంస్థని తేల్చారు. పైగా అది మేముండే యింటికి దగ్గరగా వుండటంతో దాన్ని ఓకే చేశారు.

ఇక నన్ను నర్సరీ క్లాస్‌లో చేర్చటానికి ముహూర్తం నిశ్చయమైంది. కొత్త యూనిఫాం వేశారు. గుడి దగ్గర పూజా వగైరాలు జరిగాక స్కూల్లో దిగబెట్టటానికి అమ్మానాన్నలు మంది మార్బలంతో బయలుదేరారు. అప్పటివరకు జరిగిన తతంగాన్ని తమాషాగా ఆస్వాదించిన నేను బడి ఆవరణ దగ్గరవగానే అసహనంగా గోల మొదలెట్టాను. మా వాళ్ళ బుజ్జగింపుతో మధ్య మధ్య.. శాంతించినా, నా ఏడుపు ఆగాగి ఊదబడే బూరగ శబ్దంలా మారింది. చివరకు హెడ్‌ మిస్‌ గది దగ్గరకి చేరేసరికి వెక్కిళ్ళుగా మారున్న నా ఏడుపు తిరిగి మొదలవ్వబోయింది. ఇంతలో ఇంకో దిక్కు నుండి వినిపించిన మరో ఏడుపు గోలలో నా గొంతు చిన్నబోయింది.

అప్పుడు అందరం అటుగా చూశాం.

ఎవరో మరో తల్లిదండ్రులు.. నా వయస్సే వున్న తమ పాపను ఎత్తుకొని బంధుసమేతంగా మా వైపే వస్తూ కనిపించారు.

“ఒద్దమ్మా.. బడొద్దు!” ఆ బిడ్డ గోల తారాస్థాయి నుంది. నాలాగే ఎర్రగా, బుర్రగా, కొత్త యూనిఫాంలో, బాబ్డ్‌ హెయిర్‌తో ఉన్న ఆ పిల్ల కళ్ళు సజలాలై వున్నాయి.

“బడి ఒక పూటేరా బుజ్జీ! అదీ.. చదివేదేమీ వుండదట. చక్కగా కూర్చొని బొమ్మలతో ఆడుకోవటమేనట!” ఆ బిడ్డ తల్లి బుజ్జగిస్తోంది.

“అరరే, మన పాప పిరికిదనుకున్నావటే! నా.. తల్లి ధైర్యవంతురాలే! ఇవ్వాళ కొత్త గాబట్టి మారాం చేస్తోంది. రేపు చూడు! అదే పరుగెడ్తుంది!” ఆ పాప తండ్రి కూతుర్ని ఉబ్బేస్తున్నాడు.

అటే.. చోద్యం చూస్తున్న నేను ఒక్కసారిగా ఏడ్పు మానేశా.

మొత్తానికి ఆ రోజు ఎల్‌.కె.జి అడ్మిషన్స్‌ మా ఇద్దరివే.

“కవిత.. కల్పన.. యిద్దరు మంచి పాపలు! బుద్ధిగా వెళ్ళి ఆ రంగుల బెంచ్‌పై కూర్చోండమ్మా.. మీకు మిస్‌ మంచి మంచి బొమ్మలిస్తుంది. చక్కటి రైమ్స్‌ నేర్పుతుంది. బాగా ఆడిస్తుంది” హెడ్మిస్‌ నవ్వుతూ మా యిద్దర్ని క్లాస్‌కు పంపింది.

అదిగో.. అలా మొదలైంది కల్పనతో నా పరిచయం. ఆ ముహూర్త బలమేమోగాని, అది దిన దిన ప్రవర్ధమానమై విడదీయరాని చెలిమిగా మారింది.

క్రమంగా ఇద్దరం బడి వాతావరణానికి అలవాటు పడ్డాం. “త్వరగా వెళ్ళాలమ్మా! కల్పన నాకై చూస్తుంటుంది!” అని ఉదయాన్నే నేను వేగిర పెట్టటం, అలాగే కల్పన నా రాకకై స్కూల్‌కు పరుగెత్తటం చూసి మా తల్లిదండ్రులు సంబరపడేవారు.

కల్పన వాళ్ళ నాన్న గారిది పచారి కొట్టు. అందుకేనేమో.. అది రోజూ చాక్లెట్‌లాంటి తాయిలాలు బాగానే తెచ్చేది. వాటిలో సగం నాకు యిచ్చేది. మా నాన్న క్యాంపుకు వెళ్ళినప్పుడంతా.. రకరకాల ఆట బొమ్మలు తెచ్చేవారు. అలాంటి వన్నీ.. రెండుగా తేవాలని పట్టుబట్టేదాన్ని. ఇంటి గారాల పట్టినైన నా మాటకు తిరుగుండేది కాదు. దాంతో నేను ఒక బొమ్మను కల్పనకిచ్చేదాన్ని.

మెల్లమెల్లగా మేము ఏ.బి.సి.డీ..లు దాటి రైమ్స్‌, డ్రాయింగ్‌.. వగైరాల్లో పడ్డాం.. ఎక్కువగా అన్నీ కలిసే చేసేవాళ్ళం. ఇక శలవు రోజుల్లో నేను వాళ్ళింటికో, అది మా యింటికో చేరేవాళ్ళం.

అలా కాలం సంతోషంగా గడిచింది. సంవత్సరాలు దొర్లాయి. నా ఆరో తరగతి వరకు అదే ఊర్లో వున్నాం. ఈలోగా మా స్నేహం వెల్లివిరిసింది. ‘కవిత-కల్పన’ జంట అన్నింటా.. ఓ పంట!.. అని అందరు పొగిడేవారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలలో మా ఇరువురి నాట్యం తప్పక వుండేది. అలాంటి ఓ సందర్భంలో తీసిన మా ఫోటో ఒకటి ఎన్‌లార్జ్‌ చేయించి కల్పన వాళ్ళింటి హాల్లో పెట్టారు. అది చూసి జనం అసూయ పడ్తున్నారని, వాళ్లమ్మ మా యిద్దరికి దిష్టి తీసి ఓ తతంగమే చేసేది.

అయితే మా ఈ నిరవధిక అనుబంధానికి అనుకోని అవాంతరమొకటి వచ్చింది. అది.. మా నాన్నకు వచ్చిన శ్రీకాకుళం బదిలి. తప్పదు! అప్పటికాయన నెల్లూరు పోస్టులో ఎనిమిదేళ్ళున్నారు. ఆ వార్త కల్పనకు పిడుగు పాటైంది.

“వద్దే.. కవితా! వద్దు! ఏమైనా మీరు వెళ్ళొద్దే!” అది బ్రతిమాలింది.

“అదెలాగే! నాన్న ఉద్యోగం కదా! తప్పదే!” నేను సర్ది చెప్పా.

“ఏమోనే! నిన్న నువ్వు చెప్పినప్పటి నుండి.. నాకు ఒకే దడగా వుందే! ఏ దేవుడైనా కనికరించి మీ ట్రాన్స్‌ఫర్‌ ఆగిపోతే బాగుండే!” దాని కన్నీరు నన్ను కదిలించింది.

“అయ్యో పిచ్చిపిల్లా! అది జరగనే జరగదు! అందుకే నువ్వు ధైర్యంగుండాలి. మా కల్పన కన్న మంచిది కదూ!” నేను దానిని బుజ్జగించా.

“ఊ! హుఁ! వెళ్ళవే నేను.. నీతో కచ్చి! కాకుంటే నువ్వు.. నాతో మా యింట్లో వుండవే!” అది బుంగమూతి పెట్టింది.

“అయ్యో దేవుడా! నాన్నవాళ్ళు అసలు ఒప్పుకోరే! పోనీ అప్పుడప్పుడు శెలవుల్లో నీ దగ్గరకు వస్తాగా”

“ఏమోనే.. నువ్వు లేకుండా నేను చదవలేనేమో ననిపిస్తుందే!” అది దిగులుగా యింటికెళ్ళిపోయింది.

ఆ మరుసటి రోజు కల్పన బడికి రాలేదు. క్లాస్‌ పిరియడ్స్‌ అన్నీ ముగిసేదాకా ప్రతి నిమిషం దాని రాకకై ఎదురు చూశా.. ఊఁ..హుఁ.. నిరాశే ఎదురైంది. ఇక స్కూల్‌ వదిలాక సరాసరి దాని యింటికి వెళ్ళాను.

“రామ్మా కవితా రాఁ! ఉదయం నుంచి దానికి జ్వరంగుంది! అలాగే పడుకుండిపోయి మధ్య మధ్య.. నీ పేరే పలవరిస్తోందమ్మా! డాక్టర్‌ దగ్గరికెళ్ళాం! ఆయనిచ్చిన మందులు యిప్పటికి రెండు దోస్‌ లిచ్చాం!” నన్ను చూడగానే కల్పన వాళ్లమ్మ ఏకరువు పెట్టింది.

“అలాగా ఆంటీ” అంటూ స్కూల్‌ బ్యాగ్‌ టీపాయ్‌పై పడేసి దాని గదికెళ్ళాను. అది మగతగా పడుకుంది. ముఖం పీక్కుపోయింది. మనిషి నీరసంగుంది. దాని ప్రక్కనే కూర్చొని ఆప్యాయంగా నుదిటిపై చేయి వేశాను. వళ్లు పెనంలా కాలి పోతుంది.

నా స్పర్శకు అది కళ్ళు తెరిచి బేలగా చూస్తూ “వెళ్ళొద్దే కవితా! వెళ్ళొద్దే!” అంటూ నా చేతిని తన గుండెపై నుంచుకొని చిన్నగా ఏడ్వసాగింది.

“ఏం చెయ్యాలి తల్లీ! ఇదీ.. దీని వరస! ఎంత నచ్చ చెప్పినా.. వినదు!” నా వెనుకనే లోనికి వచ్చిన కల్పన వాళ్ళమ్మ దిగాలుగా అంది. ఆ మాటలకు.. నాకూ ఏడ్పొచ్చింది.

ఆ పై “లేదు లేవే కల్పనా! నేను నీతోనే వుంటానుగా!” అనే అబద్ధంతో దాన్ని ఓదార్చాలని ప్రయత్నించా.

“నిజంగా!” అది ఒక్కసారిగా లేచి కూర్చొని నన్ను పొదవి పట్టుకుంది.

ఈలోగా కల్పన వాళ్ళమ్మ తెచ్చిన వేడిపాలు యిద్దరం త్రాగాం. కాసేపటికి వళ్ళంతా చెమటలు పట్టి దానికి జ్వరం తగ్గింది. ఆపై ఓ గంట దానితో ఏవేవో కబుర్ల కాలక్షేపం చేసి, రాత్రి మా జీపు రాగానే దానికి బైబై చెప్పి యింటికి వెళ్ళిపోయా. నిజానికి దాన్ని వదిలి శ్రీకాకుళం వెళ్ళటమంటే.. నాకూ బాధగానే వుంది. కాని ఏం చేయగలం? నాన్న బదిలీ నేనాపలేనుగా!

చివరకు మేము ఒకర్నొకరు వదిలి వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది.

అప్పుడది నన్ను ఆపటానికి ప్రయోగించిన ఆఖరస్త్రం తలచుకుంటే నాకిప్పటికి ఆశ్యర్యం, నవ్వూ.. రెండూ కలుగుతాయి.

“ఒసే కవితా! మీ నాన్నగారిని ఈ ఊర్లోనే వుంచే ఓ సరికొత్త ఆలోచన నాకొచ్చిందే!” అది ఆనందంగా అంది.

“ఏమిటే?” నేనాత్రంగా అడిగా.

“అదేనే.. మా నాన్ననడిగి మీకు ఓ పెద్ద దుకాణం యిప్పిస్తా! అందులో ఎంచక్కా వ్యాపారం చేసుకుంటూ.. మీ నాన్న, ఆయనతో పాటు మీరు యిక్కడే వుండిపోవచ్చు!” దాని కళ్ళు మిలమిలలాడాయి.

“అవన్నీ జరిగేవి కాదులేవే!” అని నే వ్యతిరేకించగానే అది ఒక్కసారిగా చిన్నబుచ్చుకుంది. ఏమైనా ఆ సంఘటన దాని స్నేహశీలతకు, అనురాగానికి ఋజువుగా నా మనస్సున ముద్రపడింది.

ఆపై సుదీర్ఘమైన ఎనిమిది సంవత్సరాలు మా సహచర్యానికి తెరపడింది.

మేము శ్రీకాకుళంకు వెళ్ళిపోయాం. అది నెల్లూరులోనే వుండిపోయింది. అయితే మామధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫోన్‌కాల్స్‌, శలవుల్లో రాకపోకలు జరుగుతూనే వున్నాయి.

చూస్తుండగానే మరో తొమ్మిదేళ్లు కాలగర్భంలో కలసిపోయాయి. ఈలోగా మానాన్నకింకో మూడు బదిలీలు, ఒక పదోన్నతి జరిగాయి. చివరిగా మేము గుంటూరుకొచ్చాం. అప్పటికి నేను డిగ్రీ ముగించి లా సెట్‌ సాధించి ఎల్‌.ఎల్‌.బి.లో చేరా.

ఇక ‘కవిత లేకుండా నేను కొనసాగించలేను’ అని కరాఖండిగా తేల్చిన కల్పన ఎస్‌.ఎస్‌.సి. తప్పటంతోనే చదువు ఆపింది. ఆపై దాని వివాహం వాళ్ళ దూరపు బంధువుతో ఖాయమైంది. పెళ్ళి నెల్లూరులో అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మానాన్నలతో కలిసి అన్ని సంబంధిత కార్యక్రమాల్లో పాలు పంచుకొని, జంటకు శుభాభినందనలు తెలిపి తిరుగు ప్రయాణమై గుంటూరు చేరుకున్నాం.

ఆపై నా లా క్లాస్‌లు మొదలయ్యాయి. ఇక చెప్పేదేముంది.. అసైన్‌మెంట్లు, యూనిట్‌ టెస్ట్‌లు, కేస్‌ స్టడీలు, చివరిగా పరీక్షలు వగైరాలతో మొదటి సంవత్సరం ముగిసింది.

ఈలోగా కల్పన దగ్గర్నుండి ఓ శుభవార్త. అది గర్భవతైంది. చూస్తుండగానే నెలలు నిండి అది పండంటి పాపకు జన్మనిచ్చింది. భారీ ఎత్తుగా జరిగిన బారసాలకు వెళ్ళాను. బిడ్డ నెత్తుకున్న నా కల్పనలో నిండు మాతృమూర్తిని చూసి మురిసిపోయాను.

అలా.. అలా.. లా రెండో ఏడు ముగించి మూడో ఏట ప్రవేశించా. ఆపై చదువుతో విరామం లేని కుస్తీ అయింది. ఎలాగో అర్ధ సంవత్సరం ముగిసింది.

ఇంతలో నెల్లూరు నుండి అందిన కల్పన అస్వస్థత వార్త నన్ను వేగిర పరిచింది. పరుగున బయల్దేరి ఆ ఊరు చేరా. ఆక్కడ కల్పన వాళ్ళ నాన్న “అవునమ్మా! దాని పొత్తి కడుపు దగ్గర గడ్డలా కనిపిస్తే.. మామూలుగా హాస్పిటల్లో చూపించాం! వాళ్ళకు అనుమానమొచ్చి, అదేదో బయాప్పి పరీక్ష చేయించారు. ఫలితాలు వచ్చాక వాళ్ళు కల్పనను మద్రాస్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకెళ్లమన్నారు. దాంతో ఇరవైరోజుల క్రితం.. మీ ఆంటీ, అల్లుడు, అమ్మాయి, పాప.. అందరు కలసి చెన్నయ్‌కు వెళ్ళారమ్మా!” అని చెప్పగానే, “రిజల్ట్స్‌ ఏమైనా తెలిశాయా అంకుల్‌?” అని ఆత్రంగా అడిగా.

“ఆఁ! తెలిశాయమ్మా! క్యాన్సరేనట! ఆపై అదేదో.. కీమో థెరపీ కూడ మొదలెట్టారట! అంతా మా.. ప్రా..ర..బ్ధం!” ఆయన గొంతు పూడుక పోయింది.

అంతే! ఒక్కసారిగా నా కాళ్ళక్రింద భూమి కంపించినట్లయింది. వణుకుతున్న అవయవాలు అదుపు చేసుకొని ఓ కుర్చీలో కూలబడ్డా. ఆ తరువాత అక్కడ ఒక నిముషం కూడా నిలువలేక పోయాను. రైల్వే స్టేషన్‌కు వెళ్ళి కరెంట్‌ బుకింగ్‌లో బెర్త్‌ రిజర్వ్‌ చేయించుకొని మరునాటికి చెన్నయ్‌ సెంట్రల్‌కు చేరా. అక్కడ ఓ క్యాబ్‌ తీసుకొని సరాసరి కేన్సర్‌ హాస్పిటల్‌కు వెళ్ళి ఎంక్వయిరీలో పేరు, చిరునామా వగైరాలు చెప్పా. వాళ్ళిచ్చిన వివరాల ప్రకారం వార్డ్‌కు చేరా.

వాకిలి వద్ద కల్పన భర్త కనిపించి “ఏముందమ్మా! అంతా అయిపోయింది! మా బ్రతుకులు బుగ్గవుతున్నాయ్‌!” అంటూ బావురుమన్నాడు. నాకూ కన్నీరు చిప్పిల్లింది. ఎలాగో ధైర్యం కూడగట్టుకొని లోపలికి అడుగు పెట్టా.

“ఎదురుగా బెడ్‌మీద బోడిగుండుతో, పీక్కుపోయిన ముఖం మరియు నిర్జీవమైన చూపులతో వున్న.. ఆ బక్క చిక్కిన వ్యక్తి ఎవరు?.. కల్పనేనా? అయితే ఏమైంది? ఇంతలోనే ఎంత మార్పు! హే భగవాన్‌! సజీవ చైతన్యానికి మారు పేరుగా వుండే నా చెలి కేమైంది? ఆడుతూ పాడుతూ నిత్యం ఛలోక్తులతో వూరించి వుడికించే నా ప్రాణస్నేహితురాలు ఈమేనా? ఆనాటి ఆమె అందం, హొయలు, సొగసులు అన్నీ ఏమయ్యాయి? వాటికి రెక్కలెలా వచ్చాయ్‌!’ ఆలోచనలు పిప్పి చేస్తుంటే గుండె బండబారి పోయింది. కన్నీటితో చూపు మసకబారింది. తడబడే అడుగులతో మంచం దగ్గరకు చేరా.

“అమ్మా! వచ్చావా! అది రోజూ నిన్నే గుర్తు చేసుకుంటుంది!” ఓ మూలగా నుంచొని పళ్ళరసం తీస్తున్న కల్పన వాళ్ళమ్మ నన్ను పట్టుకొని ఏడ్చింది.

దాంతో నేనొక్కసారిగా చలించిపోయా. పెల్లుబికిన కన్నీటితో పరిసరాలు మసకబారాయి. ఆపై “కల్ప..నా!” అని పిలుస్తుంటే పెదాలు వణికాయి.

నేనొచ్చానంటే అది కళ్ళు తెరచి నావైపే దీనంగా చూసింది.

అంతే! నేను దాని గుండెపై లాలనగా చేయి వేసి నిమిరా. నా కళ్ళు యింకా తడిగానే వున్నాయి.

“ఏడవకే! అంతా పై వాడి లీ..లా!” దాని గొంతు బొంగురు పోయింది.

ఆపై రోజంతా ఏవేవో కబుర్లతో, ఓదార్పులతో, పరిచర్యలతో కల్పన వాళ్ల వద్దే గడిపా. చికిత్స యింకా చాలా నెలల పైనే జరగాలట. అప్పుడుగాని మందులవి యిచ్చి ఇంటికి పంపిస్తారట. ఇక చేసేదేముంది? చేయ గలిగేదేముంది? అందుకే అందరికి ధైర్యం చెప్పి గుంటూరుకు కెళ్ళిపోయా.

తిరిగి క్షణం తీరికలేని చదువైంది. అలాంటి పరిస్థితిలోను దాని క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే ఉన్నా. అయితే.. అవంత సంతృప్తిగా లేవని చెప్తున్నారు.

మెల్లమెల్లగా లా చివరి సంవత్సర పరీక్షలు అన్నీ బాగానే వ్రాశా. ఇక రాత్రి కల్పన నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌ నాలో ఏదో తెలియని భయాన్ని రేపుతుంది. ఏదైనా మన చేతిలో ఏమి లేదుగా? అందుకే ఆలోచనలకు స్వస్తి చెప్పి నిద్రలోకి జారుకున్నా.

ఇవేమి పట్టని రైలు గమ్యం వైపు దూసుకెళ్ళ సాగింది.

***

నేను చెన్నయ్‌లో రైలు దిగేసరికి తెల్లవారింది. హడావిడిగా క్యాబ్‌లో కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చేరి కల్పన వార్డ్‌లో అడుగు పెడ్తుంటే.. అక్కడ ఆమె భర్త, బిడ్డ, అమ్మ, నాన్న, మరికొందరు చుట్టాలు గుమికూడున్నారు.

అంతే! నా గుండె గుభేలు మంది!

చేతిలోని సూట్‌కేస్‌ నేలపై గిరాటేసి, పరుగున వెళ్ళి జనాలందర్నీ చీల్చుకొని బెడ్‌వైపు చూశా. అక్కడ మృత్యువుతో పోరాడి, పోరాడి.. ఓడిపోయిన నా కల్పన శవం ప్రశాంతంగుంది. పాతికేళ్ళ లోపే వందేళ్ళ జీవితానికి తెర దించి, మమ్మల్నందర్ని అభాగ్యుల్ని చేసిన దాన్ని చూస్తుంటే, నా గుండెనెవరో పిండినట్లయింది. ప్రియాతి ప్రియమైన నా చెలి చివరి కోర్కెను తీర్చకుండా డిగ్రీ చివరి పరీక్ష రూపంలో నన్ను ఓడించిన పరిస్థితిని తలచుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. ఏమైనా విధి బలీయం కదా! దాన్నెవరు తప్పించగలరు?

Exit mobile version