విద్యా విధానం – సింహావలోకనం

0
2

[dropcap]ప్ర[/dropcap]కృతిని మించిన గురువు లేడని విశ్వకవి రవీంద్రుడి అభిప్రాయం. ‘శాంతినికేతన్’ రూపుదిద్దుకోవడానికి ప్రకృతి పట్ల ఆయనకు ఉన్న మమకారమే స్ఫూర్తి. ఆ సంస్థ ప్రపంచ స్థాయి సంస్థగా ఎదగగలిగిందంటే కారణం ఆ విద్యా విధానం వలన ఒనగూడిన ఎనలేని ప్రయోజనాలే.

ఇన్ని దశాబ్దాల అనంతరం – రవీంద్రుని అభిప్రాయాలు నూటికి నూరు శాతం అక్షర సత్యాలని పలు అధ్యాయనాలు ఋజువు చేస్తున్నాయి. పి.ఎల్.ఓ.ఎస్.1 అనబడే జర్నల్‍లో ఇటీవల ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం –

సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన ఒక విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ప్రకృతి పరిసరాలలో గడపగలిగే అవకాశం లభించిన పిల్లలు ప్రపంచాన్ని చూసే తీరు మిగిలినవారి కంటే భిన్నంగా ఉంటోందని తేలింది. క్లిష్ట సమయాలలో వీరు సరైన నిర్ణయాలు తీసుకోగలిగే దృఢమైన మనస్తత్వం కలిగి ఉంటున్నారనీ తేలింది. సామాజిక సంబంధాల విషయంలోనూ వీరు చక్కటి అవగాహన కలిగి ఉంటున్నారట. ఈ రకంగా వ్యక్తిత్వ నిర్మాణంలోనూ ప్రకృతి ముఖ్య పాత్ర పోషిస్తోందని అర్థమవుతోంది. ఈ అంశాల ఆధారంగా ప్లే స్కూళ్ళు, చైల్డ్ కేర్ సెంటర్లలో ఎటువంటి వాతావరణం ఉండాలన్న అంశంపై అంచనాలు వేస్తున్నారు.

ప్రాథమిక విద్యే కీలకం:

ప్రాథమిక విద్యాభ్యాసం పిల్లలలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించటం లేదని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. స్కూళ్ళలో చదువుకుంటున్న ఎలిమెంటరీ చదువులను పూర్తి చేసుకుని హైస్కూలు స్థాయికి వచ్చిన పిల్లలు కూడా చదవటం, గణితం వంటి అంశాలలో బాగా వెనుకబడి ఉంటున్నారని తేలింది. ఇక డ్రాపవుట్స్‌లో ఉన్న విద్యార్థుల గురించి చెప్పడానికేముంది? ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి విద్యార్థులు 600 మిలియన్లని అంచనా!

నాణ్యమైన ప్రాథమిక విద్య విద్యార్థి ప్రయాణానికి బలమైన పునాది. విద్యార్జన లోని ప్రతి స్థాయి లోనూ విద్యార్థి విజయావకాశాలకు ప్రాథమిక విద్యే ఆలంబన. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రిప్రైమరీ/ప్రైమరీ వయసు పిల్లలు అటువంటి నాణ్యమైన విద్యకు నోఛుకోవటం లేదు.

స్కూళ్ళలో శిక్షణ పొందిన సమర్థులైన బోధనా సిబ్బంది కొరత, తలాతోకా లేని పాత్య సామగ్రి, మౌలిక సదుపాయాల కొరత వంటి మౌలిక సమస్యలకు తోడు – బీదరికం, రాజకీయ అస్థిరతలు, ప్రకృతి బీభత్సాలు – ఇలా అనేక కారణాలుగా పిల్లలు విద్య నుండి వంచించబడుతున్నారు. ఈనాటికీ కొన్ని దేశాలలో ఆడపిల్లలకు విద్యావకాశాలు పరిమితమే!

విద్య మనిషికి ప్రాథమిక హక్కు. చక్కని వాతావరణం, దక్షత గల బోధనా సిబ్బంది, సులభగ్రాహ్యమైన భాషలో విద్యాబోధన ఇవన్నీ తక్షణావసారాలు. ఫలితాలను అనుసరించి మార్పులూ చేర్పులూ చేసుకుంటూ ముందుకు సాగడమన్న విధానం ఎలాగూ ఉండనే ఉంది.

ప్రకృతి విపత్తుల వంటి ఆపత్సమయాలలో పిల్లల చదువులు దెబ్బతింటూ ఉంటాయి. వారి వద్ద అప్పటికే ఉన్న నైపుణ్యాలను అటువంటి విపత్తులు హరించివేస్తాయి. ఉదాహరణకి కోవిడ్‍కు ముందు 10 సంవత్సరాల వయసు పిల్లలలో 80% మంది సాధారణ పుస్తకాలను చదవడం/అర్థం చేసుకోవడంలో సైతం విఫలమయ్యారన్న వాతావరణం ఉండగా, కోవిడ్ అనంతరం మరో 10% జమపడింది. కోవిడ్ సమయంలో విద్యార్థుల చదువులు కొనసాగడానికి చేపట్టిన ఆపద్ధర్మ విధానాలు – ఆన్‍లైన్ విద్యా విధానం వంటివి అందరికీ అందుబాటులో ఉండకపోవడం వంటివి దానికి కారణం.

యునిసెఫ్:

విపత్కర సమయాలలో బాలల భవిష్యత్తు అగమ్యగోచరం కాకుండా ఉండటానికి యునిసెఫ్ తన వంతుగా కృషి చేస్తోంది. 147 దేశాలలో నాణ్యమైన విద్య, భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలగడానికి దోహదం చేయగల నైపుణ్యాలు, విజ్ఞానం సమకూర్చగల అభ్యసనావకాశాలను కల్పిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here